
ఆసియా కప్-2025 కోసం భారత జట్టును మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అంతా సజావుగా సాగితే ఒకటి రెండు మార్పులు మినహా అంతా అనుకుంటున్న జట్టే యూఏఈకి (ఆసియా కప్ వేదిక) వెళ్లనుంది. ఈ పరిస్థితుల్లో రెవ్‌స్పోర్ట్స్ అనే ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్‌కు చెందిన రోహిత్ జుగ్లన్ అనే జర్నలిస్ట్ బాంబును పేల్చాడు.
ఆసియా కప్ సెలెక్షన్‌కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జపాన్‌లో ఉన్నాడని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. స్కై జపాన్‌ను ఎందుకు వెళ్లాడో చెప్పని జుగ్లన్.. అతను ఆసియా కప్ ఆడతాడా లేదా అన్న అనుమానులు మాత్రం వ్యక్తం చేశాడు. టీమిండియాను బీసీసీఐ కార్యకలాపాలను దగ్గర ఫాలో అయ్యే జుగ్లన్ ఈ పోస్ట్ చేయడంతో టీమిండియాలో ఏదో జరుగుతుందని అభిమానులు చర్చించుకుంటున్నారు.
Things were looking good till yesterday in every report for a player or 2 but there could be a last minute change for Asia cup sqaud
Captain Surya is in Japan for couple of days
Lets wait for the captain and a last call #AsiaCup2025— Rohit Juglan (@rohitjuglan) August 13, 2025
అసలే గత కొద్ది రోజులుగా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌నే భారత టీ20 కెప్టెన్‌గానూ నియమించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. చాలా మంది మాజీలు కూడా ఈ వాదనను సమర్దిస్తున్నారు. గిల్ టెస్ట్ కెప్టెన్‌గా తన తొలి పర్యటనలోనే (ఇంగ్లండ్) విజయవంతం కావడంతో అతనికి మద్దతు పెరిగింది. ఈ పరిస్థితుల్లో స్కై విదేశాలకు వెళ్లడం అనుమానాలకు తావిస్తుంది.
వాస్తవంగా మేజర్ టోర్నీలకు జట్టు ఎంపిక సమయంలో కెప్టెన్లు కూడా సెలెక్టర్లతో డిస్కషన్స్‌లో పాల్గొంటారు. అయితే స్కై కెప్టెన్ అయినప్పటి నుంచి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ కనిపించలేదు. బీసీసీఐ పెద్దలు స్కైను తాత్కాలిక కెప్టెన్ అనుకున్నారో ఏమో కానీ అతనికి అంత సీన్ ఇవ్వలేదు. స్కై కూడా వరుస విజయాలు సాధించినా ఎప్పుడూ కెప్టెన్‌లా(ఆఫ్ ద ఫీల్డ్) ప్రవర్తించలేదు.
తాజా పరిస్థితులను బట్టి చూస్తే స్కై కెప్టెన్సీకి కాలం చెల్లినట్లు కనిపిస్తుంది. ఆసియా కప్‌కు గిల్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేసి, స్కైను సాధారణ ఆటగాడిగా కొనసాగమని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది తెలిసే స్కై ఆసియా కప్ నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు వినికిడి.
గిల్‌ను కొందరు బీసీసీఐ పెద్దలు ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రోహిత్ రిటైరయ్యాక వన్డే పగ్గాలు కూడా గిల్‌కేనని సంకేతాలు అందాయి. మిగిలింది టీ20 కెప్టెన్సీ. దీన్ని కూడా గిల్‌కే కట్టబెడితే ఓ పని అయిపోతుందని బీసీసీఐలో ఓ కోఠరీ యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో స్కై బలపశువు కావచ్చు.