మీ అబ్బాయిది ఒక రకం ఆస్తమా కావచ్చు!

sakshi health councling

పల్మునాలజీ కౌన్సెలింగ్‌
మా అబ్బాయి వయసు 13 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరంతో ఉంటోంది. వాడికి శ్వాస సరిగా ఆడటం లేదు. మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. మావాడి సమస్యకు పరిష్కారం చెప్పండి.
– సీతారామయ్య, కొత్తగూడెం

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్‌ వేరియంట్‌ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో  తెమడ వంటివి పడకుండా పొడిదగ్గు వస్తూ ఉంటుంది. పిల్లికూతలు లాంటి లక్షణాలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్‌ కాఫ్‌’ (దీర్ఘకాలిక దగ్గు) అని కూడా అంటారు. రాత్రీ పగలూ తేడా లేకుండా దాదాపు రెండు నెలలపాటు దగ్గుతుంటారు. దాంతో రాత్రివేళ  నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్‌పోజ్‌ అయితే ఆ అలర్జెన్స్‌ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి.  కాఫ్‌ వేరియెంట్‌ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్‌ వేరియెంట్‌ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు.

కాకపోతే సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్‌) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా–బ్లాకర్స్‌ తీసుకున్న తర్వాత ‘కాఫ్‌ వేరియెంట్‌ ఆస్తమా’ మొదలు కావచ్చు. కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్‌ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్‌ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్‌ వేరియెంట్‌ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్‌ వేరియెంట్‌ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి.  వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తగిన చికిత్స సూచిస్తారు.

వ్యాయామంలో  ఆస్తమా అటాక్‌ రాకుండా ఉండాలంటే...!
నా వయసు 38. డస్ట్‌ అలర్జీ ఉంది. గతంలో నా ఫ్రెండ్స్‌ కొందరు వింటర్‌లో వ్యాయామాలు చేస్తుంటే నేను వారితో పాటు ఎక్సర్‌సైజ్‌ మొదలుపెట్టాను. కానీ వ్యాయామం చేయదలచినప్పుడల్లా ఆయాసం వస్తోంది. ఈసారి మళ్లీ వింటర్‌ రాబోతోంది. ఎక్సర్‌సైజ్‌ మొదలుపెట్టాలని ఉంది. ఆస్తమా అటాక్‌ కాకుండా నాకు తగిన సలహా ఇవ్వండి.
– ఎస్‌. ప్రసాద్, విశాఖపట్నం

వ్యాయామం కొన్నిసార్లు ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. అందుకే దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలోనే  బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడి, ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతను సమకూర్చుకుంటుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఒక్కసారిగా ఈ చల్లగాలితో ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకేళ్లే దారులు సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి...

∙పొడి దగ్గు వస్తుండటం ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙పిల్లికూతలు వినిపించడం ∙వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ∙వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేశాక 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్‌సైజ్‌ ఇండ్యూస్‌డ్‌ ఆస్తమా) కారణంగా వ్యాయామ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్‌ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్‌ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్‌ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్‌ డౌన్‌ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. తొలుత పరిమితం సమయంలో వ్యాయామం చేస్తూ, ఆ వ్యవధిని పెంచుకుంటూ పోవడం వల్ల మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు.

పల్మునరీ ఫైబ్రోసిస్‌ అంటే..?

నాకు గత ఆర్నెల్లుగా దగ్గు, ఆయాసం వస్తోంది. చాలామంది డాక్టర్లకు చూపించుకున్నాను. చివరకు ఒక పెద్ద డాక్టర్‌గారు దాన్ని పల్మునరీ ఫైబ్రోసిస్‌ అని నిర్ధారణ చేశారు. ఆ తర్వాత ‘జబ్బుకు కారణమేమిటో తెలుసుకోవా’లన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది.   – ఎమ్‌. సాగర్, నల్గొండ
పల్మునరీ ఫైబ్రోసిస్‌ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక జబ్బు. ఇందులో ఊపిరితిత్తుల మీద చారల్లాగా వస్తాయి. ఇలా చార (స్కార్‌) రావడం పెరిగిపోతే కనెక్టివ్‌ టిష్యూ అనే కణజాలమంతా ఒకేచోట పోగుబడుతుంది. దాంతో మృదువుగా ఉండాల్సిన ఊపిరితిత్తుల గోడలు మందంగా మారతాయి. రక్తానికి తగినంత ఆక్సిజన్‌ అందదు. దీని వల్ల రోగులు ఆయాసపడుతూ ఉంటారు. అయితే కొందరికి ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలియదు. ఇలాంటి జబ్బును ఇడియోపథిక్‌ పల్మునరీ ఫైబ్రోసిస్‌ అంటారు. సాధారణంగా ఆయాసం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు అది ఎక్కువ కావడం, ఎప్పుడూ పొడిదగ్గు, అలసట, ఛాతీలో ఇబ్బంది, కొంతమందిలో ఛాతీనొప్పి, ఆకలి తగ్గడం, నీరసించిపోవడం, బరువు తగ్గడం కనిపిస్తుంటాయి.

సాధారణంగా ఇది ప్రధాన జబ్బు కాదు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య తర్వాత రెండో (సెడండరీ) సమస్యగా ఇది వస్తుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం (ఆటోఇమ్యూన్‌), వైరల్‌ ఇన్ఫెక్షన్స్, టీబీ లాంటి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ వంటి కారణాలతో ఇది వస్తుంది. ఇక ఎప్పుడూ ఆస్బెస్టాస్, సన్నటి ఇసుక రేణువులనూ, సిమెంటు నిండి గాలి పీలుస్తుండటం, నిమోనియాను కల్పించే బ్యాక్టీరియా, ఫంగస్‌లతో ఉన్న గాలిని పీల్చడం, కోడిదాణా వంటి వ్యవసాయ పరిశ్రమలకు సంబంధించిన వాసనలు ముక్కుకు తగులుతూ ఉండటం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. సిగరెట్‌ పొగ ఈ కండిషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. సాధారణంగా దీనికి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే లభ్యమవుతోంది. మంచి మందులు ఇంకా ప్రయోగదశలోనే ఉండి, అందుబాటులోకి రావల్సి ఉంది. ప్రస్తుతం కార్టికోస్టెరాయిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటర్‌ మందులు వాడుతూ ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు, నొప్పి, ఎర్రబారే పరిస్థితిని (ఇన్‌ఫ్లమేషన్‌ను) అదుపు చేసే స్థితిలోనే వైద్యశాస్త్రం ఉంది. దీనికి తోడు అవసరమైనప్పుడు ఆక్సిజన్‌ పెట్టాల్సి ఉంటుంది. మీరు పెద్ద సెంటర్‌లలో నిపుణులైన పల్మునాలజిస్ట్‌లను సంప్రదించండి.
డా. రమణ ప్రసాద్‌ కన్సల్టెంట్‌ పల్మునాలజిస్ట్‌
అండ్‌ స్లీప్‌ స్పెషలిస్ట్‌ , కిమ్స్‌ హాస్పిటల్‌ సికింద్రాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top