ధూమ్ ధామ్ బ్లాక్ బస్టర్ | Sakshi
Sakshi News home page

ధూమ్ ధామ్ బ్లాక్ బస్టర్

Published Sun, Nov 15 2015 12:06 AM

ధూమ్ ధామ్ బ్లాక్ బస్టర్ - Sakshi

దేడ్ కహానీ - ధూమ్ 2
తెర మీద: ఓ పోలీసాఫీసరు ‘ఎ’ అనే పెద్ద అంతర్రాష్ట్రీయ దొంగని పట్టుకోవడానికి ఓ అమ్మాయిని దొంగగా ప్రవేశపెడతాడు. ఆమె ఆ దొంగని పడేయడానికి, నమ్మించడానికి విపరీతంగా అంగాంగ ప్రదర్శన చేస్తుంది. తనని తాను అర్పించుకుంటుంది. మోతాదు మించి రొమాన్స్ చేస్తుంది. ఆ క్రమంలో ఆ దొంగతో నిజంగానే ప్రేమలో పడిపోతుంది.

తెర వెనుక: ఆ పోలీసు పాత్రధారి దొంగగా ప్రవేశపెట్టే అమ్మాయి అతనికి నిజ జీవితంలో కాబోయే భార్య. నిశ్చితార్థం అయ్యి, పెళ్లి జరగబోయే ముందు తీసిన సినిమా. ఆ దొంగ బాలీవుడ్‌లో మోస్ట్ డిజైరబుల్, హ్యాండ్‌సమ్ హీరో హృతిక్. ఆ అమ్మాయి భారతీయ సౌందర్యాన్ని ప్రపంచ వేదికపై ప్రశంసించేలా చేసిన సుందరి ఐశ్వర్యారాయ్. ఆ పోలీసాఫీసరు, నిజ జీవితంలో ఆమె కాబోయే భర్త... అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్.
 
ఎంతో ప్రొఫెషనలిజమ్ ఉంటే తప్ప ఇలాంటి పాత్రల్లో పాత్రధారులు నటించలేరు. ఆ ప్రొఫెషనలిజమే బాలీవుడ్ పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానానికి ఎగరేసుకుపోతోంది. పర్సనల్ లైఫ్‌లో ఎవరు ఎవరికి ఏమైనా కానీ, తెర మీద పాత్ర ఏం చేయాలో, ప్రేక్షకుడికి ఏం కావాలో అది ఇచ్చేయడంలో బాలీవుడ్‌ని మించిన పరిశ్రమ భారతదేశంలో లేదు. ప్రేక్షకులు కూడా అలాగే ప్రేమిస్తారు ఆ పరిశ్రమని.
 తెలుగులో ఓ పెద్ద నటుడి కూతురు హీరోయిన్ అవ్వాలంటే అభిమానులు ఒప్పుకోరు. ఆ వంకన ఇంట్లోవాళ్లూ ఒప్పుకోరు. ఫ్యాషన్‌కి, ప్రతిభకి, క్యారెక్టర్‌నీ పర్సనల్ ఇమేజ్‌నీ ముడిపెట్టడం వల్లే దక్షిణాది సినిమా చాలా విషయాల్లో వెనకబడిపోతూ ఉంటుంది (ఇది నా వ్యక్తిగత పరిశీలన మాత్రమే. ఎవరి అభిప్రాయం వాళ్లది. చర్చలకు తావు లేదు).
 
‘ధూమ్’ మొదటి భాగం హిట్ అయిన ఆనందంలో జాన్ అబ్రహాం పాత్రలో హృతిక్ రోషన్‌ని పెట్టి, అదే దర్శక నిర్మాతలు సంజయ్ గధ్వీ, ఆదిత్య చోప్రాలు అందించిన ఫక్తు కమర్షియల్ చిత్రం ‘ధూమ్ 2’. ఇది సర్వ రుచుల సమ్మేళనం! ముప్ఫై అయిదు కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రానికి 150 కోట్ల వసూళ్లు వచ్చాయి. అంటే హిందీ సినిమా ఎక్కడుంది మిలీనియమ్‌లో?!
 
హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్‌ల అధర చుంబనాలు, అర్ధనగ్న ప్రదర్శనలతో పాటు తెరమీద నుంచి కళ్లు పక్కకి తిప్పనివ్వని విజువల్స్, థ్రిల్స్, చేజులు, అడుగడుగునా వీడియో గేమ్స్‌ని మించిపోయిన బ్రెయిన్ గ్రేమ్స్, కాళ్లని క్షణం కూడా కుదురుగా ఉండనివ్వని పాటలు... వెరసి బాగా ఆకలి మీదున్నప్పుడు పెట్టిన బఫే భోజనం ‘ధూమ్ 2’. మొదటి భాగం ‘ధూమ్ మచాలే’ అన్న పాటతో పూర్తవుతుంది. అందులో ఈషా డియోల్ ప్రత్యేక ఆకర్షణ.

ఇదే పాటతో ‘ధూమ్ 2’ మొదలవుతుంది. సిక్స్‌ప్యాక్ బాడీతో హృతిక్ రోషన్ స్ప్రింగ్‌లా కదులుతూ చేసిన అద్భుతమైన డ్యాన్స్‌తో ‘ధూమ్ అగైన్’ అంటూ టైటిల్స్ పడుతుండగా పాట! దాన్ని మించి నైరోబీ ఎడారిలో రైలులో ప్రయాణిస్తున్న బ్రిటిష్ రాజ కుటుంబీకుల వద్ద నుంచి వారి కిరీటాన్ని అత్యంత లాఘవంగా ఎత్తుకెళ్లే ఎపిసోడ్‌తో హీరో హృతిక్ రీ ఇంట్రడక్షన్! ఈ రెండూ ప్రేక్షకుణ్ని సినిమాలోకి లాక్కెళ్లిపోతాయి. తెరకు కళ్లు అప్పగించేలా చేస్తాయి. ఆ తర్వాత సినిమా ముగిసే వరకూ ఆ ఆసక్తి కొనసాగుతుంది.
 
సన్నివేశాన్ని బట్టి హృతిక్ వేసే మారువేషాలు చాలా ఆకట్టుకుంటాయి. జెంటిల్‌మేన్ చిత్రంలో అర్జున్ పాత్ర చేసే దొంగతనాల మాదిరిగా ఈ చిత్రంలోనూ దొంగతనాలు తీర్చిదిద్దినట్టు ఉంటాయి. మొదటి భాగంలో కథకి, సెంటిమెంట్‌కి ఈ చిత్రంలో ప్లేస్ లేదు కానీ... సెకెండాఫ్‌లో హృతిక్, ఐశ్వర్య పాత్రల మధ్య కాస్త సెంటిమెంటును టచ్ చేశారు.
 
ఈ సినిమా కథ చెప్పుకోవడానికి పెద్దగా ఉండదు. చూడాల్సిందే. అయినా మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇది ఓ దొంగ కథ. అతన్ని పట్టుకోవ డానికి ప్రయత్నించే పోలీసుల కథ. పోలీసుల తరఫున దొంగ దగ్గర చేరి, అతని ప్రేమలో పడి వచ్చిన పని నెరవేర్చలేకపోయిన ఓ అమ్మాయి కథ. సెకెండాఫ్‌లో బిపాసా బసు మంచి ఆకర్షణ. మొదటి భాగంలో నటించిన రిమీసేన్ కూడా ఇందులో అభిషేక్ భార్యగానే కంటిన్యూ అయ్యింది. రాజేష్ రోషన్ నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రాలు కాకుండా... హృతిక్‌తో బయటి నిర్మాతలు, దర్శకులు తీసిన చిత్రాల్లో పెద్ద హిట్... ధూమ్ 2 ఒక్కటే. ఈ చిత్రంలో కథ కన్నా స్క్రీన్‌ప్లే బలం ఎక్కువ.

విజయకృష్ణ ఆచార్య ధూమ్‌కి, ధూమ్ 2కి రచయిత. ‘ధూమ్ 3’కి రచనతో పాటు దర్శకత్వం కూడా చేశాడాయన. హాలీవుడ్ సినిమాల తరహా హైటెక్ దొంగతనాల కథ ఇది. దాన్ని స్కేల్‌లో నిర్మించే సాహసం చేసిన ఘనత ఆచార్యదే.
 
