రాములమ్మ ఎటువైపు?

రాములమ్మ ఎటువైపు? - Sakshi


కమలాన్ని వీడి కారు ఎక్కి ఆ తర్వాత హస్తాన్ని అందుకోవాలనుకున్న మెదక్ ఎంపీ విజయశాంతి పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. రాములమ్మ రాజకీయ జీవితం ప్రస్తుతం సుడిగుండంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. మెదక్ సీటు విషయంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో  విభేదించి తెలంగాణ... కాంగ్రెస్ ఇచ్చింది అంటూ  పార్టీ మార్చిన విజయశాంతి పాలిటికల్ కెరీర్  ప్రశ్నార్థకమైంది.



వెండి తెరపై ఒకప్పుడు లేడీ అమితాబ్గా ఓ  వెలుగు వెలిగిన రాములమ్మకు రాజకీయాలు మాత్రం అంత కలిసి రావడం లేదు. విజయశాంతి ఇప్పుడు సమస్యల రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంది. కారుకు గుడ్ బై చెప్పి హస్తాన్ని అందుకోవాలనుకున్నా ఆమెకు అక్కడా సమస్యలు తప్పేట్లు లేవు. బీజేపీలో చేరిక మొదలు టీఆర్‌ఎస్‌ను వీడే వరకూ అడుగడుగునా ఆమె ఒడిదుడుకులనే ఎదుర్కొంది. బీజేపీని వీడి ఆ తర్వాత 'తల్లి తెలంగాణ' పార్టీని స్థాపించింది. కొద్దిరోజుల అనంతరం ఆర్థిక ఇబ్బందులతో  తన పార్టీని కేసిఆర్ చేతిలో పెట్టి, ఆయనకు మెదక్ చెల్లెమ్మగా మారిపోయింది.



అయితే, గులాబీ దళంలోనూ విజయశాంతి ఇమడలేకపోయింది. అంతకు ముందు అనేకసార్లు అలకబూని, పలుసార్లు పార్టీని వీడుతున్నట్లు వార్తలు వచ్చినా తూచ్ అంటూ... సర్దుకుంది. అయితే తాజాగా తెలంగాణ ప్రకటనతో విజయశాంతి గాలి కాంగ్రెస్ వైపు మళ్లింది. కానీ, మెదక్ సీటు వదిలేది లేదంటున్న రాములమ్మకు హస్తం నుంచి కూడా సరైన హామీ రాలేదని సమాచారం.



దాంతో నిన్న మొన్నటి వరకూ అత్యుత్సాహంగా ప్రకటనలు గుప్పించిన   రాములమ్మ ఉన్నట్టుండి మౌనముద్రలోకి వెళ్లిపోయింది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నేతలు పలుమార్లు హస్తినకు వెళ్లినా, సోనియాకు కృతజ్ఞతలు చెప్పేందుకు జైత్రయాత్ర సభలు నిర్వహించినా ఆ దరిదాపుల్లో కూడా  విజయశాంతి  జాడ లేదు. తెలంగాణ విషయంలో ఎవరేమన్నా వెంటనే ఖండించే ఆమె ఇప్పుడు మౌనమంత్రాన్నే పఠిస్తోంది. హైదరాబాద్ యూటీ, భద్రాచలం, రాయల తెలంగాణ ఇలా ఎన్నో డిమాండ్లు తెరమీదకు  వస్తున్నా విజయశాంతి నోరు విప్పడం లేదు.



మరోవైపు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మానియా నేపథ్యంలో మళ్లీ రాములమ్మ సొంత గూటికే చేరుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఇక కమలం మాత్రం విజయశాంతి కోసం ఎప్పుడో తలుపులు తెరిచి పెట్టింది. ఆమెకు బీజేపీ అగ్రనేత అద్వానీతో సాన్నిహిత్యం ఉంది. అద్వానీ కూడా ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. దాంతో విజయశాంతి కూడా కమలం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top