భూమి లోడితే  దొరికేది మాయేనంట!

Funday story of the week10-03-2019 - Sakshi

ఈవారం కథ

ఆ పొద్దు శనివారం. గడపట అలికి బొట్లు పెడతా ఉండా!  నా చెల్లెలు పద్మ వచ్చి నాపక్కన కుసుండే. నేను ఆ యమ్మ మొగంకల్ల ఎగ జూస్తి. మొగం సప్పిడిగా పెట్టుకొని ఉండె. ‘‘యాల పద్మా అట్లుండావు?’’ అని అడిగితి. ‘కాదక్కా,  మా ఇంటి పక్కన నరసమ్మ మంచి లై కనుక్కొనింది. ఇబుటికి సుమారు నెల నుండి గమనిస్తా ఉండా. నేను ఇంటికాడ ఉన్నింది చూసిందంటే నీల్లకు చెమ్ము ఎత్తుకుని ఒచ్చేస్తుంది. వాళ్ళింట్లో సంగటి తిని మా ఇంట్లోకి వచ్చేది నోరు కారాలు అని ఆరస్తా. నోరు మంటగిని కాసిన్నినీల్లు ఇమ్మ తాగల్ల అనేది. మా ఇంట్లో ఉండ పెద్ద చెమ్ము, అది లీటరు నీల్లు పడుతుంది. దానినిండుకు పట్టిస్తే గుక్క తిప్పుకోకుండా, పైకి ఎత్తిన చొమ్ము దించకుండా నిమిసానికి తాగేసి చొమ్ము ఆడ పెట్టేసి మూతి తుడ్సుకొని ఎలిపోతుంది. మేము వారానికి రెండు క్యాండ్లు నీల్లు కొంటే ఆయమ్మ ఒగ క్యాను నీల్లు కొంటుంది. ఆనీల్లను సుమారు వారం పది దినాలు సరిజేస్తుంది. లీటరు నీల్లు పట్టే బాట్లు ఎత్తుకొస్తుంది మాఇంటికి. వాటిని బట్టుకుపోయి మొగునికిస్తుంది. దినాము వాళ్ళింట్లో అన్నందినేది మా ఇంట్లో నీల్లు తాగేసిపోతే పొదుపు గాదా. మా ఇంట్లో మేము నలుగురం తాగల్ల. ఇంగా వొచ్చే వాళ్లకు పొయ్యే వాళ్లకు ఎట్లా లేదన్నా దినానికి రెండు లీటర్ల నీళ్లు పంచాల్సి వస్తా ఉంది. ఇల్లు ఏమారి బీగం ఎయ్యకుండా ఆదమర్సినామంటే చిన్నగా లబ్బరు సీసా ఎత్తకొచ్చి నీళ్లు దొంగతనం కూడా చేస్తుంది. నా మొగుడు నన్నుకన్నమాటలు తిడతా ఉండాడు. ఇట్లే ఆయమ్మను నువ్వు చేరదీస్తావుండు ఇంట్లో నీల్లన్నీ తాగేసి పోతుంది అని. 

అది కాదక్కా మేమూ కొనే నీల్లె కదా,ఇరవై లీటర్లనీల్లకి ఇరవై రూపాయలిస్తుండాం. ఆయమ్మ ఇరంపరం లేకుండా అట్లా తాగితే ఎట్లా? దీనట్లాడిదే ‘మనింటిదీపమే కదా అని ముద్దుపెట్టుకుంటే మూతంతా కాలిందట’ ఈ పొద్దు మల్లా కాసిన్ని నీల్లు ఇయ్యి అని అడిగే. మా ఇంటికి  నీల్లకోసం రావద్దు అని మగాన గొట్టినట్టు జెప్పిన నిట్టూరం అయితే గానీ అని. ఇబ్బుటికే నేను నీల్లోనికి పది క్యాండ్లకి అప్పు. ఈసారికి వాడు నాకు నీల్లు ఇస్తాడో లేదో’’ అని దాని బాదంతా ఎలగక్కి మల్లా వస్తాకా అని ఎలిపాయె!‘‘చుట్టమై వచ్చి దెయ్యమై పట్టుకున్నంట’’ ఇట్లాడిదే నర్సి అనుకొని నేను నా పన్లన్నీ ముగించుకునేకుందికి అన్నం పొద్దు అయింది. మడికాడికి పదామని దావలోకి వస్తి. నేను పద్దన్నేదిబ్బలో పేడతట్టి ఎయ్యను దావింటి వచ్చినబడు మా తోడికోడలు మేనమామ ఊరు నుండి వస్తా ఉండే. ఆయన ఇబుడు తిరుక్కుని ఊరికిఎలిపోతా ఉండాడు. నాకు ఎదురుబడే.‘‘ఏమప్ప ఇంతలో వస్తా ఉండావు, మల్ల అంతలోనే ఎలిపోతా ఉండావు’’  అంటి. ‘‘పాక, మీ ఊర్లో తాగను నీల్లు పుట్ల. మీయక్క క్యాను నీల్లు అయిపోయినాయని బోరునీల్లు ఇస్తాది, అవి తాగి పడిసం బడితే ఎట్లమ్మ’’ అనే. నేను ఉండుకొని ‘అయ్యో మా ఇంట్లో తాగుదువురా అంటే ‘లేదులేమ్మా పని ఉంది’ అనిఎలిపాయ ఆయప్ప!

ఆ మర్సునాడు అంతా కూలీలకు ఎలబారే  పొద్దయింది. అరుపులు గెట్టిగా ఇనిపిస్తావుంటే ఇంట్లోనుండి ఈదిలోకి వొచ్చి చూస్తి. మా చిన్నమ్మ చిన్నాయన కొట్లాడుకుంటా ఉండారు. నేను పుట్టి బుద్దెరిగిందే వాళ్లిద్దరూ వాళ్ళ సద్దు నలుగురినేటిగా రంపులాడిందే లేదు. వాళ్లకు బిడ్డలు పాపలు లేరు. ఉండేది ఇద్దురే. మా చిన్నాయన ఏ పనికీ పాటకూ పోడు. ఏయాలకీ మా చిన్నమ్మే కూలి చేసి ఇంట్లోకి ముప్పై మూడు తెచ్చేయల్ల. ఆ యప్పమాత్రానికి తెల్లగ గుడ్డలేసుకొనేది,ఈ యమ్మ కూలి చేసిన డబ్బుల్ని అల్లింబెల్లం మాటలు జెప్పి ఉబ్బించి తీసుకునేది,ఈకుంటే రంపుజేసి పెరుక్కుని టౌనుకు బోయి ఆ బస్టాండెంటి తిరిగేది. ‘‘లత్తగవ్వలన్నీ ఒక దరికి చేరినట్టు’’ ఈనికి దోడుమైనోళ్లతో టీలు తాగేది,అట్లా పొద్దుబోగొట్టుకునేది. మావిటేల ఆయమ్మ నోటికి వక్కాకు, నాలుగుబాండాలు నల్లకవర్‌ లో తీసుకొని ఇంటికొచ్చేది. ఆయమ్మ ఏంపనికి పోయింటివి అంటే నేను ఆడ పనుంటే పోతిని ఈడపనుంటే పోతిని అని దస్తు కొట్టేది. ఇట్లా తోసుకుంటా దొబ్బుకుంటా పోతావుండారు. నేను ఉండుకొని ఈల్ల సద్దు ఎబుడూ బయట రాదే అని ఏమీల్లకు పోయేకాలం అని దండించి యాల రంపు మీకు అని అడిగితి. నేను పాతానే మా చిన్నాయన బుజం మీద గుడ్డేసుకొని ఎలిపాయ.  మా చినమ్మ ‘‘కాదు పాపా నేను ఎర్రటెండకు నెత్తురుచ్చ్చలు పోసుకొని పొగులంతా కష్టపడితే ఇచ్చేది ఇన్నూరురూపాయలు. ఒగనాడు పనుంటే పది ఇరవై దినాలు పని చిక్కదు. ఆ ఇన్నూరు రూపాయలతో సంసారానికి అన్నీ కొనే పనే. అనకవగా వాడుకోవల్ల. ఇవిటి కొదవకు తాగే నీల్లు నెలకి నాలుగు క్యాండ్లు కావల్ల. నా దగ్గర డబ్బుల్లేక క్యానోనికి ముందు చేసిన అప్పు ఈలేక ఈ వారం  నీల్లు కొనుక్కోలే. ఒగ చొమ్ము నీల్లుంటే అన్నం బెట్టి అవి ఆడ బెడితి. నువ్వు కాసిన్ని తాగి నాకు కాసిన్ని బెట్టు ఇవే ఉండాయి అంటే, గిన్నెడు కూడు తినేసి చొమ్మునీల్లు కడుపునిండా తాగేసి మిగిలిన నీల్లతో చేయికడుక్కుంటాడు. చేతులు కడిగేకి వారగా మనూరు నీల్లు ముంచి పెట్టిన. ఎంత కండకావరం వుంటే అట్లాపని చేస్తాడు. అయినా నారాతే సరిలేదు. మాయమ్మ యాలగ్నాన నేలేసిందో. ఒగటే అగసాట్లు. నేనెట్లా అన్నం దినేది ఈ బాదకన్నా నేను ఏడన్నపడి సచ్చిపోదామా అనిపిస్తా ఉంది’’ అని ఆయమ్మ ఏడ్సె! నేను పానీ ఊరుకో అని మా ఇంట్లో చొమ్ము నీల్లు ఎత్తకపోయి ఆయమ్మకు ఇచ్చి అన్నం తినమని సర్దిచెప్పి వొస్తి . 

ఆ పొద్దంతా మేఘాలు ఆడతా ఉండాయి. ఆ రేయి అందరూ నిద్దర పానంక సడి సప్పుడు లేకుండా వొచ్చింది వాన. అదే వాన ఎడతెరిపి లేకుండా రెయ్యి పొగులు రెండు దినాలు కురిసి నిల్సి పోయింది. వాన బడితే మాఊరి రోడ్డంటి బండ్లు కాని ఆటోలు గాని రాలేవు. మన్సులు నడిచేదానికే ఇబ్బంది ఆరోడ్డులో. ఇంక బండ్లు దిగబడిపోతాయి. ఇంగ ఈ నీళ్లబండోడువొచ్చి అబుటికే నాలుగు దినాలయ్యింది. సందకాడ అన్నం తిందామని గిండ్లల్లో అన్నం బెట్టుకున్నాం, నీల్ల డబ్బాలో చూస్తే చెమ్మునీల్లు మాత్రమే ఉండాయి. ఇంట్లో మేము ఐదుమంది ఉన్నాం. ఆనీల్లు చాలవని చెమ్ముఎత్తుకొని మాఇంటి చుట్టుపక్కల ఉండే ఇండ్ల కాడికి పొయ్యి ‘‘ఒగ చొమ్మునీల్లు పోయమ్మ, మాఇంట్లో నీల్లు ఐపోయినాయి, ఈ రేయిరేతిరి గడిస్తే తెల్లారికి నామొగున్నిఅంపించి తెమ్మంటా’’ అని అడిగితి. ‘‘అయ్యో నాయనా మా ఇంట్లోన అయిపోయినాయి’’ అనే ఆయమ్మ. రెండో ఇంటికిబోతి. ఆయమ్మ ‘‘వానబడి క్యానోడు రాలే మాకు ఇబుటికి అయ్యేటిగా ఉండాయి’’ అనే. మా బజారులోని ఇండ్లు అన్నీతిరిగి ఒట్టిచెమ్ము ఎత్తుకుని యింటికొస్తి.ఆయాలకి ఇంట్లోవాళ్ళు ఉన్నినీల్లు తలా గుక్కెడు తాగినారు. నేను అన్నం తినాలంటే  నీల్లులేవు.మాఊరి ట్యాంకి నీల్లే గొంతులో కడి అడ్డం బడకుండాకాసిన్ని మింగి పొనుకుంటి. ఆ తెల్లారే సరికి ముక్కులు మూసుకు పోయినాయి .ఒరే నీల్లు మారిందానికి దాని స్వరూపం అబుడే చూపించిందే అనుకొని అంగిల్లో గసాలమాతర ఒగటి తెచ్చుకొని మింగి అట్లే టమాటా చెట్లల్లో గెడ్డి తొగేకి గొల్లోళ్ళకు పనికిబోతి. నా జతకి గంగుల చినమ్మ,మా ఆడబిడ్డ,నీలా చినమ్మ,పెద్దమ్మ జయమ్మ అంతా ఐదారుమంది జమై పనిలోకి దిగితిమి. నేను వంకోని గెడ్డి తొగతా ఉంటే ముక్కుల్లో నుంచి నీల్లు జలజలా కారతావుంది.పాపా గొంతు మారిందే య్యాలమ్మా’ అనిఅడిగే మా చిన్నమ్మ. ‘‘రాత్రి మా ఇంట్లో తాగే నీల్లయిపోయినాయి. రాత్రి మా బజారులో ఏడిండ్లు తిరిగినా చొమ్మునీళ్లు పుట్ల. ఎంతన్న దుడ్డు పెట్టి నీల్లు కొనే కాలం.గ్లాసు నీల్లు దొరకలేదే పానం బోయేటపుడు కూడా ఇంతే కదా’’అంటి.  నా కంట్లో నీల్లు కారినాయి.మా చినమ్మ ఉండుకొని ‘‘మనూరి ట్యాంక్‌ నీల్లు గన బాగుంటే మనకు ఈ కర్మేల. నాకు పెండ్లి అయిన కొత్తల్లో  మాయత్త నాకు కడుపునిండా సంగటి పెట్టేదిలేదు. అబుడు బోరింగ్‌ నీల్లు ఉండేవి. నేను నిద్దర లేస్తానే నీల్ల కడవ ఎత్తుకొని బిందెకు నీల్లుకొట్టి పరగడుపుతోనే నాలుగైదు దోసిల్లు గుక్క దిప్పుకోకుండా కడుపునిండే దాకా తాగేసేది. కడుపు సల్లగా అయ్యేది. ఆ బోరింగుని చూస్తే కన్నతల్లిని చూసినట్టు నాకు. ఆ నీల్లు గూడా చెక్కిరినీల్లు  ఉన్నట్టు ఉండేవి’’ అనే!

