స్త్రీలోక సంచారం

Womens empowerment:Aditi Rao Hydari on casting couch - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

భారతదేశంలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు గురయ్యే మహిళల సగటు వయసు పశ్చిమ దేశాలకన్నా దాదాపు దశాబ్దకాలం తక్కువగా ఉంటోందని, కొత్తగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బయట పడిన ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు మరణానికి చేరువవుతున్నారని నోయిడాలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ రిసెర్చ్‌’ తన తాజా నివేదికలో వెల్లడించింది! సైలెంట్‌ కిల్లర్‌లా విస్తరిస్తూ దేశంలో ప్రతి 8 నిముషాలకూ ఒక మహిళ గర్భాయ క్యాన్సర్‌తో మరణించడానికి కూడా కారణమౌతున్న పరిస్థితులపై తగిన అవగాహన కల్పించన ట్లయితే ఈ మరణాల సంఖ్య పెరిగిపోయే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.

► రుతుక్రమంపై ప్రాచీన కాలంలో మన దేశంలో ఉన్న అపోహల గురించి వింటే నవ్వొస్తుందని నటి రాధికా ఆప్టే అన్నారు. రుతుక్రమ పారిశుధ్య కథాంశంతో అక్షయ్‌ కుమార్, సోనమ్‌ కపూర్‌లతో కలిసి ఆప్టే నటించిన ‘ప్యాడ్‌ మాన్‌’ చిత్రం ఆగస్టు 12న టీవీలో ప్రసారం అవుతున్న సందర్భంగా ఆప్టే ఒక ప్రకటన విడుదల చేస్తూ.. రుతుక్రమం అనే ఒక ప్రకృతిసిద్ధమైన దేహధర్మం చుట్టూ అల్లుకున్న అపోహలతో పాటు, యువతుల్లో బిడియాన్నీ పోగొట్టేందుకు సమాజంలో మరిన్ని ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

► బిహార్, ముజఫర్‌ఫూర్‌లోని ఒక షెల్టర్‌ హోమ్‌లో మైనరు బాలికలపై జరిగిన అత్యాచారాలకు బాధ్యత వహిస్తూ బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తక్షణం రాజీనామా చేయాలని మంగళవారం నాడు ఢిల్లీలో అనేక పౌర సంఘాలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపాయి. ‘బేటీ బచావో బేటీ పఢావో’ కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్న కేంద్ర ప్రభుత్వం.. బిహార్‌తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను ఆపలేకపోతోందని చాణక్యపురిలోని బిహార్‌ భవన్‌ ఎదుట జరిగిన ఆందోళన కార్యక్రమంలో ‘నేషనల్‌ ఫెడరేషన్‌ ఫర్‌ ఇండియన్‌ ఉమె¯Œ ’ ప్రధాన కార్యదర్శి యానీ రాజా విమర్శించారు.

► మహిళలకు భారతదేశం సురక్షితమైన ప్రదేశం కాదని ప్రపంచ దేశాలన్నీ ఇక్కడికి వచ్చేందుకు విముఖత ప్రదర్శిస్తోంటే.. అమెరికన్‌ మోడల్, నటి అంబర్‌ రోజ్‌ మాత్రం ఎవరైనా తనను భారతదేశానికి ఆహ్వానిస్తే బాగుండునని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారట! గత ఏడాది భారత్‌లో పర్యటించి, హిప్‌హాప్‌ ప్రదర్శన ఇచ్చిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌ విజ్‌ ఖలీఫా.. ‘భారత్‌ తప్పక చూసి తీరవలసిన’ ప్రదేశం అని తనతో అన్నప్పటి నుంచీ ఆమె ఇండియా వచ్చేందుకు తహతహలాడిపోతున్నారట.

► కొన్నేళ్ల క్రితం ‘కాస్టింగ్‌ కౌచ్‌’ పై తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేసి, ఎనిమిది నెలల పాటు అవకాశాలను కోల్పోయిన అదితీరావ్‌ హైదరీ మళ్లీ ఈ టాపిక్‌పై నిక్కచ్చిగా మాట్లాడుతూ.. ‘ఇష్టం లేని పనిని ఎవరూ ఎవరి చేతా బలవంతంగా చేయించకూడదు’ అన్నారు. ‘సండే గార్డియన్‌’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో.. అవకాశాలను అశగా చూపించి, అమ్మాయిలను లోబరుచుకునే హీనమైన సంస్కృతిపై ఆమె తారస్థాయిలో విరుచుకుపడ్డారు.

► అమెరికా ప్రతిపక్ష ‘డెమొక్రాటిక్‌’ పార్టీ జాతీయ కమిటి సి.ఇ.వో.గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి భారతీయ సంతతి మహిళ సీమా నందా.. నవంబరులో జరగనున్న అత్యంత కీలకమైన మధ్యంతర ఎన్నికల్లో మూలమూలలా డెమోక్రాట్‌లే గెలిచేందుకు సర్వశక్తులను ఒడ్డుతానని ప్రతిజ్ఞ చేశారు. అమెరికా ఆత్మను తిరిగి ప్రతిష్ఠించేందుకు తను చేయబోతున్న పోరాటంలో విశ్రమించేది లేదని చెబుతున్న సీమ.. ‘డెమొక్రాటిక్‌ నేషనల్‌ కమిటీ’కి సారథ్యం వహించేందుకు తనకు లభించిన అవకాశాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.

► చైనాలోని బ్రిటిష్‌ విదేశాంగ కార్యదర్శి జెరెమీ హంట్‌.. బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగీతో కలిసి పాల్గొన్న దౌత్య అధికారుల సమావేశంలో జెరెమీ హంట్‌ పొరపాటున తన భార్య లూసియా గొవో జపాన్‌ సంతతి మహిళ అని చెప్పడం విశేషవార్త అయింది! ఆయన పొరపాటుగానే అన్నప్పటికీ.. చైనా, జపాన్‌ దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సైనిక వైరాల కారణంగా.. వెంటనే తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ, ‘నా భార్య చైనా దేశస్థురాలు, నా పిల్లలు సగం చైనా సంతతి వారు. వారి అమ్మమ్మ, తాతయ్య కూడా చైనా వాళ్లే’ అని పనిగట్టుకుని చెప్పవలసి వచ్చింది.

► ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో కూర్చుని ఉన్న మహిళా ఎంపీల మధ్య.. ఎవరు చక్కగా డ్రెస్‌ చేసుకున్నారనే చర్చ వచ్చినప్పుడు మొదటి రెండు స్థానాల్లో సోనియాగాంధీ, సుప్రియా సూలె నిలిచారని ప్రముఖ ఆంగ్ల జాతీయ దిన పత్రిక ఒకటి పేర్కొంది! ఉత్తరప్రదేశ్‌లోని మధుర ఎంపీ హేమమాలిని కూడా వారి మధ్యలో కూర్చొని ఉన్నప్పటికీ, సినీ నటి కనుక వారు ఆమెను పరిగణనలోకి తీసుకోలేదని చెబుతూ, మహరాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సుప్రియ గత నాలుగేళ్లుగా కట్టిన చీర కట్టడం లేదని ఒక సభ్యురాలు అన్నారని ఆ పత్రిక రాసింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top