కాగితపు బొమ్మ

funday story to world - Sakshi

కథా ప్రపంచం

అమ్మానాన్నలు ఎంత ప్రయత్నించినా ఆగకుండా ఏడుస్తూ వుండడం నా మొదటి జ్ఞాపకం. నా ఏడుపు ఆపలేక నాన్న గది వదిలిపోయాక అమ్మ నన్ను వంట గదిలోకి తీసుకెళ్లి భోజనం బల్ల ముందు కూర్చోపెట్టి ‘‘కన్నా కన్నా చూడు చూడు’’ అంటూ ఫ్రిడ్జ్‌ పైన దొంతరలుగా పేర్చిన కాగితపు పొట్లాలనుంచి ఒక కాగితపు కవరు తీసి బల్లపై పరిచింది. అమ్మ కొన్ని సంవత్సరాలుగా క్రిస్మస్‌ కానుకలపై వచ్చిన అన్ని కాగితపు కవర్లను ఒకదానిపై ఒకటి దొంతరలుగా దాచిపెడుతోంది. నా ముందు పరచిన కాగితాన్ని సరిచేసి మడవటం మొదలెట్టింది. నా ఏడుపు ఆగిపోయింది. ఆసక్తిగా చూడడం మొదలెట్టాను.అమ్మ ఆ కాగితాన్ని వెనక్కి తిప్పి మళ్ళీమడిచింది, సరి చేసింది. చుట్ట చుట్టింది. తిప్పింది. చిన్నగా తయారైన ఆ కాగితపు మడతల్ని తన రెండు చేతులతో నోటిదగ్గరికి తీసుకుని గాలిబుడగని ఊదినట్లు ఊదింది.

‘‘కన్నా! చూడు ఇది వొక పులి. లచ్చు.’’ అంటూ దాన్ని టేబుల్‌ మీద నిలబెట్టింది. చిన్న కాగితపు  పులి. రెండు పిడికిళ్ళంత మాత్రమే ఉన్న పులి. ఆ టేబుల్‌ మీద నిలబడింది. ఆ పులి చర్మం కాగితం కవరు రంగులతో ఆకుపచ్చని క్రిస్మస్‌ చెట్టు ఆకులతో, ఎర్రటి బొమ్మలతో నిండి ఉంది. అమ్మ తయారు చేసిన ఆ పులివైపు కదిలాను. దాని తోక ముడుచుకుంది. ఒక ఆటలాగా నా వేలివైపు దూకింది. గుర్ర్‌ర్‌.. అని అరిచింది. ఆశ్చర్యంగా నవ్వాను. నా చూపుడు వేలితో దాని వీపుపై నిమిరాను.  ‘‘ఝే జ్హియో జేచ్చి’’ అంది అమ్మ. ఇది ఒరిగామి.   అప్పుడు అది ఏమిటో నాకు తెలియదు. కానీ అమ్మ ఊపిరిలో ఆ శక్తి ఉంది. 
నాన్న అమ్మను ఒక ప్రకటనలో చూసి ఎంచుకున్నాడు. నేను హై స్కూలులో వున్నప్పుడు నాన్న దగ్గర ఈ విషయాలు తెలుసుకున్నాను. 1973లో ఆయన పరిచయ వేదికల కాగితాలు చూస్తున్నప్పుడు అమ్మ వివరాలున్న చోట ఆయన చూపు ఆగిపోయింది. ఆ ఫోటోలో కుర్చీలో కూర్చుని కెమేరావైపు మొహాన్ని తిప్పింది. అందంగా అల్లబడిన పొడవాటి నల్లని జుట్టు ఆమె మెడమీదనుంచి వొడిలోకి జాలువారింది. ఆకుపచ్చని పట్టు బట్టలతో వున్న ఆమె చూపు ఒక ప్రశాంతమైన చిన్న పిల్ల చూపులాగుంది. ‘‘అదే నేను చూసిన ఆఖరు పేజీ’’ అన్నాడు నాన్న.పరిచయవేదిక కాగితాలలో వివరాలు ఆమె వయస్సు 18 సంవత్సరాలనీ, ఆమెకు నాట్యమంటే ఇష్టమనీ, హాంగ్‌కాంగ్‌ అమ్మాయి కనుక చక్కటి ఆంగ్లంలో మాట్లాడగలదనీ చెప్పాయి. తరువాత కాలంలో అవేవీ నిజం కాదని తెలిసిపోయింది.

నాన్న అమ్మకు వుత్తరం రాసాడు. పరిచయ వేదిక వాళ్ళు అమ్మకూ నాన్నకూ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపారు. చివరికి నాన్న అమ్మను కలవడానికి హాంగ్‌కాంగ్‌ వచ్చాడు. ‘‘వేదిక వాళ్ళే అమ్మ తరుపున ఉత్తరాలు రాసేవాళ్ళు. అమ్మకు ‘హలో’, ‘గుడ్‌ బై’ తప్ప వేరే ఇంగ్లీషు తెలియదు’’. నాన్న కోపంతో వేదికవారిని డబ్బులు వెనక్కి అడగకుండా అక్కడ హోటల్‌లోని ఒక మహిళా సహాయకురాలిని అమ్మకూ తనకూ మధ్య దుబాసీగా కుదిరించుకున్నాడు. ‘‘తను నన్ను చూసిన కన్నులలో భయమూ, ఆశా దోబూచు లాడినట్లనిపించింది. నేను మాట్లాడింది సహాయకురాలు అనువదించడం మొదలెట్టాక ఆమె మొహంలో వొక అరనవ్వు తోచింది’’.నాన్న కనెక్టికట్‌కు తిరిగి వచ్చాక అమ్మ అమెరికా రావడానికి కాగితాలు సిద్ధం చేశాడు. వొక సంవత్సరం తర్వాత ‘టైగర్‌’ సంవత్సరంలో నేను పుట్టాను.నా కోరికతో అమ్మ వొక గొర్రెనూ, వొక జింకనూ, ఒక నీటి ఏనుగును కూడా కాగితాలతో చేసి ఇచ్చింది. మేము కూర్చునే గదిలో అవి పరుగులు పెడుతుంటే లచ్చు వాటిని వెంటాడేది. గాండ్రిస్తూ వాటిని దొరకబుచ్చుకున్నప్పుడు వాటిలోని గాలి మొత్తం బయటికి వెళ్ళేవరకు అణచివేసి కాగితపు ముక్కగా చేసేది. నేను మళ్ళీ గాలి ఊది వాటిని పరుగులెత్తించేవాడిని. 

