నిశ్శబ్దంతో పాటు అపోహలనూ ఛేదించండి


 హెచ్‌ఐవీపై అపోహలూ, వాస్తవాలు...

 హెచ్‌ఐవీ కంటే భయంకరమైనవి, అంతకంటే ప్రాణాంతకమైనవి ఎన్నో వ్యాధులు ఉన్నాయి. కానీ బహుశా వాటి పట్ల కూడా లేని ఎన్నో భయాలు, ఇంకెన్నో ఆందోళనలూ, మరెన్నో అపోహలు హెచ్‌ఐవీ పట్ల ఉన్నాయన్నది నికార్సయిన సత్యం. నిజానికి హెచ్‌ఐవీ అన్నది పూర్తిగా నియంత్రించదగ్గ వ్యాధిగా మారి చాలా రోజులైంది. ఉదాహరణకు డయాబెటిస్‌ను పూర్తిగా తగ్గించలేకున్నా మందులు వాడుతూ ఎప్పటికీ అదుపులో ఉంచగలిగినట్లే... హెచ్‌ఐవీకి కూడా మందులు వాడుతూ జీవితాంతం అదుపులో ఉంచుకుంటూ, పూర్తి జీవితకాలం బతకవచ్చు. అయినప్పటికీ దాని పట్ల ఉన్న అనేక అపోహల కారణంగా జీవితంలో ఎప్పటికీ తగ్గించలేని వివక్ష హెచ్‌ఐవీ రోగుల పట్ల ఉంది. నేడు ప్రపంచ హెచ్‌ఐవీ దినం సందర్భంగా హెచ్‌ఐవీ పట్ల ఉన్న అనేక అపోహలూ, వాస్తవాలపై కథనం.

 

 హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవీ) అని పిలిచే ఈ వైరస్ మన వ్యాధి నిరోధక వ్యవస్థను దెబ్బతిస్తుంది. ఈ వైరస్ మన వ్యాధి నిరోధక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఏ చిన్న వ్యాధినీ నిరోధించలేని స్థితిని కలిగితే ఆ దశను ‘ఎయిడ్స్’ అంటారు. ఇది సురక్షితం కాని సెక్స్ వల్ల, వ్యాధిబారిన పడ్డ వారి రక్తాన్ని ఎక్కించడం వల్ల, తల్లి నుంచి బిడ్డకు అనే మూడు మార్గాల ద్వారానే వ్యాపిస్తుంది. ఇతరత్రా ఎలాంటి మార్గాల ద్వారా అది వ్యాపించదు. అయినప్పటికీ హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రోగుల పట్ల ఎంతో వివక్ష కొనసాగుతోంది. ఉదాహరణకు వారితో కరచాలనం చేయడానికి సైతం ఒప్పుకోలేనంతగా అపోహలు మనలో వ్యాపించి ఉన్నాయి. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పట్ల ఉన్న అనేక అపోహలూ, వాస్తవాలను తెలుసుకుందాం.

 

 అపోహ: మన మధ్య హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రోగులు ఉంటే చాలు... ఆ వ్యాధి మనకు సంక్రమిస్తుంది.

 వాస్తవం: అది కేవలం అపోహ మాత్రమే. హెచ్‌ఐవీ అన్నది వ్యాధి ఉన్నవారితో సెక్స్ చేయడం, వారి రక్తాన్ని స్వీకరించడం ద్వారా తప్ప మరింకే మార్గంలోనూ వ్యాపించదు. హెచ్‌ఐవీ రోగులు ఉన్న ప్రాంతంలో మనం శ్వాసించడం వల్ల గాలి ద్వారా అది మనకు సంక్రమించదు. వారిని హత్తుకున్నా, కరచాలనం చేసినా అది మనకు రాదు. హెచ్‌ఐవీ రోగులు వాడిన టాయిలెట్ సీట్లపై మనం కూర్చున్నా, లేదా వారు ముట్టుకున్న డోర్ నాబ్, హ్యాండిల్స్‌ను ఆ తర్వాత మనం వాడినా ఎయిడ్స్ రాదు. వారితో కలిసి భోజనం చేసినా హెచ్‌ఐవీ వ్యాప్తి చెందదు.

 

 అపోహ:
హెచ్‌ఐవీ ఉన్న రోగిని కుట్టిన దోమ మళ్లీ మనల్ని కుడితే మనకు వ్యాధి వస్తుంది.

 వాస్తవం: ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. నిజానికి ఒక హెచ్‌ఐవీ రోగిని దోమ కుట్టాక, అది మనల్ని కుడితే, అది తాగిన రక్తాన్ని మనలోకి ఎంతమాత్రమూ ఎక్కించదు. అది మన రక్తాన్ని పలచబార్చడం కోసం కేవలం తన లాలాజలాన్ని మాత్రం ఎక్కించి, ఆ తర్వాత మళ్లీ మన రక్తం తాగుతుంది. ఇలా దోమ ద్వారా ఎయిడ్స్ వ్యాపించిన కేసు ఇప్పటికి ఒక్కటి కూడా నమోదు కాలేదు.

 

 అపోహ: మనం హెచ్‌ఐవీ లేదా ఎయిడ్స్ రోగిని చూడగానే అతడికి వ్యాధి ఉన్నట్లు గుర్తించగలం.

 వాస్తవం: ఇది ఎంత మాత్రమూ నిజం కాదు. ఎందుకంటే ఎయిడ్స్ రోగుల లక్షణాలూ అందరిలోనూ ఒకేలా ఉండవు. అయితే హెచ్‌ఐవీ సోకిన తర్వాత, అది మనలో వ్యాధినిరోధకశక్తిని పూర్తిగా నశింపజేసే ఎయిడ్స్ దశకు చేరడానికి ఎంతోకాలం పడుతుంది. అప్పటివరకూ (ప్రత్యేకంగా వ్యాధి నిర్ధారణకు చేయించాల్సిన రక్తపరీక్ష చేయించుకుంటే తప్ప) ఎవరికైనా వ్యాధి ఉన్న సంగతే తెలియదు.

 

 అపోహ: హెచ్‌ఐవీ సోకగానే అది వేగంగా ఎయిడ్స్ దశకు తీసుకెళ్తుంది.

 వాస్తవం: హెచ్‌ఐవీ సోకగానే అది ఎయిడ్స్ దశకు చేరదు. నిజానికి హెచ్‌ఐవీ సోకిన తర్వాత చికిత్స తీసుకుంటూ, డాక్టర్ చెప్పిన మార్గదర్శకాలనూ, నిబంధనలనూ పాటిస్తూ మందులు వాడుతుంటే అది ఎప్పటికీ ఎయిడ్స్ దశకు చేరకపోవచ్చు కూడా. ఒకవేళ హెచ్‌ఐవీ సోకిన వారు వాడాల్సిన యాంటీరిట్రోవైరల్ మందులు తీసుకునే చికిత్స తీసుకోకపోతే కొన్నేళ్ల తర్వాత మాత్రమే అది ఎయిడ్స్ దశకు చేరుతుంది. కాబట్టి యాంటీరెట్రోవైరల్ మందులు వాడుతూ ఉంటే వారు ఎప్పటికీ ఎయిడ్స్ బారిన పడరు.

 

 అపోహ: హెచ్‌ఐవీ అన్నది కేవలం హోమోసెక్సువల్ అలవాటు ఉన్నవారికీ, సెక్స్ వర్కర్లకూ, మాదకద్రవ్యాల(డ్రగ్స్)ను నరంలోకి తీసుకునే వారికి మాత్రమే వస్తుంది. కాబట్టి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అంటే ఒకరికి హెచ్‌ఐవీ సోకిందంటే వారు పైన పేర్కొన్న వర్గాలకు మాత్రమే చెందుతారని అర్థం.

 వాస్తవం: పై విషయం అర్ధ సత్యం మాత్రమే. పైన పేర్కొన్న మూడు వర్గాలూ హెచ్‌ఐవీకి అత్యధిక రిస్క్ ఉన్నవారే అయినప్పటికీ మిగతావారంతా సురక్షితం అని కాదు అర్థం. ఒకవేళ మనం పైన పేర్కొన్న మూడు వర్గాలకు చెందకపోయినా, పొరబాటున ఎవరిదైనా కలుషితమైన రక్తం (హెచ్‌ఐవీ ఇన్ఫెక్టెడ్ బ్లడ్) ఎక్కించిన పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన వ్యక్తి, పైన పేర్కొన్న మూడు వర్గాలకు చెందకపోయినా హెచ్‌ఐవీ సోకవచ్చు.

 

 అపోహ: ఒకవేళ హెచ్‌ఐవీ సోకితే... కొంతకాలం దానికి సంబంధించిన మందులు వాడాక వాటిని మానేయవచ్చు.

 వాస్తవం: ఇది వాస్తవం కాదు. నిజానికి హెచ్ ఐవీకి వాడే మందులు చాలా ప్రభావితమైనవి. వాటివల్ల వచ్చే కొన్ని సైడ్‌ఎఫెక్ట్స్ కారణంగా వాటిని  కొంతకాలం డాక్టర్లు ఆపేస్తే ఆపవచ్చు. కానీ అలా ఆపడం అన్నది వ్యాధి మళ్లీ పుంజుకోడానికి దోహదపడవచ్చు. అందుకే డాక్టర్ల సలహా లేకుండా మందులు వాడటం ఆపకూడదు.

 

 అపోహ: ఓరల్ సెక్స్ సురక్షితం. కాబట్టి దాని ద్వారా హెచ్‌ఐవీ రాదు.

 వాస్తవం: ఓరల్ సెక్స్ ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించడానికి అవకాశాలు తక్కువే అయినా, పూర్తిగా సురక్షితమని చెప్పడానికి లేదు. ఎందుకంటే వ్యాధి సోకిన వారిలోగాని లేదా వారి పార్ట్‌నర్‌లో గాని నోటిలో ఏవైనా గాయాలున్నా, ఎదుటివారి రహస్యాంగాల్లో ఏవైనా కనిపించనంత చిన్న గాయాలు, పుండ్లు ఉన్నా... వాటి ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించడానికి అవకాశాలు ఉన్నాయి.

 

 అపోహ: హెచ్‌ఐవీ అన్నది కేవలం సెక్స్ ద్వారానే వ్యాపిస్తుంది.

 వాస్తవం: ఇది పూర్తిగా తప్పుడు అభిప్రాయం. హెచ్‌ఐవీ వ్యాప్తికి సెక్స్ ఒక కారణం. అంతేగాని సెక్స్ ద్వారా మాత్రమే అది వ్యాప్తి చెందదు. ఉదాహరణకు ఆసుపత్రిలో హెచ్‌ఐవీ సోకిన వారికి చేసిన ఇంజెక్షన్ సూది గుచ్చుకోవడం, పచ్చబొట్టు వేయడానికి వారికి ఉపయోగించిన సూదులనే మళ్లీ ఇతరులకు ఉపయోగించడం, తల్లికి హెచ్‌ఐవీ ఉంటే... ఆ చనుబాలు తాగడం వల్ల బిడ్డకు రావడం వంటి కారణాలతోనూ హెచ్‌ఐవీ రావచ్చు. కాబట్టి హెచ్‌ఐవీ సోకిన ప్రతివారికీ అది సామాజికంగా అనుమతించని సెక్స్ వల్లనే వచ్చిందని భావించడం సరికాదు. అలా వారిపట్ల వివక్షతో కూడిన ధోరణిని ప్రదర్శించడమూ సరికాదు.

 

 అపోహ: కొన్ని వైద్యవిధానాల్లో హెచ్‌ఐవీని తగ్గించడానికి మందులు ఉన్నాయి.

 వాస్తవం: ఇప్పటికి ఏ వైద్యవిధానంలోనూ హెచ్‌ఐవీని పూర్తిగా తగ్గించి, నయం చేసే మందు ఇంకా అందుబాటులో లేదు.

 

 అపోహ: గర్భనిరోధానికి వాడే డయాఫ్రమ్స్, సర్వికల్ క్యాప్స్, స్పాంజెస్, స్పెర్మిసైడ్స్, డెపో ప్రోవేరా, నార్‌ప్లాంట్, లేదా గర్భనిరోధక పిల్స్ అన్నవి హెచ్‌ఐవీని కూడా నిరోధిస్తాయి.

 వాస్తవం: పైన గర్భనిరోధక సాధనాలన్నీ కేవలం అవాంఛిత గర్భాన్ని రాకుండా చేసేవే. అంతేగాని సెక్స్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను, హెచ్‌ఐవీని పూర్తిగా నిరోధించిన దాఖలాలు లేవు. కాకపోతే పైవి వాడుతున్న సందర్భాల్లోనూ పురుషులు కండోమ్ వాడటం వల్ల ఇతర సెక్స్‌వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు (ఎస్‌టీడీ)లతో పాటు హెచ్‌ఐవీని వ్యాప్తిచెందకుండా అరికట్టవచ్చు. అయితే పెళ్లికాక ముందు బ్రహ్మచర్యం పాటించడం, పెళ్లయ్యాక కేవలం జీవిత భాగస్వామికే పరిమితం కావడం అన్నవి హెచ్‌ఐవీని నిరోధించడానికి మంచి మార్గాలు.

