
ఒకప్పుడు ప్రేమ కళ్లతో మొదలై, కలలతో కడవరకు సాగేది. ఇప్పుడది ఒక స్వైప్‌తో మొదలై, ఒక మెసేజ్‌తోనే ముగుస్తోంది. ప్రేమలా అనిపిస్తుంది, కానీ ప్రతిసారి సందేహాల స్టేటస్‌లోనే ఆగిపోతుంది. ఇక బంధం బ్లూటూత్‌లా మారి, కనెక్ట్ అయితే పని చేస్తుంది, లేదంటే మాయమవుతోంది. ఇక్కడ ప్రేమ పుట్టినా, క్లారిటీ మాత్రం ఎప్పటికీ బ్లాక్‌లిస్ట్‌లోనే మిగిలిపోతుంది. ఇవన్నీ ఇప్పడు లవ్ ట్రెండ్స్‌లో బలంగా వీస్తున్న న్యూ విండ్స్...
ఈ తరం ప్రేమికుల ప్రేమ ఓపెన్ రిలేషన్‌షిప్‌లా ఉంటుంది. కాని ఎవరూ ఓపెన్‌గా మాట్లాడరు! ‘హాయ్’ అంటే ఫ్రెండ్ అనాలా? ఫ్లర్ట్ అనాలా? అన్నదానిపై కన్‌ఫ్యూజన్. ‘మిస్ యూ’ అంటే నిజంగా ప్రేమా? లేక లస్ట్? అన్న సందేహం. ఇక ‘బిజీ బేబీ’ అంటే టైమ్ లేదు అంటున్నారా? లేక నన్ను బెంచ్‌లో పెట్టాలనుకుంటున్నారా? అనే అనుమానం వచ్చేస్తుంది.
అలా ఇవన్నీ స్క్రోల్ చేయగలిగే అనుబంధాలుగా, టైప్ చేయగలిగే మమకారాలుగా, డిలీట్ చేయగలిగే గాథలుగా మారాయి. ఇక్కడ ప్రేమ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో నడుస్తుంది, కాని కన్ఫర్మేషన్ మాత్రం ఎప్పుడూ బఫరింగ్‌లోనే ఉంటుంది. అందుకే ఈ ప్రేమలను అర్థం చేసుకోవాలంటే ఓ కొత్త డిక్షనరీ అవసరం. అదే ఈ జెన్ జీ ప్రేమభాష డిక్షనరీ. ఇది ప్రేమలో పడటానికి కాదు, పడిపోకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అందుకే, మీ క్రష్ చేతిలో మీ హార్ట్ క్రాష్ కాకముందే, ఒక్కసారి ఈ ప్రేమ భాషను తెలుసుకోండి!
నేటి ప్రేమ భాష
కాకరకాయకు షుగర్ కోటింగ్ వేసినట్టు నేటి ప్రేమ ఉంటోంది. ప్రేమగా, స్నేహంలా కనిపిస్తుంది కాని, ఫీలింగ్ డిఫరెంట్. కుప్పలు తెప్పలుగా ప్రేమను చూపిస్తారు. కాని, కన్ఫర్మేషన్ ఇవ్వరు. అందుకే, ఎవరైనా సరే, ఈ జెన్ జీ ప్రేమ భాష తెలుసుకోకుండా, ప్రేమలో పడొద్దు. ఎందుకంటే, మీ ప్రేమను తెలిపే సమయానికే వాళ్లు వదిలిపోయే జెన్ జీ బంధాల పేర్లతో సిద్ధంగా ఉంటారు! అలా కొన్ని గమ్మత్తయిన జెన్ జీ బంధాలే ఇవీ!
ఘోస్టింగ్ అజ్ఞాతంలోకి ఎగిరిపోవడం
ఇప్పటి వరకు ప్రతిరోజూ మాట్లాడినవారు, ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయమవుతారు. సందేశాలకు సమాధానం ఉండదు. కాల్ చేస్తే స్విచ్‌డ్ ఆఫ్. వెతికితే కనిపించరు. కారణం? తెలీదు. ఎమోషన్స్‌కు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకుండనే వెళ్లిపోవచ్చు. అదే ఘోస్టింగ్.
