ప్రియాంక ఈజ్‌ ద స్కై

Special Interview With Priyanka Chopra - Sakshi

ఆకాశంలో సగం కాదు.. ఆకాశం మొత్తం తనే అయ్యారు ప్రియాంక. మామూలు ఆకాశం కాదు.  సినీ వినీలాకాశం! నింగీ నాదే, నేలా నాదే అని చేతులు చాచారు. బాలీవుడ్‌ ఆమెదే అయింది. హాలీవుడ్‌ ఆమెదే అయింది. సినిమాలు.. సీరియళ్లు.. ప్రేమ.. పెళ్లి.. ఇప్పుడు..‘ది స్కై ఈజ్‌ పింక్‌’! ఈ చిత్రంతో ‘ప్రియాంక ఈజ్‌ ద స్కై’ అనిపించారు. ఈ ‘స్కై’ని సాక్షి అందుకుంది. ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ తీసుకుంది.

ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి, స్టార్‌ హీరోయిన్‌ అయి హాలీవుడ్‌ వరకూ వెళ్లిన మీ జర్నీ గురించి కొన్ని మాటలు...
ప్రియాంక: ఈ ప్రయాణంలో చాలామంది సహాయం ఉంది. వాళ్లందరికీ ఎంతో వినయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పనిని గుర్తించి అభినందించినప్పుడు కలిగే అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ అభినందనలే ఇంకా ఇంకా బాగా పని చేయడానికి ఉత్సాహాన్నిస్తాయి. ఎవరి అండా లేకుండా ఒంటరిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. చాలా హార్డ్‌వర్క్‌ చేశాను. నా ముఖం మీదే తలుపులేసిన సందర్భాలున్నాయి.

అలాంటి దురదృష్టకర సంఘటనలు ఎదురైనప్పటికీ నేను అదృష్టవంతురాలినే. ఎందుకంటే నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడే అవకాశాలు కూడా వచ్చాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ‘సక్సెస్‌’ ఖాయం అని నా ఒపీనియన్‌. ‘ఇది మన కెరీర్‌కి ఉపయోగపడుతుంది’ అనిపించిన ఏ అవకాశాన్నీ తేలికగా తీసుకోలేదు. ఆ క్యారెక్టర్ల కోసం ఎంత కష్టపడాలో అంతా పడ్డాను. ఇప్పటికీ పడుతున్నాను. ఎప్పటికీ కష్టపడతాను. ఈ జర్నీలో రాళ్ల బాట చూశాను. పూల బాటకు ఆ రాళ్ల బాట ఉపయోగపడింది.

కొన్నిసార్లు కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. అప్పుడు ఏమనిపిస్తుంది?
అలాంటి సమయాల్లో కొంచెం నిరుత్సాహం ఉంటుంది. అయితే జీవితంలో నేను నమ్మేదేంటంటే... ప్రతి ఫెయిల్యూర్‌ని సవాల్‌గా తీసుకుని ఎదగాలని. నాకెప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, కొత్త పనులు చేయాలన్నా ఇష్టం. మీరు నా కెరీర్‌ని గమనిస్తే అది అర్థమవుతుంది. ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేసుకుంటూ వచ్చాను. ‘ఇలాంటి పాత్రలే చేయాలి’ అనే హద్దులను నటిగా చెరిపేయాలనుకున్నాను. నిర్మాతగా కూడా జస్ట్‌ కమర్షియల్‌ చిత్రాలకే పరిమితం కాదల్చుకోలేదు.

మా పర్పుల్‌ పెబెల్‌ పిక్చర్స్‌పై తీసిన మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్‌’కి మూడు నేషనల్‌ అవార్డులు వచ్చాయి. ఇంకా పంజాబీ, భోజ్‌పురి భాషల్లో కూడా మంచి సినిమాలు నిర్మించాం. ఇప్పుడు చిత్రపరిశ్రమ, ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. కొత్త సినిమాలను, తమను కదిలించే కథలను చూడ్డానికి ఆడియన్స్‌ ఇష్టపడుతున్నారు. వరల్డ్‌ సినిమాల్లో ఉండటానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను.
     
కథానాయికగా మరో మూడేళ్లల్లో 20 ఏళ్లు కంప్లీట్‌ చేసుకుంటారు. హీరోయిన్‌గా తమిళ చిత్రం ‘తమిళన్‌’ (2002)తో స్టార్ట్‌ అయ్యారు. ఇన్నేళ్ల కెరీర్‌ మీకు నేర్పించిన విషయాలేంటి?
జీవితం చాలా నేర్పిస్తుంది. ఒడిదుడుకులను దాటుకుంటూ ఈదమని చెబుతుంది. అలాంటి క్లిష్టమైన సమయాల్లో ఓ ‘వారియర్‌’లా మారిపోవాలి. ఆటను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లాలి. పరిస్థితులు తలకిందులుగా ఉన్నప్పుడు మనం ఎలా లేవాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ప్రతి ఒక్కరం ఫెయిల్యూర్‌ని ఎదుర్కోవాలి. ఎందుకంటే ఒక అపజయం తర్వాత మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. మనకు మనమే ఆదర్శంగా నిలవాలి. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి.

మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. మనల్ని మనం నమ్మాలి. సమస్యలు ఎదురైనప్పుడు ‘మన బలం ఏంటి?’ అని ఆలోచించా. ఆ బలం తెలుసుకుని, ఆ దిశగా వర్కవుట్‌ చేయడం మొదలుపెట్టా. నా ముఖం మీదే తలుపులు వేశారని చెప్పాను కదా. అప్పుడు నేనేం కుంగిపోలేదు. మనల్ని మనం నిరూపించుకుంటే మనం ఏ పని చేయాలనుకుంటున్నామో దాన్ని డిమాండ్‌ చేసే స్థాయిలో ఉంటాం అని నమ్మాను. నిరూపించుకోవడానికి కష్టపడ్డాను. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానో అదే చేస్తున్నాను.

బాలీవుడ్‌ స్క్రీన్‌ మిమ్మల్ని బాగా మిస్సవుతోంది. మూడేళ్ల తర్వాత ‘ది స్కైజ్‌ ఈజ్‌ పింక్‌’తో మళ్లీ హిందీ తెరపై కనిపించారు. మీకెంతో ఇచ్చిన హిందీ పరిశ్రమను మిస్సవుతున్న ఫీలింగ్‌ లేదా?
‘జై గంగాజల్‌’ (2016) తర్వాత హిందీ సినిమా చేయాలనుకున్నాను. చాలా కథలు కూడా విన్నాను. అప్పటికే అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘క్వాంటికో’ టెలికాస్ట్‌ కూడా మొదలైంది. ఈ సిరీస్‌ త్రీ సీజన్స్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఆ షూటింగ్‌కి ఎక్కువ టైమ్‌ పట్టేసింది. హిందీ సినిమా చేయాలని ఉన్నా చేయలేకపోయాను. ఫైనల్లీ ‘ది స్కై ఈజ్‌ పింక్‌’తో మళ్లీ హిందీ ప్రేక్షకులకు కనిపించాను. ఈ మూడేళ్లల్లోనే సినిమాలపరంగా చాలా మార్పొచ్చింది.

}‘ది స్కై ఈజ్‌ పింక్‌’ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం మళ్లీ హిందీలో చేయాలనా? కథ బాగా నచ్చిందా?
నేను న్యూయార్క్‌లో ఉన్నప్పుడు ఈ కథ నా దగ్గరకు వచ్చింది. కథ చదివాక ఇది పక్కన పెట్టేసే స్క్రిప్ట్‌ కాదనిపించింది. ‘కేర్‌టేకర్స్‌’ గురించి ఆలోచింపజేసిన కథ అది. నాకు తెలిసి వాళ్లను ఎవరూ గుర్తు పెట్టుకోరు. నాకు మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేని రోజులు గుర్తొచ్చాయి.

అప్పుడు మా అమ్మగారు పక్కనే ఉండి చాలా కేర్‌ తీసుకున్నారు. ఒక వ్యక్తికి బాగా లేకపోతే ఇంటిల్లిపాదీ బాధపడతాం. మనకు ఇష్టమైన వ్యక్తి మన కళ్లముందే అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాం. అది ఆ కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వైవాహిక జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలు ఆ కథలో ఉన్నాయి. వ్యక్తిగతంగా మా నాన్నగారి పరిస్థితి చూశాను. అలాంటి అంశాలతో ఉన్న ఈ కథ నన్ను బాగా కదిలించింది.
 
