నవ్వింత: ‘టీ’కా తాత్పర్య సహితమీ జ్ఞానం...

నవ్వింత: ‘టీ’కా తాత్పర్య సహితమీ జ్ఞానం...


‘‘కొండలలో పండేటీ తేనీటి మొక్కను చూడు...

 కొండలంత ఉత్సాహాన్ని గుప్పేటీ తీరును చూడు...’’ అంటూ పాడుకుంటూ, అంతకంటే ఆరాధనగా టీకప్పు వంక చూస్తూ పరమభక్తితో చాయ్‌ను ఆస్వాదిస్తున్నాడు మా బావ.

 ‘‘ఏమిటో బావా! నువ్వూ అర్థం కావు. నీ వైఖరీ అర్థం కాదు... అందరిలాగే చాయ్ తాగొచ్చు కదా. టీకప్పుకు మొక్కులూ, ఈ భక్తి పాటలూ అవసరమా?’’ అని అడిగా. ‘‘అవును... నేను ప్రపంచాన్ని చూసే దృష్టికోణం వేరు. ఒక ఆధ్యాత్మిక భావనతో చాయ్‌ను పరికిస్తే ఎన్నో విశేషాలు తెలుస్తాయి’’ అన్నాడు మా బావ.

 ‘‘చాయ్‌కీ... ఆధ్యాత్మికతకూ సంబంధమేంటి బావా?’’

 ‘‘టీ అంటే ఏమనుకున్నావురా నువ్వు. అది సాక్షాత్తూ భగవద్స్వరూపం. దేవుడితో చాయ్‌కి ఎన్నో పోలికలున్నాయి. ఎప్పుడెప్పుడైతే మానవుల్లో ఉత్సాహం తగ్గుతుందో, ఎక్కడెక్కడైతే నీరసం ప్రబలుతుందో అప్పుడు ‘కప్పు’డు పరిమాణంలో తనను సృష్టించుకుని, మనిషిలో ప్రవేశించి ఆ నిస్తేజాన్ని నాశనం చేస్తుందీ టీ. అంతేకాదు... భగవంతుడిలాగే చాయ్‌కూ ఎన్నో అవతారాలు... జింజర్ టీ, ఇలాచీ, మలాయీ, ప్లేనూ, గ్రీనూ, హెర్బల్... ఇలా. అయితే అవతారం ఏదైనా దాని పర్పస్ ఒక్కటే. దుష్ట నీరస శిక్షణ, శిష్ట ఉత్సాహ రక్షణ. ఎప్పుడు పడితే అప్పుడు కప్పుడు చాయ్ కాచుకోడానికి వీలుగానే విష్ణుమూర్తి పాల సముద్రంలో పవ్వళించాడని నా అభిప్రాయం’’ అంటూ చాయ్ కప్పుకేసి భక్తిగా చూశాడు.

 ‘‘ఇలాంటి పైత్యం నీకొక్కడికే ఉంటుంది. అవున్లే టీ ఎక్కువైతే పైత్యం ఎక్కువుతుందిగదా. నీ విషయంలో అదే జరుగుతున్నట్లుంది.’’ ‘‘సరే రా... నువ్వు అనుకున్నట్లుగా నాకే పైత్యం అనుకుందాం. మరి ఘనత వహించిన ఆయొక్క జంధ్యాల గారు చాయ్‌ను ‘నిశివర్ణోదకం’ అని పేరు పెట్టి ఎందుకు స్తుతించారు?’’

 ‘‘జంధ్యాల గారు నిశివర్ణోదకం అన్నది టీ గురించి కాదు... కాఫీ గురించి’’

 ‘‘పిచ్చివాడా... టీ లేదా కాఫీ... ఈ రెండూ శివకేశవుల్లాంటివి. అందుకే టీ, కాఫీల విషయంలో నేను అభేదం పాటిస్తాను. పైగా టీలో ఉన్న తాత్విక చింతన సామాన్యమైంది కాదు’’

 ‘‘టీలో తాత్వికతా?’’ ‘‘తాత్వికత, ఆధ్యాత్మికత కలగలసిన స్వరూపమే రా టీ. జంధ్యాల అన్నట్లు నిశివర్ణం అంటే నలుపు. అంటే డికాక్షన్ నీలమేఘస్వరూపం అన్నమాట. అందులో పవిత్రమైన తెల్లటి పాలు కలుస్తాయి. ఇందులో నల్లరంగులో ఉండే డికాక్షన్ కష్టాలకు ప్రతీక. సుఖాలకు చిహ్నంగా పాలు తెల్లగా ఉంటాయి. ఇక కష్టసుఖాలు రెండూ కలగలసిందే జీవితం. ఇదే చాయ్ ఇచ్చే సందేశం. అంతేకాదు... చాయ్ పరమాత్మ స్వరూపం. కరకరలాడుతూ మిడిసిపడే బిస్కెట్ జీవాత్మ. ఎప్పుడైతే బిస్కెట్ అనే జీవాత్మ... చాయ్ అనే ఆ పరమాత్మతో లీనమవుతుందో అప్పుడు... బిస్కెట్ తన కరకరలాడే ఐహికమైన ఈ కరకుగుణాన్ని వదిలేసి, మెత్తగా మారి చాయ్‌లో... అనగా పరమాత్మలో ఐక్యమవుతుందన్నమాట. ఇదేరా చాయ్ బిస్కెట్ బోధించే సత్యం. అంతేకాదు... ‘కాఫీ’ల ఆస్వాదనార్థం ఇయం పటాటోపం. బుద్ధుడికి బోధివృక్షం కింద తెలినట్టుగానే... ఈ విషయాలన్నింటిపైనా నాకు ఇరానీ హోటల్లో జ్ఞానోదయమైంది.’’

 ‘‘అందుకే బావా బోధి వృక్షం కింద జ్ఞానోదయమైన ఆయనను బుద్ధుడు అన్నట్టే... నీ జ్ఞానంతో మమ్మల్ని చంపుకుతింటావు కాబట్టి నిన్ను చంపకుడు అందామా?’’ ‘‘నీకు ఎగతాళిగా ఉంటుందిగానీ... టీ తాగుతూ తరచిచూస్తే ఇందులో ఇంకా ఎన్నో అంతరార్థాలున్నాయిరా. డికాక్షను నల్లగా ఉందని మనం విచారించరాదు. ఎందుకంటే అది పాలతో కలిసిన వెంటనే రంగుమారిపోతుంది. దీన్ని బట్టి తెలిసేదేమిటి... డికా‘క్షణభంగురం’. అందుకేరా డికాక్షనూ, పాలు కలగలసిన చాయ్‌ను చూస్తే నాకంత జాయ్. చాయ్ జాయ్ అయ్యిందంటే పరుషాలు సరళాలయ్యాయనే కదా అర్థం. అందుకే ఇంతటి మాహత్మ్యం ఉన్న టీకప్పును చూసినప్పుడల్లా పైకప్పుకేసి తలతిప్పి కాస్త ఆ డికాక్షణామూర్తి సహిత క్షీరశర్కరాది దేవతలు దర్శనమైనట్లుగా కాసింత ప్రార్థన చేసుకుంటుంటా’’ అంటూ తానెందుకు టీని భక్తిభావంతో చూస్తాడో చెబుతూ మాకూ కాస్త టీ తీర్థంతో, బిస్కెట్ల నైవేద్యం పెడుతూ మరీ జ్ఞానోపదేశం చేశాడు మా బావ. ఆధ్యాత్మిక భక్తిభావనల తాలూకు ‘టీ’కాతాత్పర్యాలను మాకు అర్థమయ్యే భాషలో చెబుతున్న ఆయన... ఎందుకో ఆ క్షణం నెత్తిన టీ ఆకును పింఛంలా ధరించిన అపర గీతాకారుడిలా కనిపించాడు.

 - యాసీన్

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top