యూట్యూబ్‌ స్టార్స్‌

Youtube Stars Special Story - Sakshi

మీరూ స్టార్స్‌

యూట్యూబ్‌.. సినిమా థియేటర్లను చిన్నబోయేలా చేస్తోంది!వంటల నుంచి న్యూస్‌ ఎనాలిసిస్‌ దాకా అన్ని అంశాలతో అరచేతిలోనే ఇన్‌ఫోటైన్‌మెంట్‌ అందుతుంది!హంగామా కాదు.. ఆలోచన ఉన్న సృజనకారులను తెరమీదకు తెస్తోంది...సినిమాస్టార్స్‌ కంటే ఎక్కువ ఫాలోయింగ్‌ను సంపాదించిపెడుతోంది..పాటలు, ఫైట్లు అనే ఫార్మూలాతో కాకుండా.. ఫ్లాప్‌లు, హిట్లు  లేకుండా..  కేవలం క్రియేటివిటీతోనే కెరీర్‌ను స్థిరపరుచుకుంటున్న..పరుచుకున్న యూట్యూబ్‌ ఫిమేల్‌  స్టార్స్‌ పరిచయం..

చాన్నాళ్ల కిందట.. కాఫీ విత్‌ కరణ్‌ షోకి అతిథిగా వెళ్లారు ఆలియా భట్‌. రాపిడ్‌ రౌండ్‌లో ‘‘మన రాష్ట్రపతి (అప్పటి) ఎవరు?’’ అన్న ప్రశ్నకు తప్పు సమాధానమిచ్చి అప్పట్లో దేశ ప్రజల ట్రోలింగ్‌కి గురయ్యారు ఆలియా. ఆ స్పూఫ్‌తో అంతే పాపులర్‌ అయింది ఓ చానెల్‌. దాని పేరు ఏఐబి (ఆల్‌ ఇండియా బ్యాక్‌చోడ్‌.. ఉత్తర భారతంలో బ్యాక్‌చోడ్‌ అంటే ఊసుపోని కబుర్లు, వదంతులు అని అర్థం). నిజానికి ఇది యూట్యూబ్‌ కంటే ముందే వచ్చిన చానెల్‌. అంటే మన దేశంలోకి యూట్యూబ్‌ రాకముందు ఏఐబీ తన షోస్‌ను ఆడియో రికార్డింగ్‌ చేసి నెట్‌లో పెట్టేది. ఒకరకంగా రేడియోలాగా అన్నమాట. తర్వాత అంటే 2013కి యూట్యూబ్‌ చానెల్‌గా మారింది. తన్మయ్‌ భట్, జి. కంభ అనే ఇద్దరు యువకులు దీన్ని స్టార్ట్‌ చేశారు. ఇదెంత ప్రాచుర్యం పొందింది అంటే అప్పటి రియాలిటీ షోస్‌లకు దీటుగా దీనికి వ్యూస్‌ ఉండేవి. ‘కాఫీ విత్‌ కరణ్‌’ స్పూఫ్‌లో ఆలియానే అతిథిగా వచ్చేంత క్రేజ్‌ సంపాదించుకుంది ఏఐబి.

బాలివుడ్‌ నుంచి పాలిటిక్స్‌ దాకా దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామం మీద వ్యంగ్యంగా షో చేసేవాళ్లు దీంట్లో. దేశంలో యూట్యూబ్‌ చానెల్స్‌కి ఒకరకంగా ఇది ప్రేరణ, స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు. కొత్త ఆలోచనలు, భిన్నమైన ప్రెజెంటేషన్సే ఈ షోస్‌కు క్వాలిఫికేషన్‌. వంటలు, ఫ్యాషన్, యోగా, న్యూస్‌ కామెంట్స్, ఆర్ట్స్‌... ఒక్కటేమిటి అభిరుచికి సృజనను జోడించి షో చేసి యూట్యూబ్‌ చానెల్‌లో రిలీజ్‌ చేయడమే. వీటన్నిటికీ వేలల్లో చందాదారులున్నారంటే యూట్యూబ్‌ చానెల్స్‌కున్న డిమాండ్‌ ఎంతో అర్థం చేసుకోవచ్చు. పాపులర్‌ షోస్‌తో టాప్‌లో ఉన్న యూట్యూబ్‌ స్టార్స్‌లో చాలా మంది మహిళలే. వీళ్లలో అయిదేళ్ల నుంచి వందేళ్ల అవ్వల దాకా ఉన్నారు.  మరీ అంత అతశయోక్తా అనుకోవద్దు.. జబర్‌దస్త్‌ దీవెన అయిదేళ్ల పిల్ల. మస్తానమ్మ గుర్తుంది కదా.. ఎలాంటి ప్రయాస లేకుండా కొత్తరకం వంటలను యూట్యూబ్‌లో రుచి చూపించిన ఆమె వందేళ్ల వయసులో యూట్యూబ్‌ స్టార్‌ అయ్యారు. ఈ క్రియేటివిటీలో మనవాళ్లకూ స్పేస్‌ ఉంది. మహాతల్లి జాహ్నవి, వరంగల్‌ వందన, ‘‘మై విలేజ్‌ షో’’ మిల్కూరి గంగవ్వ దాకా అందరూ స్టార్సే.

