ఊరు ఇంటర్‌ పాసైంది

Special Story About Krishnaveni From Kanigiri District Tamil Nadu - Sakshi

ఇరులపట్టి గ్రామం. ఎక్కడుంది? డెంకణికొట్టయ్‌ తాలూకా. ఎక్కడుంది? బొమ్మతతనూర్‌ పంచాయితీ. ఎక్కడుంది? కృష్ణగిరి జిల్లా. ఓ.. తమిళనాడు! తమిళనాడులోని ఆ ఇరులపట్టి గ్రామం ఇప్పుడు వార్తలలోకి రావడానికి మంచి కారణమే ఉంది. ఆ ఊరి ఇంటర్‌ విద్యార్థిని కృష్ణవేణి గురువారం వచ్చిన ఫలితాలలో 600 మార్కులకు 295 మార్కులతో పాసై ఊరికి గుర్తింపును తెచ్చింది. ఇరులపట్టి గ్రామంలో ఇంటర్‌ పాస్‌ అయిన తొలి విద్యార్థి కృష్ణవేణి. పక్క జిల్లా అయిన ధర్మపురిలో.. పాలాకోడ్‌ సమీపంలోని కొత్తూరు ప్రభుత్వ కళాశాలలో ఆమె చదివింది. టెన్త్‌ కూడా అక్కడే.  

తొంభై తొమ్మిది, తొంభై ఎనిమిది శాతాలతో పిల్లలు పాస్‌ అవుతున్న కాలం ఇది. అయితే కృష్ణవేణిని వారితో సమానంగా అభినందించడానికి ఆమె సాధించిన మార్కులను కాకుండా, ఆమె ప్రయత్నాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటర్‌లో కామర్సు, అకౌంట్స్‌ సబ్జెక్టులతో పాసైంది కృష్ణవేణి. ఇరులపట్టి చుట్టుపక్కల చాలావరకు తెలుగు, కన్నడ మీడియం పాఠాశాలలే. అందుకని తమిళ మీడియం కోసం పొరుగు జిల్లాల్లోని హాస్టల్‌లో ఉండి.. అక్కడే ఆరవ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుకుంది.

బ్యాంక్‌ పరీక్షలు రాస్తూ, సివిల్‌ సర్వీసుకు ప్రిపేర్‌ అవుతూ ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని ఆమె లక్ష్యం. తండ్రి రైతు. తల్లి గృహిణి. ఇద్దరు తోబుట్టువులు. వాళ్ల చదువు టెన్త్‌ తర్వాత ఆగిపోయింది. కృష్ణవేణి ఆ ఊరి చరిత్రలోనే ఇంటర్‌ పాస్‌ అయిన తొలి విద్యార్థి అనే వార్త రాగానే చుట్టుపక్కల డిగ్రీ కళాశాలల నుంచి ఆమెకు సీటు ఇస్తామన్న ఆఫర్‌లు మొదలయ్యాయి! ధర్మపురిలోని ‘ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌’ ప్రైవేటు కాలేజీ ఇప్పటికే ఆమె కోసం అడ్మిషన్‌ను రిజర్వు చేసి ఉంచింది! 

ఇంటర్‌ ఫలితాలు వచ్చిన రోజు డెంకణికొట్టయ్‌ డిఎస్పీ సంగీత, కేళమంగళం పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది ఇరులపట్టి గ్రామంలోనే ఉన్నారు. స్థానికులకు రేషన్‌ బియ్యం, పప్పు, నూనెల పంపిణీ సక్రమంగా జరుగుతున్నదో లేదో పర్యవేక్షిస్తున్నారు. ఆ పనిలో ఉన్నప్పుడే కృష్ణవేణి గురించి డిఎస్పీ సంగీతకు తెలిసింది. వెంటనే ఆమెను పిలిపించి అభినందించారు. ‘‘నేనూ నీ లాగే పల్లె ప్రాంతం నుంచి వచ్చాను. మా ఇంట్లో నేనే తొలి గ్రాడ్యుయేట్‌ని’’ అని తన సంతోషాన్ని పంచుకున్నారు సంగీత. ఆర్థికంగా కృష్ణవేణికి సహాయం చేకూరేలా చేస్తానని కూడా చెప్పారు. ఇరులపట్టి గిరిజన గ్రామం. ఇకముందు కృష్ణవేణి ఏం సాధించినా అది ఊరు పంచుకునే విషయమే అవుతుంది. 

కృష్ణవేణి ర్యాంకు సాధించలేదు. నైంన్టీ నైన్‌ పర్సెంటేమీ రాలేదు. ఇంటర్‌ పూర్తి చేసింది.. అంతే! ఊరి పేరు మార్మోగిపోతోంది. ఊరి చరిత్రలోనే.. తొలి.. ఇంటర్‌ ఉత్తీర్ణురాలు కృష్ణవేణి!! 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top