ఇటీవలి కాలంలో వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానం చాలామంది ఉద్యోగులకు సౌకర్యంగా మారింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తూ సమయం, ప్రయాణ ఖర్చు ఆదా చేసుకుంటున్నారు. అయితే.. ఈ విధానం కొంతమందికి ఆరోగ్య సమస్యలను కూడా తీసుకువస్తోంది. తాజాగా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పంచుకోవడం పెద్ద చర్చకు దారితీసింది.
ఆ ఇంజనీర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది తనకు మొదటి వర్క్ ఫ్రం హోమ్ అనుభవం. తాను సహజంగా చాలా యాక్టివ్ పర్సన్, అయితే.. ఇంట్లో ఒంటరిగా పని చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా అలసటకు గురవుతున్నట్లు చెప్పారు. గత రెండు నెలలుగా ప్రతిరోజూ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయినా ఉదయం లేవగానే బద్ధకంగా, అలసటగా అనిపిస్తోందని తెలిపారు. దీని కారణంగా పనిపై దృష్టి పెట్టలేకపోతున్నానని, ఉత్సాహం తగ్గిపోయిందని వివరించారు.
అతను ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి పనిచేసే గది. ఆ గదిలో కిటికీలు లేవని, పొరుగింటి గోడ ఉండటం వల్ల సహజ కాంతి అసలు లోపలికి రాదని పేర్కొన్నారు. రోజంతా సూర్యకాంతి లేకుండా గదిలో ఉండటం వల్ల తన ఆరోగ్యం దెబ్బతింటోందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. సూర్యకాంతి లేకపోవడం వల్ల విటమిన్ డీ లోపం, అలసట, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చని చాలామంది వైద్యులు చెబుతుంటారు.

అంతేకాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్ తన లైఫ్ స్టైల్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని అన్నారు. పని స్టార్ట్ చేయడానికి ముందు మాత్రమే నిద్ర లేవడం, రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఎక్కువగా AI టూల్స్ ఉపయోగించి కోడింగ్ చేయడం వల్ల శారీరక కదలికలు తగ్గిపోయాయని చెప్పారు. ముందులా తీవ్రంగా ఆలోచిస్తూ.. కోడింగ్ చేసే అనుభూతి కూడా లేకపోవడంతో పని పట్ల ఆసక్తి తగ్గుతోందని తెలిపారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అనేక మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొందరు ముందుగా విటమిన్ డీ, ఐరన్ లెవెల్స్ టెస్ట్ చేసుకోమని సూచించారు. మరికొందరు గదిలో సూర్యకాంతి, తాజా గాలి లేకపోవడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. వ్యాయామం చేయడం, జిమ్‌కు వెళ్లడం, సరైన ఆహారం తీసుకోవడం, అలాగే కిటికీలు ఉన్న గదిలో పని చేయడం మంచిదని సలహా ఇచ్చారు.
కొంతమంది నెటిజన్లు “వర్క్ ఫ్రం హోమ్ నిజానికి శక్తిని ఆదా చేస్తుంది. ప్రయాణం చేయాల్సిన అవసరం లేకపోవడం ఒక పెద్ద ప్రయోజనం. కానీ సరైన జీవనశైలి లేకపోతే అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది” అని పేర్కొన్నారు. మరికొందరు తీవ్రమైన అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.
ఇదీ చదవండి: కియోసాకి చెప్పిన సక్సెస్ ఫార్ములా ఇదే!


