జల కవచం

A japanees story  - Sakshi

ముసలావిడ పేరు వాంగ్‌. రాజకీయాలు ఆమెకు అర్థం కావు గానీ అక్కడెక్కడో యుద్ధం జరుగుతున్నదని మాత్రం తెలిసింది. జపాన్‌ వాళ్లొచ్చి తమ దేశం వాళ్లని చంపుతున్నారట. ఎంతమంది చైనీస్‌లనిలా చంపుతారు వాళ్లు? తనదాకా రాలేదు. తన కళ్ల ముందర ఎవరూ ఎవర్నీ చంపలేదు. ఎల్లో రివర్‌ ఒడ్డున వున్నదా వూరు. వాంగ్‌ పూర్వీకులంతా అక్కడే పుట్టి పెరిగారు. జపాన్‌ వాళ్లెలా ఉంటారో అక్కడి వాళ్లకు తెలియదు. వర్షాకాలం. పొద్దు గుంకుతున్నది. నది పొంగి ఊరిని ముంచెయ్యకుండా ఉండటానికి నిర్మించిన కట్ట ఎక్కి నీటి పొంగు ఎలా ఉందో పరిశీలించింది వాంగ్‌. జపాన్‌ వాళ్ల సంగతేమో గానీ నది పొంగితే మాత్రం అపాయం తప్పదు. వందల వేల పాములు మెలికలు తిరుగుతున్నట్టుగా నీళ్లలో మెరుస్తున్న అలలు. ‘‘నీటిమట్టం బాగా పెరిగిందిరో’’ అంటూ హెచ్చరించింది. ‘‘పాడు నది. ఈ ఊరికి పట్టిన దయ్యం ఇది’’ అన్నాడు ఆమె మనవడు. వాడి పేరు లిటిల్‌పిగ్‌. ‘‘జాగ్రత్త. జలదేవత వింటుంది.’’ కట్టమీద కూర్చున్నవాళ్లంతా జపాన్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ‘‘వాళ్లెలా ఉంటారసలూ? చూస్తే ఎలా గుర్తు పట్టడం?’’ ‘‘పరదేశం వాళ్లను పోల్చుకోవడం కష్టం కాదులే. బాగా పొడుగ్గా ఉంటారు. ఒంటి రంగు కూడా తేడా ఉంటుంది. పైగా వాళ్లవి చేపకళ్లు. మన మాదిరిగా లేనివాళ్లంతా జపానువాళ్లే’’.

ఆ ఊళ్లో అందరికన్నా ముసల్ది ఆవిడే. అందువల్ల ఆమె మాటకు తిరుగులేదు. ‘‘వాళ్లు విమానాల్లో దాక్కుంటారు తాతమ్మా. మనకు కనిపించరు.’’ అన్నాడు మనవడు. ‘‘జపనీస్‌ అనేవాళ్లు అసలు వుండరురా’’ అంటూ తీర్మానించింది వాంగ్‌. అందరూ గొల్లున నవ్వారు. అది చిన్న ఊరు. ముప్ఫై యిళ్లకు మించి ఉండవు. ఇంతదూరం ఎందుకు వస్తారు జపాన్‌వాళ్లు? ఎంతచెడ్డా, వాళ్లూ మనుషులే. ఆమె జీవితంలోని ఎన్నో ముఖ్య సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిందీ డైక్‌. పదిహేనేళ్లప్పుడు నవవధువుగా ఉన్నప్పుడు భర్త పిలిస్తే ఇక్కడికి వచ్చింది. కొన్నాళ్లకే అతడు ప్రమాదవశాత్తూ ఈ నీళ్లలో పడి మరణించాడు. బుద్ధిస్ట్‌  నరకం నుండి భర్తను రక్షించడానికి ఎన్ని సంవత్సరాలపాటు పూజలు చేయించిందో! ఉన్నదంతా ఊడ్చిపెట్టింది. ఇంకా పిల్లాణ్ని పెంచాలి. భూమి సాగు చెయ్యాలి. ఖర్చులు పెరిగిపోయాయి. ‘‘మరో పది వెండి బిళ్లలు కావాలి!’’ అంటూ డిమాండ్‌ చేశాడు పూజారి. ‘‘ఇంకెన్నాళ్లీ పూజలు?’’ ‘‘నీ భర్త కుడిచెయ్యి యింకా నరకంలోనే చిక్కుకుని ఉన్నది’’ అన్నాడు. ‘‘చెయ్యే గదా! లాక్కోగలడులే. నాకాయన సంగతి బాగా తెలుసు’’ అంది వాంగ్‌.

ఇన్నేళ్లు గడిచినా ఇంకా అనుమానం తీరలేదు. నిజంగా లాక్కున్నాడో లేదో. మనవడి పెళ్లాం నీళ్లాడటానికి సిద్ధంగా ఉంది. ఆ తర్వాతైనా డబ్బులు జమచేసి ఆయన్ను విడిపించాలి.
నదిని చూస్తే చాలు.. వాంగ్‌కు ఆలోచనలు పొంగి పొర్లుతాయి. తన భర్తను కబళించిన రాక్షసి! ఆ రోజు కట్టకు గండి పడ్డది. అతడు మరమ్మతు చెయ్యటానికెళ్లాడు. తను వారిస్తూనే ఉంది. అంతలోనే నీటి మట్టం పెరిగింది. కాలు జారింది. కళ్లముందరే కొట్టుకుపోయాడు. తమకు జీవన్మరణాల మధ్య సరిహద్దు రేఖ ఈ కట్ట. ఆ ఊరివాళ్లు తరతరాలుగా నదిని తిట్టుకుంటూ, అడ్డుగోడకు మరమ్మతులు చేస్తూ గడుపుతారే తప్ప, తమ నివాసాల్ని ప్రమాదస్థలానికి మరికాస్త దూరంలో కట్టుకోవాలని మాత్రం తట్టలేదు. అది వాళ్ల అమాయకత్వానికి పరాకాష్ట. నీటి అలల మీద వెన్నెల పరుచుకుంది. ‘‘తాతమ్మా! విమానాలు వస్తాయిలాంటప్పుడు’’ అన్నాడు మనవడు. ‘‘అశుభం పలక్కు. ఎక్కడ నేర్చుకున్నావురా ఇలాంటి మాటలు!’’ అంటూ కట్ట దిగింది వాంగ్‌. ఆమె వెంట ఊరి జనమూ బయల్దేరారు. రాత్రి పక్కలో వాలిందన్న మాటేగానీ ఆలోచనలన్నీ జపాన్‌ వాళ్ల గురించే. వాళ్లెలా ఉంటారు? ఎందుకొచ్చారట? ఏం చేస్తారు? తమ గ్రామం గురించి వాళ్లకు తెలుసా? రాక్షసుల్లాంటి వికృతాకారాలను కొన్ని వూహించుకుని బహుశా ఇలాగే ఉంటారు కాబోలు అనుకుంది.

అర్ధరాత్రి దాటింది. ‘‘వచ్చారు.. వచ్చారు..’’ అంటూ కేకేసింది మనవడి పెళ్లాం. ‘‘ఎక్కడ?’’ ‘‘అదిగో, ఆకాశంలో!’’ నిజమే. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కాని పక్షులు. ‘‘ఏమిటవి?’’ జవాబుగా, అల్లంత దూరాన, పొలంలో వెండి గుడ్డులాంటిది జారిపడింది. మట్టి ఆకాశమంతెత్తు ఎగిసింది. అందరూ ఈ వింత చూడటానికి పరిగెత్తారు. ముప్ఫై అడుగుల మేర గొయ్యి ఏర్పడింది. అంతలోనే మరొకటీ, మరొకటీ. జనమంతా చెల్లాచెదురుగా పరిగెత్తారు. ‘అంతా’ అంటే  వాంగ్‌ తప్ప మిగతా వాళ్లందరూ అని అర్థం. మనవడూ, మనవరాలూ చెయ్యి పట్టుకుని లాగారు. కానీ విడిపించుకుని కట్ట పక్కనే కూలబడిపోయింది ఆవిడ. ‘‘నేను పరిగెత్తలేనురా. డెబ్భై ఏళ్లుగా పరిగెత్తలేదు. మా పాదాలను కట్టేశారు గదా. ఈ కాళ్లతో పరిగెత్తలేను. మీరిద్దరూ వెళ్లండి. చిన్నపిల్ల జాగ్రత్త. ఒట్టి మనిషి కూడా కాదు’’ అంటూ వెనక్కు వాలింది వాంగ్‌. ‘‘తాతమ్మా! నువ్వు రాకపోతే నేనూ వెళ్లను’’ అంటూ మొండికేసింది పిల్ల. ‘‘పోవే మూర్ఖురాలా. నీ మొగుడు చస్తే, వంశాంకురం ఉండటానికన్నా, నీ ప్రసవం క్షేమంగా జరగాలి. వెళ్లు’’ అంటూ చేతికర్రతో తోసింది వాంగ్‌. పైన విమానాల రొద పెరిగింది. అందరూ ఏదో అరుస్తున్నారు గానీ ఒకరి మాటలొకరికి వినిపించడం లేదు. మరికొన్ని విమానాలు వచ్చి మొదట వచ్చిన వాటిని ఎదిరించాయి. ఆకాశంలో యుద్ధం! పెంకుటిళ్లు, పూరిపాకలు ఒక్కొక్కటే నేల మట్టమవుతున్నాయి. ఎటు చూసినా మొండి గోడలు తప్ప మరేమీ కనిపించడం లేదు. తన ఇల్లేమైంది? పొగ వ్యాపించింది. మంటలు. యుద్ధమంటే ఏమిటో, ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను, చెమటోడ్చి పండించిన పంటలను ఎవరైనా ఎందుకు నాశనం చెయ్యాలి?

మరికాసేపట్లో, నిన్నగాక మొన్న మనవడు దుక్కి దున్నిన సోయాబీన్‌ పొలంలో రెక్క తెగిన పక్షిలా ఏదో కూలింది. మొదట భయమేసింది. కానీ, ఈ వయసులో తను దేనికి భయపడాలి? ఏం జరిగినా ఫరవాలేదు. కర్ర సాయంతో నెమ్మదిగా నడిచింది.విమానం చుట్టూ చేరి మొరుగుతున్నాయి కుక్కలు. ఇదికాక, ఇంజిన్‌ రొద కొంత. ‘ఉస్‌స్‌!’ అంటూ అదిలించింది కర్రతో. తెల్లగా మెరుస్తున్న రెక్కలు. ‘ఇదంతా వెండి కాబోలు’ అనుకుంది వాంగ్‌. విమానం లోపల కుర్రాడెవరో కూర్చున్నాడు. అంతెత్తునుంచి పడటంతో సీటులో ముందుకు వాలి పడిపోయాడు. ‘‘లే.. లే..’’ అంటూ పలకరించింది. బతికాడో, చచ్చాడో! చైనా వాడిలా లేడు. చర్మం అదో రంగులో ఉంది. ‘దక్షిణ దేశం వాడైవుంటాడు’. ‘‘బైటికిరా కట్టు కడతాను’’ అంది. వాడేదో గొణిగాడు గానీ అర్థం కాలేదు. తనే, అతి ప్రయత్నం మీద బయటికి లాగింది. నేలమీద పడబోయి, నిలదొక్కుకున్నాడు ఆ యువకుడు. ‘‘మా ఇంటిదాకా నడిస్తే, అక్కడేమైనా చికిత్స చేస్తాను’’ అంది. కుక్కలు మొరుగుతూ మీదికి లంఘించాయి. వాడు భయపడి ఆమెను వాటేసుకున్నాడు. కర్రతో కుక్కల్ని విదిలించింది వాంగ్‌ – ‘‘ష్‌! పొండే. కుర్రాణ్ని చంపుతారా ఏంటి?’’ నడవలేని మనిషిని, వీపున వేసుకుని ఈడ్చుకుంటూ, కూలిన, ఇళ్ల శిథిలాల గుండా నడిచింది. ఇంటికి చేరుకోవాలనే ఆమె ప్రయత్నం. కానీ ఇల్లు మిగల్లేదు. కట్ట గేటుకి ఎదురుగా ఉంటుంది తన ఇల్లు. మళ్లీ కట్టుకోవాల్సిందే. గోడకు వాలి కూర్చున్నాడు కుర్రాడు. నీళ్లు కావాలని సైగ చేశాడు. ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఒక్క మాటా అర్థం కాలేదు.

పగిలిన కుండ పెంకులో నది నీళ్లు పట్టించింది వాంగ్‌. గాయాలు కడిగి తన గౌను చింపి కట్టుకట్టింది. కుర్రాడికి బాధతో కళ్లు మూసుకుపోతున్నట్టున్నాయి. ‘‘ఆకలిగా ఉందా! ఏదన్నా ఉందేమో చూస్తాను’’ నాలుగిళ్లావల, రొట్టెలు చేసే బేకరీ ఒకటి ఉంది. ఇప్పుడక్కడ బేకరీ మిగల్లేదు గానీ దుమ్ము కొట్టుకుపోయిన రొట్టె ముక్కయినా దొరక్కపోతుందా! చాలాసేపు వెతికింది. చివరికి, కూలిన గోడల మధ్య ఇంకా వేడి వేడిగా ఉన్న బ్రెడ్‌ రోల్‌ చేతికి తగిలింది. ఆహారం కనిపించగానే ఆకలి జ్ఞాపకం వచ్చింది. ముందర, తను కాసింత తిని, కుర్రాడికికూడా పెట్టొచ్చనుకుంది. అంతలో, అరుపులు వినిపించాయి. ‘‘జపనీస్‌!’’ అంటూ పరిగెత్తుకొచ్చారు సైనికులు. ‘‘జపనీస్‌ ఎవరు?’’ ‘‘వీడే’’ ‘‘వీడు జపనీసా? మన పోలికలూ ఉన్నాయే’’ ‘‘వీడు జపనీస్‌’’ అన్నాడొక సైనికుడు కోపంగా. ‘‘సర్లే. ఆకాశం నుండి ఊడిపడ్డాడు. నన్నేం చెయ్యమంటావు?’’ అంది వాంగ్‌. ‘‘ఆ బ్రెడ్డిటివ్వు’’ ‘‘మీరు తినండి. వాడికీ ఓ ముక్క ఇవ్వండి’’ ‘‘జపనీస్‌కు మన రొట్టె ఇవ్వాలా?’’ ‘‘ఏం? వాడికి మాత్రం ఆకలి ఉండదా?’’ తనవాళ్లే అయినా, చైనీస్‌ సైనికులు ఇలా ఉంటారని అనుకోలేదు వాంగ్‌. కానీ, ఎవర్నెందుకు తప్పుపట్టడం! సైనికులంతా ఒకటే. ‘‘మాది ప్రశాంత జీవితం. నా ఎరుకలో, ఈ ఊరికి సైనికులు రాలేదు. మీరూ రావొద్దు. వెళ్లిపోండి’’ ‘‘నిజమే.

చాలా ప్రశాంతంగా ఉందిప్పుడూ. సమాధిలాగ. ఈ వూరినలా చేసిందెవరో తెలుసా మామ్మా? ఈ జపనీస్‌గాళ్లే!’’ ‘‘కానీ, ఎందుకు వాళ్లిలా చేస్తున్నారు?’’ ‘‘మన దేశం, మన భూమి వాళ్లక్కావాలట!’’ ‘‘మన భూమి వాళ్లకెందుకిస్తాం?’’‘‘ఎప్పటికీ ఇవ్వం!’’ అంటూ అరిచాడొక సైనికుడు. ఏదో గొడవ జరుగుతూనే ఉందిగానీ, అందరూ తూర్పు వైపు పరిశీలనగా చూస్తున్నారు. ‘‘అటుకేసి ఎందుకు చూస్తున్నారు?’’ ‘‘జపాన్‌గాళ్లు అటునుండే వస్తున్నారు’’ ‘‘మరేం చెయ్యాలి? మీరు పారిపోతారా?’’ ‘‘మేం కొద్దిమందిమే ఉన్నాం. సావోఆన్‌ గ్రామం రక్షణ బాధ్యత మాకప్పగించారు’’ ‘‘ఆ ఊరు నాకు బాగా తెలుసు. టీ కొట్టు యజమాని పావో ఎలా ఉన్నాడు? వాడు నా తమ్ముడు’’ ‘‘ఎవరూ మిగల్లేదా వూళ్లో. అందర్నీ చంపేశారు జపనీస్‌. విదేశీ ట్యాంకులు, విదేశీ తుపాకులతో జనాభా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది’’ హతాశురాలైంది వాంగ్‌. తన వంశంలో ఇంకెవరూ మిగల్లేదన్నమాట. జపనీస్‌ మరోసారి దాడికి పాల్పడవచ్చని సైనికులు అప్రమత్తంగా ఉన్నారు. ‘‘ఇంతకూ, వీడు బతికున్నాడా, చచ్చాడా?’’ అంటూ ఒక సైనికుడు కత్తి తీసి గాయపడిన పైలట్‌ను రెండు మూడు సార్లు పొడిచాడు. వ్యూహంలో భాగంగా, సైనికులంతా వెళ్లి దూరంగా ఎక్కడో నక్కారు. ‘‘వీడు జపాన్‌వాడా? ఎంత ఆశ్చర్యం!’’ అనుకొని విస్తుపోయింది వాంగ్‌.

పైలట్‌ శవం నేలకొరిగింది. వంశం కొనసాగాలంటే మనవడూ, వాడి పెళ్లాం క్షేమంగా వుండాలి. ఇద్దరూ ఎటువైపు పారిపోయారో! కనిపిస్తారేమోనని కట్ట ఎక్కి చూసింది. గంట సేపట్లో నీటి మట్టం బాగా పెరిగినట్టుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఊరు మునిగిపోతుంది. ‘పాపిష్టి దయ్యం’ అంటూ తిట్టుకుంది. ‘నది విననీ. ఇంకేం జరిగినా బాధ లేదు. జపాన్‌ వాళ్లు నాశనం చేసిన ఊరును నది తన కడుపున దాచుకుంటుందా!’. మొహం, కాళ్లూ, చేతులూ కడుక్కుంది. చుట్టూ చూసింది. సైనికులు పడుతూ, లేస్తూ పరిగెత్తుతున్నారు. నిర్మానుష్యంగా ఊరు, తన మనవడూ, మనవరాలూ ఎక్కడో తన కోసం నిరీక్షిస్తూనే ఉండి ఉంటారు. కట్ట దిగుదామనుకుంటున్నప్పుడు, తూర్పున, దూరంగా, ఏదో కదలిక కనిపించింది. మొదట ధూళి మేఘంలాగ. పరికించి చూస్తే ఏవో చుక్కలు. మెరుస్తున్న చుక్కలు. అర్థమైంది. పోల్చుకోగలిగింది. మనుషులు. ఒకరూ యిద్దరూ కాదు. పదాతిదళం కదలి వస్తున్నది. ‘‘జపనీస్‌’’ అనుకున్నది వాంగ్‌. వాళ్లకు రక్షణగా, పైన షీల్డ్‌ చేస్తూ యుద్ధ విమానాలు టార్గెట్‌ చూసుకుని బాంబులు విడుస్తాయి. ‘‘ఎవరు కావాలి మీకు? ఇంకా ఏం మిగిలిందని ఈ ఊళ్లో? నేను, నా మనవడూ, మనవరాలు తప్ప. మా తమ్ముణ్ని చంపేశారు!’’ మంచి టీ చేసే పావో మరణించాడు.