బెంచింగ్ బ్యాకప్ లవ్
ఇక్కడ, మీరు క్రికెట్‌లో ఎక్స్‌ట్రా ప్లేయర్ లాంటివారు. అవసరమైతే పిలుస్తారు, లేదంటే ‘బిజీ బేబీ’ అని మెసేజ్ పెడతారు. ఇది ఓ స్ట్రాటజీ లవ్. ముందు నుంచే వెనక పెడతారు. పూర్తిగా రిలేషన్‌షిప్‌లోకి తీసుకుకున్నా, వదిలేయకుండా, ‘ఓకే కాని, ఇప్పుడు కాదు’ అనే మూడ్‌లో ఉంచుతారు. ఒక రిజర్వ్
లవర్‌లా! నో స్ట్రింగ్స్ అటాచ్డ్
శరీరం దగ్గర, మనసులు దూరంఈ ప్రేమలో ఎలాంటి బంధాలూ ఉండవు. కేవలం భౌతికంగా సమీపంలో ఉంటారు. ఎమోషనల్ ఇన్వాల్వ్‌మెంట్ అసలు ఉండదు. ఒకరి కోసం ఒకరు ఎదురుచూసే అవకాశం కూడా రాదు. ఇది ప్రేమకన్నా ఒప్పందం లాంటిది. కనెక్ట్ కావచ్చు. కాని, కమిట్ అయ్యే పరిస్థితే ఉండదు.
షుగర్ డేటింగ్ ప్రేమకు పేమెంట్
ఇది డేటింగ్ మాత్రమే కాదు. డీలింగ్ కూడా. గిఫ్ట్‌లు, డబ్బు, సహాయం, హోదా... వీటన్నింటికీ బదులుగా సాన్నిహిత్యం లేదా భాగస్వామ్యం. ఇక్కడ ఒకరికి ఆర్థిక ఒప్పందం, మరొకరికి
అవసరాల ఒప్పందం.
సిచ్యుయేషన్‌షిప్ సమయానికి తగు ప్రేమ
ఇది స్నేహం కాదు, ప్రేమ కాదు. అర్థం కాలేదు కదా! రోజూ మాట్లాడుతుంటారు. కలుస్తుంటారు. అచ్చం ప్రేమికుల మాదిరే ఉంటారు. కాని, చెప్పుకోరు. సందర్భాన్ని బట్టి స్నేహాన్ని, ప్రేమను స్విచ్ చేస్తూ ఉంటారు.
కఫింగ్ అందమైన వసంతం
చలికాలం వచ్చిందంటే ఒంటరితనానికి బదులుగా ఈ తాత్కాలిక ప్రేమను ఓపెన్ చేస్తారు. ఈ ప్రేమ వేసవి వస్తే మాయమైపోతుంది. వెచ్చని స్వెట్టర్‌లా, ఈ ప్రేమకు కూడా చలికాలం తర్వాత ప్యాకప్
చెప్పేస్తారు.
ఎథికల్ నాన్ మొనోగమీ (ఈఎన్‌ఎమ్) నిజాయితీతో కూడిన బహుళ ప్రేమ
ఇక్కడ ప్రేమ ఉన్నా, అది ఒకరితోనే పరిమితం కాదు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా, మరొకరిని కూడా ప్రేమిస్తున్నాను.’ అనేంత నిజాయితీగా ఉంటుంది. అంటే, ఇక్కడ ఒకరితో కాక, పలువురితో బంధం ఉండొచ్చు. కాని, ఎవరినీ మోసం చేయకూడదు. అందరికీ స్పష్టంగా చెప్పి ఉండాలి.
ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్‌స్నేహానికి అదనపు లేయర్
ఇక్కడ మీరు స్నేహితులు. కాని, అప్పుడప్పుడూ బౌండరీలను దాటి శారీరక సాన్నిహిత్యం కూడా ఏర్పరచుకుంటారు. ప్రేమను స్పష్టంగా దూరంగా ఉంచి, ‘మన మధ్య ఏమీలేదు, కాని, ఏం జరిగినా ఫ్రెండ్స్ మనం!’ అన్న కంఫర్ట్ జోన్‌లో ఉంటారు.