ఇంతలో మా చిన్నిపెద్దమ్మ వుండుకొని ‘‘మీకాలాన్నన్నా బోరింగునీల్లు. మేము ఈ ఊరికి కాపరానికి వచ్చినబుడు ఏట్లో నీల్లు తాగతా ఉండేది. ఇబుడన్న బిందెలు. ఆ కాలాన మొంటికడవలతో మోసేది. మా ఇంట్లో మేము ఐదు మంది తోడుకోడాల్లం. నాకాటికి పెద్దతోడికోడాలు కిట్టిని,నన్ను నీల్లు మొయ్యను పెట్టిండ్రి. అది పడమట గడ్డ నుంచి వచ్చిండేది. బలే శతమానం మన్సి. మనుసుల్లో కూడేది లే. నేను చిన్నగా ఉండా  పెద్దపెద్ద కడవలతో నీల్లు నేను మోయలేను. నీల్లకు ఇద్దరం బోతే అది కడవనిండా నీల్లు ముంచుకొని కడవను అవలీలగా భుజానికి ఎత్తుకొని తిరిగి చూడకుండా రివ్వున వచ్చేసేది. నేను కడవెత్తేవాళ్లకోసం చూసి వాళ్ళ చేత ఎత్తించుకొని వచ్చేది. ఎబుడన్నాకడవెత్తు అక్కా అంటే ఏమి అంతలావు మొగుల్ని మోస్తారు నీల్ల కడవ మోయ్లేరా అనేసి ఎలిపోయేది. నేను కడవ మోకాటిపైన పెట్టుకొని అది బుజానికి ఎగసక సుమారు నూరు కడవలన్నా ఒక్కల గొట్టుంటా. అట్లా ఏట్లో నీల్లు తాగేటబుడు ఎవురికే గాని ముక్కు గాని చెక్కుగాని నొచ్చిండ్ల’’ అనే! ఇంతలో మా ఆడబిడ్డ ఉండుకొని ‘‘నేను  నా కొడుక్కి నీల్లాడినబుడు బాలింతగా నెల దినాలు ఉడికి నీల్లే తాగల్ల. నెలదాటతానే బాయికి పూజ చేసి ఆ బాయి నీల్లు చేదుకొని పెద్దోళ్ళు గుక్కెడు తాగమంటే,నేను ఉడికినీల్లు తాగి మొగం వాసి పోయివుండి చొమ్ము  నీల్లు తాగేస్తి’’ అనే!మావొదిన ఉండుకొని ‘‘ఊరులో ఉన్నంతసేపు ఊరునీల్లు తాగేది.పొలిం మిందపోతే బాయినీల్లు. సీనివాసపురంలో పేరు మోసిన బాయి ఇసక బాయి. పద్నాలుగు మెట్లు కూడా ఉండవు అంత చిన్న బాయి. ఆడోల్లు ఆ బాయిలోకి భయంలేకుండా దిగేది.  పొరపాటుగా పడినా కూడా దర్లు పట్టుకోవచ్చు. నల్లపూస పన్న్యాకూడా కనపడుతుంది. ఆ బాయినీల్లు అంత తెల్లగా ఉండేవి,సల్లగా ఉండేవి. రుసి టెంకాయ పాలన్నట్లు ఉండేవి. ఎండాకాలం నాకు ఒళ్ళు ఉష్ణమయ్యేది. ఆ బాయిలో నీల్లు తాగితే ఉడుకు తగ్గిపోయేది. దిగువబాయి,గుండు బాయి, దావారబాయి, చిన్నప్పరెడ్డి బాయి, చెంగారెడ్డిబాయి, కమ్మోల్ల బాయి,కటువుబాయి, కోమటోల్ల  బాయి ఇట్లా ఎన్నుండేవో.వాన్లు తలకిందులై, వాన్లుపడక మిషన్లు కనిపెట్టి ఎబుడైతే బోర్లు ఏసినారో ఆ బాయిలు ఎండిపోయే. కంటికి కనుపించే నీల్లు కనుమరుగైపోయినాయి. ఈ బోర్లు ఎయ్యను మరిగిరా, కంటికి కనిపించని నీల్లలో ఏమొస్తావుండాయో ఏమో .

తెల్లారి కడవకు నీల్లు బట్టిపెడితే మాయిటేలకు తెల్లగా బిల్లగడతా ఉండాయి అవి తాగితే కీల్లనొప్పులు.మా సిన్నాయనకు డొక్కలోనొప్పి అని ఆస్పత్రికి పోతే కిడ్నీలో రాల్లున్నాయంట. ఈ బిల్లగట్టిన నీల్లు తాగినదానికే అంట ఆ జబ్బు. మేము ఎబుడూ గాని ఇట్లా జబ్బులు ఇనలేదు.ఈ రోగాలకు భయపడే వొగర్నిజూసి వొగరం ఊరంతా ఈ క్యాను నీల్లుకొని తాగే దానికి మరిగిరి. ఈ  నీల్లుకు అలవాటుపడి ఊరిట్యాంకునీల్లు తాగినా ఒంటవు. కూలీకి పోయిన తావుకి కూడా లబ్బరు సీసాల్లో నీల్లు బోసుకొచ్చుకుంటావుండారు. ఈ క్యాను నీల్లల్లో ఏమి మందులు కలపతారో మనం చూసినామా, ఈ నీల్లకి ఇంకేమి కొత్త రోగం పుడుతుందో.అసలు నీల్లు కొన్నెబుడు నుండి నోటారా తెంపుగా నీల్లు తాగి ఎన్నాలయిందో. లబ్బరు క్యాండ్లలో నీల్లు ఎండాకాలం అయితే గోరెచ్చగా అయిపోతాయి, కడుపునొప్పొస్తే తాగతామే అట్లుంటాయి’’ అనే. నర్సిపెద్దమ్మ ఉండుకొని ‘‘ఇట్టాకాలం చూస్తామనుకోలేదు. ఏబుడన్నా ఇమ్ముతప్పొయ్యి ఆకిలి అయితే అన్నం అడిగేదానికి చిన్నతనమని నీల్లు బొయ్యమనేవాళ్ళం. ఎవురన్నఇండ్లకు వచ్చినా చొమ్ములో నీల్లు  ముంచకపోయి గబుక్కున ఇచ్చేవాల్లం. మన బీదాబిక్కీ ఇండ్లల్లో కట్లు,నీల్లు కొనేవాల్లం కాదు. ఇబుడు కొంటా ఉండాం. పల్లెలు టౌన్డ్లు ఒగటైపాయే!’’ అనే.నా చెల్లెలు ఉండుకోని ‘‘నిన్న ఏమి జరిగిందో తెలుసా,మా వొదినోల్లు  కొడుకు బిడ్డకు తొట్లు కట్టినారు. ఇంటింటికి బొయి చెప్పినారు. అదేపనిగా చెప్పినారే అని టౌన్‌ కి బోయి బాలింత సామగ్రి తీసుకోని,బాలింతకు రైకి,చిన్నబిడ్డకు గుడ్డలు,సాంగ్యానికి బీము,తెల్లగడ్డలు,సీకాయి,వాము,పసుపు,సతాపాకు ఇవన్నీ తట్టకు పెట్టుకోని ఉడికి నీల్లు ఒక బిందెకి కాసుకోని అందరం బోతిమి. వాళ్ళు ఒచ్చినోల్లకు అన్నాలు కూరలు జేసినారు. మా వొదిన వాల్ల అత్త అందరికీ వొడ్డిస్తా ఉండే. ఆయమ్మ వొలిపిక్కరం మన్సి.

