అమల అక్కినేనికి అంతపేరెలా వచ్చింది? | Amala Akkineni as Doctor in Uyirmei serial | Sakshi
Sakshi News home page

అమల అక్కినేనికి అంతపేరెలా వచ్చింది?

Sep 25 2014 4:04 PM | Updated on Sep 2 2017 1:57 PM

అమల అక్కినేని

అమల అక్కినేని

డాక్టర్‌ కవితా సందీప్‌ అంటే మనకు తెలియదు. కానీ, తమిళనాడులో మాత్రం చాలా పాపులర్‌ డాక్టర్‌. అవును ఆ డాక్టర్‌ ఎవరో కాదు. మన అమల అక్కినేని.

డాక్టర్‌ కవితా సందీప్‌ అంటే మనకు తెలియదు.కానీ, తమిళనాడులో మాత్రం చాలా పాపులర్‌ డాక్టర్‌.  అవును ఆ డాక్టర్‌ ఎవరో కాదు. మన అమల అక్కినేని.  తమిళనాడులోని ప్రతి ఇంటికి  వెళ్లి పలకరిస్తున్నారు.  దాదాపు  20 ఏళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నారు అమల.  చెన్నై కళాక్షేత్ర విద్యార్థిని అయిన అమల 'మైథిలి  ఎన్నై కాదళి' అంటే తెలుగులో 'మైథిలి నా ప్రేయసి' సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పై తొలిసారి ప్రత్యక్షమయ్యారు. ఆరేళ్లలో అమల దాదాపు 50 సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ అన్ని భాషలలో ఆమె నటించారు.   

 ఈ మధ్య కాలంలో అమల లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో అతిధి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత  'ఉయిర్‌ మెయ్' అనే బుల్లితెర తమిళ సీరియల్‌ కోసమే ఆమె మేకప్‌ వేసుకున్నారు. ఉయిర్‌ మెయ్ అంటే ప్రాణదాత. డాక్టర్స్‌ చుట్టు ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఈ సీరియల్‌లో డాక్టర్‌ కవితా సందీప్‌ పాత్రలో అమల నటిస్తున్నారు. సందీప్‌ పాత్ర భరత్‌ కళ్యాణ్‌ది.  పన్నెండు మంది డాక్టర్లు, వారి జీవితాలు, కుటుంబాలు, రోగుల చుట్టు కథ నడుస్తుంది.

 మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన భూషణ్‌ కళ్యాణ్‌ ఈ సీరియల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.తమిళ హీరో గీబ్రాన్‌ ఉస్మాన్‌ ఇందులో  చిన్నపిల్లల డాక్టర్‌ పాత్ర.  ఈ సీరియిల్ స్క్రిప్టు చాలా బాగుందని, అందువల్లనే ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు అమల చెప్పారు. అమల ఊహించినట్లే ఈ సీరియల్ తమిళనాడులో బాగా పాపులర్ అయింది. అందులోని డాక్టర్ పాత్ర అమలకు మంచి పేరు తెచ్చిపెడుతోంది.

''నేను సీరియల్‌లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, అనుకోనివి జరగడమే జీవితం''అని అమల అన్నారు.  ఉయిర్‌మెయ్ ధారావాహికలో నటించడానికి గల కారణాలను అమల వివరిస్తూ ఈ కథ, కథనం చాలా బాగున్నాయని తెలిపారు. పైగా ప్రతి ఎపిసోడ్‌లోనూ ప్రేక్షకులను ఆలోచింపజేసే మంచి సందేశం ఉందని చెప్పారు. ఇందులో తన పాత్ర పేరు డాక్టర్ కవిత అని,  ఎమర్జెన్సీ కేర్‌కి హెడ్‌ని అని తెలిపారు.  కేవలం మందుల వల్ల మాత్రమే అనారోగ్యం దూరం కాదని, రోగి పట్ల ప్రేమాభిమానాలు కనబర్చడం కూడా ముఖ్యం అని ఈ పాత్ర చెబుతుంది. గత నెల 18న ఈ ధారావాహిక ప్రసారం ఆరంభమైంది. తమిళంలో అనేక చిత్రాలలో నటించిన అమలకు తమిళనాడులో  అభిమానులు బాగానే ఉన్నారు. మళ్లీ తెరపై అమల కనిపించడం వారికి ఆనందంగా ఉంది.
 
 నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు  అమల  ఫుల్‌స్టాప్ పెట్టేశారు.  ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ బ్లూ క్రాస్ కార్యకలాపాలు చూసుకుంటూ గడిపేవారు. ఇరవయ్యేళ్ల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ద్వారా మెరిశారు. ఇప్పుడు బుల్లి తెరపై మంచి పాత్ర పోషిస్తున్నారు.
- శిసూర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement