తమ ‘సోమ’జ్యోతిర్గమయ

Tribute to duvvuri somayajulu - Sakshi

దువ్వూరి సోమయాజుల్ని విజ్ఞానపు వెలుగుగా వర్ణిస్తారు ఆయన సన్నిహితులు. ‘ఐబీఎం మెయిన్‌ఫ్రేమ్స్‌ రోజుల్లోనే తయారైన లేటెస్ట్‌ ఐఫోన్‌’ అంటారు మరికొందరు సన్నిహితులు ఆయన గురించి. రెండూ నిజమే!! ఎందుకంటే శాస్త్రీయ సంగీతంతో పాటు తాజా సినిమా పాటల్లోని సాహిత్యాన్ని కూడా అంతే సాధికారికంగా విశ్లేషిస్తారాయన. మహబూబ్‌ నగర్‌ జిల్లా గద్వాలలో పుట్టారాయన. తండ్రి టీచర్‌ కావటంతో గద్వాలలోనే విద్యాభ్యాసం ఆరంభమయింది. తండ్రికి బదిలీ కావటంతో కొన్నాళ్లు భువనగిరి... తరవాత హైదరాబాద్‌!!. దీంతో... పాఠశాల స్థాయి నుంచే హైదరాబాద్‌ ఆయన అడ్డా అయింది.

సంబంధం లేని సబ్జెక్ట్‌ లేదు
మలక్‌పేట గవర్నమెంట్‌ స్కూల్‌లో సోమయాజులు సోదరుడు టీచర్‌. తండ్రి హెడ్‌మాస్టర్‌.  ఆయన చదివిందీ అక్కడే. స్కూల్‌ టైమ్‌ నుంచే పుస్తకాలు తెగ చదివేవారు. చిత్రమేంటంటే ఆయనకు చిన్ననాటి నుంచి తన సబ్జెక్‌ కానిదంటూ ఏదీ లేదు. స్నేహితుడు కొల్లూరి విజయశంకర్‌ తండ్రి చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ కావటంతో అక్కడికెళ్లి జైలు లైబ్రరీలోని పుస్తకాలు తెచ్చుకుని మరీ చదివేవారు. ఆ రచయితలు, వారి రచనలపై చర్చించేవారు. అదే అలవాటు చివరి దాకా కొనసాగింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘లా’ చదివినపుడు... వర్సిటీ జర్నలిజం విభాగానికి టెలీ ప్రింటర్‌ ద్వారా పీటీఐ, యూఎన్‌ఐ వంటి వార్తాసంస్థల నుంచి వార్తలొస్తుండేవి. తనకు ఆ విభాగంతో సంబంధం లేకపోయినా... ప్రపంచ గమనాన్ని, తాజా సమాచారాన్ని తెలుసుకోవటానికి రోజూ అక్కడికి వెళ్లేవారు. ఆ వార్తలన్నీ చదివేసేవారు. తెలుగు భాషా దిగ్గజం భద్రిరాజు కృష్ణమూర్తి అప్పట్లో ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉండగా... ఆయన క్లాసుల్లో కూడా కూర్చునేవారు సోమయాజులు.

ఎప్పుడు చదువుతారబ్బా..?
సోమయాజులు చార్టర్డ్‌ అకౌంటెన్సీ, లా, కంపెనీ సెక్రటరీ మూడు కోర్సుల్నీ పూర్తి చేశారు. వారణాసిలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌లో సీటొచ్చి చేరినా... హైదరాబాద్‌లో అందరినీ వదిలి ఉండలేక కోర్సు పూర్తి చేయకుండానే వచ్చేశారు. నిజానికి ఆయన చదువు, మార్కులు చూసిన వారెవరైనా... ఆయన ఎప్పుడూ పుస్తకాలని అంటిపెట్టుకుని ఉంటారని అనుకుంటారు.

కానీ... ఆయన ఏ లక్కీకేఫ్‌లోనో, తిలక్‌రోడ్‌లోని హిరోజ్‌ కేఫ్‌లోనో అర్ధరాత్రి దాకా తన స్నేహితులతో మాట్లాడుతూనే కనిపించేవారు. ఇక ఇంట్లో చూస్తే ఇష్టమైన ఇతరత్రా పుస్తకాలు చదివేవారు. ఇంగ్లీషు సినిమాలంటే ఇష్టం. దాదాపు అన్ని ఇంగ్లీషు క్లాసిక్స్‌నూ థియేటర్‌లోనే చూశానని చెప్పేవారాయన. బాలీవుడ్‌ సినిమాల్లో సైతం అప్‌ టు డేట్‌గా ఉండేవారు.

అలాంటి వ్యక్తి క్లిష్టమైన పరీక్షలు సైతం అలవోకగా ఎలా పాసయిపోతున్నారు? అని స్నేహితులు, తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయేవారు. కార్వీ వ్యవస్థాపకులు పార్థసారథి గారు కూడా ఆయనకు మంచి స్నేహితుడు. ‘‘తాను చదవకుండా తనకు వినపడేలా చదవమని చెప్పి... అది మైండ్‌లో రికార్డ్‌ చేసేసుకునేవారు. చదివింది, విన్నది చాలా ఫాస్ట్‌గా రికార్డ్‌ చేసుకుని అవసరమైనప్పుడు తిరిగి  వెంటనే తీసే సత్తా ఆయన సొంతం’’ అని స్నేహితులు చెబుతుంటారు.  

సంగీతం... ఆయన ప్రపంచం
అబిడ్స్‌ తాజ్‌ మహల్‌ హోటల్లో కాఫీలు, మసాలా దోసెలు ఆయనకెంతో ఇష్టం. సిటీలోని ఇరానీ  కేఫ్‌లలో వాళ్లు ఇక క్లోజ్‌ చేస్తామని చెప్పేదాకా స్నేహితులతో ‘చాయ్‌ పే చర్చలు’ నడిపించే వారు.  అప్పట్లో కలకత్తా రామ్‌ప్యారీ మీనాక్షి పాన్‌ రోజుకు ఆరేడు దాకా తినేసేవారు. వీటన్నిటికీ తోడు సంగీతమంటే... అందులోనూ ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి గాత్రమంటే ప్రాణం. కర్ణాటక సంగీతంలో ఏ రాగం గురించైనా సాధికారికంగా మాట్లాడేవారు.

ఇక హిందీ సినిమాలకొస్తే గురుదత్, మధుబాల, వహీదా రెహ్మాన్‌ అంటే అభిమానం. పాత సినిమాల నుంచి తాజా సినిమాల వరకూ దాదాపు మంచిదేదీ వదిలేవారు కాదు. అన్నిటినీ చూసి... వాటిలోని సంగీతం, డైలాగులు వంటి అంశాల్ని పరిశోధనాత్మకంగా వివరించేవారు. ఉత్తరాది, దక్షిణాది సంగీత బాణీలన్నిటినీ విశ్లేషించేవారు.

‘‘నాకూ సంగీతమంటే ఇష్టం కావటంతో ఇద్దరం రాత్రిళ్లు రెండు, మూడింటి వరకూ మాట్లాడుకునే వాళ్లం. వాళ్లబ్బాయికి మాకంటే ఎక్కువ నాలెడ్జ్‌ ఉండటంతో ఆయన కూడా కలిసేవారు’’ అని సోమయాజులు సహాధ్యాయి విజయశంకర్‌ వివరించారు. రోజూ ఇంట్లో అమ్మవారిని పూజించే సోమయాజులు... సమయం దొరికినపుడల్లా విజయవాడ కనకదుర్గ, తుల్జాపూర్‌ భవానీ వంటి పీఠాలను దర్శించేవారు.

వివిధ రంగాలపై పట్టు
ఎనర్జీ రంగంపై సోమయాజులుకున్న పట్టు తిరుగులేనిది. అంకెలు అలవోకగా చెప్పటమే కాదు. ప్రాక్టికల్‌గా వాటిలోని సాధ్యాసాధ్యాలనూ వివరించేవారు. ఇంధనం, వ్యవసాయం, ఆర్థికం... ఇలా దాదాపు 15–20 రంగాలకు సంబంధించి ప్రతి పరిణామాన్నీ అధ్యయనం చేస్తూ ఎప్పుడూ అప్‌టు డేట్‌గా ఉండేవారాయన. స్టాక్‌ మార్కెట్లనూ నిశితంగా అధ్యయనం చేసేవారు.

హర్షద్‌ మెహతా సమయంలో బుడగ పగులుతుందని ఆయన చెప్పినా తాము నమ్మలేదని, తరవాత అదే నిజమైందని స్నేహితులు కొందరు గుర్తు చేసుకున్నారు. ‘‘సామాజికంగా, రాజకీయంగా అంతా ఆయన దగ్గర తమ సందేహాలు నివృత్తి చేసుకునేవారు. ఎప్పటినుంచో పెద్ద పెద్ద రాజకీయ పరిచయాలున్నాయి. ఏ ప్రభుత్వం ఎలా పనిచేసిందో చెప్పేవారు.  ఆయనతో ఒకసారి స్నేహం కలిస్తే అది చిరకాలం కొనసాగటానికే అవకాశాలెక్కువ’’ అని 40 ఏళ్లుగా ఆయనకు సన్నిహితులైన మోహన్‌ కుమార్‌  వివరించారు.

