మనసంతా... బేబీ శాంటా | Dr. S. Sahariya Medical Memoirs... | Sakshi
Sakshi News home page

మనసంతా... బేబీ శాంటా

Feb 22 2015 12:15 AM | Updated on Oct 9 2018 7:52 PM

మనసంతా... బేబీ శాంటా - Sakshi

మనసంతా... బేబీ శాంటా

అది నవంబర్ మాసం. కిటికీలోంచి చల్లగా వీస్తోంది కొండగాలి. టీ కాచుకొని...

మెడికల్ మెమరీస్
మామూలుగానైతే బర్త్‌డే బాయ్‌కు కదా ఎవరైనా కానుకలిస్తారు! కానీ ఇక్కడ రెండేళ్ల పిల్లాడు ఇచ్చిన అపురూప కానుకల కథ ఇది. కథలా అనిపించే వాస్తవ గాథ ఇది!
ఆరోజు ఆరింటికే లేచింది మాధవి. అవాళ్ల తమ నోములపంట అరుణ్ బర్త్‌డే. ఇది రెండో పుట్టినరోజు. మొదటి జన్మదినం రోజు భర్త దూరంగా భారత్-చైనా సరిహద్దుల్లో డ్యూటీ చేస్తున్నాడు. అందుకే జరపలేదు. ఈసారి భర్త మనీష్ ఉన్నాడు.

పైగా ఈ వేడుక కోసమే హైదరాబాద్‌కు 60 కి.మీ. దూరంలోని చిన్న ఊరి నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని బొండిలా అనే ఊరికి వచ్చారు మాధవి తల్లిదండ్రులు. అది నవంబర్ మాసం. కిటికీలోంచి చల్లగా వీస్తోంది కొండగాలి. టీ కాచుకొని, ఆ తెమ్మెరలను చాయ్‌తో పాటూ ఆస్వాదిస్తోంది మాధవి. ఇంతలో భర్త మనీష్, రెండేళ్ల అరుణ్ కిచెన్‌లోకి ఒకేసారి వచ్చి మాధవి కళ్లుమూశారు. నవ్వుతూ పేర్లు చెప్పింది మాధవి. ఓ పక్క మనీష్, మరో పక్క మాధవి... ఇద్దరూ అరుణ్‌కు ముద్దులతో బర్త్‌డే విషెస్ కూడా చెప్పారు.
 
సాయంత్రం త్వరగా వచ్చేస్తానంటూ వెళ్లాడు మనీష్. అమ్మమ్మ, తాతయ్య తెచ్చిన ఆటబొమ్మతో బాల్కనీలో ఆడుకుంటున్నాడు అరుణ్. ఇల్లంతా కలియ దిరిగి వంట మొదలు పెట్టింది మాధవి.
 
కిటికీలోంచి చూస్తే బాల్కనీలోని  పిల్లాడు కనిపించలేదు. ‘అమ్మా, నాన్నా లేచి ఉంటారు. అరుణ్‌ను ఆడిస్తూ ఉండి ఉంటారు’ అనుకుంది. అరగంటైంది. అమ్మానాన్నల గదివైపు చూసింది. వాళ్లింకా నిద్రపోతున్నారు. గబగబా బాల్కనీలోకి వచ్చింది. గుండె గతుక్కుమంటుండగా కిందికి చూస్తే రక్తపుమడుగులో అరుణ్! కెవ్వుమన్న కేక ఈశాన్యపర్వతాలను తాకి ప్రతిధ్వనించింది. ఉలిక్కిపడి లేచిన తాతయ్య, అమ్మమ్మ పరుగున వెళ్లారు. బాల్కనీ నుంచి పడిపోయినట్టున్నాడు! తలకు గాయం. కొడుకును పొదువుకొని, దగ్గర్లోని ఆసుపత్రికి పరుగెత్తింది మాధవి. ఒళ్లింకా వెచ్చగానే ఉండటం, గుండె స్పందనలు కనిపిస్తూ ఉండటంతో డాక్టర్లు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ తలకు బలమైన గాయం. ఒళ్లంతా మల్టిపుల్ ఫ్రాక్చర్స్. ఎనిమిది గంటల సుదీర్ఘ ప్రయాస తర్వాత విధి ముందు విధి లేక డాక్టర్లు తలవంచారు.

ఆసుపత్రికి చెందిన ట్రాన్స్‌ప్లాంట్ కో-ఆర్డినేటర్ మాధవీ-మనీష్ వద్దకు వచ్చాడు. జరిగిన విషాదానికి సానుభూతి తెలిపాడు. విధి నిర్వహణలో భాగంగా భారమైన హృదయంతోనే ఆ రెండేళ్ల బాలుడి అవయవాలు దానం చేస్తారా అని మెల్లిగా అడిగాడు. అరుణ్ తల్లిదండ్రులు  డీప్ షాక్‌లో ఉన్నారు. కాసేపటి తర్వాత...  అవయవ దానానికి వాళ్లు అంగీకరించారు. అరుణ్ నిర్జీవ శరీరంలో గుండె స్పందనలను గ్రాఫ్‌లో చివరిసారిగా చూసి మళ్లీ భోరుమంది మాధవి. కానీ ఎవరి శరీరంలోనో ఆ గుండె అలా స్పందిస్తూ... ఆ గ్రాఫ్ అలాగే కొనసాగుతూ ఉంటుందని హామీ ఇచ్చాడా కో-ఆర్డినేటర్. అంతేకాదు, అరుణ్ ఊపిరితిత్తులు మరొకరికి హాయి శ్వాసనిస్తాయి. అతడి కళ్లు మరిద్దరి రేయి చీకటిని దూరం చేస్తాయి. అతడి ప్యాంక్రియాస్... నిత్యం ఇంజెక్షన్ సూదితో ఒంటిని పొడుచుకునే ఓ శరీరానికి సాంత్వన ఇస్తాయి అని ఓదార్చాడు.

ఈ సంఘటనకు సాక్షి డాక్టర్ సహారియా. ఒక రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ఒకవేళ ఇదే కేసులో మూత్రపిండాన్ని గనక మరొకరికి తానే అమర్చాల్సి వస్తే? అప్పుడు ఆయన తనకు తాను వేసుకున్న  ప్రశ్న: ‘‘నా రెండు కనుల చివర కన్నీళ్ల జల్లులు. ఆ కంట కారేది అరుణ్ పట్ల విలాప విషణ్ణ విషాదాశ్రువులా? లేక, మరో రెండేళ్ల చిన్నారికి కొత్త జీవితం ప్రసాదిస్తున్నందుకు స్రవిస్తున్న ఆనందబాష్ప కణాలా?’’        
 - యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement