ఆర్ యు నైస్ ఆర్ నాటీ | Are You Naughty or Nice | Sakshi
Sakshi News home page

ఆర్ యు నైస్ ఆర్ నాటీ

Dec 3 2014 11:38 PM | Updated on Sep 2 2017 5:34 PM

ఆర్ యు నైస్ ఆర్  నాటీ

ఆర్ యు నైస్ ఆర్ నాటీ

లిస్ట్ డే థ్యాంక్స్ గివింగ్ సెలిబ్రేషన్స్‌తోనే పెద్దలందరూ నవంబర్ నెలాఖరు నుంచే క్రిస్మస్ మూడ్‌లోకి వచ్చేశారు.

లిస్ట్ డేథ్యాంక్స్ గివింగ్ సెలిబ్రేషన్స్‌తోనే పెద్దలందరూ నవంబర్ నెలాఖరు నుంచే క్రిస్మస్ మూడ్‌లోకి వచ్చేశారు. పెద్దల సంబరాలు, ఆడంబరాలు సరే, మరి చిన్నారుల మాటేమిటి? నిజానికి ఏ పండుగైనా సందడంతా పిల్లలదే కదా! చిన్నారులను క్రిస్మస్ మూడ్‌లోకి తెప్పించేందుకు, అదే సమయంలో వారి అల్లరిని కట్టడి చేసేందుకు  పుట్టుకొచ్చిందే ‘శాంతాస్ లిస్ట్ డే’. ప్రపంచ వ్యాప్తంగా ఏటా డిసెంబర్ 4న దీనిని జరుపుకొంటారు. క్రిస్మస్ అంటే చర్చిలో ప్రార్థనలు, ఇళ్లలో అలంకరణలు, సంబరాలు, విందు వినోదాలన్నీ పెద్దల వ్యవహారాలు.

పిల్లలకు క్రిస్మస్ అంటే, ధగధగలాడే తెల్లటి గడ్డంతో ఆకర్షణీయంగా మెరిసిపోయే క్రిస్మస్ తాత ‘శాంతా క్లాజ్’, ఆయన తెచ్చే కానుకలు.. క్రిస్మస్ తాత తెచ్చే కానుకల కోసం చిన్నారులంతా ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. క్రిస్మస్ పండుగ దగ్గరపడుతున్న కొద్దీ, తాము కోరుకునే కానుకల గురించి కలలు కంటూ ఉంటారు. అయితే, ఎవరికి ఎలాంటి కానుకలు దొరుకుతాయనేది చివరి వరకు సస్పెన్స్‌గానే ఉంటుంది.
 
రెండు జాబితాలు.. ఒక అవకాశం
పిల్లలంతా ఒక్కటే అయినా, అందరు పిల్లలూ ఒకేలా ఉండరు. కొందరు మంచిబాలలు ఉంటారు. ఇంచక్కా అమ్మానాన్నల మాట వింటారు. స్కూల్లో టీచర్ల దగ్గర బుద్ధిగా ఉంటారు. తోటి పిల్లలతో మంచిగా ఉంటారు. అందరూ ఇలాగే ఉంటారనేం లేదు. కొందరు అల్లరి పిల్లలూ ఉంటారు. నిజానికి పిల్లలంటేనే అల్లరికి మారుపేరు కదా! అల్లరి కాస్త అదుపులో ఉంటే ఫర్వాలేదు. కొంతమంది మరీ మొండిఘటాల్లాంటి చిచ్చర పిడుగులుంటారు. కానుకలు ఇచ్చే ముందు శాంతాక్లాజ్ పిల్లల జాబితాలు తయారు చేస్తాడట. వాటిని బయటపెట్టే రోజే ‘శాంతాస్ లిస్ట్ డే’గా పాటిస్తారు.

శాంతాక్లాజ్ వద్ద మంచి పిల్లలందరి పేర్లతో ‘నైస్ లిస్ట్’, అల్లరి పిల్లల పేర్లతో ‘నాటీ లిస్ట్’ అని రెండు జాబితాలు ఉంటాయట. అయితే, ఎంత అల్లరి చేసినా, పిల్లలు నిరాశ పడకూడదు కదా! అందుకే, ప్రవర్తన చక్కదిద్దుకోవడానికి వారికి ఓ అవకాశం ఉంటుంది. శాంతాస్ లిస్ట్ డే నుంచి క్రిస్మస్ ముందు రోజు వరకు, అంటే డిసెంబర్ 4 నుంచి 24 వరకు పిల్లలు అల్లరి మానేస్తే, వారి పేర్లను శాంతాక్లాజ్ నాటీ లిస్ట్‌లోంచి తీసేసి, నైస్ లిస్ట్‌లో చేరుస్తాడట. వారికి కూడా కోరుకున్న కానుకలను ఇంచక్కా అందిస్తాడట. కానుకలంటే పిల్లలకు ఆశ సహజం.

క్రిస్మస్ తాత తెచ్చే కానుకల కోసం ‘నైస్ లిస్ట్’లో చేరడానికి చిచ్చర పిడుగులు సైతం అల్లరి మానేసి, కనీసం కొద్ది రోజులైనా మంచిబాలల్లా ఉంటారని ఓ నమ్మకం. క్రిస్మస్ అంటే సెలవుల సీజన్. బడి ఉన్నప్పుడు నిత్యం చదువులతో సతమతమయ్యే పిల్లలకు సెలవుల్లో ఏం చేయాలో తోచదు. దాంతో ఏదో ఒకటి కావాలంటూ తల్లిదండ్రులను విసిగిస్తారు. ఇరుగు పొరుగు పిల్లలతో ఆటలాడుకునే వీలు దొరికినా, ఆటలు ఎంతోసేపు ప్రశాంతంగా సాగవు. పిల్లల్లో పిల్లలకు దెబ్బలాటలూ మొదలవుతాయి. సెలవు రోజుల్లో పిల్లలు చేసే ఇలాంటి అల్లరితో వేగడం తల్లిదండ్రులకు అగ్నిపరీక్షే! బహుశ, వారి అల్లరిని కాస్త అదుపు చేయడానికే ఇలాంటి పద్ధతిని ప్రవేశపెట్టి ఉంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement