యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌

Symptoms For Urinary Tract Infections - Sakshi

మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్స్‌ అందరికీ వచ్చినా ఇవి మహిళల్లో చాలా ఎక్కువ. మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్‌ రావడం అన్నది తరచూ కనిపించే సమస్య. ఇక తమ ప్రమేయం లేకుండా మూత్రం కారిపోవడం (యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌) అనే సమస్య వారిని చాలా ఇబ్బందికీ, ఆత్మన్యూనతకు గురిచేస్తుంది. అలాగే ‘యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌’ సమస్య కూడా మహిళల్లో ఎక్కువ. దీన్ని ఒకింత తీవ్రమైన సమస్యగా డాక్టర్లు పరిగణిస్తుంటారు.

ఈ ఇన్ఫెక్షన్‌ పైకి పాకితే కిడ్నీని సైతం ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మహిళలు సాధారణంగా బయటకు చెప్పుకోడానికి కూడా బిడియపడుతూ, తమలో తామే బాధపడుతుంటారు. ఇలాంటివన్నీ చాలా సాధారణమనీ, కిడ్నీ లేదా మూత్రసంబంధిత స్పెషలిస్టులను సంప్రదిస్తే చాలా సులువుగా పరిష్కారమయ్యే సమస్యలేనని అవగాహన కల్పించడానికే ఈ కథనం.

వేర్వేరు వయసులో...
చిన్నవయసులో తరచూ ఇన్ఫెక్షన్స్‌ వస్తుంటే : చిన్నవయసు నుంచే ఇలా కనిపిస్తున్నాయంటే అది పుట్టుకతో వచ్చిన సమస్య (కంజెనిటల్‌ అనామలీస్‌)కారణంగా ఇన్ఫెక్షన్‌లు తరచూ వచ్చే ప్రమాదం ఉంది. కారణం తెలుసుకోకుండా ఎన్నిసార్లు చికిత్స ఇప్పించినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాదు. పైగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదమూ పొంచి ఉంటుంది.

యౌవనంలో: ఇక యువతుల్లో, కొత్తగా పెళ్లైన మహిళల్లో మూత్రంలో ఇన్ఫెక్షన్స్‌ అనేవి చాలా సాధారణం. కొత్తగా పెళ్లయిన వాళ్లకి హనీమూన్‌ సిస్టయిటిస్‌ అనే సమస్య కనిపిస్తుంది. ఇక వయసు పైబడిన మహిళల్లో (పోస్ట్‌ మెనోపాజల్‌ వుమన్‌లో) కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్స్‌ చాలా సాధారణంగా వచ్చే సమస్య.

నెలసరి ఆగిపోయికవచ్చే హార్మోన్ల ప్రభావంతో ఈ సమస్యలు వస్తుంటాయి. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ లోపం వల్ల మూత్రనాళం సన్నబడే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రాశయంలో మూత్రం నిల్వ ఉండటంతో అది మాటిమాటికీ వచ్చే అవకాశం ఉండి,  ఇది ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. ఈ హార్మోన్ల లోపం కారణంగా మూత్రాశయ కణాలకు అనారోగ్యకరమైన బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది.

యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌: ఈ సమస్య ఉన్నవారిలో తమ మూత్రవిసర్జనపైన తమకే నియంత్రణ ఉండదు. ఈ సమస్య కూడా పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ. కాన్పులు కష్టమైనవారిలో, స్థూలకాయంతో... హార్మోన్‌ సమస్యలతో బాధపడుతున్న వారిలో, మరికొంతమందిలో మెనోపాజ్‌ ఆగిపోయాక ఈ సమస్య కనిపిస్తుంది. కొందరిలో ఏ అవసరం లేకుండానే మూత్రాశయ కండరాలు సంకోచిస్తుంటాయి. మరికొంతమందిలో  మూత్రాశయ నాడులు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.

యాభైఅయిదేళ్ల లోపు వయసున్నవారిలో సగం మంది మహిళలు ఈ సమస్యకు లోనవుతుంటారు. కానీ సిగ్గు, బిడియం కారణంగా అందులో పది శాతం మంది కూడా వైద్యులను సంప్రదించడానికి ముందుకు రావడం లేదు. నిజానికి ఈ సమస్య అంత పెద్దది కాదు. అయినప్పటికీ మానసికంగానూ, శారీరకంగానే కాకుండా సామాజికంగా కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఒక్కోసారి ఈ సమస్య ఉన్నవారిలో మూత్రం వల్ల ఏర్పడిన చెమ్మ కారణంగా చర్మ సంబంధిత అలర్జీలు కూడా వస్తాయి.

సమస్య తీవ్రత పెరిగి సర్జరీ వరకు దారితీయవచ్చు. దీనికి పూర్తి చికిత్స అందించకపోతే ఇది కిడ్నీలపైన కూడా ప్రభావం చూపుతుంది.  మూత్ర విసర్జక వ్యవస్థ ఇన్ఫెక్షన్‌కు గురవడానికి ప్రధానమైన కారణం ‘ఈ–కొలి’ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా బయటి వాతావరణంలోనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇది మూత్ర విసర్జన మూత్రనాళాల్లోకి వెళ్తుందో అప్పుడు దీనివల్ల కిడ్నీకి అత్యంత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇందులోని ‘క్లెబిసియల్లా, ఇంటరోకోకస్‌ ఫైకలిస్‌’ అనే రెండు బ్యాక్టీరియాలు చాలా కీడు చేస్తాయి. పైగా యాంటీబయాటిక్స్‌లాంటి మందులకు కూడా ఇవి పెద్దగా లొంగవు.

నివారణే మేలు :
►వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలో భాగంగా మల, మూత్ర విసర్జన తర్వాత ప్రైవేటు పార్ట్స్‌ శుభ్రపరచుకునే సమయంలో పై వైపు నుంచి కింది వైపునకు కడుక్కోవాలి. లేకపోతే మల మార్గంలో ఉండే రోగకారక క్రిములు/సూక్ష్మజీవులు మూత్ర మార్గం వైపునకు వచ్చి ఇన్ఫెక్షన్లు కలిగించే అవకాశం ఉంది
►రోజూ తగినంత నీరు తాగకపోవడమే సాధారణంగా మూత్ర సంబంధిత వ్యాధులకు కారణమని వైద్యులు అంటున్నారు. ఇప్పుడు మహిళల్లో చాలామంది ఉద్యోగలతో  క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. కనీసం మంచినీరు కూడా తగినంత తాగేంత తీరిక కూడా వారికి ఉండటం లేదు. దాంతో మహిళల్లోనే మూత్ర సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
►తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేయాలి.
►కాఫీ, టీ, జంక్‌ఫుడ్స్‌ లాంటి వాటి జోలికి వెళ్లకూడదు ∙గ్రామీణ ప్రాంతాల్లోని వారితో పాటు పట్ణణాల్లోని మురికివాడల వంటి అంతగా పరిశుభ్రత లేని ప్రాంతాల్లో  నివసించే మహిళలు కూడా శుభ్రతపాటించేలా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రయత్నించాలి.

చికిత్స
సాధారణంగా వచ్చే మూత్ర వ్యాధులకు డాక్టర్లు నోటి ద్వారా తీసుకునే మందులతోనే చికిత్స చేస్తుంటారు. అవసరాన్ని బట్టి ఒక్కోసారి  కాస్త ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్‌ ఇస్తారు. సమస్య ఇంకాస్త ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసే, పరీక్షలు నిర్వహించి, అందుకు అనుగుణంగా చికిత్స పద్ధతిని అవలంబిస్తారు.

పుట్టుకతో వచ్చే లోపాలకు, మూత్రపిండాల్లో రాళ్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు అవసరమైతే సర్జరీ చేసి... ఆయా లోపాల్ని సరిచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి మూత్రావయవాల్లో టీబీ వల్ల కూడా మాటిమాటికీ ఇన్షెక్షన్స్‌ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ డాక్టర్‌కి అనుమానం వస్తే టీబీ క్రిముల కోసం ప్రత్యేకమైన మూత్రపరీక్షలు చేసి, చికిత్సను అందిస్తారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top