ధన్‌తేరస్‌; అప్పుడు పూజ చేస్తేనే మంచిది! | Sakshi
Sakshi News home page

అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆరోగ్యం కూడా..

Published Tue, Oct 22 2019 3:28 PM

Dhanteras Puja Brighten Your Lives Ahead Deepali - Sakshi

భారతీయ సంస్కృతిలో దీపావళితో పాటు... దివ్వెల పండుగకు రెండు రోజుల ముందుగానే వచ్చే ధన్‌తేరస్‌కు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. సర్వ సంపద ప్రదాయిని శ్రీ మహాలక్ష్మి జన్మదినం సందర్భంగా అమ్మవారిని పూజించి.. ఆ రోజు బంగారం, వెండి కొనడం వల్ల తమ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కొలువుదీరుతాయని చాలా మంది విశ్వసిస్తారు. అందుకే ధన్‌తేరస్‌ నాడు బంగారం షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతాయి. ఇంతటి విశిష్టత కలిగి ఉన్న ధన్‌తేరస్‌ గురించి శాస్త్రం ఏం చెబుతుందో.. ఆరోజు ఏ సమయంలో పూజ చేయాలో ఓసారి గమనిద్దాం.

చిరంజీవులుగా ఉండేందుకు అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో.. ఆ క్షీరాబ్ది నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. ఆమెతో పాటు సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కోరిన వరాలిచ్చే కామధేనువు.. అదే విధంగా దేవ వైద్యుడు ధన్వంతరి కూడా జన్మించారు. ఆ రోజు అశ్వయుజ కృష్ణ త్రయోదశి కావడంతో పాటు... ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి జనియించడం వల్ల ధన త్రయోదశి లేదా ధన్‌తేరస్‌ అని కూడా పిలుస్తారు.  అయితే సాధారణంగా అశ్వయుజ మాసంలో మొదటి పది రోజుల్లో పార్వతీదేవిని, మూలా నక్షత్రంనాడు సరస్వతీ మాతను పూజిస్తారు. సరస్వతీ కటాక్షం మెండుగా ఉన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటేనే ముందుకు సాగుతామని ప్రతీతి. కాబట్టి త్రిమూర్తుల భార్యల్లో పూజ జరగకుండా మిగిలిన లక్ష్మీదేవిని మూడు రోజుల పాటు(ధన త్రయోదశితో పాటు నరకచతుర్ధశి, దీపావళి) ప్రత్యేకంగా పూజించాలని శాస్త్రం చెబుతోంది. అందుకే సిరి సందలకు మూలమైన లక్ష్మీదేవిని మానవాళి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి.. ఆశీసులు అందుకుంటారు.

ఇక ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవితో పాటు ఉత్తర దిక్పాలకుడు, ధనానికి అధినాయకుడు అయిన కుబేరుడితో పాటు ధన్వంతరిని కూడా పూజించడం ఆనవాయితీ. ముందుగా చెప్పినట్లుగా ధంతేరస్‌ నాడు బంగారం వెండి ఇతర విలువైన వస్తువులు కొనడంతో పాటు దేవ వైద్యుడు, ఆయుర్వేద పితామహుడు అయిన ధన్వంతరిని పూజించడం వల్ల ఐశ్వర్యం వృద్ధి చెందడంతో పాటు దీర్ఘ కాలంగా బాధిస్తున్న వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.


                                                       కుబేరుడు- ధన్వంతరి

ప్రదోష కాలంలో పూజ..
సాధారణంగా దీపావళికి రెండు రోజుల ముందు అంటే ధంతేరస్‌ నాడు సాయంకాల సమయంలో అనగా ప్రదోష వేళలో వృషభ లగ్నంలో లక్ష్మీపూజ ఆచరిస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిమిషాలు ఈ ప్రదోషకాలం కొనసాగుతుంది. ఆశ్వయిజ మాసంలో వృషభలగ్నం రాత్రి సుమారు 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో లక్ష్మీపూజ చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ దేవిని పూజించడంతో పాటు దీపాలు వెలిగించి.. కోటి ఆశలతో ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇక ఈ ఏడాది లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శుక్రవారం(అక్టోబరు 25) రోజే ధన్‌తేరస్‌ కావడం విశేషం.

Advertisement
 
Advertisement
 
Advertisement