మాతృత్వానికే అంబాసిడర్‌గా నిలిచిన మోడల్‌

US Model Give Breastfeed To Her Baby Over Ramp Walk - Sakshi

‘బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. తన చిన్నారి ఆకలి తీర్చడమే అమ్మకు ప్రధానం. తల్లి ఎక్కడ ఉన్న, ఏం చేస్తున్న ఆమె ఆలోచనలన్ని తన బిడ్డ చూట్టే తిరుగుతుంటాయి. పిల్లలు ఆకలితో ఏడిస్తే తల్లి పేగు కదులుతుంది. అంతే ఇంక ఆ సమయంలో ఏం ఆలోచించదు. వెంటనే బిడ్డ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తుంది. బిడ్డ ఆకలి తీర్చడానికి తల్లికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం చనుబాలు. కానీ నేటికి మన సమాజంలో మహిళలు బహిరంగంగా బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. కారణం చుట్టూ ఉన్న నలుగురు గురించి ఆలోచించి. కేవలం ఈ కారణం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తల్లి అయిన తర్వాత కొన్నేళ్లపాటు ఉద్యోగాలు మానుకుంటున్నారు. ఈ విషయంలో విచక్షణ లేని పశుపక్ష్యాదులే మనిషి కంటే మేలు. బిడ్డ ఆకలి తీర్చడంలో వాటికున్న స్వతంత్రలో కనీసం ఒక్క శాతాన్ని కూడా సమాజం మన తల్లులకు ఇవ్వడంలేదు’.

కానీ ఇప్పుడిప్పుడే మాతృమూర్తుల ఆలోచన ధోరణి మారుతుంది. ‘బిడ్డకు పాలు ఇ‍వ్వడం నా ధర్మం. తల్లిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. దీనికి సమాజం గురించి పట్టించుకోనవసరం లేదు’ అనుకుంటున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు ఈ అంశంపై దృష్టి సారిస్తున్నాయి. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే కాక, భారత్‌ లాంటి సనాతన దేశాల్లో కూడా ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది.

కొన్నాళ్ల క్రితమే ప్రముఖ కేరళ పత్రిక ‘మాతృభూమి’ తన గృహలక్ష్మి మ్యాగ్‌జైన్‌లో బిడ్డకు పాలు ఇస్తున్న మోడల్‌ ఫోటో ప్రచురించి ఈ అంశం గురించి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. అమెరికా లాంటి దేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ అంశానికి సంబంధించి విధివిధానాలను రూపొందిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఒక మోడల్‌ బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్‌ వాక్‌ చేసి మాతృత్వానికి సరికొత్త నిర్వచనం చెప్పారు.

వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన మారా మార్టిన్‌ అనే మోడల్‌ స్లిమ్‌ షూట్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా మియామిలో నిర్వహించిన ఒక ర్యాంప్‌ షోలో పాల్గొంది. మోడల్‌ కంటే ముందు మార్టినా ఓ బిడ్డకు తల్లి. ఆ విషయం ఆమెకు బాగా తెలుసు. ర్యాంప్‌ వాక్‌ చేస్తుండగా మార్టినా ఐదు నెలల చిన్నారి ఏడుపు ప్రారంభించింది. తల్లి కదా అందుకే బిడ్డ ఎందుకు ఏడుస్తోందో మార్టినాకు వెంటనే అర్ధమైంది. ర్యాంప్‌వాక్‌ నుంచి బయటకు వచ్చి తన చిన్నారి ఆకలి తీర్చాలనుకుంది. కానీ షో నిర్వాహకులు బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్‌ వాక్‌ చేయమని సలహా ఇచ్చారు. దాంతో మార్టినా బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్‌ వాక్‌ చేశారు.

ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు మార్టినా. మార్టినా షేర్‌ చేసిన ఈ ఫోటోకు అనూహ్యంగా.. పెద్ద ఎత్తున జనాలు మార్టినాకు అభినందనలు తెలుపుతున్నారు. కానీ కొందరు మాత్రం దీన్నో పబ్లిసిటి స్టంట్‌లా భావించి విమర్శలు చేస్తున్నారు. అయితే తనను విమర్శించే వారికి చాలా గట్టిగానే సమాధానం చెప్పారు మార్టినా.

‘నేను ఈ రోజు చేసిన పని కావాలని, నలుగురి దృష్టిలో పడాలని చేసింది కాదు. నేను గత ఐదు నెలలుగా చేస్తున్న పనినే ఇప్పుడు చేశాను. రోజు నా బిడ్డకు నేను ఇదే సమయంలో పాలు ఇస్తాను. ఈ రోజు కాస్తా ఆలస్యం అయ్యేసరికి తను ఏడుస్తుంది. తన ఆకలి తీర్చడం కంటే మరేది నాకు ముఖ్యం కాదు. ఈ విషయం కేవలం తల్లికి మాత్రమే అర్ధమవుతుంది. నన్ను విమర్శించే ముందు ఈ విషయం గురించి మీ అమ్మను అడగండి. వారికి తెలుసు నేను చేసింది కరెక్టో, కాదో’ అంటూ కాస్తా ఘాటుగానే స్పందించారు.

ఇప్పటికైతే అమెరికాలో బిడ్డలకు తల్లులు బహిరంగంగా పాలు ఇవ్వొచ్చు, కానీ రెస్టారెంట్లు, మాల్స్‌ వంటి రద్దీ ప్రదేశాల్లో మాత్రం కవర్‌ చేసుకోవాలనే ఆదేశాలు ఉన్నాయి. అమెరికా మహిళలు ఈ ఆదేశాలను తప్పు పడుతున్నారు. ‘మేము కవర్‌ చేసుకోవడం కాదు మీరు మీ బుద్ధిని సరి చేసుకోండి’ అంటూ విమర్శిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరం అంటూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top