మోసకారి బతుకు నుంచి బయటపడేసే

మోసకారి బతుకు నుంచి బయటపడేసే


నాటి సినిమా



దివాకరం (రాజేంద్రప్రసాద్‌)కు అబద్ధం చెప్పడం అంటే వాటర్‌ సిప్‌ చేసినంత వీజీ. ఒకపూట బ్రేక్‌ఫాస్ట్, రెండు పూటల భోజనానికి బదులు అతడు అబద్ధాలనే భోంచేసి రాత్రిపూట హాయిగా స్లీప్‌ చేస్తూ ఉంటాడు. వృత్తికి వీడియోగ్రాఫర్‌. కాని బతికేది నాలిక మీదే. విజయనగరంలో ఏదో పెళ్లుంటే రాజమండ్రి నుంచి వెళ్లి అక్కడ భువనేశ్వరి (శోభన)తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి త్వరలోనే రాజమండ్రికి ట్రాన్స్‌ఫర్‌ మీద రానుందని తెలిసి ఆ వచ్చేలోపు వీడియో లైబ్రరీ పెట్టి షైన్‌ అయిపోదామని అబద్ధాల రేసులో రన్నింగ్‌ మొదలెడతాడు.



రైల్వే కాలనీలో ఉండే సినిమా పిచ్చి దమయంతికి ‘మీరో పదివేలు ఇస్తే పది రూపాయల వడ్డీ వేసి తిరిగిచ్చేస్తాను... అంతేకాదు లైఫ్‌లాంగ్‌ నా వీడియో లైబ్రరీలోని క్యాసెట్లన్నీ ఫ్రీగా ఇస్తానని’ కోతలు కోసి పదివేలు నొక్కుతాడు. ఇంకో ఆడపడుచు భాగ్యం (జయలలిత)ను ‘నువ్వు పదివేలివ్వకపోతే ఫలానా అరవ రాజన్‌తో నీకున్న కనెక్షన్‌ను పబ్లిక్‌ చేసేస్తాను’ అని బ్లాక్‌మెయిల్‌ చేసి అక్కడా ఒక పదివేలు నొక్కుతాడు. టికెట్‌ కలెక్టర్‌ చిన్నారావు (మల్లికార్జునరావు)కు ఆ భాగ్యం మీద మనసుందని తెలిసి ‘మీకెందుకు నాకొదిలిపెట్టండి సెట్‌ చేస్తాను కదా’ అని బొంకి ‘ఆ భాగ్యం తన చంటోడికి మామిడిపిందెల బంగారు మొలతాడు చేయించుకుంటుందట... మరి మీరేదైనా...’ అంటూ అతని దగ్గర ఒక పద్నాలుగు వేలు నొక్కుతాడు.



ఇక ఎలాగూ ఎగ్గొట్టాలని డిసైడ్‌ అయిన యాభై వేల చీటీని ముప్పై అయిదు వేలకు పాడి ఆ డబ్బునూ తీసుకుంటాడు. ఇక వాళ్లనూ వీళ్లనూ ఇలాగే టోకరా ఇచ్చి మొత్తం మీద వీడియో లైబ్రరీ తెరుస్తాడు. ఆ షాపులో కూడా అన్నీ మోసాలే. ‘షోలే’ అడిగితే ‘జ్వాల’ ఇస్తాడు. అదేమిటంటే ‘తెలుగులో తీశారని’ మస్కా వేస్తాడు. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ అడిగితే పాత ‘జగదేకవీరుని కథ’ అంట గడుతుంటాడు. కూచుంటే అబద్ధం. లేస్తే మోసం. బతుకంతా దరిద్రం.



ఇది రాజమండ్రి వచ్చిన భువనేశ్వరి గమనించింది. ప్రేమ అంటూ తనవెంట పడుతున్న దివాకరంను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించి అతడిని ఒక ప్రమాదకరమైన ఒప్పందంలోకి దించుతుంది. అదేమిటంటే ఒక నెలంతా ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా అన్నీ నిజాలే చెప్పి బతకడం. ‘ప్రాణం పోయినా సరే అబద్ధం చెప్పకూడదు. ఇవాళ మార్చి ఒకటి. ఇవాళ్టి నుంచి ముప్పై రోజులు. ఈ వ్రతం సక్సెస్‌ఫుల్‌గా ముగిస్తే ఏప్రిల్‌ 1న నీకు విడుదల. నా ప్రేమ ఒప్పుకోలు’ అని చెప్తుంది.



దివాకరం బతుకు అబద్ధం కాని భువనేశ్వరి మీద అతడి ప్రేమ అబద్ధం కాదు. అందుకని అతడా పందేన్ని స్వీకరిస్తాడు. నిజాలు చెప్పడానికి నడుం తువ్వాలుతో బిగిస్తాడు. సూర్యుడు ఎప్పుడూ తూర్పునే ఉదయించాలి. పడమర ఉదయిస్తే అల్లకల్లోలం జరిగిపోతుంది. ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాడు అబద్ధాలే చెప్పాలి. నిజాలు చెప్పడం మొదలుపెడితే బతుకు బస్టాండ్‌ అవుతుంది. చెప్పేవాడిది కాదు. ఎదుటివాడిది. అతడి నిజాలకు మొదటగా బలైంది చిన్నారావు. భాగ్యంతో కనెక్షన్‌ కోసం అతడు ట్రై చేస్తున్నాడని ఆ కనెక్షన్‌ కుదిరితే ఇప్పటికే ఇంట్లో ఉన్న ఇద్దరు పెళ్లాలకు ఎండ్రిన్‌ ఇచ్చి చంపాలని ప్లాన్‌ చేశాడని, అంతేకాదు... భాగ్యంతో పెళ్లయ్యాక ఆమె పరాయి మగాడి వైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు గుండు కొట్టించి మూల కూచోపెట్టే పన్నాగం పన్నాడని దివాకరం తన నిజాల వ్రతంలో భాగంగా భాగ్యంకు చెప్పేశాడు. ఆమె అతణ్ణి ప్రియుడని కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసింది.



ఈ సంగతి ఇద్దరు భార్యలకు తెలిసి పతిదేవుడని కూడా వగచకుండా చావబాదారు. ఆ అంకం అలా అయ్యిందా... కాలనీలో పెద్ద రౌడీగా ఉన్న కొండబాబు గురించి చీటీలేసే వై.విజయ, సాక్షి రంగారావు నానా తిట్లు తిట్టుకుంటూ ఉంటారు. ‘అవి నిజం కండలు కావని, చంకల కింద సెగ్గడ్డలు లేచాయని, అతడివి దొడ్డికాళ్లని, కట్‌డ్రాయర్‌ కట్‌ అయ్యి అలా నడుస్తున్నాడనీ’ అన్నింటికి మించి ‘అతడి భార్య జట్కా అహమద్‌తో రాత్రిళ్లు సెకండ్‌షోలకు చెక్కేస్తుంటుందని’ తిట్టుకుంటూ ఉంటారు. ఇవి విని దివాకరం తన నిజాలలో భాగంగా కొండబాబుకు చేరవేస్తాడు. అంతే. ఆ తిట్టుకున్నవాళ్లంతా తాటలూడి కింద పడతారు. ఇలాగే దివాకరం నిజాల వల్ల కాలనీ అంతా కకావికలం అయిపోతూ ఉంటుంది.



ఎంత ప్రమాదం వచ్చినా ఎన్ని ఉత్పాతాలు సంభవించినా దివాకరం ఒక్క అబద్ధం కూడా చెప్పడు ప్రేమ కోసం. కాని క్లయిమాక్స్‌కు వచ్చేసరికి ఒక నేరం తనను పెంచిన తల్లి మీదకు వెళ్లే ప్రమాదం ఉందని తెలిసి కావాలని అబద్ధం చెబుతాడు. ఆ ఒక్క అబద్ధం చెప్పినందుకు అతడు పందెం ఓడిపోయినట్టే. కాని మంచి కారణం కోసం అబద్ధం చెప్పినందుకు భువనేశ్వరి అతణ్ణి క్షమిస్తుంది. అతడి ప్రేమను అంగీకరిస్తుంది. అబద్ధాలతో సాధించలేని ప్రేమను నిజాలతో దక్కించుకుని దివాకరం ఒక ఇంటివాడవుతాడు. కథ ముగుస్తుంది. వాళ్ల లైఫ్‌ మూడు క్యాసెట్లు ఆరు వీడియోలుగా హాయిగా గడిచిపోతుంది.



‘ఏప్రిల్‌ 1 విడుదల’ 1991లో వచ్చింది. ఇది ‘హరిశ్చంద్రుడు అబద్ధమాడితే’ (రచన: కోలపల్లి ఈశ్వరరావు, ఎం.ఐ.కిషన్‌) అనే ఒక నవలలోని చిన్న పాయింట్‌ ఆధారంగా దర్శకుడు వంశీ బ్రిలియంట్‌గా రాసుకున్న కథ. రాజేంద్రప్రసాద్‌ చెలరేగిపోయి నటించిన కథ. పాత్రలన్నీ సహజ వాతావరణంలో సహజ ప్రవర్తనలతో సహజ నుడికారంతో అద్భుతంగా ఆకట్టుకున్న కథ. అబద్ధాలు అందరం ఏదో ఒక సందర్భంలో ఆడతాం. కాని మామూలు నిజాలు కూడా మాట్లాడలేని పరిస్థితి మనందరిలో ఉంటుంది. అటువంటిది ఒక నెలపాటు కఠినమైన నిజాలు కూడా మాట్లాడే పందెం హీరో హీరోయిన్ల మధ్య పడటమే ఈ సినిమాలో ఆసక్తి కలిగించే అంశం. దీని స్క్రీన్‌ ప్లే ఏదైనా యూనివర్సిటీలో పాఠ్యాంశంగా పెట్టదగ్గ స్థాయిలో ఉంటుంది. ఆద్యంతం నవ్వించే ఈ సినిమా చివరలో సీరియస్‌గా టర్న్‌ అయ్యి భయోద్విగ్నత కలిగిస్తుంది. ఈ సినిమా చూసినవాళ్లెవరైనా నిజాలు చెప్పాలని అనుకోరు కాని దివాకరంలా అబద్ధపు బతుకు నుంచి విముక్తం కావాలని మాత్రం అనుకుంటారు. అది ఈ కథ విజయం. ఇది సాధించిన మంచి ఫలితం. దర్శకుడు వంశీకి జేజేలు.             



మన తర్వాతే హాలీవుడ్‌లో....

ఏప్రిల్‌ 1 విడుదల 1991లో వచ్చింది. కాని అదే కథాంశాన్ని పోలి హాలీవుడ్‌లో ‘లయర్‌ లయర్‌’ అనే సినిమా 1997లో వచ్చింది. అందులో హీరో లాయర్‌. కాని అతడు కూడా హటాత్తుగా నిజాలు మాట్లాడటం మొదలెడతాడు. ఆ విధంగా చూస్తే మనవాళ్లు హాలీవుడ్‌ స్థాయిలో వారి కంటే ముందు కథను ఆలోచించినట్టు. గ్రేట్‌ కదూ.



కడుపుబ్బ నవ్వించే... సన్నివేశాలు...

‘ఏప్రిల్‌1 విడుదల’లో అడుగడుగునా నవ్వించే సన్నివేశాలు ఉంటాయి. పెంటకుప్పల మీద పడి ఉన్న టీవీని కళ్లు చిదంబరం రాజేంద్రప్రసాద్‌కు అప్పగిస్తే దాన్నతడు ‘దుబాయ్‌ టీవీ’ అని సాక్షి రంగారావుకు అమ్మేస్తాడు. దానిని ఆన్‌ చేస్తే ఢామ్మని పేలి అందరి ముఖాలు నల్లగా మారతాయి. వీడియో లైబ్రరీ ఓపెనింగ్‌ కూడా వెరైటీగా ఉంటుంది. అందరూ రిబ్బన్‌ కట్‌ చేయిస్తే ఇందులో పెద్ద దుంగను పెట్టి రంపంతో కోసి ఓపెనింగ్‌ చేయమంటారు. ఆ రోజుల్లో దూరదర్శన్‌లో వచ్చే మూగచెవిటి వార్తలను ఇమిటేట్‌ చేస్తూ రాజేంద్రప్రసాద్‌ శోభనకు రాసే వీడియో ప్రేమలేఖ కూడా హైలైటే.



ఎల్‌.బి.శ్రీరామ్‌ మాటలు

ఏప్రిల్‌ 1 విడుదల సినిమాకు ఎల్‌.బి.శ్రీరామ్‌ రాసిన మాటలు చాలా ప్లస్‌ అయ్యాయి. అయితే నటుడు కృష్ణభగవాన్‌ కూడా ఈ మాటల్లో సాయం అందించారని, కొన్ని డైలాగులు రాశారని కథనం. ఈ సినిమాలో వీళ్లిద్దరూ యాక్ట్‌ చేసినా అప్పట్లో జనానికి వీరు పట్టలేదు కాని ఆ తర్వాతి కాలంలో ఎల్‌.బి.శ్రీరామ్, కృష్ణభగవాన్‌ ప్రసిద్ధ కమెడియన్‌లుగా మారారు. ఇక ఇళయరాజా చేసిన పాటల్లో ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’, ‘ఒంపుల వైఖరి సొంపుల మాదిరి’ హిట్‌ అయ్యాయి.

  – కె

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top