ఆశీస్సులతో అత్తమ్మ

Special Story On National Mother In Law Day In Sakshi Family

ప్రతి అత్తా ఒకప్పటి కోడలే. ప్రతి కోడలూ ఒకనాటికి  కాబోయే అత్తే. వేర్వేరు తరాలను కలిపే బంధమిది. ఇది వట్టి బంధంగా మిగిలిపోతుందా లేక అనుబంధంగా అల్లుకుపోతుందా అన్నది  ఆ అత్తా కోడళ్లను బట్టే ఉంటుంది.  అత్తగారిపై కోడలికి గౌరవభావం ఉండాలి.  కోడలికి అత్తగారి ఆశీస్సులు ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు.. నిత్యం వేడుకల పందిరి అవుతుంది.   

అక్టోబరు నాలుగో ఆదివారాన్ని అత్తగార్ల దినోత్సవంగా ప్రపంచమంతా జరుపుకుంటోంది. అత్తగార్లు ప్రపంచమంతా ఉంటారుగా. మదర్‌ ఇన్‌ లా అని పిలిచినా, సాసు అని బులాయించినా, అత్తయ్య అని పలకరించినా అత్తగారు అత్తగారే. ‘అత్తగారు’ అనే పదం వినపడగానే ఆడపిల్లలు ఉలిక్కిపడతారు. అత్తవారిల్లు అనగానే నెత్తి మీద పిడుగు పడినంతగా అదిరి పడతారు.. ముఖ్యంగా కాబోయే కోడళ్లు! ‘అత్తగారు’ పదానికి గయ్యాళి గంప చేర్చి, ‘గయ్యాళి అత్తగారు’ అని 90 శాతం మంది అనకుండా ఉండలేరు. ఆడపిల్లకు సూర్యకాంతం పేరు పెట్టాలంటే గజగజలాడిపోతుంది ప్రతి తల్లి. రాక్షసి అత్తగారు అనే పేరుకు ప్రతీకగా నిలబడిపోయింది సూర్యకాంతం పేరు. అత్తగార్లు కోడళ్లను ఏడిపించుకు తింటున్నందు వల్లనేనేమో ‘అత్తా ఒకింటి కోడలే’ అనే సామెత పుట్టుకొచ్చి ఉంటుంది. మరో అడుగు ముందుకు వేసి, ‘అత్త లేని కోడలు ఉత్తమురాలు’ అని ఒంటరి కోడలి సౌఖ్యాన్ని వివరించడానికి కూడా ఇదే కారణం కావొచ్చు. పాపం నిజంగానే అత్తగారు అంత రాక్షసిలా ఉంటుందా? కోడలి నుంచి అత్తగారి స్థాయికి ఎదిగిన తరవాత ఆవిడలో ఇంత మార్పు వస్తుందా. ఏమో! వస్తుందేమో మరి!!

ఒక్కసారి త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి ప్రయాణం చేద్దాం.
శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రుడు సీతను చేపట్టాడు. కౌసల్యకు కోడలు అయ్యింది సీతాదేవి. కైకేయి కోరిక ప్రకారం రాముడు అరణ్యవాసానికి బయలుదేరాడు. సీతాదేవి తాను కూడా వెంట వస్తానంది. అప్పుడు కౌసల్య, ‘‘ఈ ఇంటి కోడలు సీతాదేవి. ఆమె నార వస్త్రాలు ధరించవలసిన అవసరం లేదు. ఆమెకు సరిపడా చీనిచీనాంబరాలు, నగలు వెంట ఇచ్చి పంపండి. ఈ ఇంటికి వచ్చిన కోడలిని మర్యాదగా చూసుకోవడం మన వంతు’ అని పలికి, అరణ్యవాసంలో ఉన్నన్ని రోజులు ఆమె ధరించడానికి అవసరమైనదుస్తులు, ఆభరణాలు అన్నింటినీ ఇచ్చి ఆమెను హత్తుకుని దీవించి మరీ పంపింది. కౌసల్య సీతకు అత్తగారే కదా! రాముడితో పాటు లక్ష్మణుడు కూడా అరణ్యాలకు బయలుదేరాడు. లక్ష్మణుడు వచ్చేవరకు ఊర్మిళ గాఢంగా నిద్రపోయింది. ఒక్కనాడు కూడా ఊర్మిళను నిద్ర లేపలేదు సుమిత్ర. ఆవిడ కూడా అత్తగారే కదా!

ద్వాపర యుగంలోకి ప్రవేశిస్తే..!
వ్యాసుడి తల్లి సత్యవతి. ఎంతో లౌక్యం తెలిసిన స్త్రీ. తన కుమారులైన విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు మరణించడంతో కురు వంశం నిర్వంశం అవుతుందని భావించింది. రాజు లేని రాజ్యంగా కూడా మారుతుందని ఒక రాజమాతలా ఆలోచించింది. వ్యాసుడిని స్మరించుకుని, తన కోడళ్లకు సంతానం ప్రసాదించమని కోరింది. సత్యవతిని మించిన అత్తగారు ఉంటుందా! ఆ రోజు ఆవిడ బాధ్యత గల అత్తగారిగా ఆలోచన చేసి ఉండకపోతే, ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురులు జన్మించేవారే కాదుగా. అసలు కురు వంశమే అంతమైపోయేది కదా. వంశం నాశనం కాకుండా చూసిన సత్యవతి సాక్షాత్తు అత్తగారు.పాండురాజుని వివాహమాడిన కుంతి... దేవతల వర ప్రభావంతో ముగ్గురు కుమారులకు జన్మనిచ్చింది.

మాద్రికి ఇద్దరు సంతానం కలిగారు. పాండురాజు గతించిన తరువాత, హస్తినాపురానికి వచ్చింది కుంతి. ధర్మరాజుతో దుర్యోధనుడు మాయా జూదం ఆడి, పాండవులను ఓడించి, ద్రౌపదిని దాసిగా సంబోధిస్తూ, వస్త్రాపహరణం చే శాడు. కృష్ణుని సహాయంతో ద్రౌపది మానం కాపాడుకుంది. పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసి, ఒప్పందం ప్రకారం తమ రాజ్యం తమకు ఇమ్మని రాయబారం పంపారు. వాడి సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వనని దుర్యోధనుడు మొండికేయడంతో, పాండవులు యుద్ధానికి సన్నద్ధులయ్యారు. దాయాదుల సంరక్షణలో ఉన్న తల్లి కుంతిని చేరి, విషయం వివరిస్తారు. అప్పుడు కుంతీదేవి, ‘నా కోడలు ద్రౌపది చెప్పిన ప్రకారం నడుచుకోండి. ఆమె ప్రతిజ్ఞను దృష్టిలో ఉంచుకుని యుద్ధం నడపండి’ అంది కుంతి. అక్కడ కుంతీదేవి అత్తగారిలా మాట్లాడింది. ఒక తల్లిగా ఆలోచించలేదు. హిడింబికి భీముడి మీద అనురాగం కలిగినప్పుడు, కుంతీదేవి అనుమతితోనే హిడింబి భీముని వివాహమాడింది. ఇంతమంది మంచి అత్తగార్లను మన పురాణాలు మనకు ఆదర్శంగా చూపాయి. 

మరి ఇప్పుడో?!
ఏ సీరియల్‌ చూసినా అత్తగారు ఒక విలన్‌గానే కనపడుతోంది. కోడల్ని చిత్ర హింసలు పెట్టడం, ఆమెకు ప్రత్యక్ష నరకం చూపడం అత్తగారి ధ్యేయంగా చూపుతూ రేటింగ్‌ పెంచుకుని, కాసుల వర్షాలు కురిపించుకుంటున్నాయి నిర్మాణ సంస్థలు. ఏ మాత్రం బాధ్యత లేనివారి ఆలోచన నుంచి వచ్చినవే ఈ కథలు. ఏది ఎలా ఉన్నా.. కోడలిని అత్తగారు కూతురుగా బుజ్జగించాలి. అత్తగారిని కోడలు తల్లిగా ప్రేమించాలి.  – వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top