‘ది స్కైజ్‌ ఈజ్‌ పింక్‌’కి నటిగా, నిర్మాతగా రెండు బాధ్యతలు తీసుకోవడం ఎలా అనిపించింది?
ఒక ఆర్టిస్ట్‌గా సినిమా చేసిన తర్వాత జస్ట్‌ ప్రమోట్‌ చేస్తే చాలు. వేరే ఏ బాధ్యతలూ ఉండవు. కానీ నిర్మాత బాధ్యత చాలా పెద్దది. ఒక సినిమాకి 150 మంది పని చేస్తున్నారంటే అందరి బాధ్యత ఒక్క నిర్మాతదే. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకూ చాలా పని ఉంటుంది. బరువైన బాధ్యత అయినా ఇష్టంగా చేశాను. ఎందుకంటే ‘ది స్కైజ్‌ ఈజ్‌ పింక్‌’ కథ అందరికీ చెప్పాలి. నటిగా తెరపై చెబుతాను. కానీ నిర్మాతగా కూడా చేస్తే ఇంకా సంతృప్తి ఉంటుందనిపించింది. అందుకే నేను ఒక నిర్మాతగా చేశాను.

ఈ చిత్రం లొకేషన్‌లో మరచిపోలేని సంఘటన ఏదైనా జరిగిందా?
ఇది చాలా ఎమోషనల్‌ మూవీ. షూటింగ్‌కి ప్యాకప్‌ చెప్పిన తర్వాత బరువైన మనసుతో ఇంటికి వెళ్లేదాన్ని. సినిమాలో అయేషా చౌదరి (జైరా వాసిమ్‌) కి ఆరోగ్యం బాగుండదు. జీవితకాలాన్ని పొడిగించాలంటే తను ఆపరేషన్‌ చేయించుకోవాలి. కానీ దానివల్ల మంచాన పడే అవకాశం ఉన్నందున సర్జరీ చేయించుకోనని తల్లి అదితీ చౌదరీ (ప్రియాంకా చోప్రా)కి చెబుతుంది. కూతురి నిర్ణయాన్ని తల్లి ఆమోదిస్తుంది. ఓ తల్లి తన బిడ్డని కోల్పోవడం అంటే అది ఎంత బాధగా ఉంటుందో తెలుసుకోవడానికి తల్లే కానవసరంలేదు.

కానీ ఈ సీన్‌లో యాక్ట్‌ చేసేటప్పుడు ఆ ఎమోషన్‌ ఎలా చూపించాలని చిత్రదర్శకురాలు సోనాలీ బోస్‌ దగ్గర అడిగాను. అప్పుడామె ‘నా నిజజీవితంలో జరిగిన ఘటన ఇది. అనారోగ్యంతో నా కుమారుడు చనిపోయాడు’ అని చాలా ఎమోషనల్‌గా అన్నారు. అంతే.. నేను ఏడుపు ఆపుకోలేకపోయాను. ఆ రోజు షూటింగ్‌లో ఏడుస్తూనే ఉన్నాను. అప్పుడు కలిగిన ఆ బాధను ఎప్పటికీ మరచిపోలేను. ‘ది స్కైజ్‌ ఈజ్‌ పింక్‌’ అంటే చాలు.. నాకు ఎక్కువగా గుర్తొచ్చే విషయం ఇదే.

సినిమాలో ఓ తల్లిగా కూతురి మీద మీకు అమితమైన ప్రేమ ఉంది. నిజజీవితంలో మీ అమ్మ మధు చోప్రాతో మీ బాండింగ్‌ గురించి?
ఈ సినిమాలో తల్లి తన కూతుర్ని చాలా ప్రేమిస్తుంది. ఓ ఫ్రెండ్‌లా ట్రీట్‌ చేస్తుంది. నిజజీవితంలో మా అమ్మ నాతో అలానే ఉంటారు. మేమిద్దరం కలిసి పార్టీలకు వెళతాం లేదా వేరే ఈవెంట్స్‌కి వెళతాం. నాకు సంబంధించిన ప్రతి విషయం ఆమెకు తెలుసు. నా బాయ్‌ఫ్రెండ్స్‌ నుంచి భర్త వరకూ ఇప్పటివరకూ నా జీవితంలో జరిగిన ప్రతిదీ మా అమ్మకు తెలుసు. నీ లైఫ్‌లో నీకు బెస్ట్‌ పర్సన్‌ ఎవరు? అంటే ‘మా అమ్మ’ అంటాను. నా తల్లి నాతో ఎలా ఉన్నారో నేను సినిమాలో అలానే ఉన్నాను.

మీ భర్త నిక్‌ జోనస్‌ ‘స్కైజ్‌ ఈజ్‌ పింక్‌’ షూటింగ్‌ లొకేషన్‌కి వచ్చినప్పుడు కంట తడిపెట్టుకున్నారని విన్నాం. బహుశా మీరు ఎమోషనల్‌ సీన్‌లో నటిస్తున్నప్పుడే ఆయన ఎమోషన్‌ అయ్యారా?
మా పెళ్లికి నాలుగు రోజుల ముందు వరకూ నేను ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను. లొకేషన్‌కి నిక్‌ వచ్చేవాడు. షాట్‌ గ్యాప్‌లో మేమిద్దరం పెళ్లి పనుల గురించి మాట్లాడుకునేవాళ్లం. ‘పెళ్లి పనులు నేను చూసుకుంటాలే. నువ్వు కూల్‌గా షూటింగ్‌ చేసుకో’ అన్నారు. ఎందుకంటే ఇది ఎమోషనల్‌ మూవీ అని తనకు తెలుసు. నిక్‌ షూటింగ్‌ స్పాట్‌కి వచ్చిన రోజు ఎమోషనల్‌ సీన్‌ షూట్‌ జరుగుతోంది. మా సోనాలీకి ఎవరో సన్నగా ఏడుస్తున్నట్లుగా వినిపించిందట. చూస్తే.. తన పక్కనే ఉన్న నిక్‌ ఏడుస్తుండటం ఆమెకు కనిపించింది. ‘నీ భర్తను ఏడిపించేశావ్‌. ఇది చాలా గొప్ప సీన్‌’ అని ఆమె అన్నారు.

ఫైనల్లీ.. హైదరాబాద్‌ బిర్యానీ గురించి?
నేను ఫుడ్‌ లవర్‌ని. నాకు హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం.
– డి.జి. భవాని

ఇక్కడ తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుని, విదేశాల్లో కొత్త నటిగా జర్నీ మొదలు పెట్టినప్పుడు ఎలా అనిపించింది?
వేరే దేశానికి వెళ్లి, ‘నేను ప్రియాంకా చోప్రా.. ఇండియన్‌ యాక్టర్‌ని’ అని పరిచయం చేసుకున్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ప్రూవ్డ్‌. అక్కడ ప్రూవ్‌ చేసుకోవడానికి కష్టపడాలి. మామూలుగా చిన్న వయసులో కెరీర్‌ ఆరంభిస్తే, ఓ 30 ఏళ్లు వచ్చేసరికి సెటిల్‌ అయిపోతాం. బాలీవుడ్‌లో అలానే సెటిల్‌ అయ్యాను. కానీ, 30 ఏళ్లు దాటాక విదేశాల్లో కెరీర్‌లో మొదలుపెట్టడం సవాల్‌గా అనిపించింది. అయితే ఎంజాయబుల్‌గానే ఉంది.

మీ భర్త నిక్‌ జోనస్‌తో విదేశాల్లో స్థిరపడటం ఎలా ఉంది? మ్యారీడ్‌ లైఫ్‌ ప్లాన్స్‌ గురించి?
ముంబైకి దూరంగా ఉంటున్నాను. అయితే నేను ఎక్కడున్నా నా చుట్టూ నేను ప్రేమించేవాళ్లు ఉంటే చాలు..  నేను ఆనందంగా ఉంటాను. వైవాహిక జీవితం విషయానికి వస్తే... ప్రస్తుతం నా ‘విష్‌ లిస్ట్‌’లో ప్రధానంగా రెండు కోరికలు ఉన్నాయి. ఒకటి లాస్‌ ఏంజిల్స్‌లో ఇల్లు కొనడం.. రెండు.. తల్లి కావడం. మాతృత్వం తాలూకు అనుభూతిని ఆస్వాదించాలని ఉంది. అయితే అది వచ్చే రెండు మూడేళ్లల్లో మాత్రం ఉండదనే అనుకుంటున్నాను.

►గత గురువారం కర్వా చౌత్‌ పండగ. ఉత్తరాదివారు జరుపుకునే పండగ ఇది. భర్త క్షేమం కోరి రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం చంద్రుడిని చూశాక ఆహారం తీసుకుంటారు. హిందీ పరిశ్రమలో చాలామంది తారలు ఉపవాసం ఉన్నారు. ఇది ప్రియాంకా చోప్రాకి తొలి కర్వా చౌత్‌. భర్తతో కాలిఫోర్నియాలో ఉన్న ప్రియాంకా కర్వా చౌత్‌ పండగ చేసుకున్నారు. ‘‘నా భార్య భారతీయురాలు. తను హిందు. తన సంస్కృతీ సంప్రదాయాల గురించి నాకు చెప్పింది. తనంటే నాకు చాలా ప్రేమ, ఆరాధన. పండగ రోజు మేం చాలా సరదాగా గడిపాం’’ అని నిక్‌ జోనస్‌ ఈ పండగ ఫొటోను షేర్‌ చేశారు. ‘‘మై ఎవిరీథింగ్‌’’ అని ప్రియాంక పేర్కొన్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top