బ్రెజిల్లో షూటింగ్ జరుపుకున్న తొలి హిందీ చిత్రం ఇది. పెపె జీన్స్, కోకో కోలా సంస్థలు బ్రాండ్ అంబాసిడర్లుగా చిత్రాన్ని ప్రమోట్ చేశాయి. 1800 ప్రింట్లతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలోని బైక్ రేసులు కుర్రకారును అమితంగా ఆకర్షించేలా ఉన్నాయని, వాటిని తొలగించడం మంచిదని ముంబై కమిషనర్ హై కోర్టులో పిటిషన్ పెట్టారంటే... ఈ చిత్రం యువతనెలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.
 
ఆదిత్య చోప్రా నిర్మించే అన్ని చిత్రాల్లోనూ ఒక పాత్రలో తప్పనిసరిగా కనిపించే అతని తమ్ముడు ఉదయ్‌చోప్రా ఇందులోనూ నటించాడు. అభిషేక్ బచ్చన్‌కి అసిస్టెంట్‌గా కనిపించి నవ్వించాడు. బిపాసా ద్విపాత్రాభినయం ఓ మంచి ట్విస్టు ఈ చిత్రంలో. హృతిక్, ఐశ్వర్యలిద్దరూ చాలా బరువు తగ్గారట ఆదిత్య చోప్రా సూచనల మేరకు. పాత్రకు తగ్గ షేప్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ లేకపోతే పాత్రధారుల్ని ఆ పాత్రలో పెట్టనని ఆయన ఖరాఖండిగా చెబుతుంటారు.
 
నిర్మాత కథ ఇవ్వడం, మేకింగ్‌లో తన టీమ్‌కి కావలసిన స్వేచ్ఛనిస్తూనే... చిత్రం అనుకున్న స్థాయిలో రావడానికి అహర్నిశలూ శ్రమించడం తెలుగు పరిశ్రమలో కూడా ఉంది. ముళ్లపూడి వెంకట రమణగారు నిర్మాత, రచయిత. ఎమ్మెస్ రాజు కథకుడు, నిర్మాత (దర్శకుడు కాకముందు). శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కథకుడు, నిర్మాత. ఆయన తండ్రి ఎమ్మెస్ రెడ్డిగారు అఫీషియల్‌గా స్క్రీన్ మీద పేరు వేసుకోకపోయినా ఆయన కూడా నిర్మాత, రచయిత. ఇంకా రామా నాయుడుగారు, అశ్వినీదత్, అల్లు అరవింద్, నాగబాబు, సురేష్‌బాబు, స్రవంతి రవికిశోర్, బూరుగుపల్లి శివరామ కృష్ణ, దిల్‌రాజు... ఇలా నాకు తెలిసిన కొంతమంది నిర్మాతల చిత్రాల్లోనే టీమ్ వర్క్ కనిపిస్తోంది తప్ప మిగిలిన చిత్రాల్లో కనిపంచట్లేదు.

టీమ్ వర్క్ లేని చిత్రాలు ఆడవచ్చు. కానీ ఆడినా ఆడకపోయినా ఆ సినిమాలు ఆ నిర్మాతలను క్యాషియర్లుగానే చూస్తాయి. లేదా క్యాష్ ఈయరు గానే నిరూపిస్తాయి. వేరే వాళ్ల మెదడు మీద బెట్టింగ్ కాయడం పొగరు. అదే తన డబ్బుతో పెట్టుబడి పెట్టి, కొద్దిమందితో కలిసి కష్టపడి చేసి, ఆ ప్రొడక్టుని మార్కెట్లో పెడితే... దానికి దాదాపు ఫెయిల్యూర్ శాతం చాలా తక్కువ. అయినా మన నిర్మాతలు ఆ కష్టాన్ని ఇష్టపడరెందుకనో!
 
ఆదిత్య చోప్రా విజయవంతమైన దర్శకుడే కాదు... అంతకంటే విజయవంతమైన నిర్మాత అవ్వడానికి కారణం, మన తెలుగు నిర్మాతల బాట పట్టడమే అని నా అభిప్రాయం. అందుకు ఒక సాక్ష్యం.. ధూమ్ 2. ఇంతకుముందు మీకలా అనిపించకపోతే, ఓసారి ఆ సినిమాని మళ్లీ చూడండి. నాతో ఏకీభవించి తీరతారు!                     
                                          
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement