పుట్టిన రోజు

Special Storys On Chaganti koteswar Rao Pravachanlu - Sakshi

స్త్రీ వైశిష్ట్యం–23

ఎవరికయినా సరే, పుట్టినరోజు అత్యంత ప్రధానమైన పండగ. శాస్త్రంమీద గౌరవం ఉన్న వాళ్ళు ‘నేను పుట్టినరోజు పండగ చేసుకోను’ అని అనకూడదు. జీవితంలో ఒక లక్ష్యం ఉండాలంటే దానికో శరీరం ఉండాలి. ఆ శరీరాన్ని పరమేశ్వరుడు మనకిచ్చిన గొప్పరోజు అది. అందుకే ఆరోజు దానిని పండగలా చేసుకోమని చెప్పారు. ఎవరికయినా ఒక పుట్టిన రోజు మాత్రమే ఉంటుంది. కానీ అమ్మకు ఎంతమంది బిడ్డలున్నారో అన్ని పుట్టిన రోజులతోపాటూ తను పుట్టిన రోజు కూడా ఉంటుంది. ‘‘అమ్మా! ఈ బిడ్డడిని ప్రసవిస్తే మీరు చనిపోతారు’’ అని చెప్పారు డాక్టర్లు మా అమ్మకు. దానికి మా అమ్మగారన్నారట...‘‘వాడు బతికితే చాలు, నేను ఉండకపోయినా ఫరవాలేదు’’ అని. కానీ ఈశ్వరానుగ్రహం, నా అదృష్టం– ఆవిడ బతికింది, నేనూ బతికాను. మృత్యువు రెండు కోరల మధ్యలోకి చేరి, జారి కిందపడి బతికిన రోజు మా అమ్మకది. అంటే మా అమ్మకు అది మరో పుట్టిన రోజేగా... అందుకే ప్రతి బిడ్డ పుట్టిన రోజు అమ్మకు మరో పుట్టిన రోజవుతుంది.

అందుకే పుట్టిన రోజును ఎలా చేసుకోవాలి? అమ్మకు కొత్త చీర పెట్టి, నమస్కారం చేసి తరువాత మాత్రమే తాను కొత్తబట్టలు కట్టుకోవాలి. అది మర్యాద. సంస్కారవంతుల లక్షణం. అమ్మ సృష్టికర్త, ఈ శరీరాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె బ్రహ్మ. తన నెత్తురును పాలగా మార్చి బిడ్డ వృద్ధికి కారణమవుతుంది.. అందువల్ల ఆమె స్థితికర్త. ఓ గైనకాలజిస్టు ‘మాతృదేవోభవ’ పేరుతో ఒక పుస్తకం రాసారు. దానిలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. బిడ్డ పుట్టగానే తల్లి స్తన్యంలో ‘కొలోస్ట్రమ్‌’ అనే ఒక పసుపు పచ్చటి పదార్థం ఊరుతుంది. గర్భసంచీలో కటిక చీకట్లో అప్పటిదాకా ఉన్న బిడ్డ బయటికి వచ్చాక అంత వెలుతురు, అన్ని పెద్ద పెద్ద ఆకారాలు చూసేటప్పటికి లోపల ఉన్న మలం నల్లగా రాయిలా మారిపోతుంది. అది బయటకు వెళ్ళక అడ్డుపడి ఊపిరితిత్తుల, గుండె పనితనాన్ని మందగింపచేస్తుంది. ప్రాణోత్క్రమణం అవుతున్న స్థితిలో పరమ ప్రేమతో అమ్మ బిడ్డను దగ్గరగా తీసుకుని స్తన్యమిచ్చినప్పుడు ఆ కొలోస్ట్రమ్‌ బిడ్డ కడుపులోకి వెళ్లి లోపల అడ్డుపడిన నల్లటి మలం బయటకు వచ్చేసి వాడు ఆయుర్దాయం పొందుతాడు.

అందుకే అమ్మ స్థితికర్త. అమ్మ ప్రళయ కర్త కూడా. ప్రళయం అంటే చంపేయడం కాదు. నిద్రపుచ్చడం స్వల్పకాలిక ప్రళయం. పరమేశ్వరుడు చేసే మహోత్కృష్టమైన క్రియల్లో అదొకటి. అన్ని ప్రాణులకు నిద్రనిస్తాడాయన. అవి నిద్రలో సుఖాన్ని పొందుతాయి. బ్రహ్మ, విష్ణువు, శివుడు... ముమ్మూర్తుల సమాహార స్వరూపం అమ్మ. అందుకే ‘మాతృదేవోభవ’ అని మొదటి నమస్కారాన్ని అందుకుంటుంది. అమ్మతనం కేవలం స్త్రీయందే ప్రకాశిస్తుంది. అమ్మతనాన్ని చూడలేక ఆడతనాన్ని చూసినవాడు హింసింపబడి, నశించిపోతాడు. దేవీ భాగవతంలో అమ్మవారి మహిషాసుర మర్దని స్వరూపం అది. ఎక్కడ ఎవడు ఆడతనంలో అమ్మతనాన్ని చూసి గౌరవించి నమస్కరిస్తాడో వాడు దీర్ఘాయుర్దాయాన్ని పొంది భవిష్యత్‌ బ్రహ్మ అవుతాడు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top