మహాతల్లి జాహ్నవి ,మస్తానమ్మ

తొలి తెలుగు ఫీమేల్‌ స్టార్‌
మహాతల్లి జాహ్నవి.. షోలోని తను వేసే క్యారెక్టరే ఆమె పరిచయనామంగా మారిన యూట్యూబ్‌ తొలి తెలుగు ఫిమేల్‌ స్టార్‌. దైనందిన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లన్నిటినీ స్పృశిస్తూ ఆమె షోస్‌ ఉంటాయి. నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ టెక్నాలజీ చదివిన జాహ్నవి మొదట్లో షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ హరీష్‌ నాగరాజుతో కలిసి కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌కి పనిచేశారు. ‘‘మహాతల్లి.. మహానుభావుడు’’ అనే లఘు చిత్రంలో నటించారు. ఆ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాదు ‘‘మహాతల్లి’’ యూట్యూబ్‌ చానెల్‌నూ స్ట్రీమ్‌ లైన్‌ చేసింది. ‘‘ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడమంటే నాకు చాలా ఇష్టం. అయితే అదంత ఈజీ కాదు. కష్టపడితేనే కదా ఫలితం దక్కేది’’ అని ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు జాహ్నవి.

మై విలేజ్‌ షో..
పేరు వినగానే ‘‘అనిలూ.. ఓ అనిలూ’’ అనే డైలాగ్, దాన్ని పలికే మిల్కూరి గంగవ్వే గుర్తొస్తుంది. స్వచ్ఛమైన తెలంగాణ యాస ఆమె ప్రత్యేకత. చదువురాదు.. కాని అలవోకగా డైలాగ్స్‌ చెప్పగలరు. ‘‘మై విలేజ్‌ షో’’ సక్సెస్‌లో గంగవ్వది ప్రధాన భాగస్వామ్యం అంటారు ఆ షో నిర్వాహకులు, టెక్నీషియన్స్, యాక్టర్స్‌ శ్రీకాంత్, అనిల్‌. గ్రామీణ జీవితం మీద వస్తున్న యూట్యూబ్‌ తెలుగు షో ‘మై విలేజ్‌ షో’. అందులోని ఆమె నటనకు తెలుగు లోగిళ్లన్ని జోహార్లు పలుకుతున్నాయి. ఆమె సొంతూరైన జగిత్యాల జిల్లా, మల్యాల మండలంలోని లంబాడి పల్లి... ఆమెను చూడ్డానికి వచ్చే అభిమానులతో ఓ పర్యాటక కేంద్రంగా మారిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. యూట్యూబ్‌ స్టార్‌ కాకముందు ఆమె ఓ వ్యయసాయ కూలి. ముగ్గురు పిల్లలు. పెళ్లిళ్లు అయిపోయాయి. వాళ్లమ్మ నటనాచాతుర్యం, పేరుప్రఖ్యాతులకు ముచ్చటపడ్తున్నారు పిల్లలు. అన్నట్టు మిల్కూరి గంగవ్వకు సినిమా అవకాశాలూ వచ్చాయి.. మల్లేషం, ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రాల్లో. ‘‘నన్ను చూసేటందుకు హైద్రవాద్, దుబాయ్, మస్కట్‌ కెంచి వస్తుండ్రు. సంతోషంగా ఉంటది కదా మరి’’ అంటారు గంగవ్వ.

