అసూయోధనులు

అసూయోధనులు


మనుషులు నిజంగా పిచ్చి మాలోకాలు. ప్రేమ గుడ్డిదని గుడ్డిగా నమ్మేస్తారు. నిజానికి ప్రేమ కాదు గుడ్డిది, అసూయే అసలు గుడ్డిది. ప్రేమ మైకం కమ్మినవాళ్లకు లోకంమసకమసకగానైనా కనిపిస్తుంది. అదే, అసూయ కమ్మితేనా..? లోకంలో మరేదీ కనిపించదు. అసూయాగ్రస్తులకు లోలోపలే కనిపించని చితిమంట తెగ రగులుతూ ఉంటుంది.వాడుక లేని ఇనుమును తుప్పు కొరికేస్తున్నట్లుగానే, అసూయ మనిషి అంతరాత్మను కొరికేస్తుంది. అసూయకు ఆహారంగా మారిన మనిషి ఇంకేం మిగులుతాడు..? తనకు తానే సర్వ నాశనమవుతాడు. పురాణ పురుషుల్లో సుయోధనుడిని అసూయకు ప్రతీకగా చెప్పుకుంటారు. ఆధునిక సమాజంలోనూ ‘అసుయో’ధనుల సంఖ్య తక్కువేమీ కాదు.

 

సమాజంలో నేరాలూ, ఘోరాలూ ఊరకే జరగవు. మనుషుల్లో అసూయ శ్రుతిమించిన సందర్భాల్లోనే అలాంటివి జరుగుతాయి. అసూయను అదుపులో ఉంచుకుంటే సమాజం ఇంత నేరపూరితంగా మారేది కాదు. సమాజం ఇంత దారుణంగా కలుషితం, నేరపూరితం కాకూడదనే తపనతోనే చాలామంది మహానుభావులు అసూయను విడనాడండర్రా.. అంటూ శక్తివంచన లేకుండా లోకానికి హితబోధలు చేశారు. మహనీయుల మాటలను అంత తేలికగా విని బాగుపడిపోతే, మనం ఆధునిక మానవులం ఎలా అవుతాం..? భర్తృహరిలాంటి మహానుభావుడు ఈర్ష్యాళువులను కాపురుషుల (దుర్మార్గులు) జాబితాలో చేర్చాడంటే, ఇతరుల బాగును చూసి ఓర్వలేని అసూయాపరులు ఎంతటి అనర్థకారులో గుర్తించవచ్చు.

 

 ఆత్మవిధ్వంసక లక్షణం..


 అసూయ.. ఇతరులను ఇబ్బందిపెట్టే లక్షణం మాత్రమే కాదు, ఆత్మవిధ్వంసక లక్షణం కూడా. అసూయను ఆత్మకు సోకిన పచ్చకామెర్లతో పోలుస్తారు. అసూయ కమ్మిన వాడి కళ్లకు నిజానిజాలు కనిపించవు. అసూయకు అభిజాత్యం కూడా తోడైతేనా.. అలాంటి మనిషికీ, తోక తొక్కిన తాచుకు పెద్దగా తేడా ఉండదు. మహాభారతంలో దుర్యోధనుడు అలాంటి వాడే! పాండవులంటే మొదటి నుంచి అతడికి అసూయ.

 పాండవుల్లో బలశాలి అయిన భీముడంటే దుర్యోధనుడికి మరీ మంట. పాండవులు పచ్చగా ఉంటే కళ్లలో కారం పోసుకొనేవాడు. భీముడిని అడ్డు తొలగించుకుంటే, తనకు లోకంలో ఎదురే ఉండదనే భ్రమతో అతడిని అంతం చేయడానికి విఫల యత్నాలన్నీ చేస్తాడు. పాండవుల ఐకమత్యం అతడికి అస్సలు నచ్చేది కాదు. అందుకే, వాళ్లందరినీ మూకుమ్మడిగా పరలోకానికి పంపడానికి లక్క ఇంటిని దహనం చేయిస్తాడు. అసూయతో అసలే కన్నూ మిన్నూ కానని దుర్యోధనుడిని అడుగడుగునా రెచ్చగొట్టడానికి శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు తయారవుతారు. ఇంద్రప్రస్థంలో ధర్మరాజు వైభోగాన్ని చూసి దుర్యోధనుడు మరింత రగిలిపోతాడు. మయసభలో తన పాట్లు చూసి నవ్విన ద్రౌపదిపై కక్ష పెంచుకుంటాడు. శకుని పన్నాగం మేరకు మాయజూదంలో ఓడించి, పాండవులను అడవులకు పంపుతాడు. నిండుసభలో ద్రౌపదిని అవమానిస్తాడు.



అజ్ఞాతవాసంలో పాండవుల గుట్టు రట్టు చేయాలనుకుని, ఉత్తరగోగ్రహణం తలపెట్టి, అర్జునుడి చేతిలో భంగపడతాడు. శ్రీకృష్ణుడి సంధి రాయబారాన్ని తోసిపుచ్చి, పాండవులకు సూదిమొన మోపినంత నేలనైనా ఇవ్వడానికి నిరాకరిస్తాడు. కురుక్షేత్ర సంగ్రామం దుర్యోధనుడి అసూయకు పర్యవసానమే! అసూయతో అడుగడుగునా రగిలిపోయిన దుర్యోధనుడు, అతడి తొంభైతొమ్మిది మంది సోదరులు, అతడికి అండగా వచ్చిన రాజులు, వారి సైన్యాలు యుద్ధంలో దుంపనాశనమవుతాయి. పాండవులపై పెంచుకున్న అసూయ వల్ల తాను నాశనం కావడం తప్ప దుర్యోధనుడు బావుకున్నదేమీ లేదు.

 

 ప్రేమ.. పిచ్చి.. జెలసీ..


 ‘ప్రేమా.. పిచ్చీ.. ఒకటే..’ అని భానుమతి పాడిన పాట చాలామందికి తెలిసిందే. ప్రేమకు, పిచ్చికి అట్టే తేడాలేదంటారు విజ్ఞులు. ప్రేమ గుడ్డిదని అంటారు. ప్రేమ ముదిరితే పిచ్చి తలకెక్కుతుందని కూడా కొందరు అనుభవజ్ఞులు చెబుతుంటారు. అయితే, ప్రేమ కాదు, అసూయే గుడ్డిది అని నుడివాడు లారెన్స్ డ్యూరెల్ అనే మహానుభావుడు. అసూయ చెందని వాడు ప్రేమించనట్లే లెక్క అని కూడా కొందరు ప్రేమ గురువుల ప్రవచనం. అంటే, ప్రేమకు అసూయకు అవినాభావ సంబంధం ఉందని, ప్రేమ ముదిరితే అసూయగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే, ఇది అర్ధసత్యం. అంటే, కొంత వరకు మాత్రమే నిజం.



తోబుట్టువులు పుట్టిన కొత్తలో పసిపిల్లలు వారిపై అసూయ పెంచుకుంటారు. కొత్తగా పుట్టిన వాళ్లపైనే తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ చూపడాన్ని వాళ్లు తట్టుకోలేరు. తల్లిదండ్రులు నెమ్మదిగా నచ్చజెబితే, పరిస్థితిని అర్థం చేసుకుని, తమ ధోరణిని మార్చుకుంటారు. ప్రియుడు లేదా ప్రేయసి మరొకరితో సన్నిహితంగా ఉంటే ప్రేమికులు సహించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ వల్ల జనించిన అభద్రతాభావం అసూయగా పరిణమిస్తుంది.



అయితే, ప్రేమ మాత్రమే అసూయకు ఏకైక కారణం కాదు. పొరుగు వారు పచ్చగా ఉంటే కొందరు అనవసరంగా అసూయ పెంచుకుంటారు. ఇలాంటి అసూయకు ప్రేమ ఎంతమాత్రం కారణం కాదు. చదువుల్లో, ఉద్యోగాల్లో తమ తోటివారి విజయాలను జీర్ణించుకోలేక అసూయ పెంచుకునే వారు ఉంటారు. అసూయతో లోలోపలే రగిలిపోయేవాళ్లలో చాలామంది ఏమాత్రం బయటపడరు. వారిలో కొందరు అశాంతి పెంచుకుంటారే తప్ప పెద్దగా విధ్వంసక చర్యలకు దిగరు.



 అసూయ మోతాదుకు మించి తలకెక్కిన వారు మాత్రం ఊరకే ఉండలేరు. తమ అసూయకు కారణమైన వారికి హాని తలపెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇలాంటి ప్రయత్నాలే ఒక్కోసారి తీవ్రమైన నేరాలకు దారితీస్తాయి. కేవలం అసూయ వల్ల భయంకరమైన నేరాలకు, దారుణమైన ఘోరాలకు పాల్పడిన వారు సుఖప్రదంగా శేషజీవితాన్ని గడిపిన దాఖలాలేవీ చరిత్రలో లేవు. అయితే, అలాంటి నేరాలకు అమాయకులు బలైపోయిన సంఘటనలు మాత్రం కొల్లలుగా కనిపిస్తాయి.

 

 - పన్యాల జగన్నాథదాసు

 

 

 అసూయపై అభిమతాలు

అసూయ గురించి కొందరు మహానుభావులు అనుభవపూర్వకంగా చెప్పిన సూక్తులను పరిశీలిస్తే, ఈ దుర్గుణానికి గల స్వరూప స్వభావాలు మనకు అవగతం అవుతాయి. అలాంటి సూక్తులు మచ్చుకు కొన్ని:



క్యాన్సర్ వ్యాధితో కంటె అసూయ అనే వ్యాధితో మరణించేవారు ఎక్కువ. - జోసెఫ్ పి. కెన్నడీ

అసూయాపరులతో ఇతరులకు ఇబ్బంది కలుగడమే కాకుండా, వారిని వారు దగ్ధం చేసుకుంటారు. - విలియం పెన్

{పేమను మించిన గొప్ప ఖ్యాతి లేదు. అసూయను మించిన శిక్ష లేదు. - లోప డి వెగా

అసూయా పరులలో పైశాచికత్వం, విచక్షణా రాహిత్యం ఒకేసారి చేరతాయి. - జోహాన్ క్యాస్పర్ ఇవేటర్

ఇనుమును తుప్పు తినేసినట్టుగానే, మనిషిలోని మానవత్వాన్ని అసూయ తినేస్తుంది. - యాంటిస్థిన్స్

దొంగలను ఆకర్షించే కుక్క అరుపు లాంటిది అసూయ.     - కార్ల్ క్రాస్

అసూయాపరులు ఇతరులను ప్రేమించలేరు. - సెయింట్ అగస్టిన్

{పేమ కాదు గుడ్డిది, అసూయ అసలైన గుడ్డిది.   - లారెన్స్ డ్యూరెల్

అసూయ అనేది మనిషిలోని మంచికి ముడి మీద ముడి వేస్తూనే ఉంటుంది. - హెలెన్ రౌలాండ్

వ్యామోహం శరవేగంగా... అసూయగా, ఒక్కోసారి ద్వేషంగా పరిణమిస్తుంది. - అర్థర్ గోల్డెన్

{పేమ, అసూయ అక్కచెల్లెళ్లు. - రష్యన్ సామెత

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top