నాకైతే చార్మినార్‌కున్నంత హిస్టరున్నది! | Best Villain of Kota Srinivasa Rao | Sakshi
Sakshi News home page

నాకైతే చార్మినార్‌కున్నంత హిస్టరున్నది!

Aug 13 2017 1:00 AM | Updated on Sep 17 2017 5:27 PM

నాకైతే చార్మినార్‌కున్నంత హిస్టరున్నది!

నాకైతే చార్మినార్‌కున్నంత హిస్టరున్నది!

సాంబశివుడికి నాన్చడం ఇష్టం ఉండదు. డొంక తిరుగుడుగా మాట్లాడడం ఇష్టం ఉండదు. సూటిగా విషయంలోకి వస్తాడు.

సాంబశివుడికి నాన్చడం ఇష్టం ఉండదు. డొంక తిరుగుడుగా మాట్లాడడం ఇష్టం ఉండదు. సూటిగా విషయంలోకి వస్తాడు.

‘తమ్మీ... ఇస్టేటుగా పాయింట్లకు వస్తున్న.
నీ ఫైళ్ల ఉన్న మొత్తం ఇన్‌ఫర్‌మేషన్‌ కరెక్టే.
నేను యాభై కోట్ల కుంభకోణం చేసిన... కాదంటలే!
మరి నాకైతే చార్మినార్‌కున్నంత హిస్టరున్నది’.


హీరో డైలాగులు కొడితే చప్పట్లు కొట్టడం అనేది సాధారణమే కావచ్చుగానీ, తమ డైలాగులతో కూడా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోగలిగే విలన్‌లలో కోట శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారు. ‘గణేష్‌’ సినిమాలో హెల్త్‌ మినిస్టర్‌ సాంబశివుడిగా ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ గుర్తుండిపోతాయి.
విలనిజంలో అసలు సిసలు ‘స్థానికత’ను తీసుకువచ్చారు కోట.

 ఎన్నో సినిమాల్లో విలన్‌ పాత్రలు వేసి తనదైన గుర్తింపు తెచ్చుకొని ‘ఉత్తమ విలన్‌’ అనిపించుకున్నారు.నవ్వించే నటుడిని తీసుకువచ్చి విలన్‌ క్యారెక్టర్‌ ఇస్తే... భయం కలగకపోగా నవ్వొస్తుంది. అయితే దీనికి కోట మినహాయింపు. నిన్నటి సినిమాలో కమెడియన్‌గా తెగ నవ్వించిన కోట,  ఈరోజు వచ్చిన సినిమాలో విలన్‌గా విశ్వరూపం చూపి భయపెట్టించగలరు!
∙∙
కాలేజీ రోజుల నుంచి నాటకాల్లో నటించడం అంటే కోటకు తెగ ఇష్టం. అయితే సినిమాల్లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. సినిమా రంగం అంటే భయం కూడా! ఎందుకంటే... ‘సినిమాల్లో నటించే వాళ్లు ఆషామాషీ వ్యక్తులు కాదు... పొడుగ్గా ఉంటారు. తెల్లగా ఉంటారు. ఉంగరాల జుట్టుతో ఉంటారు... అందుకే నేను సినిమాలకు పనికిరాను’ అనుకునేవారు కోట. ‘ప్రాణం ఖరీదు’ అనే నాటకంతో కోటకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ నాటకాన్ని సినిమాగా తీసినప్పుడు అందులో నటించే అవకాశం వచ్చింది.  హైదరాబాద్‌లో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నాటకాలు విరివిగా ఆడేవారు కోట.

 హైదరాబాద్‌ దాటి వెళ్లాల్సి వస్తే నాటకాలు ఆడే అవకాశం కోల్పోతానని, నాటకాల కోసం ప్రమోషన్స్‌ కూడా వదులుకునేవారు.ఎప్పుడైనా జంధ్యాల హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌ చేస్తే సరదాగా ఆ సినిమాలో చిన్న వేషం వేసేవారు తప్ప సినిమాల్లోకి వెళ్లాలని, పెద్ద నటుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదు కోట. అనుకోవడం, అనుకోకపోవడంతో విధికేం పని!

టి.కృష్ణ, ముత్యాలసుబ్బయ్య ఒక నాటకం చూశారు. అందులో కోట నటన వారికి బాగా నచ్చింది. ‘సినిమాలకు పనికొస్తాడు’ అనుకున్నారు. అలా కోటతో ‘వందేమాతరం’, ‘ప్రతిఘటన’ సినిమాలలో నటింపచేశారు. అయితే ‘ప్రతిఘటన’ సినిమాలో పోషించిన గుండు కాశయ్య పాత్ర కోట శ్రీనివాసరావును ఎక్కడికో తీసుకువెళ్లిపోయింది. ‘ఆర్టిస్ట్‌కు టైం వస్తే టైమే ఉండదు’ అని కోట చెప్పే మాట ఆయన విషయంలోనే అక్షరాలా రుజువైంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement