
రొమ్ముపైన కనిపించే ఏ చిన్న లక్షణాన్ని చూసైనా... అదిగో పులి అన్నట్లుగా ఇప్పుడు బెదరాల్సిన అవసరం లేదు. ఆ పులిని చెలరేగకుండా చూసి, అదుపు చేసే ఎన్నో చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అదిగో పులి అని భయపడుతున్నప్పుడు... ఇదిగో తోక అంటూ బెదరగొట్టే వారి అపోహలకూ ఇప్పుడు వెరవనక్కర లేదు. ఎందుకంటే అవి అపోహలన్న విషయం గ్రహించి వాస్తవాలు తెలుసుకుంటే చాలు. భయాలూ, గియాలూ అన్నీ బెదిరిన పులిలా పరారవుతాయి. మనం చిన్నప్పుడు వినే కథలు అలా మెదడులోకి కూరుకుపోతాయి. మనసులో కూర్చుండిపోతాయి. ఎప్పటికీ గుర్తుంటాయి. అందుకే రొమ్ముక్యాన్సర్ గురించి అనేక విషయాలను కథలా చెబుతున్నారు ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యనిపుణులు, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సీహెచ్. మోహనవంశీ. రొమ్ము క్యాన్సర్ కథను తెలుసుకోండి. అవగాహన పెంచుకోండి.
ఇది కథ వెనక కథ...
ఇక్కడ రొమ్ము క్యాన్సర్‌ది అసలు కథ. అయితే ఆ అసలు కథ చదివే ముందు ఆ కథ వెనుక క«థను కాస్త చూద్దాం. ఈ కథను చిన్నప్పుడు మనమంతా చదువుకున్నాం. గంగిగోవుకు పులి ఎదురైంది. చంపి తినేస్తానంది. గోమాత మాతృమూర్తి కదా. అందుకే ‘మునుమును పుట్టిన ముద్దుల పట్టి’... తన లేగదూడకు మనస్పూర్తిగా పాలుపట్టి వస్తానంది. మన కథలో గోమాత సమస్త మహిళా లోకానికి ప్రతీక. ఎదురుగా ఉన్న పులి... రొమ్ము క్యాన్సర్‌కు ప్రతినిధి.
ఇప్పుడు అసలు కథకు వద్దాం...
గిలిపుట్టించే ఈ పులి అసలెలా పుట్టింది? ఆధునికత ప్రధాన కారణం. అందుకే రొమ్ముక్యాన్సర్ నగర పట్టణప్రాంతాల్లో చాలా ఎక్కువ. ఆధునికతతో వచ్చే ఆకర్షణ పులి చారలంత అందంగా కనిపిస్తుంటుంది. కానీ అది తెచ్చే అనర్థాలే పులి గోర్లూ, కోరలంత ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఇప్పుడు చాలా మంది యువతులు... కెరీర్ కోసం అంటూ చాలాకాలం పాటు పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. 30 ఏళ్లు దాటితేగానీ గర్భధారణకు ప్లాన్ చేసుకోవడం లేదు. అందం చెడుతుందనే అపోహతో పాపాయిలకు పాలు పట్టడం లేదు. వేళకు తినడం లేదు. మంచి పోషకాహారం తీసుకోవడం లేదు. కాలుష్యాలకు దూరంగా ఉండటం లేదు. ఇలాంటి ఎన్నో అంశాలన్నీ కలగలసి రొమ్ముక్యాన్సర్ అనే పులిని పుట్టిస్తున్నాయి. గంగిగోవుల్లాంటి మహిళల ముందు నిలిచి బెంబేలెత్తిస్తున్నాయి.
రొమ్ము క్యాన్సర్... అపోహలూ, వాస్తవాలు
చికిత్స
సాంప్రదాయిక క్యాన్సర్ చికిత్స ప్రక్రియల్లో శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఉంటాయన్న విషయం తెలిసిందే. అవసరాన్ని బట్టి డాక్టర్లు ఏ ప్రక్రియను తొలుత చేయాలో... ఏయే కాంబినేషన్లలో చేయాలో నిర్ణయిస్తారు. ఇప్పుడు శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ, రేడియోషన్ చికిత్సల్లో చాలా అధునాతన ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. కీమోథెరపీలో: ఇందులో ఎన్నో కొత్త మందులు అందుబాటులోకి రావడంతో ఇదివరలోలాగ శరీరం మీద వాటి దుష్ప్రభావాల తీవ్రత బాగా తగ్గిపోయింది. ఒకసారి కీమో ఇచ్చాక కూడా క్యాన్సర్ మళ్లీ వస్తే గతంలో అయితే ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త మాలిక్యూల్స్ వల్ల, నోటి ద్వారా తీసుకునే ఓరల్ కీమోథెరపీ మందుల వల్ల జీవిత కాలన్ని గణనీయంగా పొడిగించే అవకాశాలున్నాయి.