అత్తాకోడళ్ల నుంచి జబర్‌దస్త్‌ దీవెన దాకా..
యోధ.. అనగానే రమ్య, వీళ్లద్దరూ నటించిన  ‘‘అత్తాకోడళ్లు’’ అనే యూట్యూబ్‌ చానెల్‌ షో జ్ఞాపకమొస్తుంది. నాలుగేళ్ల కిందటి ముచ్చట ఇది. అప్పటికి ఈ ఇద్దరి వయసు పదేళ్లలోపే. రమ్య గడసరి అత్తగా, యోధ సొగసరి కోడలుగా.. అత్తాకోడళ్ల ఇష్యూస్‌ మీద పదుల సంఖ్యలో షోలు చేశారు. అందరినీ అలరించారు. ఇంటింటా అభిమానులను సంపాదించుకున్నారు. ఆరవ తరగతి చదువుతున్న యోధ ఇప్పుడు సినిమాలు, టీవీ షోస్‌తో బిజీ అయిపోయింది. అయినా యూట్యూబ్‌ చానెల్‌ షోస్‌ను వదల్లేదు. ఏ కొంచెం విరామం దొరికినా ‘జబర్‌దస్త్‌ దీవెన’ పేరు మీద షోస్‌ చేస్తూనే ఉంది. ఈ జబర్‌దస్త్‌ దీవెన ఎవరు? జబర్‌దస్త్‌లో రాకింగ్‌ రాకేశ్‌ టీమ్‌లో యోధాతోపాటు ఉన్న చిన్నమ్మాయి. ఈ అమ్మాయీ యూట్యూబ్‌ లిటిల్‌ స్టారే. ఈ ఇద్దరూ కలిసి ‘‘స్మాల్‌ కిచెన్‌’’, గేమ్స్, కొన్ని ఫన్నీ షోస్‌ చేస్తున్నారు. వీళ్ల చానెల్‌కు దాదాపు 60 వేల వరకు సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. ‘‘కెమెరా అంటే ఇష్టం మాకు. మేం ఆడుతున్నా.. పాడుతున్నా.. బొమ్మలు గీస్తున్నా.. అన్నట్టు నేను బొమ్మలు కూడా వేస్తాను.. అన్నిటినీ వీడియోలుగా కాన్సెప్ట్స్‌గా చేసి యూట్యూబ్‌లో పెడ్తూంటా’’ అంటుంది యోధ.

దేశంలోనే టాప్‌..
నిషా మధులిక... మొదట్లో వంటల బ్లాగ్‌ రాసేవారు. తన అభిమానుల కోరిక మేరకు 2011లో, తన యాభై అయిదవ యేట యూట్యూబ్‌ చానెల్‌ను ప్రారంభించారు. టెక్నాలజీ అంటే యూత్  అనే అర్థాన్ని తిరగరాశారు.  ఎంతోమంది గృహిణులకు స్ఫూర్తిగా నిలిచారు.

ప్రజక్తా కోలీ... తొలుత రేడియో జాకీ. తర్వాత  యూట్యూబ్‌ కామిక్‌ చానల్‌ను మొదలుపెట్టారు. రాజకుమారి, రెక్కల గుర్రం, గ్రీకు వీరుడు అంటూ నమ్మశక్యంకాని కథలు చెప్పకుండా రోజూవారి జీవితంలోని సంఘటనలనే కథలుగా మలిచి చెప్తుంటారు. ఈమె కథలకు చెవులు కోసుకునే వాళ్లే కాదు.. కళ్లప్పగించే వాళ్లూ లక్షల్లో ఉన్నారు.

త్రిష... యూట్యూబ్‌లో ఇంటి చిట్కాల చానెల్‌ను నడుపుతున్నారు. వంటింట్లోని వస్తువులతోనే చిట్కాలు చెప్తారు ఆమె. వీటికి ఎంత డిమాండ్‌ అంటే చానెల్‌ పెట్టిన యేడాదిలోపే పదిహేడు లక్షల మంది సబ్‌స్కైబర్స్‌ అయ్యారు.

కోమల్‌ పాండే... ఫ్యాషన్‌ చానెల్‌ను రన్‌ చేస్తారు. షాపింగ్‌ జోలికి పోకుండా ఇదివరకే బీర్వాలో మూలుగుతున్న దుస్తులతో అప్‌డేట్‌గా ఎలా ముస్తాబవచ్చో చెప్తారు. ఆమె ‘రీ సైకిల్డ్‌ ఫ్యాషన్‌’ వీడియోస్‌ మంచి ఫాలోయింగ్‌ ఉంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటింటా ప్రతిభావంతులే! అందుకే వీళ్లంతా మనింట్లోవాళ్లుగానే అనిపిస్తారు. వీళ్లు తీసుకునే థీమ్స్‌ కూడా ఎప్పుడో ఒకప్పుడు మనకు తారసపడ్డవే.. తారసపడేవిగానే ఉంటాయి. కాబట్టే అంత కనెక్టివిటీ! కనుకే.. మనింటి తారలుగా వెలుగుతున్నారు. ఒక ఐడియా మన టాలెంట్‌ను బయటకు తెచ్చి.. జీవితాన్ని మార్చి యూట్యూబ్‌ స్టార్‌ని చేయొచ్చు. దాన్ని ఫ్రేమ్‌ చేయడానికి సెల్‌ఫోన్‌ కెమెరా చాలు.. ప్రదర్శించడానికి యూట్యూబ్‌ థియేటర్‌ ఉండనే ఉంది. డిస్ట్రిబ్యూటర్స్‌ లాంటి గొడవ, పైసా ఖర్చు లేకుండా రాబడినీ పొందొచ్చు. ఆలస్యం ఎందుకు? మీరూ స్టార్లయిపోవచ్చు. రెడీ.. యాక్షన్‌!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top