నాకు  ఆ అలవాటు ఎక్కువ 

Funday health story 03-03-2019 - Sakshi

సందేహం

నా వయసు 26 సంవత్సరాలు. నేను ప్రెగ్నెంట్‌. నాకు తీపిపదార్థాలు బాగా తినే అలవాటు ఉంది. పూర్తిగా మానెయ్యమని కొందరు, అంతగా భయపడాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. ఏది నిజం? ఉమ్మనీరు తగ్గిపోవడం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి తెలియజేయగలరు. – ఆర్‌.క్రిష్ణవేణి, చిత్తూరు
ప్రెగ్నెన్సీ సమయంలో తీపిపదార్థాలు అసలు తినకూడదు అని ఏమి నియమం లేదు. మితంగా తీసుకోవచ్చు. తీపిపదార్థాలు ఎంత తినవచ్చు అనేది, ఒక్కొక్కరి బరువును బట్టి, వారి కుటుంబంలో ఎవరికైనా మధుమేహవ్యాధి ఉందా లేదా అనే అంశాలను బట్టి ఉంటుంది.తీపిపదార్థాలను ఎక్కువగా తీసుకోడం వల్ల బరువు ఎక్కువగా పెరగడం జరుగుతుంది. దానివల్ల ప్రెగ్నెన్సీలో షుగర్‌ పెరిగి జెస్టేషనల్‌ డయాబెటిస్‌ రావడం, బీపీ పెరగడం వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.బరువు ఎక్కువగా పెరగడం వల్ల ఆయాసం, కాన్పు సమయంలో ఇబ్బందుల వంటివి ఏర్పడవచ్చు.బరువు ఎక్కువగా ఉండి, ఫ్యామిలీ హిస్టరీలో షుగర్‌ వ్యాధి ఉన్నప్పుడు, తీపిపదార్థాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంతమంచిది. బరువు మితంగా ఉంటే తీపిపదార్థాలు అప్పుడప్పుడు కొద్దిగా తీసుకోవచ్చు.గర్భాశయంలో బిడ్డ చుట్టూ ఉమ్మనీరు ఉంటుంది. ఇది సరిపడా ఉంటే, బిడ్డ లోపల తేలికగా తిరగటానికి, ఎదుగుదలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది.కొందరిలో అనేక కారణాల వల్ల ఉమ్మనీరు తగ్గిపోతుంది.ఉమ్మనీరు బాగా తగ్గిపోవడం వల్ల బిడ్డ కదలిక, పెరుగుదలకు ఇబ్బంది అవుతుంది. కొందరిలో బిడ్డలో అవయవ లోపాలు, కిడ్నీలలో లోపాల వల్ల ఉమ్మనీరు తగ్గవచ్చు. తల్లి నుంచి బిడ్డకు రక్తసరఫరా సరిగా లేక ఉమ్మనీరు తగ్గవచ్చు. అలాంటప్పుడు బిడ్డ సరిగా బరువు పెరగకపోవచ్చు.ఊపిరితిత్తులు మిగతా అవయవాలు అదుముకున్నట్లయ్యి, బిడ్డకు ఊపిరి సరిగా ఆడకపోవడం, కొందరిలో లోపలే మోషన్‌ పోవడం, కడుపులో ఊపిరి ఆడక చనిపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఇలా ఉన్నప్పుడు స్కానింగ్‌ ద్వారా క్రమంగా పర్యవేక్షిస్తూ, అవసరాన్ని బట్టి,  ఉమ్మనీరు బాగా తగ్గిపోయి, ఎన్ని చికిత్సలు చేసినా పెరగకపోతే, కాన్పు త్వరగా చేసి బిడ్డను బయటకు తియ్యవలసి ఉంటుంది.ఉమ్మనీరు బాగా తగ్గిపోతే సాధారణ కాన్పులో ఇబ్బంది ఏర్పడవచ్చు. అవసరమైతే సిజేరియన్‌ ద్వారా కాన్పు చేయలవలసి ఉంటుంది.