ఏపీఐడీసీతో... పారిశ్రామికుల గురువుగా
ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఐడీసీ) గతంలో తొలిసారిగా ఇండస్ట్రియల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కోర్సును ఆరంభించింది. ఆ కోర్సు డైరెక్టరు సోమయాజులే. ఇప్పుడు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఫార్మా, సిమెంట్‌ తదితర రంగాల్లో దిగ్గజాలుగా ఉన్న పలు సంస్థల అధిపతులు అప్పట్లో ఈ కోర్సులో చేరారు. కొన్నాళ్లు కొనసాగాక... 1970ల్లో ఏపీఐడీసీని వదిలి బాంబినో వంటి పలు కంపెనీలను ఏర్పాటు చేయటంలో ప్రమోటర్లకు సహకరించారు. వాటిల్లో డైరెక్టరుగానూ కొనసాగారు.

వ్యక్తిగతంగా జవహర్‌లాల్‌ నెహ్రూను విపరీతంగా అభిమానించేవారు. ఆయనంతటి దార్శనికుడు, జ్ఞాని లేడనేవారు. ఆయన రాసిన పుస్తకాలన్నీ చదవటమే కాక... శ్యామ్‌ బెనెగళ్‌ తీసిన డాక్యుమెంటరీలూ చూసేవారు. రాజకీయాలపై ఆసక్తి పెరిగిన తరవాత... తొలుత పీజేఆర్‌కు సలహాదారుగా చేరారు. దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో అధికారికంగా ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కావటంతో పాటు... ఏపీ వ్యవసాయ టెక్నాలజీ మిషన్‌ వైస్‌ చైర్మన్‌గానూ కొనసాగారు.  తదనంతర పరిణామాల్లో వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి వెంట ఉండి... వైఎస్‌ఆర్‌సిపిలో కొనసాగుతూ వచ్చారు. – మంథా రమణమూర్తి

నైతికత మానవీయత కలగలిపితే సోమయాజులు
నైతికత మానవీయ కలగలిపితే డీఏ సోమయాజులు అవుతారు. నేను ఆయనలో అద్భుత మానవతావాదిని చూశాను. ఒకసారి ఆయనతో ఎవరైనా కనెక్ట్‌ అయ్యారంటే వాళ్లు ఆయనను తమ ఇంట్లో పెద్దలా చూసుకుంటారు. అటువంటి ఆత్మీయ నేస్తం ఇకలేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్నాను. నేడు దివంగతనేత వైఎస్‌ఆర్‌ ప్రజల్లో గుండెల్లో గూడుకట్టుకొని ఉన్నారంటే దాని వెనుక సోమయాజులు కృషీ, మేధస్సూ  ఎంతో ఉంది. వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన  అనేక ప్రజా సంక్షేమ పథకాల సూత్రధారి ఆయన. ఉచిత విద్యుత్‌ ఆలోచన ఆయనదే. బడుగు వర్గాల ప్రయోజనం కోసం   ఎంతో పరితపించేవారు.

ఆయనకున్న పరిజ్ఞానం ఆపారం. చరిత్ర, సామాజిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం... ఒకటేమిటి అన్ని శాస్త్రాలపై ఆపారమైన పట్టున్న మేధావి ఆయన.  చాలా వేగంగా ఆలోచనలు చేసేవారు. క్లాసికల్‌ ఫిల్మ్స్‌ బాగా ఇష్టంగా చూసేవారు. ఎన్నో కీర్తనలకు రాగాలు చెప్పేవారు. మంచి సంగీత ప్రియుడు. తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాలు ఔపోసన పట్టారు. బ్రిటిష్, ఇండియన్‌ రాజ్యాంగ నిబంధనలు ఆయన నాలుక చివరే ఉంటాయి. క్లిష్టమైన అంశాలనూ అరటిపండు వలచినట్లు చెప్పగలరు.

సోమయాజులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేస్తున్న ఈ సమయంలో సోమయాజులు అవసరం ఎంతో ఉంది. ఆయనే బతికి ఉంటే ప్రజలకు ఇంకెంతో మేలు కలిగేది. ఆయనకు వచ్చిన శ్వాసకోశ వ్యాధిలోని చాలా అరుదుగా ఏ కొద్దిమందికి మాత్రమే వచ్చేది. రెండేళ్లు ఆయన్ని అమితంగా బాధించింది. చనిపోయే చివరి రోజుల్లో శ్వాస తీసుకొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చివరికి ఆదివారం తెల్లవారు జామున ఆయన కుటుంబసభ్యులను, వైఎస్‌ఆర్‌ సీపీని, మా లాంటి ఆత్మీయులను, తెలుగు ప్రజలను విడిచి వెళ్లిపోయారు. ఎక్కడున్నా మా నేస్తం ఆశీస్సులు వైఎస్‌ఆర్‌ సీపీకి ఉంటాయి. ఆయన్ని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటాం.

– భూమన కరుణాకర్‌ రెడ్డి,  ప్రధాన కార్యదర్శి, వైఎస్‌ఆర్‌ సీపీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top