పనే చెయ్యని మగాళ్లతో కలిసి పని చేసేదెలా?!

Special Story on Britain MP Theresa May - Sakshi

ప్రపంచ సమస్య

మాధవ్‌ శింగరాజు

మగవాళ్లు ఆడవాళ్ల మీద వేసుకునే జోకులు ‘బాయిష్‌’గా ఉంటాయి. కానీ, ఆడవాళ్లు మగవాళ్ల మీద వేసుకునే జోకులు ‘గర్లిష్‌’గా ఉండవు. మెచ్యూరిటీతో ఉంటాయి. మగవాళ్లకు ప్రకృతి ప్రసాదించిన ఈ ఎదుగుదల లేమి ఆడవాళ్ల పనితీరుపై నెగటివ్‌గా ప్రభావం చూపితే, ఆడవాళ్లకున్న ఈ మెచ్యూరిటీ మగవాళ్ల పనితీరును మెరుగుపరిచేలా ఉంటుంది!  

బ్రిటన్‌లో బుధవారం ప్రభుత్వం మారింది. పార్టీ అదే. కన్సర్వేటివ్‌ పార్టీ. థెరెసా మే తప్పుకుని, ఆమె ప్లేస్‌లోకి బోరిస్‌ జాన్సన్‌ అనే ఆయన ప్రధానిగా వచ్చారు. ఆయన జుట్టు పాలిపోయిన పసుపు రంగులో (బ్లాండ్‌) ఉంటుంది. మనిషి పరుగులు తీసే (బాయెంట్‌) పాదరసంలా ఉంటారు. ఇక ఆయన మూడో ఆనవాలు విదూషకత్వం (బఫూనిష్‌). ఈ మూడు గుర్తింపులను కలిపి అక్కడవాళ్లకు జాన్స¯Œ  తరచూ బ్లాండ్, బాయంట్, బఫూనిష్‌గా ప్రస్తావనలోకి వస్తుంటారు. థెరెసా మే ప్రధానిగా ఉన్న ఈ మూడేళ్లూ వెస్ట్‌మినిస్టర్‌ ప్యాలెస్‌లో ఆమెను వేపుకు తినేందుకు విఫలయత్నం చేసిన ఐడెంటిటీ కూడా జాన్సన్‌కి ఉంది. వెస్ట్‌మినిస్టర్‌ ప్యాలెస్‌ ఆ దేశ పార్లమెంటు భవనం. ప్రధాని పదవీకాలం ఐదేళ్లు అయినప్పటికీ థెరిసా మే మూడేళ్లకే మెట్లు దిగేయడానికి పార్టీలో ప్రధాన కారకుడు జాన్సనే! థెరెసా మంత్రివర్గంలో జాన్సన్‌ విదేశాంగ కార్యదర్శిగా ఉండేవారు. గత ఏడాది జూలైలో ‘నాకు ఈ మంత్రి పదవి వద్దు. థెరెసా ‘బ్రెగ్జిట్‌’ విధానాలు నచ్చడం లేదు’ అని జాన్సన్‌ బయటికి వచ్చేశారు. తర్వాత తన వాదనకు మద్దతు కూడగట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని అయ్యారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ను నష్టం, కష్టం లేకుండా థెరెసా బయటికి తీసుకురాలేక పోతున్నారని జాన్సన్‌ ఆరోపించారు కనుక ఇకపై ఆయనే బ్రిటన్‌ను సమాఖ్య నుంచి లాభంగా, లాఘవంగా బయటికి తెప్పించాలి. థెరెసా వల్ల కానిది జాన్సన్‌ వల్ల అవుతుందా! విదేశాంగ కార్యదర్శిగా ఉన్న రెండేళ్లూ జాన్సన్‌ బఫూనిష్‌గానే ఉన్నారు. లిబియాలో మారణ హోమం జరుగుతుంటే.. ‘కుప్పలు తెప్పలుగా పడి ఉన్న శవాలనన్నింటినీ ఎత్తి పారేస్తే లిబియన్‌ నగరాలు మంచి టూరిస్ట్‌ స్పాట్‌లు అవుతాయి’ అని ఆయన అనడం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు! క్రిటిక్స్‌ ఆయన్ని ‘బ్రిటన్‌ ట్రంప్‌’ అంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బ్రిటన్‌ ప్రధాని అయ్యారు.

ప్రధాని పదవిని వదులుకున్నాక లార్డ్‌ గ్రౌండ్‌లో ఉల్లాసంగా క్రికెట్‌ చూస్తున్న థెరెసా మే
థెరెసా తప్పుకుని, జాన్సన్‌ ఎన్నికను ఎలిజబెత్‌ మహారాణి ఆమోదించాక గురువారం నాడు జాన్సన్‌ బ్రిటన్‌ కొత్త ప్రధానిగా తొలి ప్రసంగం చేస్తున్నప్పుడు థెరెసా పార్లమెంటు భవనంలోనే లేరు! ఆ సమయానికి ఆమె లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఐర్లండ్‌పై ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ప్రతీకారం తీర్చుకుంటూ ఉన్న దృశ్యాలను ఎంతో ఇష్టంగా వీక్షిస్తూ కూర్చున్నారు. బ్రిటన్‌లో ఎన్నడూ లేనంతగా కాస్తున్న ఆ ఎండ పూట, నీడ పడుతున్న చోట ప్రత్యేక ఆతిథ్యంతో ఆసీనురాలై, అంచుకు చిన్న నిమ్మ చెక్క గుచ్చి తెచ్చిన గ్లాసులోని నిమ్మరసాన్ని స్ట్రాతో పీలుస్తూ, చిరునవ్వులు చిందిస్తూ ఆటను మొత్తం ఆస్వాదించారు. జాన్సన్‌ బాయిష్‌ టాక్‌లో వినేందుకు ఏముంటుందని ఆమె అనుకున్నట్లున్నారు. అంతకన్నా విశేషం ఆ ముందు రోజు జరిగింది.

