
ఒకనాటి ఉదయం మా ఇంటికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో కలిసి కాటూరి వేంకటేశ్వరరావు గారు వచ్చారు. ఇద్దరూ ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని వస్తూ ఉండటం చూచి ‘‘రండి రండి కృష్ణార్జునులు’’ అంటూ లోపలికి ఆహ్వానించాను. ‘‘మీ ఉపమ బాగుంది’’ అన్నారు కృష్ణశాస్త్రి నవ్వుతూ. అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథుల కోసం మా ఆవిడ ఉప్మా తయారుచేసింది. జీడిపప్పు వేసిన వేడి వేడి ఉప్మా తింటూ కాటూరి వారు అన్నారు– ‘‘కరుణశ్రీ! ఇందాక నీ ఉపమ బాగుంది. అంతకంటే మీ శ్రీమతి ఉపమా ఇంకా బాగుంది.’’ ఆయన ఛలోక్తికి అంతా నవ్వుకున్నాము.
– ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి
(విశ్వకరుణ, 1992)
సేకరణ: గాలి నాసర రెడ్డి