మసకబారని మహానటి

మసకబారని మహానటి


నేడు సావిత్రి వర్ధంతి



ఆమె పేరు నిశ్శంకర సావిత్రి. తెలుగు, తమిళ ప్రజల గుండెల్లో నుండి చెరిగిపోని మహానటి. ఏ పద్మ పుష్పమూ ఆమె సిగలోకి చేరలేదు. దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్నీ ఆమె అందుకోలేదు. రఘుపతి వెంకయ్య పురస్కారానికీ ఆమె నోచుకోలేదు. అయినా అవార్డులకు అతీతమైనది సావిత్రి. గత 100 ఏళ్లలో అత్యుత్తమ భారతీయ నటుడిగా గుర్తింపుపొందిన ఎన్‌.టి. రామారావు ఆమె గురించి మాట్లాడుతూ – ‘‘సావిత్రితో నటించడం గొప్ప అనుభవం. ఆమె దర్శకుని ఆలోచనలను మెరుగుదిద్దుతుంది. ఒక్కోసారి ఆమెను అందుకోగలమా! అని భయపడ్డ సంఘటనలూ ఉన్నాయి’’ అన్నారు. ఒక్క ఎన్టీఆర్‌ మాత్రమే కాదు. శివాజీ గణేశన్‌ లాంటి గొప్ప నటుడు కూడా సావిత్రి సరసన నటించాలంటే ఒకింత జంకేవారు.



వందేళ్లలో వచ్చిన అత్యుత్తమ భారతీయ చిత్రంగా ‘మాయాబజార్‌’ గుర్తింపు పొందింది. ఆ చిత్రం చూసిన రాజ్‌కపూర్‌ అట్లాంటిది వందేళ్లకు కూడా మళ్లీ రాదని చెప్పారు. ఆ సినిమా గురించి అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘మాయాబజారులో డ్యూయెట్లు పాడిన నేను హీరో కాదు. కృష్ణుడు పాత్ర వేసిన ఎన్‌.టి. రామారావు కూడా హీరో కాదు, ఘటోత్కచుని పాత్ర వేసిన ఎస్‌.వి. రంగారావు కూడా హీరో కాదు. ఆ సినిమాలో నిజమైన హీరో ఎవరంటే... సావిత్రి’ అన్నారు.



ప్రముఖ చిత్రం మిస్సమ్మలో ఎన్‌.టి. రామారావు, సావిత్రి ఒక జంటగా; నాగేశ్వరరావు, జమున ఒక జంటగా నటించారు. మొదట్లో ఆమె పోషించిన (మేరీ / మహాలక్ష్మి) పాత్రకు సావిత్రిని అనుకోలేదు. ఆమె స్థానంలో భానుమతి ఉండాల్సింది. జమున (సీత) పాత్రకు సావిత్రి ఉండాల్సింది. నిర్మాతలు ఆలూరి చక్రపాణి, బి. నాగిరెడ్డి. దర్శకుడు ఎల్‌.వి. ప్రసాద్‌. నిర్మాణ సమయంలో భానుమతి ఆలస్యంగా వస్తున్నారని, చక్రపాణి ఆమె ఎదుటనే అంతవరకు తీసిన 4 రీళ్లను తగులబెట్టి, ఇవ్వాల్సిన పారితోషికం ఇచ్చి ఇంటికి పంపారు. (నిజానికి, భానుమతి ఆలస్యంగా రావడానికి ఆ సమయంలో ఆమె చేస్తున్న వరలక్ష్మీ వ్రతాలు కారణం). భానుమతి స్థానంలో సావిత్రిని తీసుకొని సావిత్రి ఉండాల్సిన స్థానంలో జమునను తీసుకొని సినిమాను పూర్తి చేశారు. తరువాతి జీవితంలో ఈ విషయాన్ని తాత్వికంగా తీసుకున్న భానుమతి ‘‘పోనీ లెండి, నా మూలాన ఒక మహానటికి అవకాశం వచ్చింది కదా!’’ అని నచ్చచెప్పుకున్నారు.