రేడియేషన్ థెరపీలో: ఒకప్పుడు వ్యాధికి గురైన రొమ్ము భాగానికి రేడియేషన్ ఇస్తే... దాంతో పాటు శ్వాసకోశ వ్యవస్థ, గుండె కూడా దుష్ప్రభావానికి లోనయ్యేవి. కానీ ఇప్పుడు కొత్త రకం రేడియేషన్ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఐఎమ్‌ఆర్‌టీ (ఇంటెన్సివ్ మాడ్యులేటెడ్ రేడియో థెరపీ), ఐజీఆర్‌టీ (ఇమేజ్ గైడెడ్ రేడియో థెరపీ)లతో వి–మ్యాట్ సాంకేతికత సహాయంతో రేడియేషన్ ఇస్తే రోగగ్రస్తమైన భాగానికి చాలా వేగంగా రేడియేషన్ అందించడం ఇప్పుడు సాధ్యమవుతోంది. పైగా, దీనివల్ల ఆ పొరుగున ఉండే సాధారణ కణజాలానికి ఏమాత్రం హాని కలగదు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన పార్షియల్ బ్రెస్ట్ రేడియేషన్ అనే విధానం ద్వారా మొత్తం రొమ్ముకు కాకుండా కణితి ఉన్న చోటే రేడియేషన్ ఇవ్వడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. అంతేకాదు...
ఇప్పుడు ఇంట్రా ఆపరేటివ్ రేడియో థెరపీ ప్రక్రియల ద్వారా సర్జరీ చేస్తున్నప్పుడే రేడియేషన్ ఇవ్వడమూ ఒకసారి పూర్తయ్యేలాంటి చికిత్స అందుబాటులో ఉన్నాయి. సైబర్‌నైఫ్ సహాయంతో చేసే పార్షియల్ రేడియేషన్‌తో ఒక్కరోజులో చికిత్స పూర్తవుతుంది. ఇవేగాక హార్మోన్ థెరపీ మరియు మోనోక్లోనల్ యాంటీబాడిస్ వంటి అధునాతనమై ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. దాంతో ఇప్పుడు అన్ని రకాల రొమ్ము క్యాన్సర్లకు దాదాపుగా పూర్తి చికిత్స సాధ్యమేనని చెప్పవచ్చు.
చివరగా ఇంకో పులి కథ...
యువతులు, మహిళలు నిత్యం చేసుకునే స్వీయ రొమ్ము పరీక్షలతో పాటు రిస్క్ ఉన్నవారు ప్రతి ఏడాదీ లేదా డాక్టర్ చెప్పిన నిర్ణీత వ్యవధిలో అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఎలాగూ రొమ్ము క్యాన్సర్‌ను పులితో పోల్చుకున్నాం కాబట్టి... మరో జాగ్రత్త! ప్రతిసారీ రొమ్ముక్యాన్సర్ వచ్చిన దాఖలాలేమీ కనిపించడం లేదు కదా అని... ‘నాన్నా పులి’ కథలో కొడుకు పరాచికాలకు విసిగిపోయిన తండ్రిలా ఎప్పుడూ నిర్లక్ష్యం వహించకూడదు. ఏమో ఈసారి నిజంగానే పులి కనిపించే ప్రమాదం ఉందేమో! ఇక ఆఖరున... చాలా సందర్భాల్లో చికిత్సతో ఎంతటి రొమ్ముక్యాన్సర్ అయినా తగ్గేందుకే అవకాశాలెక్కువ. ఇలా చూస్తే ఈ రొమ్ముక్యాన్సర్ కథలో –క్యాన్సర్ పులి కంచికి!... రోగి క్షేమంగా, ఆరోగ్యంగా ఇంటికి!!