నికారుసైనోడు

Funny laughing story nov 11 2018 - Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

‘‘ఏమిటోయి భేతాళా విశేషాలు?’’ రిలాక్స్‌డ్‌గా అడిగాడు విక్రమార్కుడు.‘‘నా దగ్గర విశేషాలుండవండీ... ప్రశ్నలే ఉంటాయండి’’ గంభీరంగా బదులిచ్చాడు భేతాళుడు.‘‘నీ బుద్ది పోనిచ్చుకున్నావు కాదు. ఎప్పుడూ ప్రశ్నలేనా? ఈరోజు సరదాగా జోక్‌ ఏదైనా చెప్పొచ్చుకదా’’ అడిగాడు విక్రమార్కుడు.‘‘ఇవ్వాళ రేపు దారినపోయే దానయ్యను టచ్‌ చేసినా బోలెడు జోకులు చెబుతున్నాడు. మరి నా కంటూ  ఒక స్పెషాలిటీ ఉండాలి కదా’’ అన్నాడు భేతాళుడు.‘‘నీ స్పెషాలిటీ ఏమిటి?’’ ఆసక్తిగా అడిగాడు విక్రమార్కుడు.‘‘నువ్వు ఒక లైన్‌ చెబితే... దాని మీదే జోక్‌ చెబుతా’’ అన్నాడు భేతాళుడు.‘‘మనిషి అనేవాడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎక్కువైతే  ఇక అంతే!’’ లైన్‌ చెప్పాడు విక్రమార్కుడు.అప్పుడు విక్రమార్కుడి భుజం మీద ఉన్న భేతాళుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు...అది చలికాలం రాత్రి.పంజగుట్ట ఫ్లైవోవర్‌ సమీపంలో ఒకడు వేగంగా కారు నడుపుతున్నాడు. వాడిని కానిస్టేబుల్‌ ఆపాడు.‘‘ఏమిటండీ మీ ప్రాబ్లం?’’ కళ్లద్దాలు చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు  కారువాడు.‘‘మీరు చాలా స్పీడ్‌గా డ్రైవ్‌ చేస్తున్నారు సార్‌. డ్రైవింగ్‌ వచ్చిన వాళ్లెవరూ ఇలా డ్రైవ్‌ చేయరు. అసలు మీకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందా? ఒకసారి చూపించండి’’ విండోలోకి తొంగి చూస్తూ అడిగాడు  కానిస్టేబుల్‌.‘‘చూపిస్తే మీరేమైనా కొరుక్కుతింటారా? అదేమన్నా యాపిల్‌ పండా!’’ నవ్వుతూ అన్నాడు కారువాడు.‘‘అయితే చూపించండి సార్‌’’ వీలైనంత వినయంగా అడిగాడు కానిస్టేబుల్‌.‘‘ఉండీ ఛస్తేగా నీకు చూపించడానికి’’ కొండ చెరియలు కూలిపడ్డట్టు  భళ్లున నవ్వాడు కారువాడు.‘‘ఏమిటీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా?’’ గట్టిగా అరిచాడు కానిస్టేబుల్‌.నిజంగా చెప్పాలంటే ఆ అరుపులో అరుపు మాత్రమే లేదు. కొండంత ఆవేదన ఉంది. రెండు కొండలంత ఆగ్రహం ఉంది!‘‘డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా?’’ అనే కానిస్టేబుల్‌ ఆవేదనను,  ఆగ్రహాన్ని పట్టించుకోకుండా...‘‘లేదంటే లేదని కాదు. ఉందిగానీ...’’ నసిగాడు కారువాడు.‘‘మరి ఉంటే చూపించరేం?’’ కనుబొమ్మలెగరేస్తూ అడిగాడు కానిస్టేబుల్‌.‘‘ఉండి ఛస్తేగా’’ అన్నాడు తాపీగా కారువాడు.‘‘అదేంటీ సార్‌. ఉందంటారు. లేదంటారు. ఉందంటారు. లేదంటారు. మీ మాటలేమీ నాకు బోధ పడడం లేదు’’ అని బుర్ర గోక్కున్నాడు కానిస్టేబుల్‌.‘‘నీకు డాండ్రాఫ్‌ ఎక్కువగా ఉన్నట్లుంది. మంచి షాంపువాడు’’ అని సలహా ఇచ్చాడు కారువాడు.‘‘షాంపు సంగతి తరువాత.... ముందు మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపించండి’’ బతిమిలాడుతున్నట్లు అడిగాడు కానిస్టేబుల్‌.