సావిత్రి పుట్టింది చిర్రావూరు, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. (డిసెంబర్‌ 6, 1935) (విక్కీపీడియాతో సహా అనేక చోట్ల ఆమె జన్మించింది. జనవరి 4, 1936గా నమోదయింది. అనేక వ్యయప్రయాసలకోర్చి రచించిన ‘ఎ లెజెండరీ యాక్ట్రెస్, మహానటి సావిత్రి’ పుస్తకంలో వీఆర్‌ మూర్తి, వీ శోభరాజుగార్లు జనన–మరణ రిజిస్టర్‌ని అడిగి, పక్కా ఆధారాలతో ఆమె పుట్టిన తేదీని డిసెంబర్‌ 6, 1935గా నిర్ధారించారు) ఆరు నెలల వయస్సులో తండ్రి నిశ్శంకర గురవయ్య మరణించారు. సంగీతం, నృత్యం అభ్యసించిన సావిత్రి, సుంకర కనకారావు ఆధ్వర్యంలో నడిచే అరుణోదయ సంగీత నాట్యమండలి, ఎన్‌.టి. రామారావు బావగారైన పుండరీకాక్షయ్య ఆధ్వర్యంలో నడిచే నేషనల్‌ ఆర్ట్స్‌ థియేటర్, పెదనాన్న కె.వి. చౌదరి నడిపించే నవభారత నాట్యమండలి తరఫున నాటకాల్లో కొంతకాలం నటించింది. తరువాత సినిమాల  కోసం ఆ కుటుంబం మద్రాసు వెళ్లింది.



 కోన ప్రభాకరరావుకు రాజకీయ నేపథ్యంతో పాటు కళలపై అభినివేశం ఉంది. ఆయన బాపట్లలో పుట్టి మద్రాసులో లా పూర్తిచేశారు. 1967, 1972, 1978లో కాంగ్రెస్‌ నుండి అసెంబ్లీకి ఎన్నికైనారు. కొంతకాలం ఆం.ప్ర. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980–81లో అసెంబ్లీ స్పీకర్‌గా, భవనం వెంకట్రామ్‌ మంత్రివర్గంలో సభ్యునిగా, పుదుచ్చేరి, సిక్కిం, మహారాష్ట్రల గవర్నర్‌గా పనిచేశారు. రాజకీయాలకంటేSముందు నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పనిచేశారు. 1949లో కె.ఎస్‌. ప్రకాశరావు నిర్మించి, ఎల్‌.వి. ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ‘ద్రోహి’ చిత్రంలో  ప్రతినాయకుడి భూమిక  పోషించారు. 1951లో ఆయన దర్శకత్వం వహించిన ‘రూపవతి’ నటనాపరంగా సావిత్రికి మొదటి చిత్రం.



అంతకుముందు ‘సంసారం’ చిత్రంలో నాగేశ్వరరావు సరసన నటించడానికి అవకాశం వచ్చింది. అయితే అప్పటికే ప్రఖ్యాతులైన నాగేశ్వరరావు సరసన మొదటిసారే నటిస్తున్నప్పుడు కలిగే సహజమైన భయాందోళనలతో నామమాత్రమైన  చిన్న పాత్ర పోషించింది. తరువాత ‘పాతాళభైరవి’లో ఓ నృత్యానికి మాత్రమే పరిమితమైంది. ఆ రకంగా చూస్తే సినిమా రంగంలో సావిత్రిది గతుకుల ఆరంభమనే చెప్పాలి. 1952లో వచ్చిన ‘పెళ్లిచేసి చూడు’, తమిళ సినిమా ‘కళ్యాణం పన్నిపార్‌’ సావిత్రిని సినిమా రంగంలో నిలదొక్కుకోనిచ్చాయి. 1953లో వచ్చిన ‘దేవదాసు’ సినిమా ఆమెకు పేరుప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. ఇక ఆమె వెనక్కి తిరిగి చూడలేదు.



1952లో సావిత్రికి జెమినీ గణేశన్‌తో మద్రాసులోని చాముండేశ్వరి దేవాలయంలో రహస్యంగా పెళ్లయింది. చాలారోజుల వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. కొన్నేళ్ల తర్వాత లక్స్‌ సబ్బు అడ్వర్టయిజ్‌మెంట్‌ కోసం సావిత్రి గణేశ్‌ అని సంతకం చేయడంతో అది బయటకు పొక్కింది. అప్పటికే పెళ్లయిన జెమినీ గణేశన్‌తో మరో పెళ్లికి తన తల్లి, పెదనాన్న ఒప్పుకోరని పెళ్లిని రహస్యంగా ఉంచింది సావిత్రి.జెమిని గణేశన్‌ను ఒక జ్చిbజ్టీu్చ∙lౌఠ్ఛిటగా భావించవచ్చు. ఆయనది ఆడవాళ్లను ఇట్టే ఆకర్షించే పర్సనాలిటీ. ఈ విషయంలో ఆయనకు, ప్రముఖ హాలీవుడ్‌ నటుడు గ్యారీ కూపర్‌కు పోలికలున్నాయంటారు. అలమేలు అనే ఆవిడతో ఆయనకు అసలు పెళ్లి జరిగింది. ఆ తరువాత తెలుగు నటి పుష్పవల్లితో సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రముఖ హిందీ నటి రేఖ, ఆమె చెల్లెలు రాధ వారి సంతానం. 1966లో 12 ఏళ్ల ప్రాయంలో, తెలుగు సినిమా ‘రంగులరాట్నం’తో సినీరంగ ప్రవేశం చేశారు రేఖ. పుష్పవల్లి సోదరి సూర్యప్రభ వేదాంతం రాఘవయ్య (దేవదాసు సినిమా దర్శకుడు) గారి భార్య. జెమినీ గణేశన్‌కు సావిత్రికి సాన్నిహిత్యం ఏర్పడి పెళ్లికి దారితీసింది.



(సాంకేతికంగా జెమినీ గణేశన్‌కిది రెండవ పెళ్లి). వారి సంతానం విజయ చాముండేశ్వరి, శ్రీరామ నారాయణ సతీష్‌కుమార్‌. విజయ చాముండేశ్వరి మద్రాసులోనూ, సతీశ్‌కుమార్‌ అమెరికాలోనూ స్థిరపడ్డారు. జెమినీ గణేశన్‌తో పెళ్లయిన తరువాత 15, 20 ఏళ్ళ దాకా తాను తప్పు చేశానేమో అన్న సందేహం అంతగా కలగలేదు సావిత్రికి. తన భార్య అలమేలుకు, తమ ఇద్దరి మధ్య ప్రేమ గురించి తెలుసనీ, ఆమెకు తన సంబంధం పట్ల అభ్యంతరం లేదని జెమినీ గణేశన్‌ చెప్పడమూ ఒక కారణం కావచ్చు. కొంతకాలం తర్వాత జెమినీ గణేశన్‌ నిరాదరణతో సావిత్రికి జీవితంలో అసంతృప్తి మొదలైంది.



సావిత్రికి నటనాపరంగా అత్యుత్తమ పురస్కారం  ‘చివరకు మిగిలేది’ చిత్రం ద్వారా లభించింది. 1960లో విడుదలైన ‘చివరకు మిగిలేది’ చిత్రానికి ప్రముఖ రచయిత బుచ్చిబాబు అదే పేరుతో రాసిన గొప్ప నవలకు సంబంధం లేదు. ఆయన పేరు మెన్నేని సత్యనారాయణ. మూడుసార్లు ఎంపీగా, ఒకసారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా, ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సెక్రటరీగా, వైయస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గ సభ్యునిగా వ్యవహరించారు. అడపాదడపా వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ విలేకరుల నుండి ఆదరణ పొందారు. సత్యనారాయణరావు గారిని కలుపుకుని ‘చివరికి మిగిలేది’ చిత్ర నిర్మాతలు దాదాపు 10 మంది. ఇందులో ముఖ్యులు అప్పుడు యువజన కాంగ్రెస్‌ సభ్యులుగా ఉన్న సత్యనారాయణరావు, వి. పురుషోత్తమరెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి. ఈ విషయం తెలిసి అప్పటి మంత్రివర్గ సభ్యుడు బ్రహ్మానందరెడ్డి నాగేశ్వరరావుకు ఫోన్‌ చేసి ‘వీరు ఉత్సాహవంతులైన యువకులు, వీరికి సహాయం చేయండి’ అని కోరారు. నిర్మాతలు నాగేశ్వరరావుని నటించమని కోరారు. అయితే, ఆయన వ్యక్తిగత కారణాల వల్ల  అమెరికాకు వెళ్లవలసి వస్తుందనీ, ఫలితంగా షూటింగ్‌కు అంతరాయం కలగొచ్చనీ, అందువల్ల నటించలేనని చెప్పారు. బాలయ్య, కాంతారావుల పేర్లను నిర్మాతలకు సూచించి, స్వయంగా వారితో మాట్లాడి ఒప్పించారు.



