క్రిస్పర్‌తో హెచ్‌ఐవీ మాయం!

Scientists Use CRISPR Cas9 To Eliminate HIV - Sakshi

అవసరాలకు తగ్గట్టుగా జన్యువుల్లో మార్పులు చేర్పులు చేసేందుకు వీలు కల్పించే క్రిస్పర్‌ క్యాస్‌ –9 టెక్నాలజీతో శాస్త్రవేత్తలు జంతువుల్లో హెచ్‌ఐవీని లేకుండా చేయగలిగారు. బతికున్న జంతువుల జన్యువుల్లోంచి హెచ్‌ఐవీ కారక వైరస్‌ను తొలగించగలగడం ఇదే తొలిసారి. వైద్యశాస్త్రం చాలా అభివృద్ధి చెందినప్పటికీ హెచ్‌ఐవీకి ఇప్పటివరకూ పూర్తిస్థాయి చికిత్స అన్నది లేదన్నది తెలిసిందే. యాంటీ రెట్రో వైరల్‌ మందులను వాడుతూ జీవితకాలాన్ని పెంచుకునేందుకు మాత్రమే అవకాశముంది.

ఈ నేపథ్యంలో టెంపుల్‌ యూనివర్శిటీ, నెబ్రాస్కా యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌ల శాస్త్రవేత్తలు క్రిస్పర్‌ సాయంతో హెచ్‌ఐవీ వైరస్‌లను తొలగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2014లో టెంపుల్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన శాలలో మానవ కణాల జన్యువుల్లోంచి వైరస్‌ను తొలగించడంలో విజయం సాధించగా.. తరువాతి కాలంలో నెబ్రాస్కా యూనివర్శిటీ శాస్త్రవేత్తలతో కలిసి బతికున్న జంతువులపై ప్రయోగాలు చేసి విజయం సాధించారు. హెచ్‌ఐవీ వైరస్‌ తనదైన డీఎన్‌ఏ సాయంతో కణాల్లోకి చొరబడి విభజితమవుతుందన్నది తెలిసిందే. వ్యాధితో కూడిన ఎలుకలకు యాంటీ రెట్రో వైరల్‌ మందులను చాలా నెమ్మదిగా వారాలపాటు విడుదల చేస్తూ వైరస్‌ మోతాదు అతి తక్కువ స్థాయిలో ఉండేలా చేసిన తరువాత శాస్త్రవేత్తలు.. ఆ తరువాత కణాల లోపల ఉండే వైరస్‌ డీఎన్‌ఏ పోగును కత్తిరించారు. ఆ తరువాత జరిపిన పరిశీలనల్లో మూడు వంతుల ఎలుకల్లో వైరస్‌ లేకుండా పోయినట్లు స్పష్టమైంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top