ఒకరోజు టీవీలో సోరచేపను చూసి నాకూ ఒక సొరచేప కావాలని అమ్మను అడిగాను. అమ్మ ఒక సొరచేపను చేసిచ్చింది. కానీ ఆ సొరచేప మా భోజనాల బల్లపై దిగులుగా రెప్పలు కొట్టుకునేది. సింకులో నీళ్ళు నింపి నేను దాన్ని నీళ్ళలోకి వదిలాను. కొంతసేపు ఆనందంగా తిరిగింది కానీ మెల్లమెల్లగా ముద్దగా తయారై సింకు అడుక్కు వెళ్ళిపోయింది. నేను దాన్ని రక్షిద్దామనుకున్నా అది ఒక తడి కాగితపు ముద్దగానే ఉండిపోయింది. సింకు అంచుమీద నిలబడి దీనంగా చూస్తూ, చెవులు వేలాడేసి, గొంతు దాటి బయటికి రానీయని అరుపుతో చేపను చూస్తున్న లచ్చు చూపు నేను నేరస్తుడిని అన్నట్లుంది.నాకు పది సంవత్సరాల వయసప్పుడు అదే ఊర్లోని ఇంకొక కొత్త ఇంటికి మారాం. ఇద్దరు పక్క ఇండ్ల ఆడవాళ్ళు మాకు స్వాగతం చెప్పడానికి మా ఇంటికి వచ్చారు. ఏదో పనిమీద నాన్న బయటికి వెళుతూ ‘‘మీరేమీ మొహమాట పడకండి. నా భార్యకు ఇంగ్లీషు పెద్దగా రాదు. అందుకని మీతో సరిగా మాట్లాడలేదు. దీన్ని మీరు గర్వంగా భావించకండి’’ అన్నాడు. భోజనాల బల్ల దగ్గర నేను చదువుకుంటూ వుంటే అమ్మ వంటగదిలో పాత్రలు సర్దసాగింది. పక్కిండ్ల వాళ్ళు మాట్లాడు కోవడం వినిపిస్తూనే వుంది. 

‘‘ఆయన బాగానే వున్నారు కదా! అలా ఎందుకు చేసారంటావు?’’‘‘ఏదో జరగకూడనిది జరిగే వుంటుంది. ఆ పిల్లాడిని చూసావా, చప్పిడి ముక్కూ, వాలు కళ్ళూ, తెల్లని మొహం, ఒక చిన్న దయ్యంలా లేడూ? వాడికి ఇంగ్లీషు వస్తుందంటావా?’’ఆడవాళ్ళిద్దరూ ‘‘ఉష్‌’’ అనుకున్నారు. కాసేపటికి భోజనాల గదిలోకి వచ్చారు. ‘‘నీ పేరేమిటి?’’‘‘జాక్‌’’ అన్నాను.‘‘అది చైనా పేరులా లేదే?’’ఇంతలో అమ్మ భోజనాల గదిలోకి వచ్చింది. వారిని చూసి ఒక చిరునవ్వు నవ్వింది. ముగ్గురూ త్రికోణాకారంలో నా చుట్టూ నిలబడ్డారు. చిరు నవ్వులూ, తల వూపడాలూ తప్ప మాటలు లేవు. పక్కింటి మార్క్‌ అనే పిల్లాడు ఒకరోజు స్టార్‌ వార్స్‌ యాక్షన్‌ బొమ్మలతో వచ్చాడు. ఆ బొమ్మల్లో ఒకటి ఓబీ వాన్‌ కేనోబి. ఓబీ చేతులు ఊపుతూ చిన్న గొంతుతో ‘‘బలం ఉపయోగించండి’’ అని అరిచాడు. కానీ వాడు నిజం ఓబీ లాగ లేడు. కాఫీ బల్లమీద వాడు అలా చేతులు ఊపుతూ ‘‘బలం ఉపయోగించండి’’ అని అరవడం ఐదుసార్లు చూసాం. ‘‘వీడు ఇంకా ఏం చేయగలడు?’’ అని అడిగాను. మార్క్‌ నొచ్చుకున్నట్లు చూసి ‘‘కింద రాసింది చదువు’’ అన్నాడు. చూసాను కానీ ఏం చెప్పాలో అర్థం కాలేదు.