నిర్మాతలు మద్రాసులో సావిత్రిని కలిసి చిత్రంలో నటించమంటే, తన షెడ్యూల్‌ చాలా బిజీగా ఉందనీ, నటించలేనని చెప్పారు. బలమైన కారణం మాత్రం నిర్మాతలు అపరిచితులు, కొత్తవారు కావడమే. హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక, వి. పురుషోత్తంరెడ్డి, యం సత్యనారాయణరావులు నాగేశ్వరరావును కలిసి ‘ఏ విధంగానైనా మీరు ఆమెను ఒప్పించాలి’ అని ప్రాధేయపడ్డారు. నాగేశ్వరరావు సావిత్రికి ఫోన్‌ చేసి, ‘చూడు సావిత్రీ... మనం అర్టిస్టులం. మన తృప్తికొరకు మనం కొన్ని చేయాలి. మనం బతకాలంటే ప్రజల తృప్తి కొరకు ఎక్కువ సినిమాలు చేయాల్సి వస్తుంది. నీకు ఈ సినిమా అపారమైన పేరు తెచ్చిపెడుతుంది’’ అని చెప్పారు. సావిత్రి ఒప్పుకుంది.నాగేశ్వరరావు అటు బాలయ్య, కాంతారావులను, ఇటు సావిత్రినే కాకుండా మద్రాసులోని విజయా డిస్ట్రిబ్యూటర్స్‌కు ఫోన్‌ చేసి సహకరించమని చెప్పారు.



చివరకు మిగిలేది ఇతివృత్తం – ఒక మానసిక రోగిని మామూలు మనిషిని చేయడానికి నర్సు అతన్ని ప్రేమించినట్లు నటిస్తుంది. పోనుపోను నటనకు, ప్రేమకు హద్దు చెరిగిపోయి అతనితో నిజంగానే ప్రేమలో పడుతుంది. అతను మామూలు మనిషవుతాడు. నర్సు ప్రేమ రోగి అవుతుంది. ఇక మరో వృత్తాంతం ఏమిటంటే... మందాడి ప్రభాకర్‌రెడ్డి అనే ఆర్టిస్టుది   నల్గొండ జిల్లా. తుంగతుర్తి పట్టణం. ఆయన వృత్తిరీత్యా డాక్టర్‌. 1955 నుండి 1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబిబిఎస్‌ చదివారు. 1959లో విడుదలైన ‘మా ఇంటి మహాలక్ష్మి’ సినిమా దర్శకుడైన గుత్తా రామినీడు ‘చివరకు మిగిలేది’ సినిమాకు కూడా దర్శకుడు. ‘మా ఇంటి మహాలక్ష్మి షూటింగ్‌ కొరకు హైదరాబాద్‌కు వచ్చిన రామినీడు అంతర్గత కళాశాలల నాటక పోటీలో బహుమతి ప్రదానోత్సవానికి వచ్చారు. అక్కడ బహుమతి అందుకున్న ప్రభాకర్‌రెడ్డి తరువాత రామినీడును కలిసి ‘నేను సినిమాలకు పనికొస్తానా?’ అని అడిగారు. రామినీడు అతనికి ధైర్యం చెప్పారు. రామినీడు ‘చివరికి మిగిలేది’ సినిమాకు దర్శకత్వం వహించినప్పుడు ప్రభాకర్‌రెడ్డిని గుర్తుపెట్టుకుని అతనికి డాక్టర్‌ పాత్రలో సినిమా రంగంలో తొలి అవకాశం ఇచ్చారు. అయితే.... అప్పటికే ఉన్నత శిఖరాన్ని చేరుకున్న సావిత్రితో నటించడానికి, అప్పుడే ఎంట్రీ చేసిన ప్రభాకర్‌రెడ్డి మానసికంగా సిద్ధంగా లేరు. ఒక సన్నివేశంలో, సావిత్రిని ప్రభాకర్‌రెడ్డి చెంపదెబ్బ కొట్టాలి. ఆ పని చేయడానికి ఆయనకు ముచ్చెమటలు పోస్తున్నాయి. పరిస్థితి గమనించిన సావిత్రి ఒక మగ జూనియర్‌ ఆర్టిస్టును పిలిచి చెంపదెబ్బ కొట్టారు. ఆ సందర్భంలో ఒక మహిళ మరో  మగవాడిని చెంపదెబ్బ కొట్టడం ప్రొవొకేటివ్‌గా పనిచేసింది. ప్రభాకర్‌రెడ్డికి ధైర్యం చెప్పి రిలాక్స్‌డ్‌గా నటించమని ప్రోత్సహించారు సావిత్రి. సన్నివేశానికి సంబంధించిన షూటింగ్‌ విజయవంతంగా ముగిసింది. ఆ తరువాత ప్రభాకర్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. 472 సినిమాల్లో నటించారు. 27 సినిమాలు నిర్మించారు. 21 చిత్రాలకు కథారచన చేశారు. ‘భూమికోసం’ చిత్రంలో నటించిన ప్రభాకర్‌రెడ్డి సలహా మేరకు అందులో తెరంగేట్రం చేసిన ‘లలితా రాణి’ పేరును ‘జయప్రద’గా (ఎం. ప్రభాకరరెడ్డి గారి వదిన పేరు జయప్రద) మార్చారు.



ఈ చిత్రంలో పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు కె.జి. సత్యమూర్తి (శివసాగర్‌) రెంజిమ్‌ పేరుతో రాసిన ‘చిన్నారీ చిలకమ్మా, చెల్లీ చంద్రమ్మా’ అనే పాటను జయప్రదపై చిత్రీకరించారు. సావిత్రి నటించి, ఆమె మృతి తరువాత. చివరిగా 1985లో విడుదలైన ‘అందరికంటే మొనగాడు’లో ప్రభాకర్‌రెడ్డి నటించడం ఒక ఆసక్తికరమైన ఘటన.‘చివరకు మిగిలేది’ సినిమా 1960 ఏడాదికి ఉత్తమ తెలుగు సినిమాగా ఫిలిం ఫేర్‌ పురస్కారాన్ని అందుకుంది. సావిత్రి ఉత్తమ నటిగా రాష్ట్రపతి పురస్కారమందుకున్నారు. తాను నటించిన చిత్రాలన్నిటిలోనూ ‘చివరకు మిగిలేది’లో పోషించిన పాత్ర తనకెంతో నచ్చిందని సావిత్రి చెప్పారు. అయితే ప్రముఖ సినీ విమర్శకుడు నందగోపాల్‌ ‘దేవదాసు (1953)’ పార్వతి పాత్ర, ‘కన్యాశుల్కం’ (1955)లో మధురవాణి పాత్ర, ‘మాయాబజార్‌’ (1957)లో శశిరేఖ పాత్ర, సావిత్రి నటజీవితంలో కలికితురాయిలని భావిస్తారు.



కొంత విచ్చలవిడిగా ఖర్చుపెట్టి, కొంత వితరణశీలిగా దానం చేసి, మరికొంత మత్తుపదార్థాల వ్యసనానికి బానిసై చాలా డబ్బు పోగొట్టుకుంది సావిత్రి. అదే కాకుండా సావిత్రి సంపాదించిన ఆస్తుల్లో కొన్ని ఇన్‌కంటాక్స్‌ కేసుల్లో కరిగిపోయాయి. ఆమె కొన్నాళ్లు కూతురు విజయచాముండేశ్వరి దగ్గర ఉన్నారు. అయితే ఆమె పేదరికంలో చనిపోయిందని కొంతమందిలో ఉన్న అభిప్రాయం సరైంది కాదు. చనిపోయేనాటికి ఆమెకు కొన్ని ఆస్తులు మద్రాసు, హైదరాబాద్, బెంగుళూరులలోనూ ఉన్నాయని చెప్తారు. సినీ విమర్శకుడు నందగోపాల్‌కు ఇచ్చిన ఆఖరి ఇంటర్వూ్యలో సావిత్రి తన మనసులో మాటను వెలిబుచ్చారు. – ‘‘నా సమాధిపై నిలిపే సంస్మరణ ఫలకం మీద చెక్కే చివరి వాక్యాలు ఇలా ఉండాలి. ‘జీవితంలోనూ, మరణంలోనూ మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతి పొందుతున్నది. ఎవ్వరూ ఇచ్చట సానుభూతితో వేడి కన్నీటిబొట్టు విడువనక్కర్లేదు. సమాజం దృష్టిలో ఏ తారైనా హీనంగా చూడబడకుండా ఉండటానికి ఇచ్చట నిద్రిస్తున్న మరణం లేని మహా ప్రతిభకు స్మృతిచిహ్నంగా ఒక చిన్ని పూలమాలికను ఉంచండి. అది చాలు’’ అన్నారామె.ఆమెను మనం స్మరించుకున్న రోజున ఆమె అంగీకరించే ఒక చిన్ని పూలమాలికతోపాటు, ఆమె వారించినా కూడా, ఒక వేడి నిట్టూర్పును విడవకుండా ఉండలేం. ఒక బరువెక్కిన కన్నీటి చుక్కను కార్చకుండానూ ఉండలేం.