అతడి భార్య, ఏడుగురు పిల్లలు జపాన్‌ సైనికుల తూటాలకు బలైపోయారు.’’ కట్ట ఎక్కి నిల్చున్నది. తను వాళ్లకు కనిపిస్తూనే ఉండి ఉంటుంది. దిగుతున్నప్పుడు కట్ట గేటు జ్ఞాపకం వచ్చింది. ఈ నది తమకు శాపం. తమను ఎన్ని ఇక్కట్ల పాలు చేసిందో! గేట్‌ తెరవడం వచ్చు తనకు, అంటే పంట కాల్వల కోసం కాదు. ఒకేసారి, మొత్తం గేట్‌ ఎత్తేస్తే ఏమవుతుందో కూడా బాగానే తెలుసు. తెరచి తను కొట్టుకుపోకుండా తప్పించుకోవడం సాధ్యమా? ‘కాటికి కాలు జాచుకున్న ముసల్దాన్ని. ఎందుకింత భయం!’ అనుకుంది. మనవడికి పుట్టబోయే పిల్ల ఎలాగుంటుందో చూడలేదన్న బెంగ ఒక్కటే మిగిలింది. కానీ, జీవితంలో అనుకున్నవన్నీ ఎప్పుడూ జరగవు. ఇంతవరకూ చూసింది చాలు. మరొక్కసారి తూర్పుకు దృష్టి సారించింది. జపాన్‌ సైనికులు ముందుకు కదులుతున్నారు. వందలో, వేలో.. గేట్‌ తెరిస్తే వరద ఉప్పెనలాగా పొలాలను, శిథిలాలుగా మిగిలిన ఇళ్లను ముంచెత్తి ఆకలిగొన్న డ్రాగన్‌లాగా ముందుకురుకుతుంది. మనవడూ, మనవరాలూ ఊరు దాటి మరెక్కడో క్షేమంగా తలదాచుకునే ఉంటారు. శత్రు సైన్యంతో యుద్ధం చెయ్యడానికి అనేక పద్ధతులున్నాయి. కొందరు విమానాలు వాడతారు. కొందరు తుపాకులు, నది నా ఆయుధం. లాకులు తెరవడం కాస్త కష్టమే. అయితేనేం, ఈ ఒక్క పని చెయ్యగలిగితే చాలు. ఈ జీవితానికి పరిసమాప్తి. గేట్‌ లీవర్‌ పట్టి లాగింది. ‘‘చేసేది పాపమా? అయితేనేం, నరకానికే పోతాను. చెయ్యి చిక్కుకున్న నా మొగుడింకా అక్కడే ఉన్నాడు. అక్కడైనా కలిసి బతుకుతాం’’ మరుక్షణం... కనుచూపు మేర కప్పేసింది జలప్రళయం. కిందా, మీదా, నలువేపులా నీరు. వాంగ్‌ ఏదో అనబోయింది. ఊపిరి తీసుకోబోయింది. కానీ ఎంతసేపు? అంతా లిప్తపాటులో ముగిసింది. శత్రు సేనలకు అది జలసమాధి.
 

ఆంగ్లమూలం : పెర్ల్‌ ఎస్‌. బక్‌ 
అనువాదం: ముక్తవరం పార్థసారథి

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top