కొవ్వును మార్చేస్తారు.. ఒళ్లు కరిగిస్తారు?

white fat that is harmful - Sakshi

శరీరంలో రెండు రకాల కొవ్వులుంటాయి. ఆరోగ్యకరమైన బ్రౌన్‌ఫ్యాట్‌ ఒకటైతే.. హాని కలిగించే తెల్లటి కొవ్వు ఇంకోటి. తెల్ల కొవ్వుతో సమస్యలెక్కువ. బోలెడంత శక్తిని ఠక్కున కరిగించేయగల శక్తి బ్రౌన్‌ఫ్యాట్‌ సొంతం. అంటే.. బ్రౌన్‌ఫ్యాట్‌ ఎక్కువ ఉంటే.. ఎంత తిన్నా ఒళ్లు మాత్రం చేయం అన్నమాట! దీనిర్థం.. ఊబకాయం రాదు.. మధుమేహం, గుండెజబ్బులు వంటివీ దూరంగా ఉంటాయి! అంతా బాగానే ఉంది కానీ.. ఈ బ్రౌన్‌ఫ్యాట్‌ను పెంచుకోవడం ఎలా? చాలా సింపుల్‌ అంటున్నారు కొలంబియా ఇంజినీరింగ్‌ శాస్త్రవేత్త సామ్‌ సియా! శరీరంలోంచి తెల్లకొవ్వు కొంత సేకరించి.. పరిశోధన శాలలో దాన్ని బ్రౌన్‌ఫ్యాట్‌గా మార్చేసి.. మళ్లీ శరీరంలోకి జొప్పిస్తే సరి అంటున్నారు సామ్‌. ఒక భాగంలోని కొవ్వును తీసి ఇంకోభాగంలోకి ఎక్కించడమనే ఫ్యాట్‌ గ్రాఫ్టింగ్‌ ప్రక్రియను ఇప్పటికే చాలామంది నిరపాయకరంగా చేస్తున్నారని, కొవ్వును మార్చి మళ్లీ చేర్చడం మాత్రమే తాము కొత్తగా ప్రతిపాదిస్తున్నామని వివరించారు. 

తెల్లకొవ్వును బ్రౌన్‌ఫ్యాట్‌గా మార్చే విషయంలో తాము ఇప్పటికే విజయం సాధించామని, వైద్యులు క్లినిక్‌లో చాలా సులువుగా చేయగల పద్ధతి ఇదని సామ్‌ తెలిపారు. బ్రౌన్‌ఫ్యాట్‌ను పెంచేందుకు శరీర భాగాలను విపరీతమైన చల్లదనానికి గురి చేయడం ఇంకో పద్ధతి కూడా అందుబాటులో ఉన్నప్పటికీ దీనివల్ల అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. పరిశోధన శాలలో ఎలుకల తెల్ల కొవ్వును బ్రౌన్‌ఫ్యాట్‌గా మార్చేక్రమంలో సామ్‌ బృందం దశలవారీగా పరిశీలనలు జరిపింది. మారుతున్న కొవ్వు ఆరోగ్యానికి మేలు చేసేదిగానే ఉందని నిర్ధారించుకున్న తరువాతగానీ దాన్ని మళ్లీ శరీరంలోకి ప్రవేశపెట్టలేదు. బ్రౌన్‌ఫ్యాట్‌ను సూచించే రసాయనాలు, మైటోకాండ్రియా ప్రక్రియలను నిర్ధారించుకున్న తరువాత మళ్లీ దాన్ని ఎలుకల్లోకి ప్రవేశపెట్టారు. రెండు నెలల తరువాత కూడా ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదు. ఎలుకల్లో జరిపిన ప్రయోగాలను తాము మనుషుల్లోనూ చేశామని, చర్మం అడుగున ఉండే తెల్లకొవ్వును సేకరించి పరిశోధన శాలలో బ్రౌన్‌ఫ్యాట్‌గా మార్చామని సామ్‌ వివరిస్తున్నారు. శరీరం బరువు తగ్గించేందుకు భవిష్యత్తులో ఇదో మెరుగైన పద్ధతి కావచ్చునని సామ్‌ అంచనా. రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించేందుకు, బరువు పెరక్కుండా చూసేందుకూ ఉపయోగపడవచ్చునని అంచనా. కొవ్వుతో కూడిన ఆహారం తీసుకుంటున్న ఎలుకలపై తమ పద్ధతి అంతగా పనిచేయలేదని సామ్‌ స్పష్టం చేశారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ పద్ధతి లాభనష్టాలను బేరీజు వేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top