అరవై దాటాక.. నడిపించే కాన్ఫిడెన్స్ | Sakshi
Sakshi News home page

అరవై దాటాక.. నడిపించే కాన్ఫిడెన్స్

Published Mon, May 16 2016 11:16 PM

అరవై దాటాక..   నడిపించే కాన్ఫిడెన్స్

ఉమెన్ ఫైనాన్స్ /  అటల్ పెన్షన్ యోజన

 

ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలో ఒక నిర్ణీత మొత్తాన్ని ప్రతి నెలా తప్పనిసరిగా పింఛను రూపేణా పొందాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ‘అటల్ పెన్షన్ యోజన’ పథకాన్ని 2015-2016 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది. అసలు ఏమిటీ పథకం. వివరాలు చూద్దాం.18 సంవత్సరాలు మొదలుకొని 40 సంవత్సరాల వరకు ఈ పథకంలో చేరవచ్చు.  చేరిన దగ్గర్నుంచి 60 సం. వయసు వచ్చే వరకు చందా చెల్లించవలసి ఉంటుంది.ఈ పథకంలో వెయ్యి మొదలుకొని, ఐదు వేల రూపాయల వరకు (వెయ్యి, రెండు వేలు. మూడు వేలు... ఇలా) గ్యారెంటీ పెన్షన్ ఎంత కావాలో ఆ మొత్తాన్ని ఎంచుకోవచ్చు.


చందా అనేది ఖాతాదారుడు ఈ పథకంలో చేరే నాటికి ఉన్న వయసు, ఎంచుకునే గ్యారెంటీ పెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఖాతాదారుని వయసు 18 సం. అయితే 1000 రూపాయల గ్యారెంటీ పెన్షన్‌కు ప్రతి నెలా 42 రూపాయలు చెల్లించాలి. అదే 5000 రూపాయల గ్యారెంటీ పెన్షన్ కావాలంటే ప్రతి నెలా 210 రూపాయలు చెల్లించాలి. ఒకవేళ ఖాతాదారుని వయసు 35 సం. అయితే వెయ్యి రూపాయల గ్యారెంటీ పెన్షన్‌కు ప్రతి నెలా 181 రూపాయలు, అదే ఐదు వేల రూపాయల గ్యారెంటీ పెన్షన్ అయితే ప్రతి నెలా 902 రూపాయలు చెల్లించాలి.

     
చందాను నెలవారీ, 3 నెలలకు లేదా 6 నెలలకు ఒకసారి కట్టే సదుపాయం ఉంది. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని ప్రభుత్వం వారు సూచించిన పెట్టుబడి సూత్రాలకు అనుగుణంగా పి.ఎఫ్.ఆర్. డి.ఎ. (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) చేత నియమితులైన పెన్షన్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు.ఖాతాదారులకు పెట్టుబడి మార్గాలను లేదా పెన్షన్ ఫండ్ మేనేజర్లను ఎంచుకునే వెసులుబాటు లేదు.

 
ఖాతాదారులు 60 సం. వయసు నిండిన తర్వాత నుంచి ఎంత గ్యారెంటీ పెన్షన్ ఎంచుకుంటారో అంత మొత్తాన్ని ప్రతి నెలా పొందవచ్చు. అంతే కాకుండా చందా మొత్తం మీద రాబడి ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ పెన్షన్‌ని కూడా పొందవచ్చు. ఒక వేళ తక్కువ రాబడి ఉంటే కనుక గ్యారెంటీ పెన్షన్‌ను తగ్గించరు. ఆ మొత్తాన్ని కచ్చితంగా ఇస్తారు.

     
60 సం. నిండాక ఖాతాదారుడు మరణించినట్లయితే వారి భార్య /భర్త కు పెన్షన్ అంద జేస్తారు. ఒకవేళ ఇద్దరూ మరణించినట్లయితే ఖాతాదారునికి 60 ఏళ్లు వచ్చే వరకు జమ అయిన మూలనిధి మొత్తాన్ని నామినీకి అందజేస్తారు.60 సం. నిండకముందే ఖాతాదారుడు మరణించినట్లయితే వారి జీవిత భాగస్వామికి, ఖాతాదారునికి 60 ఏళ్లు వచ్చే వరకు చందా కట్టే వెసులుబాటు ఉంది. 60 సం. నిండాక గ్యారెంటీ పెన్షన్‌ను జీవిత భాగస్వామి మరణం వరకు పొందవచ్చు.  ఒకవేళ జీవిత భాగస్వామికి ఖాతాను పొడిగించే ఉద్దేశం లేకపోతే అప్పటి వరకు జమ అయిన మూలధన మొత్తాన్ని జీవిత భాగస్వామికి లేదా నామినీకి అందజేస్తారు.     ఈ పథకంలో ఖాతాదారుడు ఒకే ఒక ఖాతాని ప్రారంభించే అవకాశం ఉంటుంది. పెన్షన్ మొత్తాన్ని తగ్గించుకునే, పెంచుకునే సదుపాయం ఉంటుంది.


రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’

Advertisement
 
Advertisement
 
Advertisement