మా బంధువు ఒకరికి హిస్టెరోస్కోపీ చేయాలంటున్నారు. ఇది ఏ పరిస్థితులలో చేయించాల్సి ఉంటుంది? దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – కె.కీర్తన, సంగారెడ్డి
గర్భాశయం లోపల ఉండే ఎండోమెట్రియల్‌ పొరలో, క్యావిటీలో ఉండే సమస్యలను హిస్టెరోస్కోపీ ద్వారా తెలుసుకుంటారు. ఇందులో యోనిభాగం నుంచి గర్భాశయ ముఖద్వారం ద్వారా, గర్భాశయం లోపలి ఎండోమెట్రియల్‌ క్యావిటీ లోపలికి, హిస్టెరోస్కోప్‌ అనే 3–నుంచి 5 మిల్లీమీటర్ల మందం ఉండే పొడుగాటి పరికరాన్ని ప్రవేశపెట్టి, దాని ద్వారా బయట మానిటర్‌లో, గర్భాశయం లోపల ఎలా ఉందనేది చూడడం జరుగుతుంది. ఇందులో నార్మల్‌ సెలైను పంపి గర్భాశయాన్ని వెడల్పు చేయడం ద్వారా లోపలి సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. దీన్ని డయాగ్నస్టిక్‌ హిస్టెరోస్కోపీ అంటారు. అదే సమయంలో ఆపరేటివ్‌ హిస్టెరోస్కోపీ ద్వారా అందులో కనిపించే సమస్యలను తొలగించడం జరుగుతుంది. దీన్ని  సరైన అనుభవం, శిక్షణ కలిగిన గైనకాలజిస్ట్‌లు చెయ్యడం జరుగుతుంది.హిస్టెరోస్కోప్‌ ద్వారా గర్భాశయంలో పొరలు, కణితులు, అతుకులు తదితర సమస్యలు ఉంటే గుర్తించి వాటిని తీసివేయవచ్చు.ఆపరేటివ్‌ హిస్టెరోస్కోపీలో కొన్నిసార్లు కొంతమందికి సమస్యను తొలగించడానికి రెండు, మూడు సిటింగ్‌లు కూడా అవసరం పడవచ్చు. దీని ద్వారా కొంతమందికి సమస్య ఎక్కడుందో, సరిగా ఆ భాగం నుంచే ముక్క తీసి ఎండోమైట్రియల్‌ బయాప్సీకి పంపించవచ్చు. ఒక్కొక్కరి శరీరతత్వాన్నిబట్టి, చేసే ప్రక్రియను బట్టి, నొప్పి తెలియకుండా ఇంజెక్షన్‌లు లేదా మత్తు ఇచ్చి హిస్టెరోస్కోపీని చేయడం జరుగుతుంది. దీనికి హాస్పిటల్‌లో 5–6 గంటలు ఉంటే సరిపోతుంది.

నేను గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాను. ఇవి తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో రొమ్ముకాన్యర్‌ ముప్పు ఉంటుందని చదివాను. ఇది ఎంతవరకు నిజం? గర్భనిరోధక మాత్రాలకు వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? తెలియజేయగలరు. –డీఆర్, విజయవాడ
గర్భనిరోధక మాత్రలు దీర్ఘకాలం వాడటం వల్ల, వాడని వారిలో కంటే 5 శాతం రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని కొన్ని పరిశోధనలలో తెలియజేయడం జరిగింది. ఇందులో ఈ రిస్క్‌ ఒక్కొక్కరి శరీరతత్వాన్నిబట్టి, బరువును బట్టి, జన్యువులను బట్టి, ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్‌లు ఉండేదాన్ని బట్టి, వాడే మాత్రలలో ఈస్ట్రోజన్‌ శాతం బట్టి కూడా ఉంటుంది.కాకపోతే ఈ గర్భనిరోధకమాత్రలు ఒవేరియన్‌ (50 శాతం), ఎండోమైట్రియల్‌ (30 శాతం), కొలోరెక్టల్‌ క్యాన్సర్‌(20 శాతం) రిస్క్‌ను తగ్గిస్తుంది.ఇప్పుడు లభించే లోడోస్‌ పిల్స్‌ వల్ల రొమ్ముక్యాన్సర్‌ రిస్క్‌ కొద్దిగా తగ్గుతుంది. వీటిలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ శాతం కొద్దిగా తక్కువగా ఉంటుంది. కొంతకాలం తీసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.గర్భనిరోధక మాత్రలకు బదులుగా, తాత్కాలిక కుటుంబ నియంత్రణకు కాపర్‌–టి(లూప్‌) లేదా మిరినా (హార్మోన్‌ లూప్‌), మూడు నెలలకు ఒకసారి హార్మోన్‌ ఇంజెక్షన్‌లు, వెజైనల్‌ హార్మోన్‌ రింగ్స్, కండోమ్స్‌వంటివి వాడుకోవచ్చు. ఇవి కూడా ఒక్కొక్కరి శరీతత్వాన్నిబట్టి  కొందరికి దుష్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.డాక్టర్‌ను సంప్రదించి వాటి ప్రభావాలు ఎలా ఉంటాయి, మీ శరీరతత్వాన్ని, హిస్టరీని బట్టి వారి సలహా మేరకు వాడుకోవడం మంచిది. 
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బోహైదర్‌నగర్‌ హైదరాబాద్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top