 

 తస్మాత్ జాగ్రత్త..!

 అపోహ: ముద్దులతో హెచ్‌ఐవీ వ్యాప్తి చెందదు.

 వాస్తవం: ముద్దులతో హెచ్‌ఐవీ వ్యాప్తి చెందదన్నమాట వాస్తవమే అయినా పూర్తిగా నమ్మదగినది కాదు. హెచ్‌ఐవీ వైరస్ శరీర ద్రవాలలో ఉంటుందన్నమాట వాస్తవం. కాబట్టి లాలాజలంలోనూ ఉండటానికి అవకాశం ఉంది. అయితే లాలాజలం వల్ల వ్యాప్తి చెందే అవకాశం తక్కువ. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే పొడి ముద్దుల వల్ల హెచ్‌ఐవీ వ్యాప్తి చెందే అవకాశం లేదు. కాని ఒకవేళ లాలాజల మార్పిడి చాలా ఎక్కువగా జరిగేలా గాఢమైన చుంబనాలు జరిపినా, లేదా పార్ట్‌నర్ నోటిలో ఏవైనా కనిపించనంత చిన్న కురుపులు, గాట్లు ఉన్నా హెచ్‌ఐవీ వ్యాప్తిచెందేందుకు అవకాశం ఉంది. కాబట్టి గాఢ చుంబనాలకు బదులు పొడిముద్దులకు పరిమితం కావడం మంచిది.

 

 నిర్వహణ: యాసీన్

 

 భవిష్యత్తులో వ్యాక్సిన్ రూపొందితే..?

 అపోహ : భవిష్యత్తులో హెచ్‌ఐవీకి వ్యాక్సిన్ కనుగొంటే, అప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నవారికి పొరబాటున హెచ్‌ఐవీ వచ్చే అవకాశం ఉండదా?

 వాస్తవం: కొన్ని వ్యాక్సిన్లలో అత్యంత బలహీనంగా ఉన్న వ్యాధికారక క్రిమిని వాడటం వల్ల అలా రూపొందించిన పోలియో వంటి వ్యాక్సిన్ల ద్వారా కొందరికి ఆ వ్యాధి సోకి ఉన్నందున కొందరిలో ఇలాంటి సందేహం రావడం సహజం. కానీ హెచ్‌ఐవీ వ్యాక్సిన్ రూపొందితే అలా జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే... ఇందులో హెచ్‌ఐవీ తరహాలో కనిపించే దాని నకలును వాడతారు తప్ప... వాస్తవంగా హెచ్‌ఐవీ కారక వైరస్‌ను కాదు. ఉదాహరణకు ఫొటోస్టాట్ కాపీ ఒరిజినల్ కాలేనట్లే... ఈ హెచ్‌ఐవీ నకలు కాపీ వ్యాధికి కారణం కాబోదు. వ్యాక్సిన్ రూపొందించే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 30,000 మంది వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చారు.  అయితే ఇందులో ఏ ఒక్కరికీ హెచ్‌ఐవీ సోకలేదు.

 

 ఇంకా జీవితం ఉంది..!

 అపోహ: హెచ్‌ఐవీ సోకినవారికి ఇక జీవితం శూన్యం.

 వాస్తవం: హెచ్‌ఐవీని తొలుత గుర్తించిన రోజుల్లో అది సోకిన కొందరు మృత్యువాత పడ్డారు. కానీ హెచ్‌ఐవీపై నియంత్రణ సాధించగల యాంటీ రెట్రోవైరల్ మందుల ఆవిష్కారం తర్వాత హెచ్‌ఐవీ రోగులు సైతం అందరిలాగే దీర్ఘకాలం బతుకుతున్నారు. ఎప్పటిలాగే తమ పనులు తామే చేసుకోవడం, అందరిలాగే జీవించడం సాధ్యమైంది. హెచ్‌ఐవీ వైరస్‌ను కలిగి ఉండటం తప్ప... ఇంక వారి సామాజిక జీవితంలో ఎలాంటి  అవరోధమూ లేనంత నార్మల్‌గా బతకడం సాధ్యమే. కాబట్టి పై మాట పూర్తిగా అపోహ మాత్రమే.


డాక్టర్  గోవర్ధన్,

 సీనియర్ ఫిజీషియన్,

 కేర్ హాస్పిటల్స్,

 నాంపల్లి, హైదరాబాద్






 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top