లవ్ బాంబింగ్ అతివేగమైన బంధం
ఒకేసారి వందలాది మెసేజ్‌లు, ‘నువ్వు లేకుంటే బతకలేను’, ‘నీ నవ్వు నా పూల వర్షం’ అనేసరికి, మీరు కూడా ‘వావ్! ఐ లవ్ యూ టూ’ అనేరు, జాగ్రత్త! ఇక్కడ, వారం తర్వాత అది అంతా మాయమైపోతుంది. ఒకేసారి ఇబ్బంది పెట్టేంత ప్రేమ చూపించడం, ఊహించని రీతిలో బ్రేకప్ చెప్పేయటం రెండూ చాలా వేగంగా జరిగిపోతాయి.
జాంబీయింగ్ పాతవారితో కొత్తగా
ఇక్కడ మరచిపోయిన వ్యక్తి ‘హాయ్ స్ట్రేంజర్’ అనే మెసేజ్‌తో మళ్లీ వస్తారు. ఇది తెలిసిన ‘ఎక్స్’తో కొత్తగా ప్రేమలో పడటం లాంటిది. ఇక్కడ ఫ్లాష్‌బ్యాక్‌ను రిపీట్ చేయకూడదనేది మొదటి హెచ్చరిక.
క్యాట్ ఫిషింగ్ ఓపెన్‌గా చేసే ఫేక్ ప్రేమ!
ఇక్కడ అన్నీ ఫేక్ ఫొటోస్, ఫేక్ ఫీలింగ్స్. చివరికి ప్రేమ కూడా ఫేక్. ఆ విషయం తెలిసి కూడా రిలేషన్‌లో ఉంటారు. అయితే, ఇక్కడ అసలు నిబంధన ఒకటి ఉంది. అదే ఆ అజ్ఞాత ప్రేమికుడి వివరాలు అసలు తెలుసుకోకూడదు. తెలిస్తే ఇక బ్రేకప్పే!
స్లో డేటింగ్ ప్రేమకు వేగం అవసరం లేదు
ముందుగా పరిచయం, ఆ తర్వాత స్నేహం, ఆ తర్వాత భద్రత, అలా అలా ప్రేమ వైపు. ఇది కథకు మొదట వచ్చే ఇంట్రోలాంటిది. ఫిజికల్‌గా కాకుండా, ఫీలింగ్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు.
బ్రెడ్ క్రంబింగ్ లవ్ ఇన్ ఆన్‌లైన్
ఒక మెసేజ్, ఒక లైక్, ఒక కామెంట్... ఇవన్నీ ఇక్కడ ప్రేమ! ఎందుకంటే, ఈ ప్రేమ కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంటుంది. నిజ జీవితంలో ఉండదు. రాకూడదు కూడా. కేవలం ఊహల్లో జీవించే ఉండే ప్రేమికుల్లా మిగిలిపోవాలి.
రిజ్ పడేంత వరకే ప్రేమిస్తారు
ఆటిట్యూడ్, ఆకర్షణ, ఆనందం ఇవన్నీ కలిపితే ‘రిజ్’!. ఇక్కడ ప్రేమలో పడేయడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తారు. కాని, ప్రేమించరు. అంటే ఇంప్రెస్, ఫ్లర్టింగ్, చాటింగ్, కేరింగ్ లాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. ఒక్క ప్రేమ తప్ప.
పాకెటింగ్-దాచుకునే ప్రేమ
వాళ్లు మీతో ప్రేమలో ఉంటారు. కాని, బయట ఎవరికీ తెలియకూడదు. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి పేరు చెప్పరు. వాళ్ల జీవితంలో మీరు ఎప్పటికీ ఒక రహస్య ఫోల్డర్‌లాంటి వారు మాత్రమే. మీకు కూడా అంతే అయ్యుండాలి.
సాఫ్ట్ లాంచ్ అట్రాక్షన్ గ్రాస్పింగ్
అట్రాక్షన్ గ్రాస్పింగ్‌వాళ్లు ప్రేమలో ఉన్నారు. కాని, ఎవరనేది మాత్రం డైరెక్ట్‌గా చెప్పరు. సోషల్ మీడియా స్టోరీల్లో మాత్రం రెండు చేతులు, ఓ కాఫీ కప్పు, ఓ షాడో కనిపిస్తుంటాయి. ‘ఇది ఎవరితో?’ అనేది ప్రపంచాన్ని గెస్ చేసేలా ఊరిస్తూ ప్రేమించుకుంటుంటారు.
ఇలా ఈ జెన్ జీ ప్రేమ లోకంలో మరెన్నో బంధాలు అర్థం కాకుండా ఉన్నాయి. వాటిలో ఒకటి థ్రస్ట్ ట్రాప్. ఇది మాట్లాడే ప్రేమ కాదు, చూస్తే చాలు అనిపించే ప్రేమ. ఇక్కడ మాటలకు చోటు లేదు, కాని, హద్దులు దాటిపోయే ఫోటోలు మాత్రం బంధాన్ని నెట్టుకుంటూ పోతాయి. అదే తరహాలో డ్రై టెక్సి›్టంగ్ కూడా. ఇది వన్‌సైడ్ ప్రేమలకి మరో రూపం. మీరు పది లైన్లు టైప్ చేస్తే, సమాధానంగా ‘ఒకే’, ‘సరే’, ‘హుమ్’లాంటి ముక్తసరి రిప్లయ్స్ వస్తాయి. ఇక సింపింగ్ అంటే అవతలి వారు ప్రేమించకపోయినా, మీరు వారికోసం ఏదైనా చేస్తూ ఉంటారు.
మీ అభిమానాన్ని వాళ్లు తీసుకుంటారు, కాని, ప్రేమను మాత్రం కాదు. ఫ్లీ బ్యాగింగ్ బంధాల్లో, వారు చెడ్డవాళ్లని తెలిసినా, వారినే ప్రేమిస్తూ మళ్లీ మళ్లీ అదే బాధను అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. ఇక పింక్ ఫ్లాగ్స్ అనేవి గ్రీన్, రెడ్ ఫ్లాగ్స్ రిలేషన్స్ మధ్యలో ఉంటాయి. అంటే చిన్న చిన్న అబద్ధాలు, నిర్లక్ష్యం, డబుల్ డేటింగ్ వంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నా, ‘మారతారు కదా...’ అనే ఆశతో బంధాన్ని వదలకుండా కొనసాగించడం. ఇలా, స్పష్టత లేని అనుబంధాలతో నిండిన ఈ జెన్ –జీ ప్రేమ లోకంలో ప్రతి బంధం, అడిగితే వచ్చే బంధాలుగా మిగిలిపోతున్నాయి.
చట్టం చుట్టమైందా?
సినిమా స్క్రిప్టుల్లా ఎక్కువ ట్విస్టులు, తక్కువ క్లారిటీతోనే ఈ ప్రేమకథలన్నీ ఉంటున్నాయి. అందుకే, క్రేజీగా ఉండే ఈ కథలు హృదయాల్లో చోటు దక్కించుకుంటున్నా, చట్టాల్లో మాత్రం ఇంకా గందరగోళంగానే ఉన్నాయి. కొన్ని బంధాలపై న్యాయవ్యవస్థ నేరుగా స్పందిస్తోంది. స్పష్టత లేక, మరికొన్ని బంధాలను అసలు పట్టించుకోవడమే లేదు. ఫలితంగా చట్టం కొందరికి హక్కుల రక్షణగా మారుతుంటే, మరికొందరికి మోసంగా మారిపోతోంది.
గౌరవిస్తున్న బంధాలుగా...
భారతీయ చట్టం ఈ ఆధునిక ప్రేమలకు పూర్తిగా సపోర్ట్ ఇవ్వలేకపోయినా, కొన్ని విషయాల్లో మాత్రం ముందడుగు వేసింది. ముఖ్యంగా లివ్–ఇన్ బంధాలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఇద్దరు మేజర్లు పరస్పర సమ్మతితో కలిసి జీవించడం అక్రమం కాదని, దీర్ఘకాల బంధాన్ని ‘వివాహంతో సమానంగా’ పరిగణిస్తూ మహిళలకు హక్కులు కల్పించింది. వ్యక్తిగత స్వాతంత్య్ర హక్కు, ఆర్టికల్ 21 ప్రకారం, ఎవరితో జీవించాలన్నది వ్యక్తిగత నిర్ణయం.ఈ కోణంలో చూస్తే, జె¯Œ జీ ప్రేమలను నేరంగా పరిగణించే పరిస్థితి లేదు.
అలాగే, పెళ్లి కాని బంధాల్లో ఉన్న మహిళలకూ గృహ హింస నిరోధక చట్టం 2005 కింద రక్షణ కల్పిస్తోంది. అంటే, స్నేహితుడితో కలిసి ఉండే మహిళపై హింస జరిగితే, ఆమెకు చట్ట పరిరక్షణ లభిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో లివ్ ఇన్ జంటలపై ఉన్న సామాజిక ఒత్తిడులను కోర్టులు ఖండించాయి. ప్రేమను సంస్కృతి పేరుతో జడ్జ్ చేయవద్దు అంటూ న్యాయవ్యవస్థ పేర్కొంది.
చిక్కుముళ్లుగా..
వేగంగా మారుతున్న ఈ సంబంధాల పట్ల మన న్యాయ వ్యవస్థ చాలా నెమ్మదిగా స్పందిస్తోంది. ముఖ్యంగా, ‘సిచ్యుయేషన్‌షిప్’, ‘ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్’, ‘నో స్ట్రింగ్స్ అటాచ్డ్’లాంటి సంబంధాలకు చట్టపరంగా స్పష్టమైన నిర్వచనమేమీ లేదు. ఈ సంబంధాల్లో స్పష్టమైన నిబంధనలు లేకపోవడం వలన, యువత భావోద్వేగ మోసాలకు, ఆర్థిక దుర్వినియోగానికి గురవుతున్నారు.
అలాగే, వీటిపై హక్కుల వివరణ, రక్షణ కష్టంగా మారింది. వివాహేతర బంధాల్లో పిల్లలకు వారసత్వ హక్కులు చట్టంలో అస్పష్టంగా ఉన్నాయి. ఇక, సాంప్రదాయ ఒత్తిడులు, ఫ్యామిలీ ఒడిదుడుకులు కూడా చట్టానికి అందని సత్యాలుగా మారాయి. ఇలా కొత్త తరానికి చట్టం కొన్ని సమస్యలును తెస్తోంది. అయితే, ఈ ప్రేమల మధ్య నిజాయితీ ఉంటే చట్టం అడ్డుపడటం లేదు.
భవిష్యత్ ప్రమాదకరం..
జెన్ జీ రిలేషన్‌షిప్‌లో పేర్లు ఏవైనా సరే ఎటువంటి ఎమోషనల్ అటాచ్‌మెంట్ లేకపోవడం కామన్ పాయింట్. సైకలాజికల్ సేఫ్టీ మనిషికి ప్రాథమిక అవసరం. అది పటిçష్ఠమైన బంధాల్లో మాత్రమే దొరుకుతుంది. నేడు కనిపిస్తున్న బంధాలు బయటకు అందంగా కనిపిస్తున్నా, లోపల బోలుగా ఉంటున్నాయి. మనిషి బేసిక్ హంగర్స్‌లో ఎగ్జిస్టెస్ హంగర్ ఒకటి. భార్యాభర్తల మధ్య; కుటుంబంతోనూ; బంధువులు, స్నేహితులతోనూ బలమైన బంధాలు ఉన్నప్పుడు మనిషి అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న రాదు. ఇవి ఎప్పుడైతే బలహీన పడిపోతాయో లోలోపల సంఘర్షణ ప్రారంభమవుతుంది.
ఇది పలు మానసిక సమస్యలకు దారి తీస్తుంది. నేటి తరం ‘మనం’ అనే భావన నుంచి ‘నేను’ అనే భావన వైపుగా వెళుతోంది. ఈ ధోరణి వ్యక్తిగతంగానూ సామాజికపరంగానూ అంత మంచిది కాదు. దీని పర్యవసానం ఏమిటో మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. యువతకు రిలేషన్‌షిప్‌ని రీడిఫైన్, రీబిల్డ్ చేసుకోవడంపై కోర్సులను రూపొందించాల్సిన ఆవశ్యకత ఉంది. యూనివర్సిటీలు, కాలేజీలు ఆ దిశగా అడుగులు వేయాలి.
ట్రెండ్‌లో వ్యాపారాలు!
జెన్ జీ ప్రేమలు స్పీడ్ బస్సులా వెళ్లిపోతుంటే... వాటి చక్రాలుగా తిరుగుతున్నాయి అనేక వ్యాపారాలు! కొన్ని బంధాలు మధ్యలోనే పంక్చర్ అవుతుంటే, మరికొన్ని స్టెపినీలా కొత్త కొత్త ఆలోచనలతో లాభాలు చూస్తున్నాయి. ఈ తరం కండిషన్స్ అప్లయ్! బంధాలను బాగా అర్థం చేసుకొని, సక్సెస్ అయిన వాటిల్లో ముఖ్యంగా డేటింగ్ యాప్స్ నిలిచాయి. జెనరేషన్ మొత్తం ‘స్వైప్ లెఫ్ట్, స్వైప్ రైట్’ మీదే ఆధారపడి ప్రేమించేస్తోంది. దీంతో ‘పెళ్ళిళ్ల పేరయ్యలు’ ఇంట్లోనే కూర్చుంటున్నారు. ప్రేమకు బహుమతిగా, ‘డేట్ కిట్ బాక్స్’, ‘బ్రేకప్ హ్యాండీ ప్యాక్’, ‘లోన్లీ గిఫ్ట్ హ్యాంపర్’ వంటి ప్రేమ వస్తువులను బాక్సుల్లో ప్యాక్ చేసి పంపిస్తూ, కంపెనీలు పర్సులను నింపుకుంటున్నాయి. ఒకవేళ ప్రేమ దూరమైతే, ‘థెరపీ ఫర్ ఎక్స్’, ‘బెంచింగ్ పెయిన్ రిలీఫ్’ అనే ఆన్‌లైన్ సేవలు కూడా రెడీగా ఉన్నాయి. కానీ ఈ ప్రేమ మార్పులు మరికొన్నింటికి తలనొప్పిగా మారాయి! పెళ్లి మండపాలు డైవోర్స్ పార్టీలకు హ్యాంగౌట్ స్పాట్లుగా మారిపోతున్నాయి.
చాలా మంగళసూత్రాలు షాపుల్లోనే ఉండిపోతున్నాయి. పెళ్లికి కట్టుబాట్లు తగ్గిపోవడంతో, మ్యాట్రిమోనియల్ సైట్లకు నోటిఫికేషన్లు రావడం అరుదైపోయాయి. ఇక ‘పెళ్లి ఫొటోగ్రఫీ’ కన్నా ‘బ్రేకప్ సెల్ఫీ’కే డిమాండ్ పెరిగిపోయింది. ఇలా జె¯న్ జీ ప్రేమలు ఎంత వెరైటీగా మారుతున్నాయో, వాటి చుట్టూ జరుగుతున్న వ్యాపారాలూ కూడా అంతే క్రియేటివ్‌గా రూపాంతరం చెందుతున్నాయి.