నా నిశ్శబ్దం మార్క్‌ను నిరాశ పరిచింది. ‘‘నీ బొమ్మలు చూపించు’’ అన్నాడు.అమ్మ చేసిచ్చిన కాగితం బొమ్మలు తప్ప నా దగ్గర ఏమీ లేవు. పడకగదిలోంచి లచ్చును బయ టికి తెచ్చాను. అప్పటికి లచ్చు బాగా మెత్తబడి పోయింది. దానిమీద కొన్ని సంవత్సరాల నుండి జిగురుతో, టేపులతో వేసిన అతుకులు ఉన్నాయి. మునపటిలాగా గంభీరంగా లేడు. తెచ్చి కాఫీ బల్లమీద నిలబెట్టాను. ఇది లచ్చు అని చెబుతూ మెల్లగా ఇంగ్లీషులోకి మారి పులి అని చెప్పాను. క్రిస్మస్‌ కాగితంతో చేసిన లచ్చు శరీరాన్ని గమనించి మార్క్‌ ‘‘ఇది పులిలాగా లేదు. మీ అమ్మ చెత్తనుండి దీన్ని చేసింది కదూ’’ అన్నాడు.
నేను ఎప్పుడూ లచ్చును చెత్తగా అనుకోలేదు గాని ఇప్పుడు మాత్రం ఒక పొట్లపు కాగితంతో చేసిన బొమ్మలా అనిపించింది. మార్క్‌ ఓబీ తలను తట్టాడు. లైట్లు వెలిగాయి. ఓబీ చేతులు ఊపుతూ ‘‘బలం ఉపయోగించండి’’ అని అరిచాడు. లచ్చు వెనక్కి తిరిగి ఓబీ మీదికి దూకి, కాఫీ బల్లపైనుంచి ప్లాస్టిక్‌ ఓబీని కిందకు తోసింది. ఓబీ కిందపడి విరిగాడు. ఓబీ తల ఊడి కుర్చీ కిందికి చేరింది. ‘ర్ర్‌ర్‌..’ లచ్చు నవ్వింది. నేనూ నవ్వాను.మార్క్‌ పిడికిలి బిగించి నా కడుపులో ఒక గుద్దు గుద్దాడు – ‘‘దీని ఖరీదెంతో తెలుసా?’’.

నేను కింద పడిపోయాను. లచ్చు అరుస్తూ మార్క్‌ మొహం మీదికి దూకింది. మార్క్‌ భయంతో గట్టిగా అరిచాడు కానీ లచ్చు ఒక కాగితపు బొమ్మ మాత్రమే. వాడు దాన్ని పట్టుకుని చేతులతో నలిపి సగానికి చించి రెండు ముక్కలను రెండు ఉండలుగా చేసి నా మీదికి విసురుతూ ‘‘ఇదిగో నీ చైనా మూర్ఖపు చెత్త’’ అన్నాడు. మార్క్‌ వెళ్ళిపోయాక చాలాసేపటి వరకు ఆ ముక్కలను అతికించడానికీ, కాగితం సరి చేయడానికీ టేపులతో ప్రయత్నిస్తూనే వున్నాను. సాధ్యం కావడం లేదు. ఇంతలో ఇతర జంతువు లన్నీ వచ్చి చినిగిపోయిన లచ్చు చుట్టూ, నా చుట్టూ దీనంగా నిలబడ్డాయి. మార్క్‌తో నా గొడవ అప్పుడే అయిపోలేదు. బడిలో మార్క్‌ అందరికీ తెలుసు. రెండు వారాల తర్వాత బడినుండి ఇంటికి రాగానే ‘‘ఎలా వున్నావు కన్నా! బడి ఎలా వుంది?’’ అని అడిగింది అమ్మ. నేను ఏమీ మాట్లాడకుండా నా గదికి వెళ్లాను. అద్దంలో చూసుకున్నాను. నేను ఆమెలాగ లేను. ఔను. ఆమెలాగ లేను.భోజనం దగ్గర నాన్నను అడిగాను ‘‘నా మొహం చైనా మొహమా?’’. నాన్న తినే చాప్‌స్టిక్స్‌ను పక్కన పెట్టి ముక్కు దూలాన్ని కుడిచేతి మధ్య వేలితో రుద్దుకున్నాడు. బడిలో ఏం జరిగిందో నేను చెప్పనప్పటికీ ఆయనకేదో అర్థమైనట్లుంది. ‘‘కాదు కాదు’’ అన్నాడు. అమ్మ నాన్నవైపు అర్థం కానట్లు చూసింది. నా వైపు తిరిగి ‘‘షో జియావ్‌ చింక్‌’’ (అంటే ఏమిటి) అని అడిగింది. 

‘‘ఇంగ్లీషు మాట్లాడు’’ అన్నాను నేను. నా ముందు వున్న ఆహారం గిన్నెను చాప్‌స్టిక్స్‌ను దూరంగా తోసేసి ‘‘మనం అమెరికా ఆహారం తినాలి’’ అన్నాను. అమ్మ నావైపు చూసి ‘‘బుహోచి?’’ భోజనం రుచిగా లేదా? అని అడిగింది.‘‘ఇంగ్లీష్‌’’ గట్టిగా అరిచాను. ‘‘ఇంగ్లీష్‌లో మాట్లాడు’’.    అమ్మ నా దగ్గరగా వచ్చి నా నుదుటిపై చేయి పెట్టబోతూ ‘‘ఫశావులా?’’ జ్వరంగా ఉందా? అని అడిగింది. అమ్మ చేతిని దూరంగా తోసి వేశాను. ‘‘నాకు బాగానే ఉంది. నువ్వు ఇంగ్లీష్‌లో మాట్లాడు’’. గట్టిగా అరిచాను.నాన్న అమ్మతో అన్నాడు – ‘‘వాడితో ఇంగ్లీషులో మాట్లాడు. ఇలాంటి రోజొకటి వస్తుందని నీకు తెలియదా?’’
అమ్మ చేతులను దిగాలుగా జారవిడుచుకుని కూర్చుంది. నాన్ననూ  నన్నూ మార్చి మార్చి చూస్తోంది. మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. ఆపుతోంది. మాట బయటకు రాదు.నాన్న అన్నాడు – ‘‘నువ్వు ఇంగ్లీషు నేర్చుకోక తప్పదు. నాతో నీ జీవితం సుఖంగా సాగింది. జాక్‌ పెరగాలి’’. నీటిలో పడిన నీటి ఏనుగులా అమ్మ కుర్చీలో కూలబడి పోయింది. ‘‘నాకు కొన్ని నిజం బొమ్మలు కావాలి’’. నాన్న స్టార్‌ వార్స్‌ యాక్షన్‌ బొమ్మల సెట్టు తెచ్చాడు. మార్క్‌కు ఓబీ వాన్‌ కేనోబిని ఇచ్చేశాను. నా దగ్గరున్న కాగితపు బొమ్మలన్నింటినీ ఒకచెప్పుల పెట్టెలో పెట్టి నా పరుపు కిందికి తోసేశాను. ఉదయానికి బొమ్మలన్నీ పెట్టెనుంచి  తప్పించుకుని నా గదిలో వాటి వాటి స్థానాలకు చేరుకున్నాయి. అన్నింటినీ పట్టుకుని మళ్ళీ ఆ చెప్పుల పెట్టెలోవేసి టేపుతో మూసేశాను. ఆ బొమ్మలన్నీ ఎంత గొడవ చేసాయంటే చివరకు నేను ఆ పెట్టెను నా గదికి దూరంగా వున్న ఒక అటకపై వొక మూలకు తోశాను. 

అమ్మ చైనా భాషలో మాట్లాడితే సమాధానం ఇచ్చేవాడిని కాదు. కొంత కాలానికి కొంచం ఇంగ్లీషులో మాట్లాడడానికి ప్రయత్నించింది కానీ ఆమె ఉచ్ఛారణా, వాక్య నిర్మాణం చాలా కష్టంగా అనిపించేది. సరిదిద్దడానికి ప్రయత్నించేవాడిని. క్రమక్రమంగా నేను ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ మాట్లాడడమే మానేసింది. నాకు ఏదైనా కావాలంటే సైగలతో అడిగి తెలుసుకునేది. టీవీ కార్యక్రమాలలో కొడుకును హత్తుకునే అమెరికన్‌ అమ్మలలాగా నన్ను హత్తుకోవాలని చూసేది. నాకు ఎందుకో అది అతిగానూ, అసహజంగానూ అనిపించేది. ఆ విషయం తనకు అర్థమైనట్లుంది. అదీ మానేసింది. ‘‘అమ్మతో అలా ప్రవర్తించకూడదు.’’ నాన్న నాతో అన్నాడు కానీ ఆయన నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోయాడు. అమ్మ అమెరికా పద్ధతిలో వండడం నేర్చుకుంది. నేను వీడియో గేమ్స్‌ ఆడుతున్నాను. ఫ్రెంచ్‌ నేర్చుకుంటున్నాను. అప్పుడప్పుడు వంట గది బల్లమీద అమ్మ పరిశీలిస్తున్న ఒక కాగితపు వెనుక భాగం నాకుకనిపించేది. కొంతకాలం తరువాత ఒక కొత్త కాగితపు బొమ్మ నా మంచం పక్కన ప్రత్యక్షమై నన్ను పలకరిస్తున్నట్లు ఉండేది. వాటిని పట్టుకుని, వాటిలోని గాలినంతా పిండేసి, బలవంతంగా అటకమీద వున్న చెప్పుల పెట్టెలోకి తోసేసేవాడిని. నేను ౖహె స్కూలులో చేరాక అమ్మ నాకోసం బొమ్మలు చేయడం మానేసింది. అప్పటికి మంచి ఇంగ్లీషు వాడే స్థితికి వచ్చింది కానీ ఆమె ఏ భాషలో మాట్లాడినా నాకు ఆసక్తి ఉండేది కాదు.
 
ఎప్పుడైనా ఇంటికి వచ్చి ఆమె చిన్న శరీరంతో వంటగదిలో బిరబిరా తిరుగుతూ తన మాతృ భాషలో ఏదో ఒక పాట పాడుకుంటూ వుండే ఆమెను చూస్తే ఈమేనా నాకు జన్మనిచ్చింది అనిపించేది. ఆమెకూ నాకూ ఏ పోలికలూ లేవు. ఆమె ఎక్కడో చంద్రమండలం నుండి వచ్చినట్లుగా ఉండేది. నేను గబగబా నా గదిలో దూరి నా అమెరికన్‌ ఆనందాన్ని వెతుక్కునే వాడిని. నాన్న, నేను అమ్మ వున్న హాస్పిటల్‌ గదిలో ఆమెకు ఇరువైపులా నిల్చొని ఉన్నాము. అమ్మకు ఇంకా నలభై ఏండ్లు కూడా నిండలేదు. కానీ చాలా ముసలిగా అనిపించింది. తన శరీరంలోని బాధను కొన్ని సంవత్సరాలపాటు ఆమె బయటికి చెప్పు  కోలేదు. దాన్నొక చిన్న విషయంగా తీసి పారేసింది. డాక్టర్ల దగ్గరికి పోలేదు. ఇంటిముందుకు అంబులెన్సు వచ్చే సమయానికి ఆమె శరీరంలోని క్యాన్సర్‌ ఆపరేషన్‌కు లొంగనంతగా వ్యాపించింది. 

నా మనస్సు ఆ గదిలో లేదు. నాకు ఇప్పుడు క్యాంపస్‌ ఉద్యోగాల కాలము. నా ధ్యాసంతా క్యాంపస్‌ ఉద్యోగాల సాధనపైనే ఉన్నది. ఇంటర్వ్యూలలో వాళ్ళను ఎలా మెప్పించి ఉత్తీర్ణుడు కావాలా అనే విషయం మీదనే నా దృష్టి ఉంది. అమ్మ ఆ స్థితిలో ఉండగా నాకు అలాంటి ఆలోచనలు ఉండడం దారుణమే కానీ ఆ సమయానికి నా మానసిక స్థితి అదే. అమ్మ స్పృహలోనే ఉంది. నాన్న తన రెండు చేతులతో అమ్మ ఎడమ చేతిని పట్టుకుని ఉన్నాడు. ఆమె నుదురును చుంబించడానికి ఆయన ముందుకు వొంగాడు. నాన్న అంత ముసలిగా బలహీనంగా ఉండటం నాకు అర్థం కాలేదు. ఆ క్షణం నాకు అమ్మ గురించి ఎంత తెలుసో నాన్న గురించి కూడా అంతే తెలుసునని అర్థమైంది.అమ్మ నాన్నను చూసి నవ్వింది. ‘‘నేను బాగానే ఉన్నాను’’. నవ్వుతూనే నా వైపు తిరిగి ‘‘నువ్వు స్కూలుకు వెళ్లాలని నాకు తెలుసు. నాకోసం బాధపడకు, వెళ్ళు. ఇది అంత పెద్ద విషయం ఏమీ కాదు. మీ స్కూలు విషయాలపట్ల శ్రద్ధ వహించు’’. ఆమె గొంతు చాలా బలహీనంగా ఉంది. అమ్మ చేతిని మృదువుగా తట్టాను. నాకు విమానానికి సమయం అవుతూ వుంది. ఉదయానికి కాలిఫోర్నియాలో ప్రకాశవంతమైన సూర్యోదయాన్ని చూడాలి. అమ్మ నాన్నతో ఏదో చెప్పింది. ఆయన తల ఊపి గదినుండి బయటికి వెళ్ళాడు.‘‘జాక్‌’’ తెరలు తెరలుగా వస్తున్న దగ్గు కొంచంసేపు ఆమెను మాట్లాడనివ్వ లేదు. ‘‘ఒకవేళ నేను ఇంటికి రాలేకపోతే బాధతో నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నీ జీవితంపై శ్రద్ధ వహించు. అటకమీద వున్న ఆ పెట్టెను నీతోనే ఉంచుకో. ప్రతి సంవత్సరం క్వింగ్‌ మింగ్‌ రోజున ఆ పెట్టెను ఒకసారి బయటికి తీసి నా గురించి ఆలోచించు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను’’.

‘క్వింగ్‌ మింగ్‌’ మృతులకోసం చైనీయులు జరుపుకునే పండుగ రోజు. నా చిన్నతనంలో క్వింగ్‌ మింగ్‌ రోజున మరణించిన ఆమె తల్లి దండ్రులకు ఆ సంవత్సరంలో తనకు జరిగిన మంచిని గురించి అమ్మ ఉత్తరం రాసేది. దానిని నాకు చదివి వినిపించేది. నేను ఏమైనా ఒక మాటంటే ఆ మాటను కూడా ఆ ఉత్తరంలో చేర్చేది. ఆ ఉత్తరాన్ని ఒక కొంగ ఆకారంలో మడిచి పడమటి దిక్కుకు వదిలేది. ఆ కొంగ తన రెక్కలను కదిలిస్తూ సుదూరాన ఉన్న ఫసిపిక్‌ సముద్రాన్ని దాటి చైనా వైపుగా అమ్మ కుటుంబాన్ని చేరడం చూసేవాళ్ళం. ఇది జరిగి చాలా సంవత్సరాలవుతోంది. ‘‘నాకు చైనా క్యాలెండర్‌ తెలియదు. విశ్రాంతి తీసుకో..’’
‘‘ఆ పెట్టె నీ దగ్గరే ఉంచుకుని ఎప్పుడైనా ఆ పెట్టెను తెరువు. ఎప్పుడైనా ఒకసారి’’ దగ్గు ముంచుకొస్తోంది. ‘‘సరే అమ్మా’’ ఆమె చేతిని మెల్లగా తట్టాను. ‘‘హైజి, మామ అయిని’’ దగ్గు తెరలు. కన్నా అమ్మ నిన్ను ప్రేమిస్తోంది. కొన్ని సంవత్సరాల కిందట ఈ మాట చెబుతూ అమ్మ తన చేతులను తన గుండెలపై ఉంచుకోవడం కళ్ళముందు మెదిలింది.‘‘సరే అమ్మా, ఇంక మాట్లాడకు’’.నాన్న తిరిగి వచ్చాడు. నాకు విమానానికి సమయమవుతోందని చెప్పాను. ఆలస్యమైతే విమానం తప్పిపోతుంది. నేనెక్కడో నెవెడాపై ఎగురుతున్నప్పుడు అమ్మ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. 

అమ్మ మరణం తర్వాత నాన్న తొందరగా ముసలివాడైపోయాడు. ఆయనకు ఆ ఇల్లు చాలా పెద్దదిగా అనిపించి అమ్మివేశాడు. నేనూ నా స్నేహితురాలు సుసాన్‌ కలసి సామాన్లు సర్దడంలో నాన్నకు సహాయం చేయడం కోసం వెళ్లాం. సుసాన్‌ అటకమీద వున్న చెప్పుల పెట్టెను చూసింది. ఆ పెట్టెలో చాలా కాలంగా ఉన్న కాగితపు బొమ్మలు గట్టిగా తయారై రంగు మారిపోయి ఉన్నాయి.‘‘నేనింతవరకు ఇంత చక్కని కాగితం కళ చూడలేదు’’ అంది సుసాన్‌. ‘‘మీ అమ్మలో ఒక అద్భుతమైన కళ ఉంది’’.కాగితపు జంతువులు కదలలేదు. బహుశా వాటిని కదిలించే అపూర్వ శక్తి్త ఏదో అమ్మ మరణంతో మాయం అయిందో లేక అవి కదలడం నా భ్రమో తెలియలేదు. పసిపిల్లల జ్ఞాపకాలు నమ్మదగినవిగా ఉండవు. రెండు సంవత్సరాల తరువాత ఏప్రిల్‌ నెల మొదటి వారాంతంలో సుసాన్‌ లేని ఇంట్లో్ల నేను ఒక్కడినే. సుసాన్‌ తన ఉద్యోగంలో భాగంగా అనంతమైన యాత్రలలో ఉంది.టీవీలో సొరచేపలపైన ఒక డాక్యుమెంటరీ వస్తోంది. ఉన్నట్లుండి నా మదిలో అమ్మ సొరచేపను తయారు చేస్తుంటే, నేనూ లచ్చూ ఆసక్తిగా చూస్తున్న దృశ్యం కదలాడింది. ఏదో కాగితం కదిలిన శబ్దం. ఒక చినిగిన టేపూ, ఒక కాగితపు ఉండా పుస్తకాల అర దగ్గర పడి ఉంది. నేను వెళ్లి దాన్ని చెత్తలో వెయ్యడానికి చేతిలోనికి తీసుకు న్నాను. ఆ కాగితపు ఉండ కదిలింది. విడివడింది. అది లచ్చు. ఎంత కాలమైంది లచ్చును గురించి ఆలోచించి. నేను వెళ్ళిపోయిన తరువాత అమ్మ లచ్చును మళ్ళీ అతికించి పెట్టినట్లు ఉంది. లచ్చు ఇప్పుడు అంతకు ముందు కంటే చిన్నదిగా ఉంది, లేదా అప్పటి నా చిట్టిచేతులకు ఇదే పెద్దగా అనిపించేదేమో. సుసాన్‌ ఆ కాగితపు బొమ్మలను అపార్టుమెంటు మొత్తం అందంగా అలంకరించింది. బహుశా లచ్చు బాగా కనబడకపోవడంతో ఒక మూలన ఉంచిందేమో.  

నేను నేలమీద కూచుని చూపుడు వేలుతో లచ్చును తగిలాను. దాని తోక ఊగింది. ఆటలోలా అది ముందుకు దూకింది. నవ్వొచ్చింది. దాని వీపు నిమిరాను. నా చేతికింద దాని గురగుర శబ్దం వినిపిస్తోంది. ‘‘ఎలా ఉన్నావు బాల్య మిత్రుడా?’’ లచ్చు ఆడటం ఆపి నా వొడిలోకి దూకి మడతలు విడివడడం మొదలైంది. నా వొడిలో ఆ కాగితం మడతలు వీడి బరువైన చైనా అక్షరాలు కనబడుతున్నాయి. నాకు చైనా భాష చదవడం రాదు. అయితే కొన్ని అక్షరాలు మాత్రం తెలుసు. ఈ రోజు క్వింగ్‌ మింగ్‌. ఆ ఉత్తరాన్ని చైనా టూరిస్టు బస్సులు ఆగే ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్లాను. అక్కడ కనిపించిన చైనా వాళ్ళందరినీ నాకు తెలిసిన చైనా భాషలో ‘‘మీరు చైనా భాష చదవగలరా?’’ అని అడిగాను. నా భాష వాళ్లకు అర్థమైందో లేదో గానీ చాలామంది తల అడ్డంగా ఊపారు. ఒక అమ్మాయి నాకు సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇద్దరం వొక బెంచిపై కూర్చున్నాం. ఆ అమ్మాయి ఉత్తరం గట్టిగా చదువుతోంది. కొన్ని సంవత్సరాలక్రితం నేను మరచిపోవడానికి ప్రయత్నించిన భాష మళ్ళీ వినిపిస్తోంది. అది నాలో కరుగుతున్నట్లు ఉంది. నా చర్మంలోంచి, ఎముకల్లోంచి, సూటిగా హృదయాన్ని తాకుతున్నట్లుగా ఉంది.

కన్నా!
మనం చాలాకాలంగా మాట్లాడుకోడంలేదు. నేను నిన్ను ముట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు నీ కోపం నన్ను చాలా భయపెట్టింది. ఈ బాధ నా జీవితమంతా ఉంది. అందుకే నీకు రాయాలను కున్నాను. నువ్వు ఎంతో ఇష్టపడే, నేను నీకు చేసి ఇచ్చిన కాగితపు జంతువులలో ఇది రాస్తున్నాను. నా ఊపిరి ఆగిపోగానే ఈ బొమ్మలలో చలన ం ఆగిపోతుంది. అయితే నా హృదయంలోని పూర్తి ప్రేమతో నీకు రాస్తే నేను నీకోసం ఈ పదాలలో ఈ కాగితాలలో ఉన్నట్లే ఉంటుంది. క్వింగ్‌ మింగ్‌ రోజున నీవు నన్ను తలచుకుంటే గతించిన వారి ఆత్మలు వారి వారి కుటుంబాలను చేరేందుకు అనుమతి లభిస్తే నన్ను నేను భాగాలు భాగాలుగా నీ ముందుంచగలనేమో. నేను నీకోసం చేసిన బొమ్మలు మళ్ళీ కదుల్తాయి. పరిగెత్తుతాయి. దూకుతాయి. అప్పుడు వాటి మీద అక్షరాలను నీవు చదవొచ్చు. నా హృదయమంతా నిండిన ప్రేమతో నీకు రాయాలి కనుక అది చైనా భాషలోనే అయితే సరిపోతుంది. ఇంతకాలం నేను ఎప్పుడూ నా జీవిత కథను నీకు చెప్పలేదు. నేను 1957లో హెబ్రీ ప్రావిన్స్‌లోని సిగులు గ్రామంలో పుట్టాను. నీ అవ్వా తాతలు అత్యంత పేద రైతుకూలీ కుటుంబాలనుంచి వచ్చారు. వారికి బంధువులు కూడా పెద్దగా లేరు. నేను పుట్టిన కొన్ని ఏండ్లకే చైనాలో దుర్భరమైన కరువు వచ్చింది. ఆ కరువు బారిన పడి 30 లక్షలమంది ప్రజలు చనిపోయారు. నాకున్న మొదటి బాల్యపు జ్ఞాపకం ఒకరోజు నిద్ర లేవగానే మన్ను తింటున్న మా అమ్మను చూశాను. మట్టితో తన కడుపు నింపుకుని ఇంట్లో పిండిని తన కూతురికోసం దాచేది మా అమ్మ. 

క్రమంగా రోజులు మెరుగయ్యాయి. సిగులు గ్రామం కాగితపు కళకు ప్రసిద్ధి చెందింది. మా అమ్మ నాకు కాగితపు బొమ్మలు చేయడం, వాటికి ఊపిరి పోయడం నేర్పింది. ఆ గ్రామీణ జీవితంలో అది ఒక యథార్థ ఇంద్రజాలం. మేము పొలాల్లోని మిడతలను తరమడానికి కాగితాలతో పక్షులను చేసి వదిలేవాళ్ళం. ఎలుకలను తరమడానికి కాగితంతో పులులను చేసేవాళ్ళం. చైనా కొత్త సంవత్సరం రోజున కొందరు మిత్రులతో కలిసి నేను ఎర్ర కాగితంతో డ్రాగన్‌ బొమ్మ తయారు చేశాను. గత సంవత్సరపు పాత జ్ఞాపకాలను తడమడానికి దారాల చివర్లలోని ఎర్రని డ్రాగన్లను ఆకాశంలో ఎగురవేయడాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. అది చూస్తే నువ్వు ఎంత ఇష్టపడేవాడివో. 1966లో సాంస్కృతిక విప్లవం మొదలైంది. ఇరుగు పొరుగు వారు ఒకరికొకరు శత్రువుల  య్యారు. అన్నలూ తమ్ముళ్ళూ ఒకరిమీద ఒకరు కలహాలకు దిగారు. ఎప్పుడో 1946లో మా అమ్మ తమ్ముడు అంటే మా మామ చైనా వదిలి హాంకాంగ్‌ చేరాడని ఎవరో గుర్తు చేశారు.ఆయన అక్కడ ఏదో వ్యాపారం చేస్తున్నాడట. హాంకాంగ్‌లో బంధువులు ఉండటం అంటే మేము గూడ చారులమో, చైనా శత్రువులమో అయినట్లు లెక్క. వీటన్నిటినీ మేము ఎదురీదాము. మీ అమ్మమ్మ పిచ్చిది. ఆ అవమానాన్ని భరించలేక ఒక బావిలో దూకి చనిపోయింది. కొంతమంది యువకులు వేటకు పనికివచ్చే ఈటెలతో మీ తాతను ఒకరోజు అడవుల్లోకి తీసుకెళ్ళారు. ఆయన ఇక తిరిగి రాలేదు. నేను ఒక పది సంవత్సరాల అనాథ పిల్లనయ్యాను. నాకున్న ఒకేవొక బంధువు హాంకాంగ్‌లోని మా మామ. ఒక అర్ధరాత్రి రహస్యంగా సామాన్లు దక్షిణ దిశకు తీసుకెళ్ళే ఒక రైలులో ఎక్కాను. 

కొన్ని రోజుల తరువాత దక్షిణాన వున్న గాంగ్‌ డాంగ్‌ ప్రావిన్స్‌లో ఒక పొలంలో ధాన్యం దొంగిలిస్తున్నానని కొందరు యువకులు నన్ను పట్టుకున్నారు. నేను హాంకాంగ్‌ వెళ్లేందుకు మార్గమధ్యంలో ఉన్నానని చెప్పినప్పుడు వారు గట్టిగా నవ్వారు. ‘‘ ఈరోజు నీ అదృష్టం బాగుంది. మేము హాంకాంగ్‌కు ఆడ పిల్లల్ని చేర్చే పని చేస్తున్నాం’’ అన్నారు. ఒక ట్రక్కు అడుగున మరికొంతమంది ఆడపిల్లలతో కలిపి వాళ్ళు నన్ను చైనా సరిహద్దు దాటించారు. వాళ్ళు మమ్మల్ని ఒక చోటుకు తీసుకెళ్ళి వరుసగా నిలబెట్టారు. మమ్మల్ని కొనేవారికి మేము తెలివిగా ఆరోగ్యంగా కనబడాలని వాళ్ళు చెప్పారు. కొన్ని కుటుంబాలు అక్కడికి వచ్చి మమ్మల్ని చూసేందుకు కొంత డబ్బు చెల్లించి మాలో ఒకర్ని ఎంచుకుంటారు. అలా చిన్‌ కుటుంబం తమ ఇద్దరు పిల్లలనూ చూసుకోవడానికి నన్ను ఎన్నుకున్నారు. నేను ఉదయం నాలుగు గంటలకే లేచి వారికి అల్పాహారం తయారు చేసేదాన్ని. పిల్లలకు స్నానాలు చేయించి తిండి పెట్టే దాన్ని. ఆహారానికి కావాల్సిన వస్తువుల కోసం బయటికి వెళ్ళేదాన్ని. ఇల్లంతా చిమ్మి అలికి బట్టలు వుతికేదాన్ని. పిల్లలు అటూ ఇటూ పోకుండా జాగ్రతగా చూసుకునేదాన్ని. వాళ్ళు రాత్రిళ్ళు నన్ను వంట గదిలోని ఒక గూట్లో పెట్టి తాళం వేసేవాళ్ళు. నేను కొంచెం నిదానంగా పనిచేసినా, ఏదైనా పొరపాటు చేసినా కొట్టేవాళ్ళు. వాళ్ళ పిల్లలు తప్పు చేసినా నన్నే కొట్టేవాళ్ళు. నేను పొరపాటున ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ పట్టుబడితే చితక బాదేవాళ్ళు. 
‘‘నువ్వు ఇంగ్లిష్‌ ఎందుకు నేర్చుకున్తున్నావు?’’ అడిగేవాడు చిన్‌. 

