సాధనతో స‘ఫలం’ | yoga special | Sakshi
Sakshi News home page

సాధనతో స‘ఫలం’

Feb 15 2017 11:00 PM | Updated on Sep 5 2017 3:48 AM

సాధనతో స‘ఫలం’

సాధనతో స‘ఫలం’

మరో జీవికి జన్మనిచ్చే సమయంలో గర్భిణుల్లో ఎన్నో సందేహాలు, ఎన్నో అపోహలు. అలాంటి సందేహాల్లో యోగ సాధన చేయవచ్చా?

యోగా

మరో జీవికి జన్మనిచ్చే సమయంలో గర్భిణుల్లో ఎన్నో సందేహాలు, ఎన్నో అపోహలు. అలాంటి సందేహాల్లో యోగ సాధన చేయవచ్చా? చేస్తే ఎంత కాలం చేయవచ్చు? నిండు గర్భిణిగా ఉండి కూడా చేయవచ్చా? ఇలాంటి విషయాల్లో చాలా మందికి సరైన అవగాహన లేదు. ఆసనాల సాధన చేయవచ్చునని కొందరు, చేయకూడదని కొందరు అంటుండడంతో... గర్భిణులు అయోమయానికి లోనవుతున్నారు. అయితే నవమాసాలు నిండి పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు యోగా చేయడం చాలా అవసరం.  గర్భం దాల్చక ముందు యోగ సాధన అలవాటు ఉన్నవారు లేదా అప్పుడే ప్రారంభిస్తున్నవారు కూడా చేయవచ్చు. చేయాలి కూడా. అదెలా అంటే...

విభజించుకుని...
నవమాసాలు పూర్తయ్యేవరకూ యోగా చేయవచ్చు. అయితే దీనిని 3 రకాలుగా విభజించుకోవాలి. గర్భం దాల్చిన తొలి త్రైమాసికంలో (3నెలల్లో) మామూలు ఆసనాలు సాధన చేయవచ్చు. ఆ తర్వాత రెండవ త్రైమాసికంలో కాస్త తేలికపాటి ఆసనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక చివరిదైన... మూడవ త్రైమాసికంలో బాగా సులభంగా ఉండేవి మాత్రమే చేయాలి. అయితే ఆసనాలు వేసేటప్పుడు ఏదైనా ఆధారాన్ని వినియోగించుకోవాలి. గోడ లేదా కుర్చీ, లేదా దిండ్లును గాని సపోర్ట్‌గా ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... బోర్లా పడుకుని చేసే ఆసనాలు మాత్రం నిషిద్ధం.

చేయదగిన ఆసనాలేవి?
నిలబడి చేసే ఆసనాల్లో తాడాసన, వృక్షాసన, కటి చక్రాసన, ఉత్కటాసన, అర్ధ చంద్రాసన, సాధారణ త్రికోణాసన, వీరభధ్రాసన వేరియంట్‌ 1, వేరియంట్‌2 లు చేయవచ్చు.

► కూర్చుని చేసే వాటిలో స్వస్తికాసన, కటి చక్రాసన, వక్రాసన, భద్రకోణాసన (బటర్‌ ఫ్లై), భరధ్వాజాసన, పక్కవైపునకు వంగి చేసి వికృష్ట జానుశిరాసన చేయాలి.

► అరచేతులు, మోకాలి మీద నిలబడి చేసే ఆసనాల్లో (నీల్‌ డవున్‌ పోస్చర్స్‌) మార్జాలాసన, వ్యాఘ్రవాలచాలన, బాలాసన, అర్ధ అథోముఖ శ్వానాసన, ప్రసారిత మార్జాలాసన వంటివి సూచించదగ్గవి.

►వెల్లకిలా పడుకుని చేసే ఆసనాల్లో సేతుబంధాసన, మోచేతులు నేలపై ఆధారంగా ఉంచి మోకాళ్లు వంచి 40డిగ్రీల యాంగిల్‌లో చేసే విచిత్ర కర్ణి, 90 డిగ్రీల యాంగిల్‌లో చేసే విపరీత కర్ణి, సర్వాంగాసన వంటివి చేయదగినవి.

మరికొన్ని సూచనలు...
►కాళ్లు కంఫర్టబుల్‌గా, సుఖవంతంగా ఎడంగా ఉంచి, మోకాలిని మడిచి, కటి ప్రదేశం, పొత్తికడుపు భాగాలు ఓపెన్‌ అయ్యేట్టుగా రిలాక్స్‌ చేస్తూ సాధన చేయడం చాలా ముఖ్యం.

►ఎటువంటి అలసటా ఫీలవకుండా ఉండాలి. కేవలం కండరాలని, టిష్యూలను లిగమెంట్స్, జాయింట్స్‌ అన్నీ రిలాక్స్‌ చేయడానికి  చేసే యోగసాధన ఉపయోగపడాలి.

►ముఖ్యంగా పొట్ట భాగంపై ఏ మాత్రం ఓత్తిడి లేకుండా అక్కడి కండరాలు రిలాక్స్‌ అవుతూ సున్నితంగా మసాజ్‌ అయ్యేలా ఆసనాల సాధన ఉండాలి.

ఉపయోగాలు...
గర్భిణులు యోగ సాధన చేయడం వల్ల నార్మల్‌ డెలివరీకి అవకాశాలు పెరుగుతాయి. ఇది ఇప్పటికే ప్రయోగాత్మకంగా రుజువు చేయడం జరిగింది. పాశ్చాత్యదేశాల్లోనే దీనిని బాగా అనుసరిస్తున్నారు. ప్రసవానికి ముందు చేసే  ప్రీ నాటల్‌ యోగా, ప్రసవానంతరం చేసే పోస్ట్‌ నాటల్‌ యోగాలను  పాశ్చాత్యులు బాగా అనుసరిస్తున్నారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే కొన్ని యోగా సెంటర్లలో అవగాహన కలిగిస్తున్నారు. సమన్వయం: సత్యబాబు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement