అరుణాచలం మేడిన్ అమెరికా!


ఆ సీన్ - ఈ సీన్

జార్జ్‌బార్ మెక్‌కుచ్చన్ అనే అమెరికన్ రచయిత ‘బ్రెస్టర్ మిలియన్స్’ నవలను 1902లో రాశాడు. హాలీవుడ్‌లో ఈ నవల ఆధారంగా ఆరు సినిమాలు వచ్చాయి. మన దగ్గర మూడు వచ్చాయి. హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో ఎన్టీ రామారావు హీరోగా ‘వద్దంటే డబ్బు’ సినిమాకు మూల కథను ‘బ్రెస్టర్ మిలియన్స్’ కథాగమనాన్ని అనుసరించి సంగ్రహించారు. 1988లో బాలీవుడ్‌లో నిసీరుద్దీన్ షా ప్రధానపాత్రలో ‘మాలామాల్’ రూపొందింది. జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా ‘బాబాయ్ అబ్బాయ్’లోనూ ఈ ఛాయలు కనిపిస్తాయి. అయితే మెక్ నవల, 1985లో వచ్చిన ‘బ్రెస్టర్ మిలియన్స్’ సినిమాల జాడ ఎక్కువగా కనిపించేది మాత్రం ‘అరుణాచలం’ సినిమాలో మాత్రమే.

 

సినీ సృజనలో కాపీ అనేది చాలా సహజమైన ప్రక్రియ. అయితే కాపీ చేసినప్పుడు అసలైన సృజనకారులకు క్రెడిట్ ఇస్తే...  కాపీ కొట్టిన వాళ్లు కూడా గొప్పవాళ్లే అవుతారు. భారతీయ కాపీ రాయుళ్లలో ఇలాంటి స్పృహ కనిపించదు. కానీ, ప్రేక్షకులు మాత్రం స్పృహలోనే ఉంటారు. కాపీ కథల జాడను పట్టేస్తారు. ఈ అరుణాచలం కూడా అంతే. అడ్డపంచెలో వచ్చి పలకరించినా ఇతడి మూలాలు మాత్రం  అమెరికాలో ఉన్నాయి!

 

ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. గడువు ముప్పై రోజులే. ఆస్తులు కొనకూడదు, అప్పుగా ఇవ్వకూడదు. దానధర్మాలు చేయరాదు. అంతా ఖర్చు పెట్టాలి. డబ్బు ఖర్చు పెట్టడంపై విసుగొచ్చేలా ఖర్చు పెట్టాలి. డబ్బుపై మమకారం పోయేలా ఖర్చు చేయాలి. అరుణాచలం సినిమాలో ఒక తండ్రి తనయుడికి పెట్టే పరీక్ష ఇది. ఈ ముప్పై కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే పరీక్షలో ఉత్తీర్ణుడు అయితేనే తన మూడువేల కోట్ల రూపాయల ఆస్తి తనయుడికి దక్కేలా వీలునామా రాసి ఉంటాడాయన.రజనీకాంత్ హీరోయిజాన్ని సరికొత్త రీతిలో ఎలివేట్ చేసిన సినిమా ‘అరుణాచలం’ మూల కథ ఇది. సుందర్.సి దర్శకత్వంలో 1997లో వచ్చిన ఈ సినిమా దక్షిణాదిలో సూపర్‌హిట్ అయింది. కేవలం రజనీకాంత్ స్టైల్స్, మ్యానరిజమ్స్ మాత్రమే కాకుండా అత్యంత ఆసక్తిగల రీతిలో సాగే ఈ సినిమా కథ, కథనాలు కూడా ‘అరుణాచలం’ సినిమా సూపర్‌హిట్ కావడానికి కారణాలే. ఇందులో రజనీకాంత్ స్టైల్స్ మాత్రమే ఒరిజినల్. కథాగమనం కాపీ కొట్టిందే. ఆ నవల పేరు, సినిమా పేరు కూడా ‘బ్రెస్టర్ మిలియన్స్’.  

 

మాంటీ బ్రెస్టర్ ఓ క్లబ్‌లో బేస్‌బాల్ ప్లేయర్. స్పైక్ నోలన్ అనే బెస్ట్‌ఫ్రెండ్ కోసం ఓ గొడవలో తలదూర్చి అరెస్ట్ అవుతాడు. నోలన్ కూడా జైలు పాలవ్వడంతో వీరిని విడిపించేవాళ్లే ఉండరు. ఇలాంటి సమయంలో ఒక అపరిచితుడు వచ్చి తనతో పాటు న్యూయార్క్ సిటీకి రావాలనే షరతు మీద బెయిల్ ఇప్పిస్తాడు. జైలు నుంచి బయటపడితే చాలని ఆ షరతుకు ఒప్పుకొని స్నేహతుడితో కలసి న్యూయార్క్ వెళతాడు బ్రెస్టర్.  

 

బ్రెస్టర్‌కు పెదనాన్న వరుసయ్యే రూపర్ట్ హార్న్ శ్రీమంతుడు. తనకంటూ ఎవరూ లేని స్థితిలో మరణించిన ఆ పెద్దాయన తన ఆస్తిపాస్తులన్నింటినీ రక్తసంబంధీకులకే దక్కాలనుకుంటాడు. అయితే వారికి ధనం మీద వ్యామోహం ఉండకూడదు, మనీమేనేజ్‌మెంట్‌లో గొప్ప నైపుణ్యం ఉండి తీరాలనే భావనతో... ముప్పై రోజుల్లో ముప్పై మిలియన్ల మొత్తాన్ని ఖర్చు పెట్టే షరతు పెడతాడు. తన వీలునామాను వివరించే వీడియో క్యాసెట్‌ను, తన ఆస్తులను సన్నిహితులయిన పెద్దమనుషులకు అప్పగించి ఉంటాడు. బ్రెస్టర్‌ను న్యూయార్క్‌కు తీసుకొచ్చిన అపరిచితుడు ఈ కథంతా వివరించడంతో... ముప్పై మిలియన్‌డాలర్ల చాలెంజ్‌ను స్వీకరిస్తాడు హీరో. ఆ తర్వాత ఎలా విజయం సాధించాడనేది అరుణాచలం సినిమాలో చూసేశాం.

 

మిలియన్లు మన కరెన్సీలో కోట్లు అయ్యాయి. ముప్పై రోజుల కాన్సెప్ట్  మారలేదు. హీరోను పరిచయం చేసే బ్యాక్‌గ్రౌండ్‌ను సెంటిమెంట్లతో లోకల్ టచ్ ఇచ్చారు. అరుణాచలం తమిళ, తెలుగు వెర్షన్‌లలో డబ్బును ఖర్చు పెట్టడానికి హీరో ప్రయత్నిస్తున్నప్పుడు అడ్డంకులు సృష్టించే పన్నాగాలు, వ్యూహాలు, హీరో ఎత్తులు కూడా మూలంలోనివే.

- బి. జీవన్‌రెడ్డి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top