ఎవరమ్మా నువ్వు... పద్మావతీ! | who is this rani Padmavati ? | Sakshi
Sakshi News home page

ఎవరమ్మా నువ్వు... పద్మావతీ!

Feb 3 2017 10:51 PM | Updated on Sep 5 2017 2:49 AM

ఎవరమ్మా నువ్వు... పద్మావతీ!

ఎవరమ్మా నువ్వు... పద్మావతీ!

రాణీ పద్మావతి! అపురూప సౌందర్యవతి. రావల్‌ రతన్‌ సింగ్‌ భార్య.

రాణీ పద్మావతి! అపురూప సౌందర్యవతి. రావల్‌ రతన్‌ సింగ్‌ భార్య. రతన్‌సింగ్‌ రాజపుత్రుడు. 1302–03లో మేవార్‌ చక్రవర్తి. అదే టైమ్‌లో ఢిల్లీ చక్రవర్తి అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ. రాణీ పద్మావతి అందం గురించి విని ఉన్నాడు ఖిల్జీ. ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. మేవార్‌.. చిత్తోర్‌గఢ్‌ (ఇప్పటì  రాజస్థాన్‌) పరిధిలోకి వస్తుంది. చిత్తోర్‌గఢ్‌ను సొంత చేసుకుంటే మేవార్‌తో పాటు, పద్మావతీ తన సొంతం అవుతుంది. ఇదీ ఖిల్జీ ప్లాన్‌.

ఈలోపు దేవ్‌పాల్‌ అనే సామంతరాజు సేమ్‌ ప్లాన్‌ వేశాడు. రాణీ పద్మావతికి కోసం రతన్‌సింగ్‌ని చంపేశాడు. ఆ గ్యాప్‌లో ఖిల్జీ కూడా తనను అపహరించేందుకు వచ్చేస్తున్నాడని తెలిసి రాణీ పద్మావతి, ఆమె చెలికత్తెలు మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నిజానికి.. పద్మావతిని పెళ్లి చేసుకోడానికి ముందు రతన్‌సింగ్‌ కూడా ఒక ఖిల్జీనే, ఒక దేవ్‌పాలే! ఆ అమ్మాయి సింహళదేశపు రాజపుత్రిక. సూపర్‌గా ఉంటుందని పెంపుడు చిలక ద్వారా తెలుసుకుని, ఆమె కోసం అన్వేషించి మరీ పట్టి తెచ్చుకున్నాడు! పట్టుపట్టి పెళ్లి చేసుకున్నాడు.

ఈ స్టోరీ చరిత్రకారులెవ్వరికీ తెలీదు. చరిత్ర అయితే తెలిసి ఉండేది. ఇదొక ఫిక్షన్‌. మన బాలీవుడ్‌ డైరెక్టర్‌ సంజయ్‌లీలా బన్సాలీలాగే మాలిక్‌ మహ్మద్‌ జయసీ అనే కవి ఒకాయన ఉండేవాడు. 1540లో ఆయన దేవనాగరి భాషలో కొంచెం రియాల్టీని మిక్స్‌ చేసి ‘పద్మావతి’ అనే కావ్యఖండాన్ని సృష్టించాడు. ఆ సృష్టించడం కూడా డైరెక్టుగా ఖిల్జీ అని, పద్మావతి అని పేర్లు పెట్టకుండా సంకేతార్థాల్లో రాశాడు. ఎలాగంటే.. ‘మానవ దేహం’ అన్నాడు. అంటే చిత్తోర్‌గఢ్‌. ‘ఆత్మ’ అన్నాడు. అంటే రతన్‌సింగ్‌. ‘చిలక’ అన్నాడు. అంటే ఆధ్యాత్మిక గురువు. ‘వివేకం’ అన్నాడు. అంటే పద్మావతి. ‘భ్రాంతి’ అన్నాడు. అంటే అల్లావుద్దీన్‌ ఖిల్జీ. ఇలా అల్లిన కథంతా చాలా పొయెటిక్‌గా ఉంది. మహ్మద్‌ జయసీ తనకు రెండొందల ఏళ్లు ముందునాటి సంగతిని ఇలా ఊహించి రాస్తే, ఇప్పుడు బన్సాలీ తనకు ఐదొందల ఏళ్ల ముందునాటి మహ్మద్‌ జయసీ కావ్యాన్ని ‘కాస్త’ మార్చి సినిమాగా తీస్తున్నాడు.

అయితే అది ‘కాస్త’ కాదు. ‘ఎక్స్‌ట్రా’ అని రాజస్థాన్‌లోని హిందూసేనల ఆరోపణ. ‘ఎక్స్‌ట్రా’లు చేస్తే ఊరుకునేది లేదని బన్సాలీకి ఆ సేనలు వార్నింగ్‌ కూడా ఇచ్చాయి. లాగిపెట్టి రెండు చెంపదెబ్బలు కూడా! జయసీ కావ్యంలో రాణీ పద్మావతి తన స్వాభిమానాన్ని కాపాడుకోడానికి ఖిల్జీకి దక్కకుండా ఆత్మాహుతి చేసుకుంటే.. ఇక్కడ బన్సాలీ సినిమాలో పద్మావతి ఖిల్జీతో ప్రేమలో పడుతుంది. అదీ మన వాళ్ల కోపం. సహజమే కదా.

ఇదంతా ఇలా ఉంటే.. పద్మావతి కల్పిత పాత్ర అయినప్పుడు.. ఎలా తీస్తే ఏముందని ప్రొఫెసర్లు కొందరు వాదిస్తున్నారు. ఏళ్లుగా ఉన్న నమ్మకం.. అది కల్పితంలోంచి పుట్టినదే అయినా.. వాస్తవంగా స్థిరపడిపోయినప్పుడు వాదనలు పనిచేయవు. ప్రస్తుతానికైతే బన్సాలీ రాజస్థాన్‌ నుంచి బిచాణా ఎత్తేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement