తమిళ్‌ మున్నేట్ర పడమ్‌

special story south indian movies - Sakshi

2018లో సినిమాలు చూశాం.గొప్పగా చెప్పుకున్నాం.2019లోనూ పక్కవాళ్ల సినిమాల కంటే గొప్పగా ఉండాలని కోరుకుందాం.2018లో తమిళులు సినిమాల్లో ముందడుగు ఎలా వేశారో తెలుసుకుందాం.మున్నేట్రమ్‌ అంటే ముందడుగు.ఇంద(ఈ) తమిళ్‌ మున్నేట్ర పడమ్‌ పాక్కలామ్‌ (చూద్దాం).

సంవత్సరం పూర్తి కావస్తోంది. కొత్త ఏడాది మొదలుపెట్టాలంటే ఈ ఏడాది ఎలా గడిచిందో విశ్లేషించుకోవాలి. మన సినిమాలకు సంబంధించిన లెక్కలు మొదలుపెట్టేశాం. ప్లస్సులు, మైనస్సులు, లాభ నష్టాలు అన్నీ లెక్క తేలుతున్నాయి. మనం ఎలా ఉన్నామో తెలియడానికి స్వీయ విశ్లేషణ ఒక్కటే సరిపోదు... మనం ఎక్కడున్నామో తెలియాలంటే పక్క ఇండస్ట్రీ వాళ్లతో పోల్చి చూసుకుంటే తప్పు లేదు. ఈ ఏడాది తమిళంలో వచ్చిన ‘పడమ్‌’(సినిమా)ల ప్రస్తావన.ఈ ఏడాది మొదటి సినిమా సీజన్‌ను విక్రమ్, సూర్య మొదలెట్టారు. పొంగల్‌కు పోటీగా రిలీజ్‌ అయిన ‘స్కెచ్‌’, తానా సేంద కూట్టమ్‌(గ్యాంగ్‌)’ చిత్రాలు యావరేజులుగా నిలిచాయి. ‘తానా సేంద కూట్టమ్‌’ పాటలు మార్కెట్‌ను విపరీతంగా ఊపేసినా ప్రేక్షకులకు ఫుల్‌ మీల్స్‌ కాలేదనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన అనుష్క ‘భాగమతి’ ఏకకాలంలో తమిళంలోనూ విడుదలైంది. అక్కడ కొంత శాతం మాత్రమే ప్రేక్షకులు భయపడడంతో యావరేజ్‌గా నిలిచింది. అలా గ్రాండ్‌ స్టార్ట్‌ లేకుండానే 2018లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది తమిళ పరిశ్రమ. 

హంగామా లేదు
ఫిబ్రవరిలో విజయ్‌ సేతుపతి ‘ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌ (ఓ మంచి రోజు చూసి చెబుతాను) రిలీజ్‌ అయింది. ఈ సినిమా ద్వారా నిహారిక కొణిదెల తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. జీవా, జై, శివ, కేథరీన్, నిక్కీ గల్రానీలతో దర్శకుడు సుందర్‌.సి తెరకెక్కించిన ‘కలకలప్పు 2’ అనుకున్నంత ఆడలేదు. ‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్‌ తన కుమార్తెను పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘సొల్లి విడవా’  సరిగ్గా ఆడలేదు. ‘36 వయదినిలే’తో కమ్‌బ్యాక్‌ ఇచ్చిన జ్యోతిక ఆ తర్వాత బాల దర్శకత్వంలో చేసిన చిత్రం ‘నాచ్చియార్‌’. ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించారు జ్యోతిక. సినిమా బాగానే ఆడింది. మొదటి నెల లానే రెండో నెల కూడా కలకలప్పు (హంగామా) లేకుండా మామూలుగా గడిచింది.

బొమ్మ పడలేదు 
మధ్యలో ఏర్పడ్డ థియేటర్ల సమస్య కారణంగా రిలీజ్‌లు పల్చబడ్డాయి. పూర్తిగా బంద్‌ అయ్యాయి కూడా. దాంతో వెండితెరపై బొమ్మ పడలేదు. బాక్స్‌లన్నీ ల్యాబుల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఆ వివాదం సద్దుమణిగిన తర్వాత ఆగిపోయిన చిత్రాలన్నీ కూడా గేటు వదిలిన నీళ్లలా వారానికి 4,5 చిత్రాలు విడుదలయ్యాయి. విభిన్న కథ– స్క్రీన్‌ప్లేతో సినిమాలు రూపొందిస్తాడనే పేరు పొందిన కార్తీక్‌ సుబ్బరాజ్‌ సైలెంట్‌ థ్రిల్లర్‌ ‘మెర్కురీ’తో వచ్చాడు. ప్రభుదేవా ముఖ్య పాత్రలో నటించిన ఈ సైలెంట్‌ సినిమాకు మంచి చప్పట్లే పడ్డాయి. ‘మహానటి’ని ఏకకాలంలో ‘నడిగయర్‌ తిలగమ్‌’గా తమిళంలో రిలీజ్‌ చేశారు. సినిమాకు మంచి ప్రశంసలు వినపడ్డా అక్కడక్కడా జెమినీ గణేశన్‌ పాత్ర తీర్చిదిద్దిన విధానంపై కొందరు అసంతృప్తి వ్యక్తపరిచారు. మన ఫోన్‌లో ఉన్న సమాచారంతోనే మనల్ని ఎలా మభ్యపెట్టొచ్చు అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ‘ఇరుంబుదురై’ (అభిమన్యుడు) చిత్రం విశాల్‌కు ఈ మధ్య కాలంలో పెద్ద హిట్‌గా నిలిచింది. మంచి వసూళ్లూ రాబట్టింది. 
కార్తీ రైతుగా కనిపించిన ‘కడైకుట్టి సింగం’ 

(చినబాబు) దెబ్బకు థియేటర్స్‌ను కన్నీటి పర్యంతం చేసేసింది. ఉద్వేగభరిత కుటుంబ కథా చిత్రంగా వంద రోజులాడేసింది.  తమిళంలో మంచి హిట్‌ సాధించి, తెలుగులో ‘చిన్నబాబు’గా రిలీజ్‌ అయింది. తమిళ కమర్షియల్‌ సినిమాల్లో కనిపించే ఫార్ములాని పేరడీ చేసి తెరకెక్కించిన చిత్రం ‘తమిళ పడమ్‌ 2’. ‘తమిళ పడమ్‌’కు సీక్వెల్‌. బాగానే నవ్వుకున్నారు ఆడియన్స్‌. మన తెలుగు ‘సుడిగాడు’కు ఈ చిత్రమే ప్రేరణ. కామెడీ డాన్‌గా విజయ్‌ సేతుపతి చేసిన ‘జుంగా’ పెద్ద నష్టాన్నే  మిగిల్చింది. యువన్‌ శంకర్‌ రాజా నిర్మాతగా మారి తీసిన ‘ప్యార్‌ ప్రేమ కాదల్‌’కు పాస్‌ మార్కులు పడ్డాయి. ఫస్ట్‌ పార్ట్‌కు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత వచ్చిన కమల్‌ హాసన్‌ ‘విశ్వరూపం 2’ చిత్రానికి తెలుగులో మంచి స్పందన రాకపోయినా తమిళంలో డీసెంట్‌ హిట్‌గా నిలిచింది. పలు వాయిదాల తర్వాత విడుదలైన నయనతార ‘ఇమైక్క  నొడిగళ్‌’ మంచి హిట్‌ సాధించింది. ఈ సినిమా ద్వారానే రాశీ ఖన్నా తమిళ ఎంట్రీ ఇచ్చారు. శివకార్తికేయన్‌ ‘సీమరాజా’ పండగ సినిమాగా మిగిలిపోయింది.

సమంత ‘యు టర్న్‌’ మంచి హిట్‌గా నిలిచింది. సీక్వెల్స్‌ ‘సామీ స్క్వేర్‌ (సామి 2), సండైకోళి 2 (పందెం కోడి 2) ఫస్ట్‌ పార్ట్‌ మ్యాజిక్‌ని రిపీట్‌ చేయలేకపోయాయి.  విజయ్‌ దేవరకొండ ‘నోటా’కు మన దగ్గర అనుకున్నన్ని ఓట్లు పడకపోయినా తమిళంలో మంచి మెజారిటీ సాధించింది. ‘జయం’ రవి స్పేస్‌ సినిమా ‘టిక్‌ టిక్‌ టిక్‌’ కూడా మంచి ప్రయత్నం అనిపించుకుంది.  చాలా కాలం తర్వాత మణిరత్నం సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ని తీసుకొచ్చింది. అరవింద స్వామి, శింబు, విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘చెక్క చివంద వానమ్‌’(నవాబ్‌) మంచి సక్సెస్‌గా నిలిచింది. విజయ్‌ – మురగదాస్‌ కాంబినే షన్‌లో వచ్చిన ‘సర్కార్‌’ సినిమా కలెక్షన్స్‌ల వర్షం కురిపించింది. అందులో రాజకీయ వివాదాల సహాయం కూడా లేకపో లేదు. జ్యోతిక ‘కాట్రిన్‌ మొళి’ పర్వాలేదనిపించింది.ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీ ఎక్కువగా డిస్కస్‌ చేసుకున్న సైకో థ్రిల్లర్‌ ‘రాక్షసన్‌’. విష్ణు విశాల్‌ హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది అద్భుతమైన రివ్యూలను సంపాదించిపెట్టింది.

ప్రస్తుతం ఈ థ్రిల్లర్‌ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు  నితిన్‌. ఇలాంటి రివ్యూస్‌ అందుకున్న మరో సినిమా ‘పరియేరుమ్‌ పెరుమాళ్‌’. దళిత సిద్ధాంతాలతో, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలతో మారి సెల్వరాజ్‌ రూపొందించిన ఈ చిత్రం కూడా మంచి రివ్యూలను అందుకుంది.దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో శంకర్‌ రూపొందించిన గ్రాఫికల్‌ సృష్టి చిట్టి. ‘2.0’ చూసిన ప్రేక్షకులు ‘హాలీవుడ్‌ సినిమా చూసినట్టే ఉంది’ అని అభినందించారు. ఆ ఆనందాన్ని కోట్లతో కలెక్షన్ల రూపంలో తెలియజేశారు. గత శుక్రవారం సుమారు నాలుగు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. ‘మారీ 2,  అడంగామారు, కానా, సిలుక్కువారిపట్టి సింగం’ సినిమాలు విడుదలయ్యాయి.

మామూలుగా తమిళనాడులో ఒకేసారి ఇన్ని సినిమాలు విడుదల నిషిద్ధం. రూల్‌ బ్రేక్‌ చేసి, థియేటర్లకొచ్చిన ఈ ఐదు సినిమాలూ వసూళ్లు పంచుకుంటున్నాయి. అలా ఈ ఏడాది స్టార్‌ హీరోలు ఫార్ములానే నమ్ముకుంటే.. యంగ్‌ హీరోలు  కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో దూసుకుపోయారు. బాక్సాఫీస్‌ ఆకలి తీర్చడానికి స్టార్‌ హీరోల సినిమాలు.. వంక పెట్టడానికి వీల్లేకుండా రివ్యూలు సాధించిన చిన్న సినిమాలూ ఉన్నాయి. మార్కెట్‌ ఉన్న హీరోలు  డబ్బింగ్‌ సినిమాల ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. అలా తమిళ, తెలుగు ఇండస్ట్రీలు ఎప్పటికప్పుడు మంచి సినిమాలు మార్చుకుంటూ, కొత్త కథలను ఇచ్చి పుచ్చుకుంటూ.. బైలింగువల్స్‌గా కొనసాగాలని కోరుకుందాం. ఇండియన్‌ సినిమా స్థాయిని ఇంకొంచెం పైకి తీసుకెళ్లడానికి కిందుండి (భౌగోళికంగా) కృషి చేద్దాం.

గ్యాంగ్‌స్ట్టర్‌ ఇయర్‌
ఈ ఏడాది ధనుష్‌ ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ చిత్రం ద్వారా హాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. అలాగే వెట్రిమారన్‌ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘వడ చెన్నై’ రిలీజ్‌ అయింది. నార్త్‌ చెన్నైలోని ఓ గ్యాంగ్‌ గురించి చర్చించిన ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్‌ చిత్రాల్లో ఓ డిఫరెంట్‌ అటెంప్ట్‌ అనిపించింది. అలాగే  ‘మారి’ సీక్వెల్‌గా రూపొందిన ‘మారి 2’ను రిలీజ్‌ చేశారు. మరోవైపు ‘రాక్షసన్, పరియేరుమ్‌ పెరుమాళ్‌’ వంటి పేరు సంపాదించిపెట్టిన రెండు చిత్రాల దర్శకులు తమ నెక్ట్స్‌ సినిమాలను ధనుష్‌తో చేస్తున్నట్టు ప్రకటించేశారు.

రజనీ ఎక్స్‌ప్రెస్‌
స్టార్‌ హీరోలు ఏడాదికి ఒక్కసారి కనిపించడమే ఎక్కువ అనుకుంటున్న రోజుల్లో  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రెండు సినిమాలను రిలీజ్‌ చేశారు. మరో సినిమా షూటింగ్‌ కూడా పూర్తి చేశారు. ‘రోబో’ సీక్వెల్‌ ‘2.ఓ’ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తయి విడుదలలో జాప్యం అవుతూ వచ్చి ఈ ఏడాది రిలీజ్‌ అయింది. అలాగే పా. రంజిత్‌ తెరకెక్కించిన ‘కాలా’ జూలైలో రిలీజ్‌ అయింది. ‘కబాలీ’ తర్వాత రజనీతో తీసిన ‘కాలా’ సినిమాతో రంజిత్‌ అన్ని వర్గాల ఆడియన్స్‌ను రంజింపచేయలేకపోయారు. ఇక కార్తీక్‌ సుబ్బరాజ్‌తో రజనీ చేస్తున్న ‘పేట్టా’ షూటింగ్‌ కూడా అనుకున్నదానికంటే 15 రోజుల ముందే కంప్లీట్‌ చేసి ఆశ్చర్యపరిచారు. 

లేడీ సూపర్‌ స్టార్‌
రెండు డిఫరెంట్‌ జానర్ల సినిమాలతో ఈ ఏడాది స్క్రీన్‌పై కనిపించారు నయనతార. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఇమైక్క నొడిగళ్‌’, డార్క్‌ కామెడీ ‘కోకో’ (కోలమావు కోకిల) చిత్రాలు రెండూ సూపర్‌హిట్‌. స్టార్‌ హీరోలకు సమానంగా ‘కోకో’కు చెన్నైలో ఉదయం నాలుగు గంటల షోలు ఏర్పాటు చేయడం విశేషం. నయన్‌ ఫాలోయింగ్‌ ఎలా ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనం.

పాంచ్‌ పటాకా
ఈ మధ్య తమిళ సినిమాల గుర్తించి ప్రస్తావించాలంటే కచ్చితంగా డిస్కస్‌ చేయాల్సిన పేరులా విజయ్‌ సేతుపతి మారిపోయారు. దానికి కారణం ఆయన స్క్రిప్ట్‌ల ఎంపికే. ఈ ఏడాది ఏడు చిత్రాల్లో కనిపించారు సేతుపతి. (రెండు గెస్ట్‌ రోల్స్‌). ‘ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌ (ఓ మంచి రోజు చూసి చెబుతాను) సినిమాతో ఓపెన్‌ చేసి ‘జుంగా, చెక్క చివంద వానమ్, 96, సీతకాత్తి’, సినిమాల్లో కనిపించారు. ‘జుంగా’లో అల్లరి డాన్‌గా కనిపిస్తే, ‘చెక్క చివంద వానమ్‌’లో పోలీస్‌ ఆఫీసర్‌ రసూల్‌గా కనిపించి, పవర్‌ కోసం పరిగెడుతున్న అన్నదమ్ములను ఏరిపారేశారు.  ఆ తర్వాత టాక్‌ ఆఫ్‌ ది సౌత్‌ ఇండస్ట్రీ అయిన ‘96’లో కనిపించారు. జానకి, రామచంద్రన్‌ అనే ఇద్దరి ప్రేమకథను టేప్‌రికార్డర్‌లో పెట్టి రివైండ్‌ బటన్‌ నొక్కి అందర్నీ పాత జ్ఞాపకాల్లో పడేసిన సినిమా ఇది. హీరోగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన 8 సంవత్సరాల్లోనే సేతుపతి 25వ సినిమా (సీతకాత్తి) మైలు రాయి అందుకోవడం విశేషం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top