ఎందుకో తెలియదుగానీ... ముందునుంచీ మా బుజ్జిగాడిని ఓ మేధావిలాగా... ఓ సైంటిస్టులాగా తీర్చిదిద్దాలనే ఉబలాటం నాది. అందుకే... వాడి వయసు నాలుగేళ్లే అయినప్పటికీ సైన్సు గురించీ... సైంటిస్టుల గురించి కథలు కథలుగా చెబుతూ ఉండటం... చిన్న చిన్న నోటి లెక్కలు చేయిస్తూ ఉండటం నాకు అలవాటు.
ఓ మంచిరోజ్జూసుకుని... తన నెత్తిన ఆపిల్ (Apple) పడటంతో భూమికి ఆకర్షణ ఉందన్న విషయాన్ని న్యూటన్ గారు ఎంత యుక్తిగా కనుగొన్నారో చెప్పా. సాదా సీదా విషయాలను అబ్జర్వ్ చేయడం వల్ల... పెద్ద పెద్ద సిద్ధాంతాలూ ఎలా తెలుసుకోవచ్చో వివరించా.
రాత్రిళ్లు పక్క తడపకూడదనే ఉద్దేశంతో... రోజులాగే ఆరోజు కూడా బుజ్జిగాడితో ‘సూ సూ’ పోయించడానికి పెరట్లోకి తీసుకెళ్లా. సూ సూ పోస్తున్నవాడు కాస్తా ‘‘నాకెందుకో న్యూటన్‌కు బె..ద్ధ...గా తెలివితేటలు లేవేమోనని అనిపిచ్చోంది నానా’’ అన్నాడు సడన్‌గా.
‘‘ఎంట్రా అంతమాటన్నావు?’’
‘‘కాదా మరి... నేను సూసూ పోస్తుంటేనే తెలిచిపోయింది కదా భూమికి ఆకర్షణ ఉందని. మరి అలాంటిది... అంత బే...ద్ధ...గా పెరిగిపోయాక... అందునా నెత్తి మీద ఆపిల్ పడేదాకా న్యూటన్ గారికి ఆ చంగతి తెలియలేదంటే... నాకెందుకో ఆయన తెలివితేటల మీద డౌటొచ్చింది నానా’’ ఇదీ మూడేళ్ల మా బుజ్జిగాడి మాట.
అక్కడితో ఊరుకోలేదు... ‘‘చేసే ప్రతి పనికీ రివర్స్ యాక్షను ఉంటుందన్న చంగతి కూడా నాకెప్పుడో తెలిసిపోయింది. అలాంటిది ఆయనకేమో బెద్దయ్యేవలకూ తెలియలేదు’’ అన్నాడు.
‘‘నీకేం తెలిసిందీ, ఎలా తెలిసిందీ?’’ అడిగా.
‘‘మొన్న ఆటాడుకుంటుంటే నా బంతి కాస్తా అమ్మ తలకు తగిలింది కదా... అంతే ఎజ్జాట్లీ నా తలకాయ మీద కూడా అదే చ్పాటులో బొప్పి తేలింది. అంతే నువ్వు నాకు చెప్పిన న్యూటన్ చిద్దాంతం అర్దమయ్యింది’’
∙∙
‘‘నాకు తెలియక అడుగుతా... ప్లచ్చు ఇంటూ ప్లచ్చు ప్లచ్చవువుతంది. కానీ... మైనచూ మైనచూ ప్లచ్చెలా అవుతుంది నానా?’’ అడిగాడు మా బుజ్జిగాడు.
నాకేం చెప్పాలో అర్ధం కాలేదు.
అదృష్టవశాత్తూ సరిగ్గా అదే టైములో వాళ్ల అమ్మ ఉతికిన బట్టలారేస్తూ ఉంది. బట్టలుతికిన తర్వాత ఆమె వాటిని ఉల్టా చేసి అంటే తిరగేసి ఆరేస్తుంటుంది. ఈ పనిలో నేనూ, మా బుజ్జిగాడూ ఆమెకు హెల్ప్ చేస్తున్నాం.
వెంటనే ప్రాక్టికల్‌గా డిమాన్‌స్ట్రేట్ చేసి మరీ వాడి డౌటును క్లియర్ చేసింది నా భార్య. అదెలాగంటే...
‘‘ఒరేయ్... బట్టలారేసేటప్పుడు వాటిని ఉల్టా చేసి ఆరేస్తామా... ఆరాక మళ్లీ వాటిని తిరగేసి తొడుగుతాం కదా! ఇలా రెండుసార్లు ఉల్టా చేశాక ఆ బట్ట మళ్లీ సీదాగా మారడంలా. ఇదీ అంతే’’ అని జవాబిచ్చింది.
చదవండి: కొత్త పెళ్లికూతురి స్టన్నింగ్ క్యాచ్..!
∙∙
ఎట్టకేలకు నాకు అర్థమైన విషయమేమిటంటే... జస్ట్ పుస్తకాల్లోనే కాదు... నిత్యజీవితంలోనూ సైన్సూ మ్యాథ్సూ ఉంటాయి. బట్టల వాషింగ్‌లో భాగహారాలూ, దుస్తులు తిరగేయడాల్లో తీసివేతలూ, కబ్బోర్డు కారంలో గుణకారాలూ, ఇంటెనకాల పెరట్లో ఈ ఈజీక్వల్టూ ఎమ్సీ స్క్వేర్లూ... ఇలా ఎక్కడెక్కడ ఏయే సిద్ధాంతాలుంటాయో, ఏ కిచెన్‌లో ఏయే ఈక్వేషన్లుంటాయో బుజ్జిగాళ్లకూ, వాళ్ల అమ్మలకే తెలుసు.
అన్నట్టు... ఆ న్యూటనులూ, ఐన్‌స్టీన్ల కంటే... అమ్మలూ, బుజ్జిగాళ్లూ, బుజ్జిపిల్లలే చాలా చాలా తెలివైనవాళ్లూ... బహు గొప్పవాళ్లు!
– యాసీన్