‘‘నిన్నటి వరకు ఉండేది. ఇవ్వాళ  మందు కొట్టాను కదా. ఎక్కడో పోగొట్టుకున్నాను’’ చెప్పాడు కారువాడు.‘‘మందు కొట్టి కారు డ్రైవింగ్‌ చేస్తున్నారా?’’ అతిపెద్దగా ఆశ్చర్యపోయాడు కానిస్టేబుల్‌.‘‘నేను పెద్దగా తాగనండీ. నా బిజినెస్‌ పాట్నర్‌తో గొడవ జరిగింది. ఒరేయ్‌ నిన్ను చంపేస్తా అని అరిచాను. ఏది చంపు చూద్దాం అన్నాడు. చూపాను. నా దగ్గర నాటు తుపాకి ఉన్న మాటేగానే  ఏరోజు చిన్నపిట్టను కాల్చిన పాపాన పోలేదు. అలాంటిది ఆరుడుగుల వ్యక్తిని అరనిమిషంలో కాల్చి పారేశాను.సరే, దురదృష్టమో అదృష్టమో వాడిని కాల్చాను.ఆ తరువాత దడ మొదలైంది.గుండెల్లో మెట్రోరైలు పరుగులు తీస్తుంది.ఇక తట్టుకోలేక పోయాను. దగ్గరలో ఉన్న బార్‌లోకి దూరి పూటుగా తాగేశాను. అప్పుడుగానీ దడ కంట్రోల్లోకి రాలేదంటే నమ్మండి’’ వివరంగా చెప్పాడు కారువాడు.‘‘ఒకర్ని చంపి, పూటుగా తాగి డ్రైవింగ్‌ చేస్తున్నారా!!!!! వామ్మో! అసలు మీ కారు రిజిస్ట్రేషన్‌ పేపర్లు ఉన్నాయా?’’ ఆందోళనగా అడిగాడు కానిస్టేబుల్‌.‘‘అసలు కారు నాదైతేగా’’ ఫ్లైవోవర్‌ కూలినట్లు మరోసారి భళ్లుమని నవ్వాడు కారువాడు.‘‘కారు మీది కాదా? మరెవరిది?’’ గుండెలు అరచేతిలో పెట్టుకొని అడిగాడు కానిస్టేబుల్‌.‘‘పూటుగా తాగిన మత్తులో నా కారు అనుకొని ఎవడిదో  కారెక్కి డ్రైవింగ్‌ స్టార్ట్‌ చేశాను. దారి మధ్యలో ఇది నా కారు కాదు వేరెవరిదో అనే విషయం అర్థమైంది. కానీ, కారులు వేరైనా దారులు ఒక్కటే...అని మన పెద్దలు అన్నారు కాబట్టి... కారు ఏదైతేనేం అనుకొని ఇలా కంటిన్యూ అయిపోయాను...’’ అని పండ్లు  ఇకిలించాడు కారువాడు.కారువాడి మాటలకు కానిస్టేబుల్‌ మైండ్‌ బ్లాకైంది. వైట్‌ అయింది. రెడ్‌ కూడా అయింది. ‘‘వామ్మో... వీడు మామూలుడో కాదయ్యో’’ అని గుండెలు బాదుకుంటూ పై అధికారికి ఫోన్‌ చేశాడు.పెద్ద ఆఫీసర్‌ రంగంలోకి దిగాడు.

‘‘సర్, మీ కారును రోడ్డు పక్కన ఆపుతారా!’’ రిక్వెస్ట్‌ స్వరంతో అడిగాడు సీనియర్‌ ఆఫీసర్‌.‘‘అలాగే’’ అని రోడ్డుకు ఒక పక్కన కారు ఆపాడు కారువాడు.‘‘మీరు ఒకరిని కాల్చి చంపారని, అంతేకాదు...’’ అని పోలీస్‌ ఆఫీసర్‌ ఏదో చెప్పబోతుండగానే మధ్యలోనే అడ్డుపడి...‘‘ఏమిటండీ మాటిమాటికీ కాల్చాను కాల్చాను అంటున్నారు. అసలు వాడు ఏంచేశాడో తెలుసా?’’ అని అరిచాడు కారువాడు.‘‘ఏంచేశాడు?’’ కళ్లు పెద్దవి చేసి అడిగాడు ఆఫీసర్‌.‘‘వాడు నేను కలిసి గంజాయి బిజినెస్‌ మొదలుపెట్టామండీ. ఐడియా నాదే. బ్రహ్మాండంగా వర్కవుటైంది. నాకు రావల్సిన కోటిరూపాయలను ఎగ్గొట్టాడు. మరి నేను ఎలా ఊరుకుంటానండి. వ్యాపారం అన్నాక న్యాయం, ధర్మం ఉండనక్కర్లేదా? మీరే చెప్పండి’’ గాద్గదిక స్వరంతో అన్నాడు కారువాడు.‘‘ఏమిటీ? గంజాయి వ్యాపారం చేశావా?’’ సన్నగా వణుకుతూ అడిగాడు ఆఫీసర్‌.‘‘బిజినెస్‌లో లాస్‌ వస్తే మరేం చేస్తామండీ’’ అమాయకంగా ముఖం పెట్టాడు కారువాడు.‘‘ఇంతకీ ఏం బిజినెస్‌ చేశారు?’’ గుండెను చిక్కబట్టుకుంటూ అడిగాడు ఆఫీసర్‌. ‘‘కట్‌ఫండ్‌ బిజినెస్‌ చేశానండీ’’ అన్నాడు  కారువాడు.‘‘చిట్‌ఫండ్‌ గురించి విన్నాంగానీ కట్‌ఫంట్‌ ఏమిటండీ నా బొందా’’ అని కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు  ఆఫీసర్‌.‘‘కష్టాలన్నీ కట్‌ అయిపోయి... ఫండ్‌ చేతికందడమే కట్‌ఫండ్‌ బిజినెస్‌. ఒక్క రూపాయితో మా కంపెనీ షేర్‌ కొంటే... సంవత్సరం తిరిగేసరికల్లా లక్షరూపాయాలు చేతికందిలే ప్లాన్‌ చేశాను. బిజినెస్‌ సూపర్‌హిట్‌ అయింది. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగి, మా విషయం వినియోగదారులకు తెలిసిపోయి... మొదట కాల్‌ చేసి బెదిరించారు. ఆ తరువాత కత్తులతో ఆఫీసు ముందు క్యూ కట్టారు. ‘మా రూపాయి మాకు ఇవ్వాల్సిందే’ అని గట్టిగా అరిచారు. ‘మీ రూపాయి మీకు ఇవ్వడమే కాదు... మీకు ఇస్తానన్న లక్షరూపాయలు కూడా పువ్వులో పెట్టి  ఇస్తాను అని చెప్పాను. ఇచ్చిన మాట కోసం గంజాయి దందా చేశాను. ఇప్పుడు చెప్పండి యవరారనర్‌. నేను చేసింది తప్పా... తప్పా... తప్పా... తప్పా.....’’ అని గట్టిగా అరిచాడు కారువాడు.రకరకాల ఏమోషన్స్‌ తట్టుకోలేక ఉన్నచోటునే కుప్పకూలిపోయాడు పూర్‌... పోలీస్‌ ఆఫీసర్‌!
– యాకుబ్‌ పాషా 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top