‘‘పోలీసులకు మామీద చాడీలు చెబుతావా? నువ్వు చైనా నుంచి వచ్చావని మేమూ చెబుతాము. వాళ్ళు నిన్ను జైల్లో పడేస్తారు’’. ఆరు సంవత్సరాలు దుర్భర జీవితం గడిపాను. ఒకరోజు సంతలో నేను రోజూ చేపలుకొనే కొట్టుగల ముసలావిడ నన్ను పక్కకు తీసుకెళ్ళింది. ‘‘నీలాంటి పిల్లలు నాకు తెలుసు. నీకెన్నేండ్లు? పదహారు ఉండవూ? ఏదో ఒకరోజు నిన్ను కొన్న మనిషి పూటుగా తాగి నిన్ను పక్కలోకి లాగుతాడు. నువ్వు ఏమీ చెయ్యలేవు. ఆ విషయం వాడి భార్యకు తెలుస్తుంది. అప్పుడు నరకమంటే ఏమిటో నీకు తెలుస్తుంది. ఇలాంటి జీవితం నుండి బయట పడవా? నీకు సహాయం చేసేందుకు నాకు తెలిసిన కొందరున్నారు’’. ఆమె నాకు ఆసియా ఆడపిల్లల్ని కోరుకునే అమెరికా మగవారి గురించి చెప్పింది. నాకు వండటం, శుభ్రం చేయడం, భర్తను శ్రద్ధగా చూసుకోవడం తెలిసినట్లయితే నాకు ఒక అమెరికా భర్త దొరకుతాడనీ, నేను ఒక మంచి జీవితం గడప వచ్చనీ చెప్పింది. నా జీవితంలో నాలో చిగురించిన ఆశ అదొక్కటే. అలా నేను ఎన్నో అబద్ధాలతో కేటలాగులోకి ఎక్కాను.  మీ నాన్నను కలిశాను. మాదేమీ ఒక ప్రేమమయమైన కథ కాదు. అయితే ఇది నా కథ. కనెక్టికట్‌ నగర పరిసరాలలో నేనొక్కదాన్నే ఒంటరిగా. మీ నాన్న నాతో ఎప్పుడూ చాలా దయగా ప్రేమగా ఉండేవాడు. నేను ఎప్పుడూ ఆయనపట్ల కృతజ్ఞతాభావంతో ఉండేదాన్ని. నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు. అలాగే జీవితంలో నాకు ఏదీ అర్థం కాలేదు. 

అయితే ఏం. నువ్వు పుట్టావు. నీ మొహంలోకి చూసినప్పుడు నాకెంత ఆనందమనిపించిందో! నీరూపులో నేను మా అమ్మనూ మా నాన్ననూ నన్నుకూడా చూసుకున్నాను. నేను నా మొత్తం కుటుంబాన్ని కోల్పోయాను. నేను పుట్టి పెరిగి అమితంగా ప్రేమించిన సిగులులో నాకేమీ లేదు కానీ నువ్వున్నావు. వారు నిజం అని చెప్పడానికి నీ మొహం సాక్ష్యం. ఇప్పుడు నాకు మాట్లాడటానికి ఒకరు దొరికారు. నీకు నేను నా భాష నేర్పాలి. నువ్వూ నేనూ కలిసి నేను ప్రేమించి కోల్పోయిన మొత్తం ప్రపంచాన్ని ఒక చిన్న భాగంగానైనా నిర్మించాలి. నువ్వు మొదటిసారి చైనా భాషలో మొదటిమాట మాట్లాడినప్పుడు అది మా అమ్మ గొంతులా అనిపించింది. ఆ రోజు కొన్ని గంటల పాటు ఏడుస్తూనే వున్నాను. నీకు మొదటిసారి ఒక కాగితం బొమ్మను చేసి ఇచ్చినప్పుడు నీ నవ్వును చూసి ఇక ఈ ప్రపంచంలో నాకు ఏ బాధలూ లేవనుకున్నాను. నీవు కొంచెం ఎదిగాక నాకూ మీ నాన్నకూ మధ్య మాటల వారధివయ్యావు. నాకు ఇప్పుడు నిజంగా మంచి జీవితం లభించింది. ఇప్పుడు మా అమ్మా నాన్నలు దగ్గర వుంటే వారికి మంచి భోజనాన్నీ మంచి జీవితాన్నీ ఇచ్చేదాన్నేమో.  ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైన విషయంగా చైనా వాళ్ళు భావించేదేమిటో తెలుసా? పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యాక అమ్మా నాన్నల ఇష్టాలను తీర్చేందుకు సిద్ధమయ్యేసరికి వాళ్ళ ప్రపంచంలో అమ్మానాన్నలు లేరని గుర్తించడమే.కన్నా! నీకు నీ చైనా కళ్ళు ఇష్టం లేదని నాకు తెలుసు. అవి నా కళ్ళు. నీకు నీ చైనా జుట్టు ఇష్టం లేదని నేనెరుగుదును. అది నా పోలికే. నీ పుట్టుక నాకెంత ఆనందాన్ని తెచ్చిందో తెలుసా! నీవు ఒక్క సారిగా నాతో మాటలు ఆపేసి నన్ను నా భాషలో మాట్లాడనీయనప్పుడు నా భావనలు నీకు తెలుసా. నేనెందుకో మరొక్కసారి నా సర్వస్వాన్ని కోల్పోయి నట్లు అనిపించింది. కన్నా! నాతో ఎందుకు మాట్లాడవు. బాధతో రాయలేక పోతున్నా....

ఆ యువతి ఆ కాగితాలను నాకు తిరిగి ఇచ్చేసింది. నేను ఆమె మొహంలోకి చూడలేక పోయాను. పైకి చూడకుండానే అమ్మ ఉత్తరంలో ప్రేమ అనే పదం ఎక్కడుందో చూపించమని అడిగాను. ఆ పదాన్ని అమ్మ ఉత్తరం కింద అలా రాస్తూ ఉండిపోయాను.ఆ అమ్మాయి నాకు దగ్గరగా వచ్చి తన చేతిని నా భుజంపై వేసింది. లేచి నన్ను మా అమ్మకు వొంటరిగా వదలి వెళ్ళిపోయింది. కాసేపటి తరువాత నా చేతిలో వున్న కాగితాన్ని మడిచి లచ్చుగా చేశాను. నా చేతులలో లాలించాను. గుర్రుమని శబ్దం చేసింది. ఇద్దరం ఇంటివైపు బయలుదేరాం. 
(‘రస్తా’ అంతర్జాల పత్రిక సౌజన్యంతో) 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top