సావిత్రికి వచ్చిన చెప్పుకోదగ్గ గుర్తింపులు:

1960లో విడుదలైన ‘చివరకు మిగిలేది’ చిత్రంలో నటనకు రాష్ట్రపతి పురస్కారం.



1961లో మద్రాసు ఆళ్వార్‌పేటలో ‘శ్రీనివాస గాంధీనిలయం’ అనే సామాజిక సేవా సంస్థ ‘నడిగయర్‌ తిలకం’ బిరుదునిచ్చి సత్కరించడం. నడిగయర్‌ తిలకం అంటే నటీశిరోమణి అని అర్థం.



1964లో ఆంధ్ర మహిళా సభకు అనుబంధ సంస్థ అయిన ఆంధ్ర యువతీ మండలి ‘మహానటి’ బిరుదునిచ్చి సత్కరించడం.



1968లో తమిళనాడు ప్రభుత్వం తరఫున, అప్పటి ముఖ్యమంత్రి అన్నాదురై గారి చేతుల మీదుగా ‘కలైమామణి’ పురస్కారం.



►   ‘‘నా దృష్టిలో సినిమా రంగంలో ముగ్గురు స్త్రీ శిల్పులున్నారు. రాయిని ఉలితో కొడుతూ అందమైన శిల్పాన్ని శిల్పి సృష్టిస్తాడు. కేవలం ఒక ఓర చూపుతో, కనుబొమ ముడితో, పెదవి కదలికతో, చిరునవ్వుతో, తల తిప్పడంతో ఎలాంటి భావాన్నైనా ప్రదర్శించగల ఆ ముగ్గురు స్త్రీ శిల్పుల్లో ఇద్దరు మన తెలుగువారు కావడం యావత్తు భారతదేశం గర్వించదగ్గ విషయం. మన సినిమా రంగంలోని ఆ స్త్రీ శిల్పులు సావిత్రి, జి. వరలక్ష్మి, మూడవ ఆమె హిందీ నటి మీనాకుమారి’’ – శ్రీశ్రీ.  



►  శ్రీశ్రీ ఉటంకించిన ముగ్గురు స్త్రీ శిల్పుల్లో ఒకరైన మీనాకు మారి సినిమాల్లో ఎక్కువగా దుఃఖపూరితమైన పాత్రలే పోషించారు. సావిత్రి కొన్ని సరదా పాత్రలు, కొన్ని సమతు ల్యమైన పాత్రలు, కొన్ని దుఃఖపూరితమైన పాత్రలు పోషిం చారు. ఇద్దరివీ సంతృప్తికరమైన వైవాహిక జీవితాలు కావు.



►  గొప్ప నటి అయిన మీనా కుమారి సావిత్రి గురించి ఇలా చెప్పారు – ‘సావిత్రి నటన చూస్తుంటే చాలాసార్లు నా నటన గురించి నాకే సందేహాలు కలుగుతాయి. భావస్ఫోరకమైన కళ్లు, ఆకర్షణీయమైన పెదవులు, సందర్భోచితమైన హావభావాలు, అన్నీ కలిపి ఆమెను అత్యున్నత నటీమణుల సరసన ఉంచుతాయి.’’



►  సావిత్రికన్నా 7 సంవత్సరాలు పెద్దదైన, ముగ్గురు స్త్రీ శిల్పుల్లో మూడవ వారైన జి. వరలక్ష్మి సంతృప్తికరంగానే జీవితం గడిపారు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా విభిన్నమైన అనుభవాలను చవిచూశారు. నిర్మాత కె.ఎస్‌. ప్రకాశరావును పెళ్లి చేసుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు 1995లో రఘుపతి వెంకయ్య పురస్కారమిచ్చారు.



►  ఒక సందర్భంలో జి. వరలక్ష్మి ‘అమాయకురాలైన సావిత్రికి రెండవ వివాహం చట్టరీత్యా చెల్లదని తెలియదు’ అని చెప్పడం జరిగింది. 78 ఏళ్ల చివరి దశలో జెమినీ గణేశన్‌ 36 ఏళ్ల క్రిస్టియన్‌ అమ్మాయి, నర్సు అయిన జూలియానాను పెళ్లి చేసుకున్నారు. ఈ దశలో పెళ్లేమిటని అడిగితే ముదుసలి దశలో పిన్నవయస్కురాలే సరైన పరిచర్యలు చేయగలుగుతుందన్నారు. కొంతకాలం తరువాత జూలియానా జెమినీ గణేశన్‌ నుండి విడాకులు తీసుకున్నారు. జీవితంలో సరైన ఆదరణ, ఆప్యాయత చూపని తండ్రి జెమినీ గణేశన్‌ దహన సంస్కారాలకు రేఖ వెళ్లలేదు.



►  1953లో వచ్చిన దేవదాసు చిత్రం సావిత్రి నటనా జీవితానికి ఒక పెద్ద మలుపు.  సావిత్రి మాటల్లో – ‘‘నేను పార్వతి లాంటి కష్టమైన పాత్రను ఎప్పుడూ చేయలేదు. ఈ పాత్రను పోషించవలసి వుందని తెలియగానే చక్రపాణి గారి పుస్తకం (దేవదాసు అనువాదం) అయిదుసార్లు చదివాను. ప్రతిసారి పార్వతి పాత్రలో లీనమైపోయేదాన్ని. ఆ పాత్రను గురించి తలచుకుంటేనే ఏడుపు వచ్చేది. నా పాత్రను నిర్వహించడానికి డైరెక్టరు గారు (వేదాంతం రాఘవయ్య) పూర్తి అవకాశాలిచ్చారు. నాకు తృప్తి లేక మళ్లీ షాట్‌ తీయమంటే ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా తీసేవారు. అనేకమార్లు నాకు ఆ సంభాషణలు చెబుతుంటేనే పార్వతి జీవితమంతా జ్ఞాపకం వచ్చి దుఃఖం పొంగివచ్చేది. అసలీ పిక్చర్‌లో గ్లిసరిన్‌ వాడే అవకాశమే కలగలేదు. షాట్‌ అయిపోయాక కూడా ఏడ్చేసేదాన్ని. ఒకవంక డైరెక్టర్‌ గారు (వేదాంతం రాఘవయ్య) కూడా ఏడ్చేస్తుండేవారు. మాకే విచిత్రంగా ఉండేది.’’



►  దానధర్మాల విషయంలో సావిత్రిది ఎముకలేని చెయ్యి. ఒకసారి ప్రఖ్యాత గాయని సుశీల సినీరంగంలోని సీనియర్ల సహాయార్థం విరాళాల కోసం సావిత్రి దగ్గరకు వెళ్లింది. సావిత్రి పర్సులో ఎంత డబ్బుంతో లెక్కపెట్టకుండానే ఉన్న డబ్బంతా తీసి ఇచ్చేసింది. ఒకసారి ఒళ్లంతా బంగారు నగలు వేసుకుని తన భర్త జెమినీ గణేశన్‌ను వెంటబెట్టుకుని ప్రధానమంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రి మద్రాసుకు వచ్చినప్పుడు కలిసి, తాను ధరించిన ఒక్కొక్క నగను ఒలుచుకుంటూ జాతీయ రక్షణ నిధికి ఇచ్చివేశారు. పేద విద్యార్థుల సహాయార్థం ముఖ్యమంత్రి యంజిఆర్‌ వేసుకున్న పూలదండను వేలం వేస్తే అందరికంటే ఎక్కువ ధరకు పాడి, ఆ తరువాత కట్టడానికి చేతిలో డబ్బు లేక బంగారం అమ్మి అవస్థలుపడ్డ వ్యక్తి సావిత్రి.



►  జ్ఞానపీuŠ‡ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ ‘‘గాలి నిండా సువాసనను నింపే మంచి గ్రంధపు ముక్క వంటిది సావిత్రి! చీకటి చిక్కదనానికి భయపడకుండా ఉజ్వలంగా వెలిగే కర్పూర తునక వంటిది సావిత్రి!’’ అన్నారు.



►  ఒక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావుతో, బాపు, రమణలు అన్నారట – ‘‘ఈ విశ్వంలో మానవాళికి ... ఒకే భూమి, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే ఆకాశం! ఒకే సావిత్రి... ఈ సినిమా ప్రపంచానికి!’’



వి.కె. ప్రేమ్‌చంద్‌

98480 52486

– వి.కె. ప్రేమ్‌చంద్‌







Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top