బయటికి వెళుతున్న బ్రిటన్‌ ప్రధాని ఎవరైనా చివరి ప్రసంగం ఇవ్వవలసి ఉంటుంది. ప్రసంగం తర్వాత ‘ప్రశ్నలు–జవాబుల’ కార్యక్రమం ఉంటుంది. సభ్యులు ప్రశ్నలు అడుగుతారు. ప్రధాని సమాధానాలు ఇవ్వాలి. ఆ సెషన్‌లో జో స్విన్‌సన్‌ అనే ఒక మహిళా ఎంపీ థెరెసాను అడిగారు.. ‘‘దేశంలోని మహిళలకు మీరేం సలహా ఇస్తారు? పనిలో తమను మించినవారు లేరని ఊరికే చెప్పుకుంటూ తిరిగే మగాళ్లతో కలిసి పని చేయవలసి వచ్చినప్పుడు మహిళలు ఎలా డీల్‌ చెయ్యాలి?’’ అని! ఒక్కసారిగా అంతా నవ్వేశారు. జాన్సన్‌ని దృష్టిలో పెట్టుకునే ఆమె ఆ ప్రశ్న అడిగారని అర్థమై థెరెసా నవ్వు ఆపుకున్నారు. సమాధానం చెప్పబోతుంటే నవ్వు అడ్డు పడి కాస్త ఆగారు. తర్వాత చెప్పారు. ‘‘మై అడ్వైజ్‌.. (మళ్లీ నవ్వు).. మహిళలందరికీ నేను చెప్పేది ఒకటే. నిజాయతీగా పని చేయండి. పని చేస్తూనే ఉండండి. మీరు ఏ లక్ష్యం కోసం పని చేస్తున్నారో ఆ పనిని చేయడమే మీ లక్ష్యంగా చేసుకోండి’’ అన్నారు. ప్రశ్న అడిగిన జో స్విన్‌సన్‌ ‘లిబరల్‌ డెమోక్రాట్‌’ పార్టీ తొలి మహిళా నాయకురాలు. ఈ వారంలోనే ఆమె తన పార్టీ లీడర్‌గా ఎన్నికయ్యారు. అధికారంలో ఉన్న ‘కన్జర్వేటివ్‌’, అపోజిషన్‌లో ఉన్న ‘లేబర్‌’ పార్టీలు కాకుండా బ్రిటన్‌ పార్లమెంటులో ఉన్న అనేక ఇతర పార్టీలలో లిబరల్‌ డెమోక్రాట్‌ కూడా ఒకటి. ఆ పార్టీ లీడర్‌గా ఎన్నికైనందుకు జో స్విన్‌సన్‌కు ‘ప్రశ్నలు–సమాధానాలు’ సెషన్‌లో థెరెసా అభినందనలు తెలిపారు. మిగతా పార్టీలలో కూడా చాలా వాటికి మహిళలు ఫ్లోర్‌ లీడర్‌లుగా ఉన్నారు. ఆ సంగతిని కూడా థెరెసా గుర్తు చేశారు. ‘‘పని పట్ల మహిళల్లో ఉండే నిబద్ధతే వాళ్లకు పార్టీ నాయకత్వాన్ని దక్కిస్తుంది’’ అన్నారు. అవన్నీ సున్నితంగా జాన్సన్‌ను ఉద్దేశించి అన్నవే. మరి నిబద్ధత ఉన్న థెరెసా ఎందుకని పార్టీ నాయకత్వం నుంచి, ప్రధాని పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది! గత ఏడాది డిసెంబరులో, ఈ ఏడాది జనవరిలో ఆమె రెండుసార్లు అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గినప్పటికీ.. బ్రెగ్జిట్‌ నిబంధనలు, షరతులపై ఏకాభిప్రాయం సాధించకపోతే కనుక ప్రధానిగా తప్పుకుంటానని గత మార్చిలో ప్రకటించారు కనుక ఆ మాటకు నిబద్ధురాలై ఆమె తన పదవిని వదులుకున్నారు. ఇక ఇప్పుడు ఎంపీగా మాత్రమే థెరెసా వెస్ట్‌మినిస్టర్‌ ప్యాలెస్‌కు వెళ్లి వస్తుంటారు. బ్రిటన్‌ ఐరోపా సమాఖ్య నుంచి విడిపించడం కన్నా తక్కువ పనేం కాదు బాయిష్‌ టాక్‌ను కట్టడి చెయ్యడం.  

ఇక ఇప్పుడు ఎంపీగా మాత్రమే థెరెసా
వెస్ట్‌మినిస్టర్‌ ప్యాలెస్‌కు వెళ్లి వస్తుంటారు. బ్రిటన్‌ను ఐరోపా సమాఖ్య నుంచి విడిపించడం కన్నా తక్కువ పనేం కాదు.. పని చేసే చోట బాయిష్‌ టాక్‌నుకట్టడి చెయ్యడం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top