ఇంత లేటు వయసులో... ఎంతటి మాతృత్వ అనుభూతులో

Twin Baby Mother Mangayamma Special Story - Sakshi

కొన్ని ప్రశ్నలు – కొన్ని సందేహాలు

ఒక జీవి మరో జీవికి జన్మనివ్వడం సహజం.సంతానానికి జన్మనివ్వకపోవడాన్ని మనిషి అసంపూర్ణత్వంగా భావిస్తాడు.సంతానం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు.అయితే అలాంటి అన్ని ప్రయత్నాలూ సరైనవేనా? లేక చర్చకు ఆస్కారమిచ్చేవా?

మాతృత్వంలోని మధురిమలు అనిర్వచనీయమైనవి. తల్లి కావడం ఒక తీయని అనుభూతే. కానీ బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ అన్న వాడుక కూడా మనలో ఉంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన 74 ఏళ్ల మంగాయమ్మ గురువారం కవల పిల్లలకు జన్మనిచ్చారు. పుట్టిన ఆడ శిశువులు ఇద్దరూ 1.5 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇది చాలా సంతోషదాయకమైన అంశం. అయితే ఇంత లేటు వయసులో గర్భధారణ అన్నది చాలా రకాలైన ముప్పులతో కూడి ఉంటుంది. డెబ్బయి నాలుగేళ్ల వయసును పక్కన ఉంచితే... గర్భధారణ విషయంలో అసలు 35 ఏళ్లు దాటిన దగ్గర్నుంచి అనేక రకాల సమస్యలు పొంచి ఉంటాయి. ఇందులోని కొన్ని వైద్యపరమైన అంశాలతో పాటు అటు నైతిక, ఇటు సామాజిక అంశాలనూ ఒకసారి పరికిద్దాం.

వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతుంటుంది. అందుకే రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్‌ పరీక్షల ద్వారా ఒక మహిళలో ఇంకా మిగిలి ఉన్న అండాల సంఖ్యను (ఒవేరియన్‌ రిజర్వ్‌) తెలుసుకుంటారు. దాన్ని బట్టి వారికి అవసరమైన సంతాన సాఫల్య ప్రక్రియ ఏమిటన్నది నిర్ణయిస్తారు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఇలా చేసే పరీక్షల ఫలితాలన్నీ ఉజ్జాయింపుగా ఉంటాయే తప్ప... నిర్దిష్టంగా ఏ పరీక్ష కూడా వంద శాతం కచ్చితత్వంతో ఉండదు. ఇక గర్భధారణ జరిగినా పిండంలో వైకల్యాలు ఏర్పడే అవకాశాలూ పెరుగుతాయి. అంతేకాదు... గర్భస్రావం అయ్యే అవకాశాలూ హెచ్చుతాయి. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆలస్యంగా గర్భధారణ జరిగే వారిలో గర్భస్రావాలు అయ్యే అవకాశాలు ఎక్కువ. గర్భస్రావం అయ్యే అవకాశాలు 35 ఏళ్ల కంటే చిన్నవయసు ఉన్నవారిలో 13 శాతం ఉంటాయి. అదే 45 ఏళ్ల వయసు పైబడిన వాళ్లలో అవి 54 శాతానికి పెరగవచ్చు.

గర్భధారణకు పురుషుడి లోపాలూ దోహదం
ఇక ఆలస్యంగా గర్భధారణ జరిగే ప్రక్రియలో పురుషుడి వీర్య సంబంధమైన లోపాలు కూడా గర్భధారణను సంక్లిష్టం చేస్తాయి. వయసు మీరిన పురుషుడికి సెమన్‌ అనాలసిస్‌ పరీక్ష చేసినప్పుడు అందులో పురుష బీజకణాలు తక్కువగా ఉండటం, వాటి రూపంలో లోపం, వాటి కదలికలు సరిపడనంతగా లేకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. అదే జరిగితే... అడ్వాన్స్‌డ్‌ స్పెర్మ్‌ అనాలిసిస్, టెస్టిక్యులార్‌ బయాప్సీ, జనెటిక్‌ టెస్ట్, స్క్రోటల్‌ అల్ట్రాసౌండ్, కేరియోటైప్‌ టెస్ట్‌ వంటి మరికొన్ని పరీక్షలూ అవసరమవుతాయి.

