కూతురితో లెక్క తప్పింది | Sakunthala Devi Movie Special Story | Sakshi
Sakshi News home page

కూతురితో లెక్క తప్పింది

Jul 16 2020 6:10 AM | Updated on Jul 16 2020 6:10 AM

Sakunthala Devi Movie Special Story - Sakshi

శకుంతలా దేవిగా విద్యా బాలన్‌ అనుపమ బెనర్జీ

‘హ్యూమన్‌ కంప్యూటర్‌’ శకుంతలాదేవి ఒకకాలంలో దేశంలో బాలికలందరికీ స్ఫూర్తిగా నిలిచింది. చదువుకోవాలనుకున్న చాలామంది ఆడపిల్లలు శకుంతలాదేవిలా లెక్కల్లో టాప్‌గా నిలవాలనుకున్నారు. నిలిచారు కూడా. గణితం మగవారి సబ్జెక్ట్‌ అని, స్త్రీలు తెలుగో ఇంగ్లిషో బోధించుకోవాలని చాలా ఏళ్లుగా అనుకునేవారు. కాని శకుంతలాదేవి గణిత మేధ ఆ ఆలోచనను మార్చింది. ఆమె ఎవరికీ సాధ్యం కాని లెక్కలను సెకన్లలో తేల్చి గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కి భారత ప్రతిష్టను పెంచింది. 1929లో బెంగళూరులో జన్మించిన శకుంతలా దేవి తన 83వ ఏట 2013లో మరణించింది

ఆమె కథ ఇప్పుడు ‘శకుంతలాదేవి’ పేరుతో నిర్మితమయ్యి అమేజాన్‌ ప్రైమ్‌లో జూలై 31న విడుదల కానుంది. శకుంతలా దేవిగా విద్యాబాలన్‌ నటించింది. తాజాగా వెలువడ్డ ట్రయిలర్‌ను బట్టి ఈ సినిమాలో శకుంతలా దేవి ఆమెకు కుమార్తెతో ఉండే ఘర్షణ ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది. నిజజీవితంలో శకుంతలాదేవి పరితోష్‌ బెనర్జీ అనే ఐ.ఏ.ఎస్‌ ఆఫీసర్‌ను వివాహం చేసుకుంది. అయితే ఆ తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. వారికి అనుపమ బెనర్జీ అనే కుమార్తె ఉంది. విడాకుల తర్వాత తండ్రిని కలవనివ్వకుండా పెంచిందనే కూతురి అసంతృప్తి ఈ సినిమాలో కథాంశం గా ఉంది. లెక్కల రంధిలో పడి తనను సరిగా పెంచకపోవడం గురించి కూడా కుమార్తె ఫిర్యాదు చేయడం సినిమాలో కనిపిస్తుంది. ‘నువ్వు ఆర్డినరీ అమ్మలా ఎందుకు ఉండవు?’ అని కూతురు ప్రశ్నిస్తే ‘నేను అమేజింగ్‌గా ఉన్నప్పుడు ఆర్డినరీగా ఎందుకు ఉండమంటావు’ అని శకుంతలాదేవి పాత్ర పోషించిన విద్యాబాలన్‌ అనడం కనిపిస్తుంది

అనుపమ బెనర్జీ ఈ సినిమా ప్రారంభానికి క్లాప్‌ కొట్టడాన్ని బట్టి ఆమె దృష్టిలోని శకుంతలా దేవిని ఈ సినిమాలో చూడనున్నామని తెలుస్తోంది. సినిమాలో కూతురి పాత్రను ‘దంగల్‌’ అమ్మాయి సాన్యా మల్హోత్రా పోషించింది. అను మీనన్‌ ఈ సినిమా దర్శకురాలు.ఏమైనా ఈ సినిమా మరోసారి శకుంతలా దేవి స్ఫూర్తిని ప్రపంచానికి ఇవ్వనుంది. ‘గణితం నా బెస్ట్‌ ఫ్రెండ్‌’ అని ఈ సినిమాలో ఆమె చెబుతుంది. అంకెల ప్రపంచంలో తిరుగాడిన ఒక స్త్రీ మేధను కాకుండా ఆమె గుండెల్లో దాగిన మనోభావాలు ఈ సినిమాలో చూడటానికి దొరుకుతాయని భావించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement