ఆ సమయంలో  బీపీ ఎక్కువైతే..?

funday health counciling - Sakshi

సందేహం

నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్‌. నాకు బీపీ ఉంది. గర్భిణులకు హైబీపీ వస్తే ప్రాణాంతకం అని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? బీపీ నియంత్రణకు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు.
–పి.స్రవంతి, గుంటూరు.

కొంతమందిలో బీపీ ప్రెగ్నెసీ రాకముందు నుంచే ఉండి, తర్వాత ప్రెగ్నెన్సీతో కొద్దికొద్దిగా పెరగడం జరుగుతుంది. దీనిని క్రానిక్‌ హైపర్‌టెన్షన్‌ అంటారు. కొందరిలో గర్భం దాల్చిన తర్వాత కొన్ని నెలలకు, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, బరువును బట్టి, హార్మోన్ల మార్పులను బట్టి బీపీ పెరగడం జరుగుతుంది. దీనిని జెస్టేషనల్‌ హైపర్‌టెన్షన్‌ అంటారు. వీరిలో రక్తనాళాలు సరిగ్గా వ్యాకోచించకుండా ఉండటం వల్ల తల్లిలో అవయవాలకు రక్త సరఫరా తగ్గడం, అలాగే శిశువుకు రక్తం సరిగ్గా అందకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. సరైన సమయంలో బీపీ నియంత్రణ జరగకపోవడం, నిర్లక్ష్యం చెయ్యడం వల్ల తల్లిలో కిడ్నీలు, లివర్, మెదడు, కళ్లు దెబ్బతినడం, వాటి పనితీరు మందగించడం, దానివల్ల ఫిట్స్‌ రావడం, కళ్లు కనిపించకపోవడం, అధిక రక్తస్రావంతో తల్లికి ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. కడుపులో బిడ్డ బరువు పెరగకపోవడం, ఉమ్మ నీరు బాగా తగ్గిపోవడం, బిడ్డ కడుపులో చనిపోవడం, నెలలు నిండకుండానే కాన్పు చెయ్యవలిసి రావడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. బీపీ సమస్య ఎప్పుడు వస్తుంది అని ముందే అందరికీ చెప్పడం కష్టం. డాక్టర్‌ దగ్గర సక్రమంగా చెకప్‌లు చేయించుకోవడం, బీపీ పెరిగితే డాక్టర్‌ పర్యవేక్షణలో బీపీకి మందులు వాడుకుంటూ ఆహారంలో కొద్దిగా ఉప్పు తగ్గించుకుని, బరువు ఎక్కువ పెరగకుండా చూసుకోవడం – రెండు వారాలకు ఒకసారి (అవసరమైన రక్త పరీక్షలు) సీబీపీ, కిడ్నీ, లివర్‌ టెస్ట్‌లు చేసుకుంటూ బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవడానికి స్కానింగ్, డాప్లర్, సీటీజీ వంటివి క్రమంగా చేయించుకుంటూ ముందుకు వెళ్లాలి. ఎన్ని మందులు వాడినా ఒక్కోసారి బీపీ నియంత్రణలోకి రాకపోవడం, రక్త పరీక్షల్లో తేడా రావడం, బిడ్డకి ఇబ్బంది మొదలవడం జరిగితే, వెంటనే కాన్పు చెయ్యవలసి వస్తుంది. లేకపోతే తల్లి ప్రాణానికి హాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భంనుంచి బిడ్డ బయటకు వస్తేగాని బీపీ తగ్గడం జరగదు. బీపీ నియంత్రణకు నువ్వు చేయవలసింది, ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్‌ పర్యవేక్షణలో బీపీ మందులు సరిగ్గా వేసుకోవడం, అధిక బరువు పెరగకుండా ఆహారం మితంగా తీసుకుంటూ, నడక, చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం, మానసిక ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా ఉండటం.
     
ప్రసుత్తం నేను ప్రెగ్నెంట్‌. వృత్తిరీత్యా నేను గంటల తరబడి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుంటాను. ‘గర్భిణులు సెల్‌ఫోన్‌లో మాట్లాడటం పుట్టబోయే బిడ్డకు చేటు’ అని చదివాను. ఇది ఎంతవరకు నిజం?
–ఆర్‌.నాగమణి, హైదరాబాద్‌.

ఈ ఆధునిక కాలంలో సెల్‌ఫోన్‌ అనేది ఒక నిత్యావసరంగా మారిపోయింది. అందరూ గంటల తరబడి ఫోన్లలో మాట్లాడటం, కాలక్షేపం చెయ్యడం జరుగుతోంది. ఎక్కువసేపు సెల్‌ఫోన్‌ శరీరానికి దగ్గర ఉండటం వల్ల కొన్నిసార్లు పుట్టబోయే పిల్లల్లో ఏకాగ్రత తక్కువ ఉండటం, హైపర్‌ యాక్టివ్‌గా ఉండటం, బిహేవియరల్‌ సమస్యలు వంటి కొన్ని చిన్న చిన్న మానసిక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. అలాగే తల్లుల్లో కూడా ఫోన్లలో ఎక్కువసేపు మాట్లాడుతూ, అనవసరమైన విషయాలు చర్చించుకుంటూ, మానసిక ఒత్తిడిని, లేనిపోని అనుమానాలను పెంచుకుంటూ ఉండటం జరుగుతుంది. దీనివల్ల కూడా బిడ్డలో మానసిక ఎదుగుదలలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. 
     
‘గర్భిణులు సమతులాహారం తీసుకోవాలి’ అనే మాట తరచుగా వింటుంటాను. అయితే  దీని గురించి నాకు అవగాహన లేదు. ఎలాంటి పదార్థాలు తీసుకోవడాన్ని ‘సమతులాహారం’ అంటారో వివరంగా తెలియజేయగలరు. – జి.రాధ, కర్నూలు.

 సమతులాహారం అంటే తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫ్యాట్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్‌ వంటివన్నీ కొద్దికొద్దిగా కలగలిపి ఉండటం. గర్భిణీలలో తొమ్మిది నెలలపాటు బిడ్డ ఆరోగ్యంగా పెరగాలి అంటే పైన చెప్పిన సమతులాహారం (బ్యాలెన్స్‌డ్‌ డైట్‌) తీసుకోవడం మంచిది. దీనివల్ల బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదల బాగుంటుంది. బిడ్డ అవయవాలు, కండరాలు, ఎముకలు, నాడీ వ్యవస్థ ఇంకా ఇతర వ్యవస్థలు సరిగ్గా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఆహారంలో కొద్దిగా అన్నం లేదా చపాతీ లేదా తృణధాన్యాలతో చేసిన ఆహారం, ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పాలు, పెరుగు, పండ్లు ఉండేటట్లు చూసుకోవాలి. దీనినే సమతులాహారం అంటారు. మామూలు వారితో పోలిస్తే, పెరిగే బిడ్డ అవసరాలకు గర్భిణీలు ఆహారంలో 300 క్యాలరీలు అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top