ఉప్పు తెచ్చే ముప్పు

Threat of making salt - Sakshi

ఉప్పు (లవణం)ను శరీరానికి ‘హితశత్రువు’ గా చెప్పుకోవచ్చు. ప్రతి వంటకానికీ రుచిని తెప్పించి, నాలుకని ఆకర్షించి, మనిషిని తనకు బానిసగా మార్చేస్తుంది ఉప్పు. దీనినే సోడియం క్లోరైడ్‌ అంటారు. ప్రకృతి దత్తమైన ఆహారపదార్థాలు అపక్వంగా ఉన్నప్పుడు వాటిలో ఉండే పొటాషియం, సోడియమ్‌ల నిష్పత్తి దాదాపు 8:1 గానే ఉంటుంది. ఆహార సేవనలో ఈ రెండింటి నిష్పత్తిని ఇలాగే కాపాడుకోవటం అవసరం. ముఖ్యంగా మనం వండుకునే విధానాల వల్ల స్వతస్సిద్ధమైన పరిమాణాలు తారుమారవుతాయి. అంటే పొటాషియం తగ్గి, సోడియం పెరిగిపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరం. షడ్రసాలలోను ఉప్పును ఎక్కువగా తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థవారి సూచన ప్రకారం ఒక వ్యక్తి రోజుకి మూడు నుంచి ఐదు గ్రాముల ఉప్పు తింటే సరిపోతుంది. కాని మనం రోజుకి 15 నుంచి 20 గ్రాములు సేవిస్తున్నాం. ఇలా తినడం రోగాలకు దారి తీస్తుంది.

పరిమిత ప్రమాణంలో ఉప్పు అవసరమే.  ఉప్పు తినడం వల్ల జీర్ణక్రియ త్వరగా జరుగుతుంది. శరీరంలో కొవ్వును కరిగి, జడత్వం పోతుంది. ఊరగాయలు, నిలవ పచ్చళ్లు, అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు... వంటి పదార్థాలలో ఉప్పు అధికంగా ఉంటుంది. వీటిని  నెలకి ఒకసారి తినాలనుకుంటే పరవాలేదు. డీప్‌ఫ్రై చేసి దట్టంగా ఉప్పుకారం చల్లిన పదార్థాలను మానేయాలి. ఉడికించిన కూరలలో నామమాత్రంగా ఉప్పు వేసి కొత్త రుచులను అలవరచుకోవాలి. బయట లభించే జంక్, ఫాస్ట్‌ ఫుడ్స్‌ జోలికి పోకూడదు. ఉప్పును అతిగా సేవిస్తే రక్తస్రావం పెరుగుతుంది, దాహం పెరుగుతుంది, బలం నశిస్తుంది, సంధులలో వాపు వస్తుంది, జుత్తు నెరుస్తుంది, బట్టతల వస్తుంది, చర్మంలో ముడతలు ఇంకా ఇతర చర్మ వికారాలు కలుగుతాయి. నీటిని శరీరంలో నిల్వ ఉండేట్టు చేసి ఊబకాయం, వాపులు కలుగ చేస్తుంది. రక్త నాళాల లోపలి పొరను గట్టిపరచి, రక్తప్రసరణకు అవరోధం కలిగించి, బీపీని పెంచుతుంది. తద్వారా పక్షవాతం, హార్ట్‌ ఎటాక్, కీళ్లవాపులు వచ్చే అవకాశం ఉంటుంది. రుచుల కోసం పాకులాడితే వచ్చే రోగాలను రుచి రోగాలు అంటారు. ఇవి అనర్థదాయకం. ఆరోగ్యప్రదమకైన కొత్త రుచులను అలవాటు చేసుకోవడానికి నాలుకకు రెండు వారాల సమయం చాలు.
 – డాక్టర్‌ వృద్ధుల లక్ష్మీ నరసింహ శాస్త్రి
ఆయుర్వేద వైద్య నిపుణులు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top