పుట్టే పిల్లలకూ ఏర్పడే ముప్పులు
ఆలస్యంగా గర్భధారణ జరిగిన మాతృమూర్తులకు పుట్టే పిల్లల్లోనూ జన్యుపరమైన కొన్ని లోపాలు తలెత్తేందుకు అవకాశం ఉంది. అదెలా జరుగుతుందో చూద్దాం.తల్లిదండ్రుల తాలూకు ఈ లక్షణాలన్నింటినీ బిడ్డలకు వచ్చేలా చేసే మౌలిక అంశాలను క్రోమోజోములు అంటారు. తల్లి నుంచి ఒక 23, తండ్రి నుంచి మరో 23... ఇలా ఈ రెండు 23 జతలు కలగలసి 46 క్రోమోజోములు పిండంలోకి చేరితేనే అది పూర్తిస్థాయిలో లోపాలు లేని ఒక మానవ పిండంగా ఎదుగుతుంది. పుట్టబోయే బిడ్డలందరిలోనూ ఇవే 23 జతల క్రోమోజోములుంటాయి. ఉండాలి కూడా. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది పిల్లల్లో మాత్రం ఈ క్రోమోజోముల సంఖ్యలో తేడా వస్తుంది. అప్పుడు ఆ బిడ్డలో దేహనిర్మాణపరమైన లోపాలు, ఇతరత్రా లోపాలు రావచ్చు. అలా ఆ లోపాలతోనే బిడ్డ పుట్టేందుకు అవకాశం ఉంది.బిడ్డ పుట్టాక లోపాలను కనుగొంటే చేయగలిగేందేమీ ఉండకపోవచ్చు. అయితే బిడ్డ పుట్టకముందే వాటిని కనుగొనగలిగితే తల్లిదండ్రులకూ, కొన్నిసార్లు పుట్టబోయే బిడ్డకు ఉపయోగకరమైన నిర్ణయం తీసుకోడానికి వీలవుతుంది. ఇలా బిడ్డలోని క్రోమోజోముల సంఖ్యలో తేడా వచ్చినప్పుడు బిడ్డకు వచ్చే వ్యాధుల్లో ఒక ప్రధానమైన సమస్యే ‘డౌన్స్‌ సిండ్రోమ్‌’.

ఏమిటీ డౌన్స్‌ సిండ్రోమ్‌?
మానవుల్లో 23 జతల క్రోమోజోములకు బదులు ఒక క్రోమోజోము అదనంగా వచ్చి చేరినప్పుడు పెరిగే పిండం బిడ్డగా రూపొందితే అప్పుడు పుట్టే బిడ్డ కొన్ని లోపాలతో పుడుతుంది. అలా పుట్టే బిడ్డను ‘డౌన్‌ సిండ్రోమ్‌’తో పుట్టిన బిడ్డగా చెబుతారు. ఈ లోపాన్నే ‘ట్రైజోమీ 21’ అని కూడా అంటారు. బిడ్డలోని 21వ క్రోమోజోముకు అదనంగా మరో క్రోమోజోము చేరడం వల్ల ఇలా డౌన్‌ సిండ్రోమ్‌తో బిడ్డ పుడతాడు. ఇలా డౌన్స్‌ సిండ్రోమ్‌తో పుట్టిన బిడ్డలో మెదడు ఎదుగుదల తక్కువ. కాబట్టి ఆ బిడ్డలో నేర్చుకునే శక్తి, మానసిక ఎదుగుదల ఇవన్నీ తక్కువగా ఉంటాయి. కొందరిలో గుండె లోపాలు కూడా రావచ్చు. తల్లిలో గర్భధారణ చాలా ఆలస్యంగా జరిగినప్పుడు ఇలా డౌన్స్‌ సిండ్రోమ్‌తో బిడ్డ పుట్టే అవకాశం ఉంది. ఉదాహరణకు 20 ఏళ్ల వయసులో గర్భధారణ జరిగినప్పుడు ప్రతి 1140 మంది మహిళల్లో ఒకరికి డౌన్స్‌ సిండ్రోమ్‌తో బిడ్డ పుట్టే అవకాశం ఉండగా... 30 ఏళ్ల వయసులో గర్భధారణ జరిగినప్పుడు ప్రతి 720 మహిళల్లో ఒకరికీ, అదే 40 ఏళ్ల వయసు తర్వాత గర్భధారణ జరిగితే ప్రతి 65 మందిలో ఒకరికి ఇలా డౌన్స్‌ సిండ్రోమ్‌తో బిడ్డ పుట్టవచ్చు.

కవలల తండ్రి
డౌన్స్‌ సిండ్రోమ్‌ను ముందుగానే తెలుసుకోవచ్చా?
కొన్ని పరీక్షలతో డౌన్స్‌ సిండ్రోమ్, మరికొన్ని జన్యుపరమైన సమస్యలను తెలుసుకోవచ్చు. ఇందులో మొదటిది స్క్రీనింగ్‌ పరీక్ష. ఈ స్క్రీనింగ్‌ పరీక్షలో.. సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలితే, ఆ తర్వాత చేసేది నిర్ధారణ పరీక్ష. ఇందులో స్క్రీనింగ్‌ పరీక్షను హైరిస్క్‌ ఉన్న ప్రతి గర్భవతీ చేయించుకోవడం మంచిది. గర్భిణి పిండంలో ఏదైనా ముప్పు (హైరిస్క్‌) ఉందా అని తెలుసుకోవడం కోసం ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఇది చాలా చిన్న సాధారణ రక్త పరీక్ష మాత్రమే. కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకున్నది.ఒకవేళ ఈ స్క్రీనింగ్‌ పరీక్ష (డబుల్‌ మార్కర్‌ టెస్ట్, క్వాడ్రపుల్‌ టెస్ట్‌)లో ఏదైనా సమస్య ఉండే అవకాశమున్నట్లు ఫలితం వస్తే అప్పుడు పూర్తి స్థాయి నిర్ధారణ కోసం మరో పరీక్ష అంటే కోరియానిక్‌ విల్లస్‌ బయాప్సీ, అమ్నియోసెంటైసిస్‌ పరీక్ష (ఉమ్మనీరు పరీక్ష) అవసరమవుతాయి.ఇవేగాక ఆలస్యంగా గర్భధారణ జరిగిన తల్లిదండ్రులకు పుట్టే బిడ్డలు చాలా రకాల అవయవ లోపాలతోనూ, ఇంకా అనేక రకాల జన్యుపరమైన సమస్యలు, మెటబాలిక్‌ సిండ్రోమ్స్‌తో పుట్టవచ్చు. మూగ, చెవుడు, ఆటిజమ్‌ వంటి సమస్యలు రావడం కూడా ఎక్కువే. ఇలాంటి చాలా సమస్యలు ఎంత అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవన్నీ కచ్చితంగా తెలియకపోవచ్చు. పుట్టిన తర్వాత, బిడ్డ ఎదుగుతున్న క్రమంలో తెలుస్తాయి. ఇక ఇంత లేట్‌ వయసులో తల్లిలో క్యాల్షియం తగ్గడం, ఎముకలు అరిగిపోవడం, రక్తం గూడు కట్టుకుపోయే ముప్పు, గర్భధారణ సమయంలో సాధారణంగా రక్తపోటు పెరగడం, జెస్టెషనల్‌ డయాబెటిస్‌ వంటి అనేక ముప్పులు కలుగుతాయి.

ఇవన్నీ వైద్యపరమైన ముప్పుల్లో కొన్ని మాత్రమే. కాగా ఇక నైతికంగా, సామాజికంగానూ, ఆర్థికపరమైన ముప్పులు కూడా ఉంటాయి.ఈ ముదిమి వయసులో పిల్లలు కలగాలనే తమ గాఢమైన తాపత్రయాన్ని నెరవేర్చుకుని సేఫ్‌గా ఆరోగ్యకరమైన పిల్లలను కన్న తల్లిదండ్రులనూ, బిడ్డలనూ అభినందించి తీరాలి. అలాగే ఈ వయసులో ప్రపంచ రికార్డు నెలకొల్పే ఫీట్‌ను అత్యంత సురక్షితంగా నెరవేర్చిన వైద్యబృందానికీ అభినందన దక్కాలి. అయితే... బిడ్డలను ఏ వయసులో కనాలి, అంత వయసు వారికి గర్భధారణ కోసం కృత్రిమ ప్రక్రియలు అవలంబించవచ్చా, ఏ వయసు వారి వరకు గర్భధారణ ప్రక్రియలు పాటించవచ్చు అనే విషయంలో స్పష్టమైన చట్టాలేమీ లేవు. నైతికతలను స్వచ్ఛందంగా పాటించే మనలాంటి దేశాల్లో ఉండవు కూడా. కాబట్టి ఇందులో ఎదురయ్యే సమస్యలూ, వాటి పరిష్కారాలు, వాటి ఆధారంగానే ముందుకు వెళ్లడం... ఇవన్నీ వారి వారి విచక్షణ మేరకే ఉంటాయి. కాబట్టి అటు వైద్యులూ, ఇటు తల్లిదండ్రులూ ఈ విషయంలో ఎవరికి వారే విచక్షణతో మెలగాలి. అలాంటి విచక్షణలతో కూడినది కనుకనే ఈ వార్త ఇప్పుడు మనందరిలోనూ, వైద్యవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఏమైనా అద్భుతాలు అరుదుగా మాత్రమే జరుగుతాయి. అద్భుతాలతో పాటు కాంప్లికేషన్లు ముడిపడి ఉంటాయి. సఫలమైనప్పుడు మాత్రమే అది అద్భుతం అవుతుంది. అందరూ ప్రతిసారీ తమ విషయంలో అద్భుతాన్ని ఆశించడం అంత సమంజసం కాకపోవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు ప్రకృతి ధర్మాన్ని అనుసరించే ముందుకెళ్లాలి.