ఒకప్పుడు ప్రేమ కోసం ఎదురు చూసేవాళ్లు, ఇప్పుడు ప్రేమ కోసం అప్‌గ్రేడ్ వెతుకుతున్నారు. 2024లో నిర్వహించిన ‘ఈ హర్మోనీ అండ్ రియల్ రీసర్చ్’ సర్వే ప్రకారం, 18 నుంచి 40 ఏళ్ల అమెరికన్లలో 40 శాతం మంది యువత ఏఐ భాగస్వాములను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరికి ఇది సురక్షితమైన ఎమోషనల్ ఔట్‌లెట్, మరికొందరికి ఇది రియల్ రిలేషన్‌షిప్‌కి ట్రైనింగ్ ఇచ్చే సలహాదారు. ఇదే విధంగా 16.7 శాతం పురుషులు ఏఐ ప్రేమ వల్ల తాము నిజమైన సంబంధాల్లో మెరుగవుతామని చెప్పారు. అలాగే, 11.5 శాతం మంది యువత ఏఐతో బంధం వల్ల భావోద్వేగ మోసాలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
కాని అదే సమయంలో, 15.4 శాతం మంది యువత ‘నా ప్రేయసి, నా కంటే ఏఐనే ఎక్కువ ఇష్టపడుతుందేమో?’ అనే భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రేమ ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకునే ఒక అప్లికేషన్‌లాగా కూడా మారుతోంది. అదే విధంగా ప్రస్తుతం యువత ప్రేమను చూసే విధానాన్ని కూడా అంచనా వేసి చెప్పారు. అందులో ఒక డేటింగ్ ప్లాన్ గురించి వివరించారు. ప్రస్తుతం డేటింగ్ అంటే గులాబీ పువ్వతో కాకుండా, గూగుల్ షీట్‌తో మొదలవుతుంది. ‘మైక్రోమాన్స్’ అంటే చిన్నచిన్న జాగ్రత్తలు, ‘ఫ్యూచర్ ప్రూఫింగ్’ దీర్ఘకాలిక ఆర్థిక ఆలోచనలు ప్రధానమైన డేటింగ్ ప్లాన్‌లో భాగమయ్యాయని ఈ సర్వే తెలిపింది. ప్రస్తుతం ఇవే ఇప్పటి కొత్త లవ్ లాంగ్వేజ్‌గా కూడా మారాయి. బిల్లు స్లిప్‌ట్ చేయడం, స్ట్రెస్‌లో నీళ్లు తాగమని రిమైండ్ చేయడం. నైట్ రైడ్‌కి క్యాబ్ బుక్ చేయడం.. ఇవన్నీ ఇప్పుడు రొమాన్స్‌కి న్యూ వర్షన్ మోడల్స్. ఈ విధంగా యువత ప్రేమలో మునిగిపోవడం మరచిపోయి, ఎమోషనల్, ఫైనాన్షియల్ హెల్మెట్స్‌తో దూసుకెళ్లడం నేర్చుకుంటోందని తెలిపింది.
∙∙
ప్రేమ నీటి బుడగలా కాకుండా, ప్రవహించే నదిలా ఉండాలి. అది నెమ్మదిగా మనసులోకి చేరి, కాలంతో కలుస్తూ, ఆత్మకు జీవం పోయాలి. కాని, ఇప్పటి ప్రేమ కథలు వాట్సాప్ స్టేటస్‌లా, ఇరవై నాలుగు గంటలు కూడా నిలవని అనుబంధాలుగా మారిపోయాయి. అయితే, ప్రేమ ఏ దశలో ఉన్నా సరే, గౌరవం, స్పష్టత, నిజాయితీ ఉంటేనే అది బంధంగా నిలుస్తుంది. లేదంటే, అది మరో ఘోస్టింగ్ ఎపిసోడ్‌గానే మిగిలిపోతుంది.
బ్రిటన్‌కు చెందిన ‘ఆఫ్‌కమ్’ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారు ప్రపంచాన్ని టెక్నాలజీతో కలిపే తరమే అయినా, ‘ఎక్కువగా ఒంటరితనంలో ఉన్న తరం’ అని పేర్కొంది. అందుకే, డేటింగ్ యాప్‌లు, రిలేషన్‌షిప్ మోడల్స్, పెళ్లిపై అభిప్రాయాలన్నీ భిన్నంగా ఉన్నాయి. ఈ విషయాన్ని వారి తాజా అధ్యయనాలతో తెలిపింది.
(చదవండి: బ్రెయిన్ ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరి..!)