అనారోగ్యం...పరిష్కార భాగ్యం... | Sakshi
Sakshi News home page

అనారోగ్యం...పరిష్కార భాగ్యం...

Published Thu, Jan 19 2017 1:03 AM

అనారోగ్యం...పరిష్కార భాగ్యం...

యోగా

ఆరోగ్య సమస్యలున్నవారికి  ఆ సమస్యలను తీసివేసేటట్టుగా యోగసాధన ఉండాలి. కొత్త సమస్యలను సృష్టించే విధంగా ఉండకూడదు.
కొందరికి కొన్ని ఆసనాలు సాధన సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు ఛెయిర్‌ యోగా దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటివి ఉన్నవారు కుర్చీని ఉపయోగిస్తే ఆసనాలు వేయడం సులభమవుతుంది. భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకండా పనిచేయడం ద్వారా ఆసనం వేయడం చాలా తేలికవుతుంది. సంప్రదాయపద్ధతిలో చేసే యోగ సాధన ద్వారా ఎంత ఫలితం ఉంటుందో అంతే ప్రయోజనం ఇందులోనూ పొందవచ్చు. పర్వతాసనంలో భిన్న రకాలను కుర్చీ ఆసరాగా సాధన చేసే విధానమిదీ...

1. పర్వతాసనం/అధో ముఖాసనం
ఫొటోలో చూపిన విధంగా కుర్చీలను ఉంచి, రెండు మోకాళ్లను ఒక కుర్చీ మీదకి, చేతుల్ని రెండో కుర్చీ మీదకు తీసుకురావాలి. సౌకర్యంగా అనిపంచకపోతే కుర్చీల మధ్య ఖాళీని సరిచేసుకోవచ్చు. ఆ తర్వాత చేతుల్ని బలంగా కుర్చీకి నొక్కుతూ నెమ్మదిగా మోకాళ్లను పైకి ఎత్తాలి. ఆసనంలో ఉన్నప్పుడు చేతి మణికట్టులో నొప్పి లేకుండా అరచేతుల్ని సరిచేసుకోవాలి. తలను వదులుగా ఉంచి పాదాలను పూర్తిగా కుర్చీలో ఆనించాలి. శరీరం వెనుక భాగంలో కాలి మడమల దగ్గర్నుంచి చేతివేళ్ల కొనల వరకూ ఆరోహణా క్రమంలో ఒక్కో భాగాన్ని అంటే కాలి మడమ, కాలి పిక్క కండరాలు, తొడ కీలు, నడుము, వెన్నెముక మొత్తం, భుజం కీలు, మోచేతులు, చేతి వేళ్ల కొనల వరకూ దృష్టి ఉంచాలి. అలా ఆసనంలో 9 నుంచి 10శ్వాసల పాటు ఉన్న తర్వాత బయటకు రావాలి.
ప్రయోజనాలు: వెన్నుముకలో ఉండే పూసల మధ్య ఒత్తిడి తగ్గించి అవసరమైనంత వదులుగా ఉండేలా బలోపేతం చేస్తుంది.  స్పాండిలైటిస్,  భుజ కండరాలు బిగుసుకుపోవడం... వంటి సమస్యలకు పరిష్కారం. తొడలు, కాలి పిక్కలలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.

2. పర్వతాసనం/అధోముఖశ్వానాసనం
పర్వతాసనంలోకి వచ్చినట్టే వచ్చి రెండు చేతుల్ని బలంగా ఆన్చి నెమ్మదిగా గాలి తీసుకుంటూ కుడి మోకాలిని మడిచి పైకెత్తాలి. తర్వాత కాలిని వీలైనంత వరకూ సరళరేఖలో ఉంచాలి. అలా 5 నుంచి 10శ్వాసల వరకూ ఉన్న తర్వాత నెమ్మదిగా కుడి మోకాలిని మడిచి కిందకి తీసుకురావాలి. ఇదే ఆసనాన్ని ఎడమవైపునకు కూడా చేయాలి.
ప్రయోజనాలు: తొడ కీలును వదులు చేస్తుంది. తద్వారా నడుము ప్రాంతంలో  ఒత్తిడి దూరమవుతుంది. మూత్ర విసర్జన వ్వవస్థకి, ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించిన సమస్యలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది.

3. ప్రసరిత మార్జాలాసనం
కుర్చీలను మ్యాట్‌పై కదలకుండా స్థిరంగా ఉంచాలి. రెండు మోకాళ్లను ఒక కుర్చీ మీదకు తీసుకురావాలి. తర్వాత రెండు చేతుల్నీ రెండవ కుర్చీ మీద ఉంచాలి.  ఇప్పుడు చూడడానికి రెండు చేతుల్ని మోకాళ్లను నేల మీద ఆన్చినట్టుగా ఆసనం ఉంటుంది. తర్వాత రెండు చేతుల్ని కుర్చీ మీద బలంగా ఆన్చి నెమ్మదిగా కుడికాలిని పైకెత్తాలి. కుడికాలిని నేలకు సమాంతరంగా సరళరేఖలా ఉంచాలి. అప్పుడు నెమ్మదిగా ఎడమ చేతిని పైకెత్తాలి. అలా 5 నుంచి 10 శ్వాసల పాటు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ కాలిని చేతిని కిందకు దించాలి. ఇదే విధంగా ఎడమవైపు కూడా చేయాలి. సాధన సమయంలో ధ్యాస అంతా నడుము, తొడ కీలు, తొడ కండరాలపై ఉంచాలి.
ప్రయోజనాలు: వెన్నెముక సంబంధిత సమస్యలు, నడుమును బలోపేతం చేయడానికి ఉపకరిస్తుంది.

 
Advertisement
 
Advertisement