ఆర్థికపరమైనఅంశాలు
సాధారణంగా తల్లిదండ్రులు పెద్ద వయసులో ఉన్న వారు కావడం, కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలు పుట్టినందున, కవలలు అయినందున కొన్ని రకాల వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది అటు తల్లిదండ్రులకూ, ఇటు బిడ్డలకూ రావచ్చు. వారు బాగా కలిగినవారే అయినప్పటికీ ఇప్పుడు వైద్యం చాలా ఖరీదైన నేపథ్యంలో ఇది ఖర్చు పరంగా కాస్తంత ఆర్థిక భారంగా పరిణమించేందుకే అవకాశాలు ఎక్కువ.

నైతికపరమైన అంశాలు
పిల్లలను పొందడం అన్నది ఒక భావోద్వేగపరమైన అంశం. ప్రతివారికీ తమ రక్తం పంచుకు పుట్టిన పిల్లలపై అపేక్ష, ప్రేమ, అనిర్వచనీయమైన అనుబంధం ఉంటాయి. ఆ హక్కును కాదనలేం. కానీ గర్భధారణ జరిగిన మహిళకు ఏదైనా ముప్పు వచ్చి, తల్లీబిడ్డలిద్దరిలో తల్లిని రక్షించాలా, బిడ్డను రక్షించాలా అన్న సంశయం వస్తే... పెద్దప్రాణానికే విలువనివ్వడం మన గమనానికి వచ్చే అంశమే. అలాంటప్పుడు 74 ఏళ్లు వయసులో బిడ్డ ఆరోగ్యంగానే పుడతాడా... ఒకవేళ పుట్టినా ఈ కేసులో అవసరమైనట్లే సిజేరియన్‌ అవసరమైతే ఆ మహిళకు శస్త్రచికిత్సలకు తట్టుకునే శక్తి ఉంటుందా... తల్లికి గండంగా పరిణమించే ఇంత రిస్క్‌ అవసరమా అన్నది ఆలోచించాల్సిన అంశం. ఇక మన మంగాయమ్మ గారి విషయంలో అదృష్టవశాత్తూ బిడ్డల్లో జన్యుపరమైన లోపాలేవీ తలెత్తలేదు. కానీ ఒకవేళ ఇంత పెద్ద వయసులో డౌన్స్‌ సిండ్రోమ్‌కు స్పష్టమైన అవకాశాలు ఉన్నందున అదేజరిగితే అది అటు తల్లిదండ్రులతో పాటు ఇటు సమాజంపై కూడా భారం పడేదే. ఇక ఇప్పుడు తల్లి వయసు 74 ఏళ్లు, మరి తండ్రి వయసు తప్పక అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తండ్రి వయసు కూడా కాసేపు అంతే అనుకుందాం. ఉదాహరణకు ఆ పిల్లలను సాకే విషయంలో ఎదురయ్యే ఒక చిన్న అంశాన్ని చూద్దాం. ఆ పిల్లలిద్దరూ పదవ తరగతి, ఇంటర్‌కు చేరే సమయానికి వారి వయసు 89, 92కి చేరుతుంది. దాదాపు 90 ఏళ్ల నాటికి కూడా టీనేజీకి చేరని ఆ పిల్లలను ఆ తల్లిదండ్రులు సమాజానికి భారం కాకుండా బాధ్యతగా సాకగలరా అనేది మరో అంశం.
డా‘‘ వేనాటి శోభ,సీనియర్‌ గైనకాలజిస్ట్‌బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో,హైదర్‌నగర్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top