నా వాల్లొచ్చినారు మునిగే చిప్ప గెంటి, మీ వాల్లొచ్చినారు తేలే చిప్పగెంటి అనే రకం. ఆయమ్మకు కాగలిగినోల్లకు వారగా చొమ్ముతో క్యాన్నీల్లు పోసింది. బయటోల్లకు ఊర్లో నీల్లు బోసింది. వాల్లంతా  ఊర్లో నీల్లు నోట్లోబోసుకునే కుందికి ఉప్పగాతెల్సినాయి. మాకు క్యానునీల్లు బొయలేదని తినే ఆకు కాడనుండి లేసి సగానికి సగం మంది ఎలిపోయిరి. ఏరుబద్దరం చేసింది అనే పేరయిపోయే’’ అనే. మా ఉరి గంగవ్వ మా పక్కనే యాపమాను కింద యాపగింజలు ఏరుకుంటా మా మాట్లు ఇని మాకాడకి వచ్చి కూసునే. మేము మానుకు యాలాడ దీసిన లబ్బరు సీసాలో నీల్లు దాగి వక్కాకు నమలతానేను యడబిడ్డంత ఉండేటప్పుడు మనూర్లో గెంతోబుల తాత ఉండేవాడు. ముసలిముర్దాపు. నడలేడు. దేకేది. కంటిసూపు మట్టం. ఆయప్ప తత్వాలు జెబ్బేది.పనీ పాటకు పోకుండా ఇండ్లకాడ ఉండే ముసలి ముతక, చిన్నబిడ్లు తల్లులు పొద్దుపాకుంటే ఆయప్ప కాడికి బొయ్యికుసుండేది. ఆ యప్ప తత్వాలు,పాటలు, కథలు జెప్పేవాడు. నాకిప్పటికీ గుర్తుంది  అయన జెప్పింది.‘‘మనల్ని తొట్టతొలీగా భూదేవి ఆడమగా అని రెండు బొమ్మలు జేసి పానం బోసి బతుకుబోండి అంటే వాల్లు బూమంతా తిరిగి ఆకలేసి తొలీత మొన్ను తిందామని చేతులు మొంట్లో పెట్టినారంట. అది జూసి బూదేవి పైకి లేసి  మీరు తినేకి, తాగేకి, బతకడానికి కావాల్సినవన్నీ బూమిపైనే ఉండాయి అవే మీకు మంచి జేస్తాయి. మీకు చెడు జేసేవి అన్నీ నా కడుపులో దాసుకుంటా, ఎట్టిపరిస్థితి లోనూ నన్ను తోడకండి అని జెప్పి మాయమయిందంట. అదే కాక ఆవు ఈనితే బిడ్డతో పాటు మ్యాయ బడుతుంది. అది ఏ జంతువు నోట్లో బడకుండా పుట్టలో ఏస్తాం. భూమిని లోడితే మనకు దొరికేది ఆ మ్యాయే అంట. అందుకే  ఆ తల్లి నాపైనవి మీ బతుక్కి సరిపోతాయి అంటే ఈడేమో ఎయ్యి రెండేలు అడుగుల లోతులు బోర్లేసి పాతాళలోకం నుండి నీల్లు పైకి రప్పించి అవి తాగి సస్తా వుండాము. ఇంగా ఎట్లా కాలం  సూడాల్సి వొస్తుందో. ఆ యాలకి మేముండములే అనే ‘ఆ యవ్వ వక్కాకు ఎర్రగ నవిలి పుక్కిట దవడకు తోసి. 

ఆ యాలకి పొద్దు గూట్లోపడే. మేము మా గూట్లకు బొయ్యి ముడుక్కుంటిమి. ఆ పద్దన్నే క్యానోడు ఊర్లోకి వచ్చే!    అర్థాలు కన్నమాటలు = బూతులు దోడుమైనోళ్లతో= ఆయప్పలాంటివాల్లతో  దస్తు = గొప్పలు, గచ్చులు ఒక్కల గొట్టుంటా =  వక్క మారిగా పగలగొట్టటం  దర్లు = పక్క గోడలు ఒంటవు = పట్టవుఇమ్ముతప్పొయ్యి = ఇబ్బందై ఎడ బిడ్డ = వయసుబిడ్డ ముసలి ముర్దాపు = ముడిగి పోవడం, వంగిపోవడం 
· 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top