కూతురు యువరాణి... తండ్రి మహారాజు

కూతురు యువరాణి... తండ్రి మహారాజు


సామ్రాజ్యం



కూతుర్ని యువరాణిలా చూసుకునే తండ్రుల్ని చాలామందిని చూసుంటాం. కానీ ఆ తండ్రి తన కూతుర్ని నిజంగానే యువరాణిని చేయాలనుకున్నాడు. ఇందుకోసం ప్రపంచ యాత్ర సాగించాడు. చివరికి ఆమెకోసం ఓ సామ్రాజ్యాన్ని కనుక్కొన్నాడు. అక్కడ తమ జెండా పాతాడు. కూతురి నెత్తిన కిరీటం అలంకరించాడు. ఆమెను ఆ సామ్రాజ్యానికి యువరాణిని చేశాడు. హద్దులు దాటిన ఆ కన్నతండ్రి ప్రేమ గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి.

 

పిల్లలు పెరిగే వయసులో పక్కన పడుకోబెట్టి రాజులు, రాజ్యాల గురించి కథలు చెప్పడం చాలామంది తండ్రులు చేసే పనే. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి  చెందిన జెరీమియా హీటన్ కూడా ఇదే పనిచేశాడు. తన కూతురు ఎమిలీకి చిన్ననాటి నుంచి పురాణ గాథలు చెబుతూ వచ్చాడు. వాటిని విపరీతమైన ఆసక్తితో మిన్న ఎమిలీని... ఆ కథల్లోని యువరాణి పాత్ర విశేషంగా ఆకట్టుకుంది. ఆ పాత్రల్లో తనను తాను ఊహించుకుని, గాల్లో తేలియాడిపోయేది ఎమిలీ. ఐతే యువరాణి పాత్ర ఆమెపై బలమైన ముద్ర వేసి, కొన్నాళ్లకు తాను యువరాణినవుతానంటూ పట్టుబట్టింది. ఐతే మొదట్లో ఈ విషయాన్ని హీటన్ తేలిగ్గానే తీసుకున్నాడు. కానీ కొన్నాళ్లకు కూతురి మనసు అర్థం చేసుకున్నాడు. ఆమెను నిజంగానే యువరాణిని చేయాలని సంకల్పించాడు.



మైనింగ్ ఇండస్ట్రీలో పనిచేసే హీటన్... తన కూతురికి ఓ రాజ్యాన్ని కట్టబెట్టాలని, కృతనిశ్చయానికి వచ్చాక, కొన్ని నెలల పాటు పనిమానుకున్నాడు. ప్రపంచంలో ఎవరి అధీనంలోనూ లేని ఖాళీ స్థలం కోసం అన్వేషణ సాగించాడు. అతని ప్రయాణం ఈజిప్ట్, సుడాన్ దేశాల మధ్య ఆగింది. ఆన్‌లైన్ సెర్చ్ ద్వారా ఈశాన్య ఆఫ్రికా ప్రాంతంలోని బిర్ టావిల్ అనే పేరుతో పిలిచే 800 చదరపు మైళ్ల ఎడారి ప్రాంతం ఎవరి అధీనంలోనూ లేదని తెలుసుకున్న హీటన్... అక్కడికెళ్లి జెండా పాతాడు. అప్పటికే తన యువరాణి సామ్రాజ్యం కోసం తయారుచేసి పెట్టుకున్న జెండా అది. ఆ సామ్రాజ్యానికి తన కూతురే యువరాణి అనేందుకు సూచికగా ఓ కిరీటం ఉంటుంది.

 

జెండా పాతి వచ్చాక, హీటన్ చేసిన పని, తన కూతురి పట్టాభిషేకం. ఓ అందమైన వజ్రాల కిరీటం తయారు చేయించి, దాన్ని ఆమె తలకు అలంకరించాడు. ఈ రోజు నుంచి ఆమె ఉత్త ఎమిలీ కాదని, ‘ప్రిన్సెస్ ఎమిలీ’ అని ప్రకటించాడు. ‘‘మా సామ్రాజ్యం స్వతంత్రమైనదిగా ప్రకటిస్తున్నా. ఈ రాజ్యానికి నేనే అధినేతను. ఎమిలీ నిజమైన యువరాణి అయింది. ఇకపై ఎమిలీని చూసినప్పుడు ఆమె అధికారిక నామం ‘ప్రిన్సెస్ ఎమిలీ’తో పలకరించండి. ఆ పదం విన్నప్పుడల్లా తనపై నా ప్రేమ, తనకోసం నేను ఎంత దూరం వెళ్లానో తెలుస్తుంది’’ అంటూ ఫేస్‌బుక్ సాక్షిగా ప్రకటన తన మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ ప్రకటించాడు హీటన్.

 

ప్రస్తుతం ఎమిలీ వయసు ఏడేళ్లు. పూర్తిగా ఊహ తెలిసేవరకు ఆమెను యువరాణిగానే భావించనివ్వమంటున్నాడు హీటన్. తాను చేస్తున్నది చూసి నవ్వుకున్నా పర్వాలేదంటున్నాడతను. ఐతే ఫేస్‌బుక్‌లో హీటన్ పోస్టులు చూసి, అతణ్ని ప్రశంసిస్తున్నవాళ్లే ఎక్కువ మంది. తండ్రి ప్రేమ ఎలాంటిదో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉండబోదంటూ హీటన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ, మద్దతుగా నిలుస్తున్నారు మిత్రులు. హీటన్ చేస్తోంది కొందరికి పిచ్చిలా అనిపించొచ్చు. ఇంకొందరికి ప్రేమలా అనిపించొచ్చు. వాస్తవమేంటంటే, తన కూతురిపై హీటన్‌కున్నది పిచ్చి ప్రేమ!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top