శిక్ష ‘ఆటో’మాటిక్‌

Special Story On Auto Shankar In Tamilanadu - Sakshi

కొందరు నేరస్తులు తమకు తాముగా తయారు అవుతారు. కొందరిని వ్యవస్థ తన అవసరాల కోసం బలవంతులను చేస్తుంది. బుట్టలోని పామును చూపి డబ్బు దండుకునేవాడి అవసరం తీరే వరకే ఆ పాముకు గుడ్డూ పాలూ.ఆ తర్వాత? చట్టం తన పని తాను మొదలెడుతుంది.ఆటో శంకర్‌ జీవితం నేరంతో మొదలై శిక్షతో ముగుస్తుంది.నేరం ఎప్పుడూ శిక్షతోనే ముగుస్తుందని అతనిపై తీసిన తాజా వెబ్‌ సిరీస్‌ప్రేక్షకులకు చూపెడుతోంది. చూడండి.

రియల్‌ ఆటో శంకర్‌ గురించి...
గౌరీ శంకర్‌.. 1955లో తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో పుట్టాడు. పెయింటింగ్, డాన్స్, యాక్టింగ్‌ పట్ల ఉన్న ఆసక్తితో మద్రాస్‌ వచ్చాడు. పెరియార్‌ నగర్‌లో కొన్నాళ్లు పెయింటర్‌గా పనిచేశాడు కూడా. సినిమాల్లో అవకాశాలు రాకపోయేసరికి, రావనీ తెలిసీ నేరప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇది 1980 లనాటి సంగతి. అప్పుడు కల్తీసారాకు ఆటోలే ముఖ్యమైన రవాణా సాధనాలుగా ఉండేవి. ఆటో కూడా నడుపుతున్న శంకర్‌ అతి తక్కువ కాలంలోనే పేరుమోసిన లిక్కర్‌ స్మగ్లర్‌ అయ్యాడు. తన తమ్ముడు మోహన్, బావ ఎల్దిన్‌తో కలిసి ఇంకొంతమంది నమ్మకస్తులైన అనుచరగణంతో సొంత గ్యాంగ్‌ను  తయారు చేసుకున్నాడు. ఫ్లష్‌ ట్రేడ్‌లోకి దిగిన ఆరునెలలకే మద్రాస్‌ను సెక్స్‌వర్కర్స్‌ కేంద్రగా మార్చాడు. 1995లో అరెస్ట్‌ అయ్యాడు. సోదాల్లో పోలీసులకు అతని డైరీ దొరికింది. అందులో మద్రాస్‌లోని పలు ర్యాంకుల్లో ఉన్న పోలీస్‌ అధికారులు శంకర్‌తో కలిసి ఉన్న ఫోటోలూ ఉన్నాయి. వాళ్లందరినీ సస్పెండ్‌ చేశారు. పలు హత్యల్లో నేరస్తులుగా రుజువైన శంకర్, అతని ముఖ్య అనుచరులు ఎల్దిన్, శివాజీలను అదే యేడు అంటే 1995లోనే సేలమ్‌ జైలులో ఉరితీశారు. 

‘‘మా నాన్న రోజూ తాగొచ్చి అమ్మను కొట్టేవాడు. పాపం.. పిచ్చి అమ్మ... సహించి, సహించి ఆ దెబ్బలకు తట్టుకోలేక ఓ రోజు ఇంట్లోంచి వెళ్లిపోయింది. మా నాన్నేం ఊరుకోలేదు. ఇంకో ఆవిడను పెళ్లి చేసుకున్నాడు. నేను అనాథనయ్యా’’ ఆపాడు ఆ అబ్బాయి కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా.

‘‘ఏడుస్తున్నావా? ఏడ్వొద్దు. పగ ప్రతీకారాలతో కాదు ధైర్యంగా బతకాలి. నేనూ మీ నాన్నలాంటి వాడినే. తాగుడు అలవాటై రోజుల తరబడి ఇంటికే వెళ్లకపోయేవాడిని. ఇంటి బాధ్యత అంతా నా భార్యే చూసుకునేది. అలా ఒకసారి ఇంటికెళ్లా. ఇంకో మగాడితో కనిపించింది. వయసులో ఉంది.. ఏం చేస్తుంది? అయినా కోపంతో రగిలిపోయా. ఆమె కళ్లల్లో పశ్చాత్తాపం. అది చూసి మౌనంగా అక్కడి నుంచి నేను వెళ్లిపోవాల్సింది. కాని..ఆవేశంతో నా భార్య గొంతు నులిమి చంపేశా. పధ్నాలుగేళ్లు జైల్లో మగ్గి జీవితం నాశనం చేసుకున్నా. నిజానికి నా తప్పు వల్లే ఇదంతా జరిగింది. అప్పుడే బాధ్యతగా ఉన్నా సరిపోయేది. నా భార్యను వదిలేసినా.. ఆమె మానాన ఆమె ప్రశాంతంగా ఉండేది. నేనూ జైలుపాలయ్యే వాడిని కాదు. అందుకే భవిష్యత్‌లో ఎప్పుడైనా మీ అమ్మ, నాన్న కనిపిస్తే.. ఆవేశపడకు. వాళ్ల కళ్లల్లోకి సూటిగా చూడు.. పశ్చాత్తాపం కనిపిస్తుంది’’ అని చెప్పాడు ఓ పెద్దాయన. 

ఒకరి అనుభవం ఇంకొకరికి పాఠమే. లక్ష్యపెట్టి ఆచరిస్తే! అయితే ఆ అబ్బాయి లైఫ్‌ నేరస్తుడిగా టర్న్‌ తీసుకుంది.. ఉరిశిక్షతో ఎండ్‌ అయింది. 1980–90ల్లో మద్రాస్‌ నేర సామ్రాజాన్నేలిన డాన్‌ గౌరీ శంకర్‌ రియల్‌ స్టోరీ ఆధారంగా జీ5 నిర్మించిన  ‘ఆటో శంకర్‌’’ వెబ్‌సిరీస్‌ ఇది. ఆ చానెల్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. 

వెబ్‌ ప్లే..
మొదట్లోనే చెప్పుకున్నట్టుగా అమ్మానాన్న ఉన్న అనాథ శంకర్‌. పెరిగిపెద్దయ్యాక జీవనోపాధికి ఆటో నడుపుతుంటాడు. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ టైమ్‌లోనే రామ్‌జయన్‌ అనే వ్యక్తి సారా స్మగ్లింగ్‌ చేస్తూ ఇటు పోలీసులు, అటు రాజకీయ నాయకులకూ పెద్ద తలనొప్పిగా తయారవుతాడు. అప్పుడే ఆటో శంకర్‌.. ధైర్య సాహసాలు ఆ ఏరియా పోలీస్‌ ఆఫీసర్‌  కంట పడ్తుంది. ఈ శంకర్‌తో రామ్‌ జయన్‌కు చెక్‌ పెట్టించొచ్చని తనకు దగ్గరగా ఉన్న మంత్రికి చెప్పడమే కాక ప్లాన్స్‌ కూడా వేస్తాడా పోలీస్‌ అధికారి. 

రాత్రికి రాత్రే..
అనుకున్నట్టుగానే శంకర్‌ను రామ్‌ జయన్‌కు పోటీగా తయారు చేస్తాడు. శంకర్‌ సారా స్మగ్లింగ్, ఫ్లష్‌ ట్రేడింగ్‌కు మార్గం సుగమం చేస్తాడు ఆ పోలీస్‌ అధికారి. అట్లా రామ్‌ జయన్‌ వ్యాపారాన్ని, ఆధిపత్యాన్ని కూలదోస్తారు. పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలతో రాత్రికి రాత్రే డాన్‌ అవుతాడు గౌరీ శంకర్‌ ఉరఫ్‌ ఆటో శంకర్‌. అడ్డు తగిలిన పోలీసులకు మామూళ్లు పడేస్తూ మచ్చిక చేసుకుంటూంటాడు.  ఒకరోజు చంద్రిక అనే అమ్మాయి తారస పడ్తుంది. ప్రేమించిన వ్యక్తిని నమ్మి... అయిన వాళ్లందరినీ వదిలి మద్రాస్‌ వచ్చేస్తుంది. తీరా ప్రేమించిన వాడు ఆమెను వ్యభిచారంలోకి దింపుతాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు... ఆటో శంకర్‌కు అనుచరుడే. ఆమె కథ విని చలించిపోతాడు. చంద్రికను ప్రేమించడం మొదలుపెడ్తాడు. శంకర్‌  ఇక నుంచి ఆమె వ్యభిచారం చేయదు అని తన అనుచర వర్గానికి చెప్తాడు. ఆ మాట చంద్రిక ప్రేమికుడికి నచ్చదు. అయినా మిన్నకుంటాడు. తన భర్త చంద్రికను ఇష్టపడ్తున్నాడన్న విషయంతోపాటు అతని వ్యాపారాల గురించీ తెలిసిన శంకర్‌ భార్య చంకలో ఒక బిడ్డ, కడుపులో మరో బిడ్డతో ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. డబ్బుకు కటకటలాడి ఆమె వచ్చేస్తుందిలే అనే నిర్లక్ష్యంలో ఉంటాడు శంకర్‌. కాని ఆమె ఎప్పటికీ తిరిగి రాదు. 

ఏకు మేకైతే...
ఈలోగా మంత్రికి చంద్రిక గురించి తెలుస్తుంది. ఆమెను తన దగ్గరకు పంపించమని ఆటో శంకర్‌కు కబురు చేస్తాడు. పట్టించుకోడు శంకర్‌. మంత్రికి కోపమొస్తుంది. ‘‘మనం తయారు చేసినవాడే మనల్ని బేఖాతరు చేయడమేంటి? అంటూ పోలీస్‌ అధికారిని హెచ్చరిస్తాడు మంత్రి.. అప్పుడా పోలీస్‌ కలగజేసుకుని శంకర్‌ను  బెదిరిస్తాడు నెమ్మదిగా.. చంద్రికకు నచ్చజెప్పి మంత్రి దగ్గరకు పంపిస్తాడు శంకర్‌. ఆ రోజే చంద్రికను ప్రేమించిన వ్యక్తి తాగి ఆమె గురించి అసభ్యంగా మాట్లాడ్తుంటే భరించలేక తన అనుచరులతో కలిసి అతణ్ణి సజీవంగా దహనం చేస్తాడు శంకర్‌. ఇంకో వైపు చంద్రికను అడ్డం పెట్టుకొని మంత్రితో తన వ్యాపారాన్ని విస్తరింపచేసుకుంటూంటాడు. గదుల్లో రహస్య కెమెరాలు అమర్చి  సెక్స్‌ వర్కర్స్‌ దగ్గరకు వస్తున్న పలుకుబడి మనుషులు, నేతలు, అధికారుల ఫోటోలు తీసి దాస్తుంటాడు.

గవర్నర్‌ పాలన..
ఈలోపు మద్రాస్‌లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎమ్జీఆర్‌ చనిపోవడంతో ఆ పార్టీ రెండుగా చీలిపోతుంది. ఆ గొడవల్లో గవర్నర్‌ పాలన వస్తుంది.  అంతే వేగంగా శంకర్‌ నేర సామ్రాజ్యమూ విస్తరించుకుంటుంది మహాబలిపురం వరకు.  అడ్డొచ్చిన తన ముఖ్యమైన అనుచరులను, తన మాట వినని సెక్స్‌ వర్కర్‌ లలితనూ  చంపేసి.. ఆ శవాలను పాతింటి గోడల్లో, నేలలో పాతి పెడ్తాడు. లలితను చంపుతుంటే ఆమె ప్రేమికుడు, శంకర్‌ అనుచరుడు బాబు చూస్తాడు. మిగిలిన హత్యలూ శంకరే చేశాడని అనుమానపడ్తాడు కూడా. దాంతో పోలీసులకు అప్రూవర్‌గా మారిపోతాడు. ఆ అవకాశం కోసమే కాపు కాస్తున్న పోలీసులు బాబు సహాయంతో ఆ శవాలన్నిటినీ వెలికి తీస్తారు. ఈ వార్త శంకర్‌కు చేరుతుంది. తాను రహస్యంగా తీసిన పెద్ద మనుషుల ఫోటోలను చంద్రికకిచ్చి.. పోయి లాయర్‌ను మాట్లాడమంటాడు. తానూ కొంత డబ్బు తీసుకొని భార్యను వెదుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్తాడు. వాకిట్లోంచే పంపించేస్తుంది భార్య. కనీసం పిల్లలనైనా చూడనివ్వమని అడిగినా వినకుండా. శంకర్‌  బయటకు వచ్చేసరికే ఆ ఇంటి చుట్టూ మోహరించిన పోలీసులు అతణ్ణి  అరెస్ట్‌ చేసేస్తారు. ఆ నాటికి ఆరు హత్యల్లో నిందితుడిగా ఉంటాడు శంకర్‌. 

ఖైదీ నంబర్‌ 203
శంకర్‌ ఇచ్చిన ఫోటోలతో నేరుగా మంత్రి దగ్గరకి వస్తుంది చంద్రిక. ఆమె అందించిన వివరంతోనే శంకర్‌ను అరెస్ట్‌ చేస్తారు పోలీసులు. ప్రతిగా ఆమెను ఆ పార్టీ మహిళా నాయకురాలిగా చేస్తానని మాటిస్తాడు మంత్రి. కోర్టులో శంకర్‌ నేరాలూ రుజువవుతాయి. ఉరి శిక్ష ఖరారు అవుతుంది. మద్రాస్‌ సెంట్రల్‌ జైల్లో ఖైదీ నంబర్‌ 203గా కాలం వెళ్లబుచ్చుతూంటాడు శిక్ష అమలు అయ్యే వరకు. తనను పట్టించింది  చంద్రికే అని తెలుస్తుంది శంకర్‌కు.  జైల్లో తన తోటి ఖైదీని చూడ్డానికి వస్తున్న అతని భార్యతో మాట కలుపుతాడు. స్నేహం చేస్తాడు శంకర్‌. ఎంతలా అంటే.. ఆమె హెల్ప్‌తో ఆ జైల్లోంచి పారిపోయి.. బాబు, చంద్రికల పని పట్టేంతగా. ఆ క్రమంలో తన తండ్రి ఇంటికి వెళ్లిన శంకర్‌ను గదిలో బంధించి పోలీసులకు పట్టిస్తుంది అతని సవతి తల్లి.

ఉరి..
శంకర్‌ ఉరిశిక్షను ఆపేందుకు అతని భార్య రాష్ట్రపతికి క్షమా భిక్ష పెట్టుకుంటుంది. కాని దొరకదు. చివరి రోజు భార్య చేతి భోజనం తినాలనుకుంటాడు. తెస్తుంది, అన్నం తినిపిస్తుంది ఆమె. ‘‘పిల్లల్ని తీసుకొస్తావనుకున్నా’’ అంటాడు శంకర్‌. ‘‘ఇప్పటి వరకూ వాళ్లకు నువ్‌ లేవు.. ఇక నుంచీ ఉండవ్‌. ఈ ఒక్క పూట మాత్రం నువ్వున్నట్టు వాళ్లకెందుకు తెలియాలి’’ అంటూ బైబిల్‌ అతని చేతిలో పెట్టి వెళ్లిపోతుంది ఆమె. ఆ బైబిల్‌ తీసి చూస్తాడు.. లోపల పుటల్లో.. పిల్లల ఫోటో ఉంటుంది. ఆ ఫొటో పట్టుకొని పొగిలి పొగిలి ఏడుస్తాడు. తెల్లవారు జామున శంకర్‌ను ఉరి తీస్తారు. ఆ రోజే చంద్రిక పార్టీ మహిళా నాయకురాలిగా పదవి తీసుకుంటుంది. ఆ ర్యాలీలో ఆమెను హత్య చేస్తాడు శంకర్‌ తండ్రి.

ఇక్కడితో సమాప్తం.
ఎంటర్‌టైన్‌మెంట్‌ వరల్డ్‌లో మార్కెట్‌ చేసేవి క్రైమ్‌ అండ్‌ సెక్సే! ఆ సూత్రం ఆధారంగా తీసిన పది ఎపిసోడ్ల సిరీస్‌ ఇది. పద్దెనిమిదేళ్లు నిండిన వాళ్ల కోసమనే డిస్‌క్లయిమరూ ఉంది దీనికి. 
– సరస్వతి రమ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top