20లలో పొదుపు ఎందుకు చేయాలంటే.. | The savings are in the order of 20 .. | Sakshi
Sakshi News home page

20లలో పొదుపు ఎందుకు చేయాలంటే..

Jul 11 2014 11:06 PM | Updated on Sep 2 2017 10:09 AM

సాధ్యమైనంత వరకూ కెరియర్ ప్రారంభించిన తొలినాళ్లలో.. అంటే ఇరవైల నుంచీ పొదుపు చేయాలి.. ఖర్చులు తగ్గించుకోవాలి అంటూ పెద్దలు, ఆర్థిక నిపుణులు చెబుతుంటారు.

సాధ్యమైనంత వరకూ కెరియర్ ప్రారంభించిన తొలినాళ్లలో.. అంటే ఇరవైల నుంచీ పొదుపు చేయాలి.. ఖర్చులు తగ్గించుకోవాలి అంటూ పెద్దలు, ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. చాలా మంది ఈ సలహాలను ఇలా విని అలా వదిలేస్తుంటారు. అయితే, ముందు నుంచే పొదుపు, ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే ఏమవుతుంది అని ఓ మోస్తరు జీతాన్ని అందుకుంటూ, లగ్జరీలపై ఖర్చు పెడుతున్న ఇరవై రెండేళ్ల కుర్రాడికి సందేహం వచ్చింది. ఇదే కొశ్చన్‌ని ఆన్‌లైన్లో అడిగితే అనేక మంది దగ్గర్నుంచి ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయి.. అందులో కొన్ని..
 
1. చక్రవడ్డీ ప్రయోజనం తగ్గుతుంది ..

కెరియర్ తొలినాళ్ల నుంచీ పొదుపు చేయడం వల్ల చక్రవడ్డీల ప్రభావంతో రిటైర్మెంట్ నాటికి అధిక మొత్తాన్ని పోగు చేసుకోవచ్చు. అదే కెరియర్ చివర్లో మొదలుపెడితే.. ఈ ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది.
 
2. ఉద్యోగం ఊడితే అంతే ..

మంచి జీతం వచ్చే ఉద్యోగం ఉన్నట్లుండీ పోతే.. అప్పటిదాకా పొదుపు చేసుకున్న మొత్తాలే ఆదుకుంటాయి. లేకపోతే అప్పులపాలవ్వాల్సి వస్తుంది. మరో ఉద్యోగం దొరకబుచ్చుకుని వాటిని తీర్చేదాకా జీవితం దుర్భరమవుతుంది.
 
3. తిరోగమనం తప్పదు ..

ఎప్పుడూ కూడా లైఫ్‌లో పురోగమించడానికే ప్రయత్నించాలి తప్ప తిరోగమించొద్దు. మితిమీరిన ఖర్చులతో పొదుపు ప్రాధాన్యాన్ని విస్మరిస్తే భవిష్యత్‌లో చిన్న చిన్న అవసరాల కోసం కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంటికెళ్లాలంటే భయమేస్తుంది. ఇలాంటి పరిస్థితి రావొద్దంటే కచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ ఉండాల్సిందే.
 
4. తర్వాత చూసుకుందాంలే అంటే కష్టమే..

నలభై ఏళ్ల తర్వాత కూడబెట్టుకోవచ్చులే అనుకుంటే.. ఆదాయం ఆర్జించేందుకు ఇప్పుడున్న సత్తా అప్పుడు ఉండదు. ఖర్చులు పెరిగిపోతాయి.. ఆర్జన తగ్గిపోతుంది. అందుకే.. అప్పుడు కూడా తినడానికి కాస్త ఆహారం, ఉండటానికి ఒక చిన్న గూడు, కట్టుకోవడానికి దుస్తులకు ఢోకా ఉండకూడదంటే ఇప్పట్నుంచీ పొదుపు చేయాలి.
 
5. ఇష్టం లేని ఉద్యోగాన్ని భరించక తప్పదు..


వచ్చే ప్రతీ పైసాను ఖర్చు పెట్టేస్తుంటే .. రేపటికంటూ ఏమీ మిగలదు. ఫలితంగా ప్రతి నెలా జీతంరాళ్ల కోసం ఎదురుచూస్తూనే ఉండాలి. మరో చోట అవకాశం లేనప్పుడు.. ఆఫీసులో పరిస్థితి నరకప్రాయంగా మారినా ధైర్యం చేసి మనెయ్యలేక.. నచ్చని ఉద్యోగంలో తప్పనిసరిగా కొనసాగాల్సి వస్తుంది.
 
6. భవిష్యత్ లక్ష్యాలు సాధించలేం..

సొంత ఇల్లు, మంచి కారు కొనుక్కోవడం .. భార్యా, పిల్లలు కుటుంబంతో కలిసి టూర్లు తిరిగేయడం లాం టి ఆలోచనలు ఈ ప్రాయంలో రాకపోయినా.. ఏదో ఒక రోజు వస్తాయి. ఇలాంటివన్నీ తీరాలంటే చాలా డబ్బు కావాలి. అందుకే ఇప్పట్నుంచే దాచిపె ట్టాలి.
 
7. వెనక్కి తిరిగి చూసుకుంటే..

మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడం.. అంటే భవిష్యత్‌లో ఉపయోగపడే నైపుణ్యాలను అలవర్చుకోవడం, అందుకోసం పెట్టుబడి పెట్టడం ఈ దశలోనే కాస్త ఎక్కువగా సాధ్యపడుతుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇవే ఉపయోగపడతాయి. అలా కాకుండా కంటికి కనిపించినవన్నీ కొనేయడం..ఎడా పెడా విలాసాలంటూ ఖర్చు చేసుకుంటూ పోతే వెనక్కి తిరిగి చూసుకుంటే విచారించడం తప్ప ఏమీ ఉండదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement