మూడేళ్లయినా పిల్లలు లేరు

sakshi  Homeo health  council

మాకు పెళ్లయి మూడేళ్లైంది. పిల్లలు లేరు. డాక్టర్‌ని సంప్రదిస్తే ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ కావచ్చు అన్నారు. హోమియో వైద్యం ద్వారా సంతానాన్ని పొందవచ్చా?
– వి. ఆర్‌. ఆర్, వెదురులంక

సంతానలేమిలో రకాలు: మొదటిది ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ. అసలు గర్భం దాల్చని పరిస్థితులు. సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటే మొదటిసారి గర్భం దాల్చి బిడ్డను కన్న తర్వాత కొందరిలో రెండవసారి గర్భధారణ జరగదు. ఇక మూడవది సంతానలేమి అంటే స్టెరిలిటీ. సంతానం కలగడానికి ఏ మాత్రం అర్హత లేని పరిస్థితులు. స్త్రీ గర్భధారణ హార్మోన్‌ల సమన్వయం మీద ఆధారపడి ఉంటుంది. అండ కణాభివృద్ధికి తోడ్పడేది హార్మోన్లే. ఈ హార్మోన్ల మధ్య అసమతుల్యం ఏర్పడి ఉత్పత్తిలో లోపం జరిగితే సంతాన సాఫల్యతను దెబ్బతీస్తుంది.

కారణాలు: అండ వాహికలు, అండాశయంలో లోపాలు, దీర్ఘకాలిక వ్యాధులు, అండాశయం సరిగ్గా వృద్ధి చెందకపోవడం వల్ల సంతానం కలగకపోవచ్చు.
అండాశయసమస్యలు: చిన్న చిన్న ఫాలికల్‌ సిస్ట్‌ (తిత్తులు) ఏర్పడి అండాశయం వెడల్పు కావడం. అండాశయం సరిగ్గా వృద్ధి చెందకపోవడం.

అండవాహిక లోపాలు: అండ వాహికల కండరాల కదలికకు ఆటంకం కలగడం, అండవాహికలు పూడిపోవడం, పగుళ్లు రావడం వలన గర్భధారణ కష్టమవుతుంది. ఈ సమస్య రావడానికి గనేరియా లాంటి వ్యాధులు, ఐయుడి, అబార్షన్‌ తర్వాత ఇన్‌ఫెక్షన్‌ రావడం, అపెండిక్స్‌ పగిలిపోవడం కారణం కావచ్చు.

ఎక్టోపిక్‌ గర్భధారణ: ఫెలోపియన్‌ కదలిక సరిగ్గా లేనప్పుడు, వీర్యకణంలో సంయోగం చెంది అండం ముందుకు సాగలేక అక్కడే ఉండిపోయి పిండం కింద అభివృద్ధి చెందడం. ఇలా అభివృద్ధి చెందడం వలన వాహికలు పగిలిపోయే అవకాశం ఉంది.

ఎండోమెట్రియోసిస్‌: గర్భాశయం లోపల ఉండే పొరలు రక్తస్రావంతో కలిసి బహిర్గతమవుతాయి. ఒకవేళ ఈ పొరలు పొట్ట అడుగుభాగంలో చేరిపోతే ఈ స్థితిని ఎండోమెట్రియోసిస్‌ అంటారు. ఈ స్థితి అండవాహికలను స్థానభ్రంశం చేసి అండకణ ప్రయాణానికి అవరోధం కలిగించి సంతానలేమికి కారణమవుతుంది. గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ల అసమతుల్యత, హైపో థైరాయిడిజం, పిట్యూటరీ గ్రంథుల సమస్యలు, సుఖరోగాలు, డయాబెటిస్, మానసిక సమస్యలు ఉన్నప్పుడు  గర్భధారణ కష్టం హోమియో వైద్యంలో మనిషి తత్వాన్ని బట్టి శారీరక, మానసిక లక్షణాలను బట్టి కాన్‌స్టిట్యూషన్‌ పద్ధతిలో పరిస్థితిని చక్కబరచవచ్చు. పల్సటిల్లా, సెపియా, నేట్రంమూర్, థైరాయిడినమ్, పాస్ఫరస్, సైఆసియా, లైపో సోడియం, కాత్కయా ప్లోర్‌ వంటి మందులతో గర్భధారణ సమస్యలను నయం చేయడం సాధ్యమే.
డాక్టర్‌ టి. కిరణ్‌ కుమార్, డైరెక్టర్,
పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

సెబోరిక్‌ డర్మటైటిస్‌ అంటే..?
హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 45 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్‌ డర్మటైటిస్‌ అని చెప్పారు. మందులు వాడినప్పుడు సమస్య తగ్గినట్లే అనిపిస్తోంది కానీ వెంటనే మళ్లీ తిరగబెడుతోంది. ఈ సమస్య అసలెందుకు వస్తోంది? హోమియోలో పూర్తిగా నయమవుతుందా?
– దయాకర్‌రావు, నల్గొండ

సెబోరిక్‌ డర్మటైటిస్‌ అనేది తరచూ తిరగ బెడుతూ బాధపెడుతుండే వ్యాధి. చర్మంలో సెబేషియస్‌ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడం, దురద వంటి లక్షణాలు ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇది దీర్ఘకాలిక సమస్య. చాలా ఎక్కువ మందిని వేధించే సమస్య ఇది. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది.

కారణాలు: ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్‌ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్‌ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది ∙రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్‌సన్‌ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ ∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ ∙వాతావరణం, హార్మోన్‌ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు.

లక్షణాలు:సెబోరిక్‌ డర్మటైటిస్‌ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి. ∙చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది.
ఈ వ్యాధి గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆధునిక జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని సరిచేయడం వల్ల సెబోరిక్‌ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్, సీఎండ్‌డి
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

పిల్లాడు ఎవరితో కలవడం లేదు!
మా అబ్బాయికి ఆరేళ్లు. బాబు కొద్ది గంటల పాటు స్తబ్దుగా ఉంటున్నారు. అకారణంగా ఏడుస్తున్నాడు. ఇతరులతో కలవడం లేదు. డాక్టర్‌ని సంప్రదిస్తే ఆటిజం అన్నారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? – కె.ఎస్‌. రావు, ఎల్లెందు
ఆటిజం అనేది భిన్న విభాగాలకు సంబంధించిన ఎదుగుదల సమ్య. దీనినే పల్వేసివ్‌ డెవలప్‌మెంటల్‌ డిజార్డర్‌ అంటారు. దీని వలన పిల్లల ఎదుగుదల అస్తవ్యస్థమవుతుంది. దీనితో బాధపడే అందరూ ఒకేలా అనిపించకపోవచ్చు. అందరిలోనూ ఒకే లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ ముందుగానే దీని ఆనవాలు గుర్తిస్తే అధిగమించడం సులభం.
కారణాలు: ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. కానీ కొన్నిసార్లు మెదడు పెరుగుదల, పనితీరులో వచ్చే అసాధారణ లోపాల వలన ఆటిజం రావచ్చు. తల్లి గర్భంలో ఇన్‌ఫెక్షన్స్‌ సోకినప్పుడు లేదా వాతావరణంలో వచ్చే మార్చుల వల్ల కూడా ఇది రావచ్చు.

లక్షణాలు: ముఖ్యంగా మూడు అంశాలను ప్రత్యేకంగా గమనించవచ్చు. ఇతరులతో కలవలేకపోవడం ∙తోటి పిల్లలతో ఆడుకోవడానికి అంతగా ఇష్టపడకపోవడం ∙ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తుండడం ∙కాళ్లు, చేతులను అదే పనిగా ఆడిస్తుండడం ∙ఒకే రకమైన వస్తువులతో ఆడుకోవడం, అలాంటి వాటినే సేకరించడం ∙భావ వ్యక్తీకరణ లోపం ∙తమ పనులను తాము చేసుకోకపోవడం, మాటలు రాకపోవడం

నిర్ధారించడం ఎలా?
మరీ చిన్న వయసు పిల్లల్లో: ∙తల్లి దగ్గరకు తీసుకుంటున్నా స్పందించకపోవడం ∙గంటల తరబడి స్తబ్దుగా ఉండడం ∙తల్లిదండ్రులు రమ్మని చేతులు చాచినప్పుడు ఉత్సాహంగా స్పందించకపోవడం ∙పరిచిత వ్యక్తులను చూడగానే నవ్వకపోవడం ∙నిరంతరం అకారణంగా ఏడవడం

కాస్త పెద్ద పిల్లల్లో: ∙కళ్లలో కళ్లు పెట్టి చూడకపోవడం ∙ప్రశ్న అడిగిన వెంటనే స్పందించకుండా తర్వాత ఎప్పుడో మళ్లీ అదే ప్రశ్నను పదే పదే అడుగుతూ ఉండడం ∙మిగతా పిల్లలతో కలవకపోవడం మనుషులకంటే ఎక్కువగా వస్తువులు, బొమ్మల పట్ల ఆసక్తి చూపడం ∙భావోద్వేగాలు చూపించకపోవడం అంటే నొప్పికీ, బాధకీ స్పందించకపోవడం ∙కాళ్లు, చేతులు అసహజంగా కదిలించడం అసందర్భ మాటలు ∙ఉండాల్సిన దానికంటే ఎక్కువ చురుకు ∙మానసిక ఎదుగుదల లోపించడం కనిపిస్తాయి.

నివారణ: పోషకాహారం పెట్టాలి. పిల్లలను ఒంటరిగా వదలకుండా వారితో ఎక్కువ సేపు గడపాలి.
హోమియోలో చికిత్స: హోమియోలో ఎటువంటి సమస్యలకైనా కాన్‌స్టిట్యూషన్‌ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధి తీవ్రతను తగ్గించి క్రమక్రమంగా పూర్తిగా వ్యాధిని నయం చేయవచ్చు.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top